close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మను కూడా గదిలోకి రానిచ్చేదాన్ని కాదు!

‘మీ కెరీర్‌ని ఇక వదిలేయాల్సిందే. కాలుపైన ఏ మాత్రం ఒత్తిడి పడినా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి ఉంటుంది’ అన్న వైద్యుల మాటల్ని లెక్క చేయలేదు. ‘నువ్వు   ఇంకేం ఆడగలవు... వెళ్లి ఇంట్లో కూర్చోవడం మంచిది’ అన్న తోటి క్రీడాకారుల్ని  పట్టించుకోలేదు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌. కసిగా రాటుదేలి ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మురిసి 2020 టోక్యో ఒలింపిక్స్‌కి బాటలు వేసుకుంది. క్రీడాకారిణిగా పతకాలూ, ప్రత్యేక గుర్తింపులెన్నో సొంతం చేసుకున్న పాతికేళ్ల వినేశ్‌ వ్యక్తిగతజీవితంలోనూ సమస్యలనే ప్రత్యుర్థులతో హోరాహోరీగా తలపడి విజయం సాధించిన ధీర. తన జీవితంలోని మరికొన్ని విశేషాలు...

ఫొగాట్‌ కుటుంబం మల్లయుద్ధానికి మరోపేరు అని చాలామంది అంటుంటారు. ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ సినిమాగా తీసింది మా పెదనాన్న మహావీర్‌ ఫొగాట్‌ జీవితాన్నే. ఇప్పటి వరకూ ఆ కుటుంబం నుంచి ఆరుగురు అమ్మాయిలం రెజ్లింగ్‌లోకి వచ్చాం. మాది హరియాణాలోని బలాలి అనే కుగ్రామం. నాన్న రాజ్‌పాల్‌ ఫొగాట్‌, అమ్మ ప్రేమలత ఫొగాట్‌లు మాకున్న కొద్దిపొలంలోనే వ్యవసాయం చేసేవారు. నాకో చెల్లీ, తమ్ముడు. మా దగ్గర ఆడపిల్లల పట్ల వివక్ష ఎక్కువ. అయినా నాన్న మమ్మల్ని ప్రోత్సహించి మరీ బడికి పంపారు. అప్పటికే మా పెదనాన్న ఊళ్లో వాళ్ల విమర్శలు ఎదురైనా గీత, బబిత అక్కలకి రెజ్లింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసి నాకూ రెజ్లింగ్‌పైన ఇష్టం కలిగింది. అయితే మా ఇంట్లో పరిస్థితుల కారణంగా ఆ కోరిక తీరుతుందని అనుకోలేదు. ఎందుకంటే పొలం సరిహద్దు తగాదాల్లో నాన్న హత్యకు గురికావడంతో మా కుటుంబం రోడ్డున పడ్డట్టైంది. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. పెదనాన్నే మా కుటుంబ బాధ్యత తీసుకున్నారు. నా మనసులో మాత్రం రెజ్లింగ్‌పైన ఇష్టం అలానే ఉంది. చొరవ లేక పెదనాన్నతో ఆ విషయం చెప్పలేకపోయా. ఒకసారి మా స్కూల్లో నాతోపాటు చదువుకునే అబ్బాయి నన్ను ఆటపట్టించడంతో కోపమొచ్చింది. పిడికిలి బిగించి వాడి మొహం మీద గట్టిగా కొట్టా. ఆ దెబ్బకి అతని ముక్కులోంచి రక్తం కారి రెండ్రోజులు బడి మానేశాడు. కొన్నాళ్లకి ఆ విషయం పెదనాన్నకి తెలిసి నన్ను పిలిపించారు. తిడతారేమోనని భయపడుతుంటే ‘ఏదీ ఆ అబ్బాయిని ఎలా కొట్టావో చూపించు...’ అనడంతో ఆశ్చర్యపోయా. ఆయన్నే కొట్టి చూపడంతో ‘శభాష్‌...’అని మెచ్చుకోవడంతోపాటు ‘రేపట్నుంచీ నువ్వూ రా రెజ్లింగ్‌ ట్రైనింగ్‌కి ’ అన్నారు. అలా పదేళ్ల వయసు నుంచి రెజ్లింగ్‌లో సాధన మొదలుపెట్టా. అయితే, దెబ్బలు బాగా తగలడంతో తట్టుకోలేకపోయేదాన్ని. నిదానంగా అలవాటు పడే క్రమంలో అమ్మకి క్యాన్సర్‌ అని తెలిసింది. దాంతో రెజ్లింగ్‌ మానేసి అమ్మని చూసుకుందామనుకున్నా. కానీ ‘నాకోసం ఆలోచించి నువ్వు ఆటకి దూరం కావొద్దు... పెదనాన్న నమ్మకాన్ని వమ్ము చేయకు’ అని చెప్పి కొంత పొలం అమ్మేసి ఆ డబ్బుతోనే వైద్యం చేయించుకుంది. పైగా కీమోథెరపీకి ఒంటరిగానే వెళ్లి వచ్చేది. ఆ బాధంతా మనసులో దిగమింగుకుని ట్రైనింగ్‌లో లీనమయ్యా. రాష్ట్ర స్థాయిలో ఆడి పలు పతకాలు సొంతం చేసుకోవడంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఒకానొక సమయంలో ఆట మానేసి ఉద్యోగం చేసి అమ్మని చూసుకుందామని ఉద్యోగంలో చేరా. అక్కడే సోమ్‌వీర్‌ పరిచయమయ్యాడు. తనూ రెజ్లరే కావడంతో చాలా తక్కువ సమయంలోనే స్నేహితులమయ్యాం. ‘నువ్వు పని చేయకపోయినా జీతం వస్తుంది. రెజ్లింగ్‌లో మాత్రం నువ్వు ఆడితేనే పతకం, పేరూ వస్తాయి. ఎటు వెళతావో నువ్వే తేల్చుకో’ అనడంతో మళ్లీ రెజ్లింగ్‌ మీద దృష్టి పెట్టా.

అప్పుడే తొలి పసిడి...
అప్పటికే అక్క గీత ఫొగాట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకం గెలుచుకున్న తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. అక్క విజయాన్ని దగ్గరగా చూశాక పసిడి పతకాలతోపాటు నాకూ పేరు తెచ్చుకోవాలనిపించింది. ఆ స్ఫూర్తితోనే కసిగా శిక్షణ తీసుకుని 2013లో దిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం దక్కించుకున్నా. ఆ తరవాత కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతంతో తిరిగొచ్చా. కొన్నాళ్లకి గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇంగ్లండ్‌ క్రీడాకారిణిని చిత్తు చేసి తొలిసారి పసిడి పతకాన్ని అందుకున్నా. గ్లాస్గో నుంచి తిరిగొచ్చాక క్రీడాలోకంలో సెలబ్రిటీ హోదా వచ్చింది.  ఎక్కడికెళ్లినా జనాలు బ్రహ్మరథం పట్టేవారు. ఆ తరవాత దోహాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో రజతం సొంతం చేసుకుని రియో ఒలింపిక్స్‌కీ అర్హత సాధించా. రియోలో ఎంతో కసిగా ఆడి క్వార్టర్‌ ఫైనల్స్‌కి చేరుకున్నా. ఆ రౌండ్‌లో చైనా రెజ్లర్‌ యాన్‌సున్‌తో తలపడ్డా. ఆమె ఆటతీరు మహా మొరటు. బలంగా నా కుడికాలిని మెలితిప్పేసింది. మోకాలులోని కీళ్లూ, కొన్ని ఎముకలూ విరిగిపోయాయి ఆ రింగులోనే కుప్పకూలిపోయా. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న నాకు ప్రాథమిక చికిత్స చేసి దిల్లీకి పంపేశారు.

కుమిలి కుమిలి ఏడ్చా...
పతకంతో తిరిగి వెళ్లాల్సిన నేను ప్రమాదకర గాయాలతో ఇంటిముఖం పడతాననుకోలేదు. క్యాన్సర్‌ నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న అమ్మకీ ఈ సంఘటన పెద్ద దెబ్బ. రకరకాల ఆలోచనలూ భరించలేని బాధతో దిల్లీకి చేరుకున్న నాకు ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి చూసి ఆ బాధ మరింత ఎక్కువైంది. రియోలో కాంస్యం సాధించిన సాక్షిమాలిక్‌, నేనూ ఒకే విమానంలో దిల్లీకి చేరుకున్నాం. సాక్షి బయటకు రాగానే ఆమెకి ఘన స్వాగతం చెబుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. తన వెనకే పతకం సాధించలేక బోసి మెడతో చక్రాల కుర్చీలో వచ్చిన నా వంక ఎవరూ కన్నెత్తి చూడలేదూ, పన్నెత్తి పలకరించలేదు. ‘నువ్వు పతకంతోనే తిరిగొస్తావని మాకు తెలుసు’ అంటూ రియోకి బయల్దేరినప్పుడు వీడ్కోలు చెప్పినవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ సమయంలో చాలా అవమానంగా అనిపించింది. ఆ బాధతో ఏడుస్తూనే అక్కడి నుంచి ఆసుపత్రికెళితే మోకాలికి ఆపరేషన్‌ చేశారు. రెండ్రోజుల తరవాత ‘కోలుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఇక నువ్వు ఆడకపోవడమే మంచిది’ అన్నారు వైద్యులు. ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అనిపించింది. రెజ్లింగ్‌ నా జీవితంలో ఉండదంటే తట్టుకోలేకపోయా. నెలరోజుల పాటు ఆసుపత్రి బెడ్డుపైనే ఉన్నా. కళ్లు మూస్తే రియో స్టేడియంలో కుప్పకూలిపోయిన సంఘటనే గుర్తొచ్చేది. ఇక కెరీర్‌ ముగిసిపోయిందనే బాధను జీర్ణించుకునే క్రమంలో డిప్రెషన్‌లోకి వెళ్లా. ఆసుపత్రి గదిలోకి అమ్మని కూడా రానిచ్చేదాన్ని కాదు. నన్ను చూసి జాలిపడుతుంటే తట్టుకోలేకపోయేదాన్ని. తనని బయటకు పంపి ఒంటరిగా కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. డిశ్ఛార్జి అయ్యాక చక్రాల కుర్చీలో కూర్చుంటే ముళ్ల మీద ఉన్నట్టే అనిపించింది. చాలారోజులు ఇంట్లోంచి బయటకు రాలేదు. అప్పుడే అర్జున అవార్డు వెతుక్కుంటూ వచ్చి నన్ను మామూలు మనిషిని చేసింది. క్రీడాలోకం నన్ను పక్కన పెట్టలేదని ఎంతో సంబరపడ్డా. చక్రాల కుర్చీలోనే వెళ్లి తీసుకున్న ఆ మెడల్‌ నా మెడలో వేసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఆడాలనే పట్టుదల పెరిగింది. ‘అంత సాహసం చేసి మళ్లీ ప్రమాదంలో పడొద్దు’ అని వైద్యులు హెచ్చరించారు. అప్పుడు పిరికిగా ఆలోచిస్తే ప్రాణాలు తీసుకోవాలనిపించేది. పట్టుదలతో ఆలోచిస్తే పతకం చేజిక్కించుకోవాలనిపించేది. అందుకే పాజిటివ్‌గా ఉండటం మొదలుపెట్టా. భరించలేని నొప్పి ఉన్నా ఫిజియోథెరపీ చేయించుకుంటూ స్థైర్యం కోల్పోకుండా చూసుకున్నా.

పతకంతో నోళ్లు మూయించా...
ఒకసారి గాయమై సున్నితంగా మారిన భాగంలో మళ్లీ ఒత్తిడి తగిలితే సమస్య తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉండాలని అంతర్జాతీయ ఫిజియోథెరపిస్టులని సంప్రదించా. వారి సమక్షంలో ఇంకా మెరుగైన చికిత్స తీసుకుంటూనే నడవడం మొదలుపెట్టాక కఠినమైన వ్యాయామాలు చేశా. పెరిగిన బరువును తగ్గించుకుంటూనే మోకాళ్లను దృఢంగా మార్చుకున్నా. ఏడాది తరవాత ‘నువ్విక ఆడొచ్చు’ అని నాకు ఆపరేషన్‌ చేసిన వైద్యులే సర్టిఫికెట్‌ ఇచ్చి మరీ పంపారు. దాంతో తొమ్మిది నెలలు శ్రమపడి ఫిట్‌గా తయారై జాతీయ శిబిరంలో చేరిపోయా. అక్కడ ‘ఏడాది క్రితం చక్రాల కుర్చీలో కనిపించిన ఆ నువ్వేనా ఈ నువ్వు’ అని చాలామంది ఆశ్చర్యపోయారు. ‘ఇంత జరిగాక కూడా నీకు ఆట ఎందుకు’ అని మరికొందరు హేళన చేశారు. అవేమీ పట్టించుకోకుండా జాతీయ స్థాయి పోటీల్లో తలపడి పసిడి పతకంతో తిరిగొచ్చి అందరి నోళ్లూ మూయించా. ప్రమాదం తరవాత శరీరం అలసిపోయేలా కాకుండా ప్రత్యర్థిని అంచనా వేస్తూ తను అలసిపోయేలా చేస్తూ నన్ను నేను కాపాడుకుంటూ ఆడటం అలవాటు చేసుకున్నా. ఇంతకు ముందు కంటే ఆత్మవిశ్వాసం కూడా పెంచుకున్నా. అలానే 2018 ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి అందుకుని నేను అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటగలనని నిరూపించా. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఎక్కడా తగ్గకుండా ఆ పతకాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నా. గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న భారత్‌ తొలి మహిళా రెజ్లర్‌గా గుర్తింపు సాధించా. పతకాల కంటే అలాంటి అరుదైన రికార్డులే ఎక్కువ కిక్కునిస్తాయి. ఈ కిక్కుతోనే మొన్నీ మధ్య ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్పులో కాంస్యం చేజిక్కించుకుని నా చిరకాల కోరిక అయిన ఒలింపిక్స్‌ పతకం దిశగా కొత్త ప్రయాణం ఆరంభించాను. ఒకప్పుడు ఓడానని నా మొహం చూడని వాళ్లే ఇప్పుడు నన్ను ఘనంగా ఆహ్వానించి స్పోర్ట్స్‌ అకాడమీకి తీసుకెళుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో!

సినీ రంగంలో ఆస్కార్‌ ఎంత  ప్రతిష్ఠాత్మకమైందో... లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డు కూడా క్రీడా రంగంలో అంత అత్యున్నతమైంది. ఈ ఏడాది  జనవరిలో ఆ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించా. అలానే కామన్వెల్త్‌,  ఆసియా క్రీడలు రెండింట్లోనూ స్వర్ణం అందుకున్న తొలి భారతీయ మహిళగానూ  గుర్తింపు లభించింది.

నా ప్రతి బాధలోనూ పక్కనున్న సోమ్‌వీర్‌తో రైల్వేలో పనిచేసినప్పుడే ప్రేమలో పడ్డా. ప్రస్తుతం తను జైపుర్‌ రైల్వే స్టేషన్‌లో టీటీఈగా పనిచేస్తున్నాడు. గతేడాది ఆగస్టులో ఆసియా ఛాంపియన్‌షిప్‌ సాధించి నాపుట్టిన రోజైన ఆగస్టు 24న దిల్లీకి తిరిగి వచ్చా. ఆ రోజే ఎంగేజ్‌మెంట్‌కి మా పెద్దవాళ్లు ముహూర్తం నిర్ణయించారు. కానీ విమానం ఆలస్యం కావడంతో మూహూర్తం సమయానికి విమానాశ్రయంలోనే ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు. పోయిన డిసెంబరులోనే మా పెళ్లైంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.