close
పూసింది పూసింది పగడాల పువ్వు..!

కనకాంబరాలూ గులాబీల రంగూ లిల్లీపూల సొగసూ ముత్యాల సోయగమూ కలగలిసిన రత్నమే పగడం. చూసేకొద్దీ చూడాలనిపించే ఆ పగడాలను ఒకప్పుడు పూసలదండలా గుదిగుచ్చుకుని ధరించేవారు. కానీ ఇప్పుడు వాటిని పువ్వులూ పూమొగ్గల ఆకారాల్లోనూ చెక్కి  అందమైన నగల్ని రూపొందిస్తున్నారు ఈతరం ఆభరణాల డిజైనర్లు.

ధవళ కాంతితో మంచుపూలలా మెరిసే ముత్యాలూ రుధిర వర్ణంతో ఎర్రగులాబీల్లా ప్రకాశించే పగడాలూ... రెండూ సాగరుడి ఒడిలో పెరిగే సౌందర్యాలే. కాల్షియం కార్బొనేట్‌తో రూపుదిద్దుకున్నవే. అందుకేనేమో తెల్లని ముత్యం మెరుపుకి ఎర్రని పగడం తోడయితే ఆ అందమే వేరు అంటూ ఆ రెండింటినీ కలిపే ధరించేవారు. అయితే దుస్తుల్లో ఫ్యాషన్లు మారినట్లే ఆభరణాల డిజైన్లలోనూ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య ముత్యాల్నీ పగడాల్నీ వేర్వేరుగా ధరించేందుకే ఈతరం ఇష్టపడుతోంది. దాంతో ముత్యాల హారాల మాదిరిగానే పగడాల హారాలూ వస్తున్నాయి. మొదట్లో ఇవి కూడా ముత్యాల్లా గుండ్రంగానో కోలాకారంలోనో మాత్రమే ఉండేవి. అయితే, పగడాలు ముత్యాల్లా కాకుండా మొక్కల్లా పెరగడంతో వీటిని కోరిన పరిమాణంలో కత్తిరించి పగడాలకు రంగురంగుల రత్నాలను జోడించి, బంగారం, ప్లాటినం వంటి లోహాల్లో పొదిగి అందమైన నగల్ని తయారుచేస్తున్నారు. నగల్లో ఈమధ్య పూల డిజైన్ల హవా కావడం, రాళ్లను అతికించి చేసే పూల నగలకన్నా చెక్కుడు ద్వారా చేసే కోరల్‌ ఫ్లోరల్‌ జ్యువెలరీ తయారీ సులభం కావడంతో ఐరోపా, అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు. ఆన్‌లైన్‌ పుణ్యమా అని అవి మన అమ్మాయిలకీ తెగ నచ్చేయడంతో పగడాల పూల నగలకి రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా యువతరంకోసం సింపుల్‌గా ఉండే పెండెంట్లూ దుద్దులూ ఉంగరాలూ రకరకాల డిజైన్లలోనూ రంగుల్లోనూ దొరుకుతున్నాయి.

అసలేమిటీ పగడం?
‘చందమామ కథలో చదివా... రెక్కల గుర్రాలుంటాయనీ, బాలమిత్ర కథలో చదివా... పగడపుదీవులుంటాయనీ, నమ్మడానికి ఎంత బాగుందో...’ అని ఓ సినీకవి అన్నట్లు నిజంగానే ఆ దీవులకి వెళ్లిన వాళ్లకి తమ కళ్లు తమనే మోసం చేస్తున్నాయా అనిపించకమానదు. ఎందుకంటే ఆ పగడాలదీవులుగా చెప్పేవన్నీ సాగరజీవులే. అవి ఒకదానికొకటి అతుక్కుని సమూహాల్లా నివసిస్తుంటాయి. అలా ఉన్నప్పుడు ఇవన్నీ ఒకచోట అతుక్కునేందుకు కెరోటిన్‌తో కూడిన కాల్షియం కార్బొనేట్‌ను స్రవిస్తుంటాయి. అదికాస్తా గట్టిపడి మొక్కలా తయారై, అవి నీటిలో తేలిపోకుండా ఉండేందుకు ఊతంలా ఉంటుంది. ఈ సమూహాల్లో పాతవి చనిపోతుంటే కొత్తవి పుట్టుకొస్తూ అవన్నీ కలిసి రంగురంగుల్లో దీవుల్లా ఏర్పడుతుంటాయి. అందుకే సాగరమాత ఒడిలో వెలిసిన అద్భుతమైన అందాలే పగడపు దీవులు అంటుంటారు.  పగడపు జీవులు ఎక్కువగా పది నుంచి 300 మీటర్ల లోతులో పెరిగిê,ే అరుదుగా కొన్ని జాతులు మాత్రం 1500 మీటర్ల లోతులో కూడా పెరుగుతుంటాయి. మొక్కల్లా పెరిగిన వీటిని కోసి శుద్ధి చేసి పగడాలు తయారుచేస్తుంటారు. అందుకే గుండ్రని పగడాలతోబాటు పొడవాటి పుల్లముక్కల్లా కూడా కత్తిరించి గుచ్చి ధరించేవీ మార్కెట్లో కనిపిస్తుంటాయి. పగడం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎరుపు కలిసిన నారింజ వర్ణమే. కానీ అందులోని కెరోటినాయిడ్ల శాతాన్నీ రంగునీ బట్టి వీటిలో లేత గులాబీ, ఎరుపు, ముదురు ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు,  నీలం... ఇలా భిన్న రంగుల్లో రూపుదిద్దుకుంటాయి. మధ్యధరా సముద్రంలోనూ జపాన్‌,  తైవాన్‌ సమీపంలోని పసిఫిక్‌ తీరంలోనూ ఎక్కువగా పెరిగే కొరెల్రియం రబ్రమ్‌, కొరెల్లియం జపానికమ్‌ జాతుల నుంచే నగల్ని తయారుచేస్తుంటారు. వీటినే రెడ్‌ కోరల్‌ అనీ ప్రెషియస్‌ కోరల్‌ అనీ పిలుస్తారు. ముదురు ఎరుపు రంగులో ఉండే కోరల్‌ చాలా అరుదు. దాంతో దీని ఖరీదు కూడా ఎక్కువే.

పగడాల నమ్మకాలు!
పూర్వకాలంలో పగడాన్ని అమర ప్రేమకు సంకేతంగా భావించేవారు. పగడాల్ని ధరిస్తే దీర్ఘకాలం జీవిస్తారనీ సంపద వస్తుందనీ చైనీయులు విశ్వసిస్తే, కుజదోషంతోబాటు ఇతర గ్రహదోషాలను పగడం దరిచేరనీయదు అనేది భారతీయ జ్యోతిష నిపుణుల నమ్మకం. అంతేకాదు, పగడాల్ని ధరిస్తే పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందనీ భయమూ ఒత్తిడీ తొలగిపోతాయనీ నమ్ముతారు పాశ్చాత్యులు. రోమన్లకయితే పగడం చుట్టూ మరెన్నో విశ్వాసాలు... మెడలో వేస్తే పిల్లలు ఎలాంటి ప్రమాదాల బారినా పడకుండా ఉంటారనీ, దిష్టి తగలకుండా ఉంటుందనీ భావిస్తారు. సంతాన సాఫల్యతకోసమూ వీటిని ధరిస్తారు. గాయాల్ని తగ్గించేందుకూ పాము, తేలు కాట్లకి విరుగుడుగానూ కూడా వాడుతుంటారు. మొత్తమ్మీద పగడం ఆశావాద దృక్పథాన్ని పెంచే ఓ మంచి నమ్మకం. అంతకుమించి మంచి మందు కూడా. పగడాన్ని పొడి చేసి ప్రవల్‌ భస్మ పేరుతో కాల్షియం లోపంతో తలెత్తే అనేక ఎముక వ్యాధుల్ని తగ్గించేందుకు ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. మారే రంగుని బట్టి వ్యాధుల్నీ గుర్తిస్తారు. అల్సర్లు తగ్గించేందుకూ ఉపయోగిస్తారు. ఈమధ్య క్యాన్సర్లూ ఎయిడ్స్‌, నొప్పులూ ఇలా రకరకాల వ్యాధుల నివారణలోనూ ఎముకల్ని అతికించేందుకూ పగడాల పొడిని వాడుతున్నారు. జ్యోతిషులయితే పగడాల నుంచి వెలువడే పసుపు రంగు కిరణాలు కీళ్లనొప్పులూ, జననాంగ సమస్యలూ, మానసిక రుగ్మతల్ని తొలగిస్తాయనీ చెబుతారు. నమ్మకాలూ వైద్యం సంగతి ఎలాగున్నా పడతి మెడలో విరిసే పగడపు పువ్వుల అందాలకు ఫిదాకాని వారు ఉండరన్నది మాత్రం కాదనలేని నిజం..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.