close

బంధాన్ని కోరితే చెప్పాలి ‘సారీ’

బంధాన్ని కోరితే చెప్పాలి ‘సారీ’

ఐ యామ్‌ వెరీ సారీ... అన్నాగా వందోసారి... సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి... అంటూ సరదాగా పాడుకోవడం బాగానే ఉంటుంది కానీ వందసార్లు సారీ చెప్పే పరిస్థితి రాకూడదు ఏ అనుబంధంలోనూ. అలాగని అసలు చెప్పకపోవడమూ తప్పే. ఏ భాషలోనైనా- క్షమించమనే మాటది అనుబంధాల్లో చాలా పెద్ద పాత్ర. అందుకే దీన్ని ‘మ్యాజిక్‌ వర్డ్‌’ అంటారు సైకాలజిస్టులు. 
పాపాయికి ఇష్టమైన టిఫిన్‌ చేయలేకపోయారు. బుంగమూతి పెట్టిన చిట్టితల్లికి ‘సారీ నాన్నా. ఇవాళ్టికి ఇది తినేసెయ్‌. రేపు తప్పకుండా చేసిపెడతాగా...’ హామీ ఇస్తారు. 
హడావుడిగా తయారై వెళ్లినా ట్రాఫిక్‌ జామ్‌లో నుంచి బయటపడి ఆఫీసు చేరేసరికి పావుగంట లేట్‌. కోపంగా చూస్తున్న 
బాస్‌కి ఓ ‘సారీ’. 
సాయంత్రం కలుస్తానని ఫ్రెండ్‌కి మాటిచ్చారు. అనుకోకుండా ఆఫీసులో మీటింగ్‌. మరో ‘సారీ’ తయారు. 

ఇలా, తెల్లారి లేచినప్పటినుంచీ మన నోటివెంట ఎన్ని ‘సారీ’లో అలా అలవోకగా వచ్చేస్తుంటాయ్‌. మన భాష కాకపోయినా ఈ మాట ఇంతగా మనలో ఇమిడిపోవడానికి ఆ చిన్ని పదం చెప్పే పెద్ద అర్థమే కారణం. అందుకే ఇంగ్లిష్‌ వచ్చినవారూ రానివారూ కూడా ఆ మాటను తరచుగా వాడేస్తుంటారు. కానీ నిజంగా చెప్పాల్సిన పద్ధతిలో, చెప్పాలనుకున్న అర్థంలో చెబుతున్నారా- అంటే సందేహమే..! ఎందుకీ సందేహమంటే తెలిసో తెలియకో జరిగిన పొరపాటుకి క్షమించమని కోరుతూ సింపుల్‌గా చెప్పేసే చిన్ని ‘సారీ’ వెనకాల చాలా పెద్ద కథే ఉంది మరి! 
చాలా చెబుతుంది! 
‘సారీ’ అనే ఈ రెండక్షరాలు మాటల్లో పెట్టలేని ఎన్నో భావాలను చెబుతాయి. సందర్భం ఏదైనా... ఇద్దరి మధ్య ఉన్న 
అనుబంధం ఎలాంటిదైనా... ఒక్క ‘సారీ’ ఎంతో పని చేస్తుంది. తెలియక చేసిన తప్పుల్ని సరిచేస్తుంది. దూరమైన స్నేహాలను దగ్గర చేస్తుంది. తెగిపోయిన అనుబంధాలను అతికిస్తుంది. ఇద్దరి మధ్య కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం చుడుతుంది. జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతుంది. 
ఏదైనా తప్పు జరిగినపుడు ‘నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది’ అని అంగీకరించడంలో భాగంగా ‘సారీ’ చెబుతాం అంతేకదా అనుకుంటే పొరపాటే. తప్పును అంగీకరించడం ఒక్కటే కాదు, ‘సారీ’లో అవతలి వారి మనసుపడిన బాధనూ పంచుకుంటున్న భావం వినపడాలి. తప్పు ఎందుకు జరిగిందీ ఎలా జరిగిందీ అన్నదానికన్నా ఎదుటి వ్యక్తి బాధపడకుండా ఉండడం ముఖ్యం అనే అర్థమూ ఆ మాటలో ధ్వనించాలి. సందర్భాన్ని బట్టి ‘సారీ’ విలువ మారుతుంది. ఎదుటివారు ఏం ఆశిస్తున్నారన్న దాన్ని బట్టి ఆ పదం తీవ్రత ఉంటుంది. కొత్తవారితో మాట్లాడేటప్పుడు ఈ పదం అవసరం అక్కడికక్కడ తీరిపోతుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అయితే పొరపాటు దిద్దుకోడానికి అవకాశాన్నిస్తుంది. తప్పుకి బాధ్యత వహిస్తున్నారు కదా దిద్దుకుంటారులెమ్మని అవతలివారు త్వరగానే క్షమించేస్తారు. అక్కడితో దాన్ని వదిలేస్తారు. అదే స్నేహితులూ కుటుంబసభ్యులూ జీవితభాగస్వాముల మధ్య అయితే జరిగిన సంఘటన వారి మనసుల్ని బాధపెట్టి ఉంటుంది. ‘సారీ’ చెప్పగానే ఆ బాధ తుడిచిపెట్టుకుపోదు. వారి మనసులకు అయిన గాయం మానాలంటే ‘సారీ’తో పాటు ఇంకా ఏదో ఉండాలి. అదేమిటో తెలియాలంటే ‘సారీ’ సంగతులు కొన్ని తెలుసుకోవాలి. 
గొంతు పెగలదు! 
పిల్లలు ఆడుకుంటూ తోటి పిల్లల్ని గిచ్చడమో, కొట్టడమో చేస్తారు. అమ్మ చూడగానే ఏమీ ఎరగనట్లు అమాయకంగా మొహం పెడతారు. ‘తమ్ముడ్ని ఎందుకు గిచ్చావు తప్పు కదా, సారీ చెప్పు...’ అంటుంది అమ్మ. పిల్లవాడు ససేమిరా అంటాడు. తానసలు వాడిని తాకనే లేదని అబద్ధం చెబుతాడు. అమ్మ కోపంగా ఎంత ఒత్తిడి తెచ్చినా పిల్లవాడు తన పట్టు వదలడు. అయితే నీతో మాట్లాడను అని అమ్మ మరింత బలవంతం చేస్తే కిందిచూపులు చూస్తూ మొక్కుబడిగా సారీ అంటాడు. అలా చిన్నవయసునుంచే క్షమించమని అడగడం అంటే నామోషీగా భావించడం అలవాటైపోతుంది. పెద్దయ్యాక కూడా సారీ చెప్పడం అంత తేలికగా రాదు కొందరికి. ఇంకొందరికి అహం అడ్డొస్తుంది. దాంతో నోరు పెగలదు. అందుకే అత్యవసరమైన చోటా క్షమించమని అడగలేరు. ముఖ్యంగా పురుషుల్లో ఇది ఎక్కువ అంటారు నిపుణులు. సారీ చెప్పడాన్ని వారు బలహీన మనస్కుల అలవాటుగా భావించడమే అందుకు కారణమట. నిజానికి సారీ చెప్పడం బలహీనత కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. దృఢమైన మనస్తత్వం ఉన్నవారే అవసరమైన చోట ‘సారీ’ చెప్పడానికి ఏమాత్రం సంకోచించరు.
ఒప్పుకున్నట్లు కాదు! 
క్షమించమని అడిగినంత మాత్రాన తప్పు చేసినట్లూ దాన్ని ఒప్పుకున్నట్లూ కాదని చాలామందికి తెలియదు. అందుకే తమ అనుబంధాలనైనా పణంగా పెడతారు కానీ ‘సారీ’ మాత్రం చెప్పలేరు. అది తమ ఆత్మగౌరవానికీ అహానికీ దెబ్బగా భావిస్తారు. నిజానికి తన తప్పు లేకపోయినా సారీ చెప్పడమంటే తప్పు ఒప్పుకోవడం కాదు, అహానికన్నా అనుబంధానికి ప్రాధాన్యమివ్వడం. దానివల్ల ఇద్దరి మధ్యా సంభాషణకి సానుకూలత ఏర్పడి తద్వారా అవతలివాళ్లు వాస్తవాలు తెలుసుకునే మార్గం ఏర్పడుతుంది. ఒక్కోసారి ఎవరికి వారు తప్పు ఎదుటివాళ్లదేననీ, వాళ్లే సారీ చెప్పాలనీ ఎదురుచూస్తుంటారు. అది బంధాన్ని మరింత బీటలు వారేలా చేస్తుంది. తప్పెవరిదీ అని రీసెర్చ్‌ చేయడం కాకుండా ఎవరో ఒకరు చొరవ చూపి ముందుగా ‘సారీ’ చెప్పేస్తే బంధాన్ని కాపాడుకున్నవారవుతారు. ఆ తర్వాత పరిస్థితులు వాటంతటవే కుదుటపడతాయి. కొందరికి హోదా అడ్డొస్తుంది. ‘వాళ్లకు నేను సారీ చెప్పడమేమిటి’ అన్న భావన ఉంటుంది. అదీ తప్పే. ‘సారీ’ చెప్పడం వల్ల ఎవరూ చిన్నవారు కారు. నిజానికి అలా చెప్పడం వారిలోని గొప్పమనసుకు నిదర్శనం. కొంతమంది వ్యక్తిగతంగా చెడ్డవారు కాకపోయినా వారు పెరిగిన వాతావరణం వారిని సారీ చెప్పడానికి విముఖుల్ని చేస్తుంది. అందుకే తప్పు చేసినా సారీ చెప్పలేరు, క్షమాపణ విలువను గుర్తించలేరు. 

బంధాన్ని కోరితే చెప్పాలి ‘సారీ’

మహిళలు... కాస్త ఎక్కువే! 
అయినదానికీ కానిదానికీ సారీ చెప్పేయడంలో మహిళలు ముందుంటారట. ప్రతి సంభాషణనీ సారీతో మొదలుపెట్టడం కొందరికైతే అలవాటుగా మారిపోతుంది. ‘వారి ఉద్దేశంలో అలా మాట్లాడడం మర్యాద. తమ అభిప్రాయం ఎదుటివారిని నొప్పిస్తుందేమోనన్న భయంతో సారీ జతచేయడం ద్వారా వాడే భాషకి మృదుత్వాన్ని తెస్తారు. ఎదుటివారి భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇస్తూ ఎవరినీ నొప్పించకూడదనే అలా మాట్లాడతారు. మన సమాజంలో ఆడపిల్లల్ని పెంచే తీరే వారిని అలా తయారుచేస్తుందనుకుంటా. ఇంట్లో ఆడపిల్లలు బాధ్యతగా ఉండాలని పెద్దలు ఆశిస్తారు. దాంతో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి తామే బాధ్యత వహిస్తూ ‘సారీ’ చెప్పడం వారికి అలవాటైపోతుంది’ అంటారు ముంబయికి చెందిన లీడర్‌షిప్‌ కోచ్‌ శీతల్‌ మెహ్రా. అలా చీటికీ మాటికీ సారీ చెప్పడం ఎదుటివారికి చికాకు తెప్పిస్తుందంటూ ఆత్మన్యూనతగా పొరపాటుపడే ఈ అలవాటుని వదిలించుకోవడం మంచిదని సలహా ఇస్తారామె. అందరినీ సంతోషపరచాలనో లేదా ఎవరూ తనని పట్టించుకోవడంలేదేమోనన్న భావనతోనో అలా అతిగా సారీ చెప్పే అలవాటును తగ్గించుకోవాలంటే... రోజూ రాత్రి ఆరోజు ఎవరెవరితో 
ఏమేం మాట్లాడారో, ఎన్ని సార్లు సారీ అన్న మాట వాడారో గుర్తు చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఆ పదం అవసరం లేకపోయినా వాడారో విశ్లేషించుకుంటే నెమ్మదిగా వాడడం తగ్గుతుందన్నది నిపుణుల సలహా. 
సరిగ్గా చెప్పాలి మరి! 
అవసరమైన చోట చెప్పడం, అవసరం లేనిచోట మానేయడం ఎంత ముఖ్యమో ‘సారీ’ని సరిగ్గా చెప్పడమూ అంతే ముఖ్యం. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని దిద్దుకోవడంలో భాగంగా క్షమించమని అడగడంలోనూ మళ్లీ పొరపాటు చేయకూడదు. ‘సారీ’ అన్నది వినడానికీ పలకడానికీ ఎంత సులువుగా ఉన్నా అది పెదాల చివరినుంచీ వచ్చే మాట కాదు. గుండె లోతుల్లోంచి రావాలి. అందులో ‘తప్పు నాదే, అందుకు బాధపడుతున్నాను, ఆ తప్పు దిద్దుకోడానికి సిద్ధంగా ఉన్నాను, మరోసారి అలా జరగకుండా జాగ్రత్తపడతాను’... అనే నాలుగు విషయాలు విన్పించాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా మూడూ వృథానే. అందుకని ‘సారీ’ చెప్పేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. 
కానీ... వద్దు: సారీ చెప్పాక- ‘కానీ’ అన్నమాట వాడారంటే అంతా మటాష్‌... సారీ చెప్పిన ప్రయోజనమే ఉండదు. పైగా బాధపడుతున్నవాళ్లనే ఇంకా బాధపెట్టినట్లవుతుంది. అంటే, జరిగిన తప్పుకీ అది కలిగిస్తున్న బాధకీ పశ్చాత్తాపపడడం కాకుండా అది జరగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి వివరించడానికి ప్రయత్నించడం వల్ల తప్పు నాది కాదని చెప్పడానికి సాకులు వెదుక్కున్నట్లవుతుంది. 
‘నిన్న నేను వేసిన జోక్‌ నీకు బాధ 
కలిగించినట్లుంది. సారీ. నేనలా అనుండకూడదు. నాది తప్పే, ఇంకోసారి అలా జరగదు’ అనడానికీ 
‘నేను వేసిన జోక్‌ నీకు బాధ కలిగించినట్లుంది. సారీ, కానీ నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు, సరదాగా అన్నానంతే...’ అనడానికీ చాలా తేడా ఉంది. పైకి ఈ రెండు వాక్యాల్లోనూ పెద్ద తేడా కన్పించదు కానీ మొదటిది చూపినంత ప్రభావం రెండోది చూపదంటారు నిపుణులు. ఎందుకంటే అవతలి వ్యక్తికి కలిగిన బాధని పంచుకున్న భావన కానీ మరోసారి అలా జరగదన్న హామీ కానీ రెండోదాంట్లో కన్పించకపోవడమే. పైగా ఉద్దేశపూరితంగా చేయలేదని చెప్పడం ఒక వంక లాగే కన్పిస్తుంది. 
ఒక్కమాటతో మారిపోదు: సారీ చెప్పానుగా, ఇంకా కోపం తగ్గదే- అనుకుంటారు కొందరు. స్విచ్‌ వేస్తే లైట్‌ వెలిగినట్లుగా, సారీ 
చెప్పగానే బాధను మరచిపోయి ఆనందంగా నవ్వేయడం ఎవరికీ సాధ్యం కాదు. 
నొచ్చుకున్న మనసు తేరుకోడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటివరకూ 
ఎదుటివారి కోపాన్ని, నిరసననూ సహనంతో భరించక తప్పదు. సారీ చెప్పాక కూడా ఎందుకు భరించాలీ అంటూ కోపం తెచ్చుకుంటే మొదటికే మోసం వస్తుంది. తప్పు చేసినందుకు నిజంగా బాధపడుతున్నారనీ, మనస్ఫూర్తిగానే క్షమాపణ అడుగుతున్నారనీ అవతలివాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరం. 
అనుబంధంలో ఈ ఐదూ: ఇద్దరు మంచి స్నేహితుల మధ్యో, జీవిత భాగస్వాముల మధ్యో సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఐదు విషయాలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. ఆ క్షమాపణలో పశ్చాత్తాపం విన్పించాలి. జరిగినదానికి బాధ్యత తీసుకోవడం కన్పించాలి. ఇద్దరి మధ్యా అనుబంధం ఎప్పటిలా కొనసాగుతుందన్న నమ్మకం కలిగించాలి. మరోసారి అలా జరగదని నిజాయతీగా చెప్పాలి. తప్పు ఒప్పుకుంటూ క్షమించమని అడగాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనస్ఫూర్తిగా ‘సారీ’ చెప్పకపోతే ఏళ్ల తరబడి పెంచుకున్న ఎన్నో బంధాలు చటుక్కున తెగిపోగలవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఒక్క ‘సారీ’తో ఫిదా!

ప్రేమ లేఖల్లాగే క్షమాపణ లేఖలకీ చాలా సీనుంది. అది ఒక్కోసారి ఊహించని ఫలితాన్నిస్తుంది. 
* ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓ ఫ్యాక్టరీ  ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఓ మాట అన్నారు. యూనివర్శిటీలో నాలుగేళ్లు చరిత్రపాఠాలు చదవనక్కరలేకుండా వృత్తినైపుణ్యాలతోనూ మంచి కెరీర్‌ సాధించొచ్చు... అని. అది యూనివర్శిటీల్లో చర్చనీయాంశం అయింది. ఓ ప్రొఫెసర్‌ చరిత్ర విభాగంలో తాము ఏమేం పనులు చేస్తున్నదీ తెలుపుతూ ఒబామాకి లేఖ రాసింది. రెండు వారాలు  తిరిగేసరికల్లా ఆమెకో క్షమాపణ లేఖ అందింది. ‘నేను కార్మికులను ఉత్సాహపరిచేందుకు మాట్లాడుతూ నోరు జారాను. మీ విభాగాన్ని కించపరుస్తున్నానని తట్టలేదు. డిపార్టుమెంట్‌లో అందరికీ నా  క్షమాపణలు చెప్పండి’ అంటూ ఒబామా చేతిరాతతో వచ్చిన ఉత్తరం చూసి ఆ ప్రొఫెసర్‌కి ఆయన మీద గౌరవం అమాంతం రెట్టింపైంది. ఆయన విలువైన సమయాన్ని వృథాచేశానని బాధపడిపోతూ  ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టడంతో విషయం బయటకు వచ్చింది. 
* క్షమాపణ చెప్పడంలో జపాన్‌వారిది ప్రపంచంలోనే ప్రథమస్థానం. అక్కడ ఒక రైలు ఒకసారి 20 సెకన్లు ముందుగా బయల్దేరి వెళ్లిపోయినందుకు సంస్థ ప్రయాణికులకు చెప్పిన క్షమాపణ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రొఫెషనలిజం అంటే ఇదీ అంటూ సోషల్‌ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది.  
* ఓసారి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ టాంపన్ల ఉత్పత్తిలో  సమస్యరావడంతో అమ్మకాలు నిలిపేసింది. అది సరిచేసి అమ్మకాలను పునరుద్ధరించినా అప్పటికే వినియోగదారుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అప్పుడు సంస్థ చెప్పిన క్షమాపణ వ్యాపార వర్గాల్నే నిర్ఘాంతపరిచింది. ఫిర్యాదు చేసిన 60వేల మందికి పైగా వినియోగదారులకు సంస్థ వ్యక్తిగత ఈమెయిల్స్‌ రాసింది. సారీ చెబుతూ వారి పేర్లతో ప్రత్యేకంగా రూపొందించిన పాట వీడియో లింకులను పంపింది. అవి చూసి వినియోగదారులు ఫుల్‌ ఫిదా అయిపోయారు.  సరైన సమయంలో, సహానుభూతిని ప్రకటిస్తూ సారీ చెబితే  పరిస్థితులు సానుకూలంగా మారతాయనడానికి నిదర్శనాలివి. అందుకే నిపుణులంటున్నారు ‘క్షమాపణ అన్నది... ప్రేమతో ఇచ్చే బహుమతి లాంటిది. అందుకున్నవారికి ఆనందం, ఇచ్చినవారికి ఇంకా ఎక్కువ ఆనందం’ అని.

అక్కున చేర్చుకుని...: క్షమాపణ అడిగేవారు బాడీలాంగ్వేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తి కళ్లలోకి చూస్తూ మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎటో చూస్తూ ఏదో చేస్తూ తప్పదన్నట్లు సారీ చెప్తే ఫలితాన్నివ్వదు. సన్నిహితులైతే ఓ కార్డు ఇవ్వచ్చు. బొకేనో ఓ చిన్న బహుమతో తీసుకుని దాంతో పాటు ‘సారీ’ నోట్‌ పెట్టి ఇవ్వవచ్చు. భాగస్వామికి ‘సారీ’ చెప్పి కౌగిలిలోకి తీసుకుంటే క్షమించేయడానికి క్షణం చాలదూ! స్నేహితురాలిని దగ్గరికి తీసుకుని భుజం  తట్టవచ్చు. అంత సాన్నిహిత్యం లేనివారిని క్షమించమని అడగాల్సి వస్తే అనునయంగా చేతులు పట్టుకోవచ్చు. సీరియస్‌గా పనిచేసుకుంటున్నారు. పక్కగదిలో దబ్బుమని సౌండ్‌ వచ్చింది. ఏ ఫ్లవర్‌వేజో పగిలిపోయింది. అంతే, కోపంగా అక్కడ ఉన్న పిల్లవాడిని పట్టుకుని గబుక్కున నాలుగు వాయించేస్తారు. ‘నేను పడెయ్యలేదు’ అని వాడు చెప్తున్నా విన్పించుకోరు. అసలు కారణం తెలిశాక 
తప్పు మీదే అయితే ఏం చేస్తారు? 
కొందరు తేలుకుట్టిన దొంగలా గమ్మున ఉండిపోతారు. ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. అలా కాకుండా అబ్బాయిని అక్కున చేర్చుకుని ‘సారీ నాన్నా. నేనే పొరపాటుపడ్డాను. నిన్ను అనవసరంగా కోప్పడ్డాను’ అని మనస్ఫూర్తిగా చెప్పి 
ముద్దాడడం సరైన పద్ధతి. అప్పుడే పిల్లలు కూడా తమ తప్పులకు బాధ్యత వహించడం అలవాటు చేసుకుంటారు. 
పైపై హామీలు వద్దు: కొందరు పని గడవడానికి మొక్కుబడిగా ‘సారీ’ చెప్పేస్తారు. అసాధ్యమైన హామీలిస్తారు. అది అవతలివారి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేస్తుంది. అలాంటి ‘సారీ’తో అసలుకే మోసం వస్తుంది. వ్యవహారం మొత్తంగా బెడిసికొడుతుంది. 

బంధాన్ని కోరితే చెప్పాలి ‘సారీ’

ఎంతో హాయి! 
క్షమించమని అడగడం తేలిక కానే కాదు. డిఫెన్సులో పడిపోకుండా జరిగిన పొరపాటుకు బేషరతుగా బాధ్యత తీసుకోవడం చాలా కష్టం. అయినా సరే సారీ చెప్పేస్తే మనసుకు ఎంతో రిలీఫ్‌ లభిస్తుంది అంటారు ‘వై వోంట్‌ యు అపాలజైజ్‌’ పుస్తక రచయితా మనస్తత్వ శాస్త్రవేత్తా డాక్టర్‌ హారియెట్‌ లెర్నర్‌. అలాగని ‘సారీ’ అనేది నష్టపరిహారం కాదు, గాయపడిన హృదయానికి సాంత్వన మాత్రమే. ఆ చిన్నమాట వినగానే చెబుతున్నవారితో సహానుభూతి ఏర్పడుతుంది. దాంతో మనసు మెత్తబడుతుంది. క్షమించడానికి 
సిద్ధమవుతారు. సరిగ్గా ‘సారీ’ చెబితే అది మనసుకు అయిన గాయాన్ని మాన్పడానికి సాయపడుతుంది. కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది. మరోసారి పొరపాటు చేయకుండా ఉండేందుకూ తోడ్పడుతుంది. దాంతో తప్పుచేసినవారికీ మనసులో భారం తగ్గి రిలీఫ్‌గా ఉంటుందన్నమాట. తప్పు చేసి సారీ చెబితే... తెలివైన వాళ్లనీ, తప్పు చేయకుండానే సారీ చెబితే... వారు ప్రేమికులై ఉంటారనీ అంటారు. 
అనుబంధాన్ని పదిలంగా కాపాడుకోవడం కోసం అహాన్ని త్యాగం చేయగల శక్తి ప్రేమించే మనసుకే ఉంటుంది మరి! 
అందుకే బంధాలకు విలువ ఇచ్చేవారు 
నిస్సంకోచంగా చెప్పేస్తారు ‘సారీ’!

*     *      *

యూనివర్శిటీలో చదువుతున్న ఓ యువకుడు తండ్రితో గొడవపడ్డాడు. మాట్లాడడం మానేశాడు. రెండేళ్లయినా అతడు మారకపోయేసరికి భరించలేకపోయిన తండ్రి ఓరోజు కొడుకు చేతులు పట్టుకుని బతిమాలాడు. అయినా కొడుకు కరగలేదు. తల్లి కూడా 
బతిమాలడంతో అంటీ ముట్టనట్లుగా మాట్లాడడం మొదలెట్టాడు. ఆ తర్వాత వారానికే విదేశాలకు వెళ్లిపోయాడు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు తరచూ ఆ విషయం గుర్తొచ్చేది. తండ్రి పట్ల తానెంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిందీ తలచుకుని బాధపడేవాడు. ఈసారి వెళ్లినప్పుడు తప్పనిసరిగా తండ్రికి సారీ చెప్పాలనుకునేవాడు. వెళ్లాక మాత్రం అహం అడ్డొచ్చేది. చెప్పకుండానే తిరిగి వెళ్లిపోయేవాడు. అలా పన్నెండేళ్లు గడిచాయి. ఓరోజు తండ్రి మరణించినట్లు ఫోను వచ్చింది. అప్పుడు వెళ్లిన ఆ యువకుడు తండ్రి పాదాల మీద తల ఆన్చి క్షమించమని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ ఏం లాభం? క్షమించానని తల నిమిరి అక్కున చేర్చుకోడానికి అక్కడ తండ్రి లేడు, ఆయన దేహం మాత్రమే ఉంది. అది- ఇక ఎప్పటికీ దిద్దుకోలేని పొరపాటంటూ తాను చేసిన తప్పుని ప్రపంచానికి పాఠంగా చెప్పిన నాటి యువకుడే నేటి వ్యక్తిత్వ 
వికాస గురువు ‘గౌర్‌ గోపాల్‌దాస్‌’.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.