close
అతివల నోము అట్లతద్ది!

అట్లతద్ది అనగానే... ఆటపాటలతో అమ్మాయిలు చేసే సందడి గుర్తొస్తుంది. పండిన గోరింటను చూస్తూ పడుచులు అల్లేసుకున్న కొంటె ఊహలు గుర్తొస్తాయి. ఊయలలు ఊగే మగువ కాళ్ల అందెల సవ్వడి గుర్తొస్తుంది... ఇలా చెప్పుకుంటూపోతే అచ్చమైన తెలుగు పండగకు అంతకుమించి ఆడపిల్లలకు మాత్రమే పరిమితమైన పండగకు ఎన్ని సొగసులో. ఈ ఏడాది అక్టోబరు 16న అట్లతద్ది.

ట్లతద్దినే అట్లతదియ లేదా చంద్రోదయ ఉమావ్రతం అని కూడా అంటారు. ఈ నోమును ఆశ్వయుజ బహుళ తదియనాడు చేస్తారు. వయోభేదం లేకుండా స్త్రీలందరూ... ఈ వ్రతాన్ని నోచుకుంటారు. అట్లతదియకు ముందురోజును భోగి అంటారు. ఆ రోజు ఉదయాన్నే ఆడపిల్లలంతా ఒకచోట చేరి కాళ్లకూ చేతులకూ గోరింటాకు పెట్టుకుంటారు. కన్నెపిల్లలయితే... పండిన గోరింటాకును చూసుకుని కాబోయేవాణ్ణి ఊహించుకుంటూ మురిసిపోతారు. తెల్లారితే అట్లతద్ది... తదియ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, తలారా స్నానం చేసి అమ్మచేసిన గోంగూర పచ్చడీ, నువ్వుల పొడీ, ఉల్లిపాయ పులుసూ, గడ్డపెరుగుతో కమ్మగా భోంచేస్తారు. తర్వాత తాంబూలం వేసుకుని నోరు ఎర్రగా పండించుకుని... అన్నదమ్ముల సహాయంతో తోటలో లేదా పెరడులో ఉయ్యాలలు వేసుకుని, ఆ రోజంతా ఆడుతూ పాడుతూ గడుపుతారు. సూర్యాస్తమయ సమయానికి తమ అల్లరికి ముగింపు చెప్పేసి వ్రతానికి ఏర్పాట్లు మొదలుపెడతారు.

అట్లతద్ది నోము
పరమేశ్వరుడిని పతిగా పొందడం కోసం పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణ కథనం. గౌరీదేవి శివయ్యను మనువాడాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయాలని సూచించడమే కాకుండా ఆయనే పురోహితుడిగా మారి దగ్గరుండి ఈ క్రతువును చేయించాడంటారు. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. ముఖ్యంగా పెళ్లీడు అమ్మాయిలు మంచి భర్తను పొందడానికి ఆచరిస్తారు.

పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉమాదేవిని భక్తిగా పూజించి... అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తయిదువులకు అలంకారాలు చేసి అట్లూ, పండ్లూ, తోరాలను వాయినాలుగా అందిస్తారు.

తర్వాత... అట్లతద్ది
మహత్యాన్ని తెలిపే వ్రత కథను చెప్పుకుని అక్షతలు చల్లుకుంటారు. గౌరమ్మ అయిదోతనాన్నీ అష్టైశ్వర్యాలనూ మంచి సంతానాన్నీ ప్రసాదిస్తుందని ఫలశ్రుతి. ఈ వ్రతంలో పది సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. గౌరీదేవికి పది అట్లను నైవేద్యంగా పెడతారు. ముత్తయిదువులకు పది అట్లూ, పది పండ్లను వాయినంగా ఇస్తారు. పది రకాల పండ్లను తింటారు. పది సార్లు ఊయల ఊగుతారు. ఇలా పదేళ్లపాటు ఈ నోము నోచిన అమ్మాయిలకు మంచి భర్త లభించడంతోపాటు కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయనినమ్మకం.

అట్ల అంతరార్థం
అట్లతద్ది నోములో ప్రధాన పాత్ర అట్లదే. అయితే అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం దాగుంది. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను నైవేద్యంగా పెడితే జాతకంలో ఏవైనా కుజదోషాలు ఉంటే పోతాయని చెబుతారు. మినుములూ బియ్యం కలిపి అట్లు తయారుచేస్తారు. ఇందులో మినుములు రాహువుకూ బియ్యం చంద్రుడికీ ప్రతీకలు. ఈ రెండింటినీ కలిపి దానం ఇవ్వడం వల్ల గర్భదోషాలు ఏవైనా ఉంటే అవి తొలగి, మంచి సంతానం లభిస్తుందంటారు. ఆధునిక కోణంలో చూసినా... ఇది అమ్మాయిలకు శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగపడుతుంది. కుటుంబ బాధ్యతల్లో ఇమిడిపోయిన మహిళలకు ఆటపాటలు మనోల్లాసాన్ని అందిస్తే... అమ్మలను అనుసరిస్తూ పెరిగే అమ్మాయిలకు ఈ నోమూలూ వ్రతాలూ మన సంప్రదాయాన్ని మరో తరానికి అందించేలా చేస్తాయి. అన్నింటినీ మించి, ఒకరికొకరు సహాయపడటం, ఉన్నదాన్ని అందరూ పంచుకుని తినడం... మొదలైన వాటి వెనక ఉన్న పరమార్థం సామాజిక సంబంధాలను పటిష్టం చేయడం, అనుబంధాలను పెంపొందించడమే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.