close
‘108’ ఆగిపోతుందేమో అనుకున్నాను!

ఏదైనా ప్రమాదం జరిగితే ‘అంబులెన్స్‌కి ఫోన్‌ చేయండి’ అనడానికి బదులు 108కి చేయండి అంటున్నాం మనం ఇప్పుడు! మనమే కాదు...దేశంలోని పదిహేను రాష్ట్రాల ప్రజలదీ ఇదే మాట. ఆ ‘108’ సృష్తికర్త... వెంకట్‌ చంగవల్లి. ఈఎంఆర్‌ఐ సంస్థ తొలి సీఈఓగా భారత్‌లోని నిరుపేద ప్రజలకూ అమెరికా స్థాయి అంబులెన్స్‌ సేవలు అందించవచ్చని నిరూపించారాయన. ఆ సంస్థని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అంతే నిశ్శబ్దంగా తప్పుకున్నారు. ప్రస్తుతం బడా కార్పొరేట్‌ సంస్థలకి మెంటార్‌గా, పలు రాష్ట్రప్రభుత్వాలకి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన్ని పలకరిస్తే...

‘నీకేమైనా పిచ్చా.?! చెన్నైలో పెద్ద ఇల్లు, ఏ ప్రైవేటు సంస్థలోనూ ఇవ్వనంత జీతం, ఇక్కడే స్థిరపడిపోయిన కుటుంబం... ఇదంతా వదులుకుని హైదరాబాద్‌ వెళ్లడం మంచి నిర్ణయం కాదు!’ - 2005లో నా బంధువుల అభ్యంతరం ఇది.
‘కార్పొరేట్‌ సంస్థలు ప్రజాసేవ చేస్తామంటే గుడ్డిగా నమ్మడం సమంజసమేనా?’- నా స్నేహితుల అనుమానం ఇది. ఎందుకీ అభ్యంతరాలూ, అనుమానాలూ అంటే... నేను సీఈఓగా ఉంటూ వచ్చిన సంస్థకి రాజీనామా చేసి, నాటి సత్యం ఛైర్మన్‌ రామలింగరాజుతో కలిసి అత్యవసర సేవల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి. రాజు అడిగినప్పుడు మొదట్లో నేనూ ఇవే అభ్యంతరాలే చెప్పాను. వాటన్నింటినీ తుడిచిపెట్టారు మా నాన్నగారు. ‘ఒరే! రేపు నువ్వు పోయాక ఎన్ని బంగ్లాలు కట్టావని ఎవ్వరూ చూడరు. ప్రజల కోసం ఏం చేశావో దాని గురించే రాస్తారు...’ అన్నారు. ఆ మాటలే నన్ను ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(ఈఎంఆర్‌ఐ) స్థాపన వైపూ, ‘108’ వైపూ నడిపించాయి.
మాది చీరాల దగ్గర ఆదిపూడి అనే చిన్నగ్రామం. అక్కడ తరతరాలుగా పౌరోహిత్యం చేసిన కుటుంబం మావాళ్లది. ఆ పరంపర నుంచి పక్కకి వచ్చి చీరాలలో టీచర్‌ ఉద్యోగానికి వెళ్లారు నాన్న చంగవల్లి వెంకటరమణయ్య. మంచితనం, మాటల్లో మన్నన, అబద్ధాలు ఆడకపోవడం...
వీటన్నింటా నాన్నే నాకు ఆదర్శం. అమ్మ స్వరాజ్యలక్ష్మి ‘ఎప్పుడూ నలుగురు వెళ్లే దారిలో కాదు... నీకంటూ కొత్త దార్లు వెతుక్కోవాలి!’ అనే తత్వాన్ని నాకు బాగా నూరిపోసింది. పదో తరగతి పాస్‌ అయినప్పటి నుంచీ ఇప్పటిదాకా దాన్నే నేను పాటిస్తూ వస్తున్నా. అప్పట్లో ఎస్సెస్సెల్సీ తర్వాత నాతోటివాళ్లందరూ చీరాల కాలేజీని ఎంచుకుంటే నేను మాత్రం విజయవాడ లయోలాకి వెళ్దామనుకున్నా. నాన్నకది ఇష్టంలేక అప్లికేషన్‌కి డబ్బివ్వలేదు. అమ్మే ఆ డబ్బు ఇచ్చి... వెళ్లి రమ్మంది. అలా ఆమె ప్రోత్సాహంతో లయోలాలో చేరిన నేను ఇంటర్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసై వరంగల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాను. అక్కడ ఆ కోర్సు ముగించేటప్పుడే మా అధ్యాపకులు నన్ను ఎంబీఏ చేయమని ప్రోత్సహించారు. నాకా ఇంగ్లిషు సరిగ్గా రాదు. అయినా సరే రోజూ ఇంగ్లిషు పత్రిక తీసుకుని పదం పదం చదువుతూ, వాటికి తెలుగులో అర్థం తెలుసుకోవడం మొదలుపెట్టాను. నాలుగునెలలు అలా శ్రమించి... నా ఇంజినీరింగ్‌ ఫైనల్‌ పరీక్షలతోపాటూ ఎంబీఏ ఎంట్రన్స్‌ కూడా రాశాను. ఐఐఎంలో సీటు సాధించడం నా జీవితంలో తొలి పెద్ద విజయం. అక్కడ కోర్సు పూర్తయ్యాక ‘భెల్‌’తోపాటూ ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం వచ్చింది. ఈసారి కూడా కొత్తదారిలోనే వెళ్దామనుకున్నాను. సర్కారీ జీతం, హోదాకన్నా... ఓ మేనేజర్‌గా ఎక్కువగా పని నేర్చుకునే అవకాశం ఉన్న కంపెనీలవైపే దృష్టిపెట్టాను. అప్పట్లో కేవలం ఓ స్టార్టప్‌గా మాత్రమే ఉన్న లుపిన్‌ ఫార్మా సంస్థలో చేరాను. వివిధ సంస్థలు మారుతూ, పదిహేనేళ్లు తిరగకుండానే, జర్మనీకి చెందిన డ్రాగాకో సంస్థకి 1994లో సీఈఓగా వెళ్లాను. నాలుగుకోట్ల నష్టంలో ఉన్న ఆ సంస్థని... పదకొండేళ్లలో 15 శాతం లాభాలవైపు నడిపించాను.
అప్పట్లోనే ఏడాదికి కోటిన్నర జీతం... సొంతంగా బంగ్లా... రెండేళ్లకోసారి కొత్త కారు... ఇలా ఉండేది జీవితం. అప్పుడే సత్యం రామలింగరాజు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నా ప్రసంగం విని... ప్రజలకి ఉచితంగా అత్యవసర సేవలు అందించే సంస్థని ప్రారంభించాలంటూ
నా దగ్గరకొచ్చారు. వెళ్లొచ్చా వద్దా అన్న నా మీమాంసని నాన్న పొగొట్టారు.

‘కుయ్‌... కుయ్‌...’ అలా మొదలైంది!
‘అమెరికాలోని 911 తరహాలో మనకీ ఓ అధునాతన అంబులెన్స్‌ సేవలుండాలి!’ అన్నది మాత్రమే రామలింగరాజు నాకు చెప్పిన ఆలోచన. దానికి కార్యరూపాన్నిచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. నాలుగు నెలల్లో తొలి దశ అంబులెన్స్‌ సేవలు మొదలుకావాలని చెప్పారు. ముందు అంబులెన్స్‌ ఎలా ఉండాలి అనే ఆలోచనతో నా పని ప్రారంభించాను. ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌ని పిలవడానికి ఇట్టే గుర్తుంచుకోగల నంబర్‌ లేక... మనదేశంలో ఏడాదికి 40 లక్షలమంది చనిపోతున్నారని ఓ అంచనా. కాబట్టి, ఓ నంబర్‌ కావాలనుకున్నాం. అమెరికాలాగే 911 పెడితే మంచిదన్నారుకానీ... అలా చేస్తే మన ప్రత్యేకత ఏముంటుంది? అందుకే 108 ఎంచుకున్నాను. ఒక్క హిందూ సంస్కృతిలోనే కాదు... బౌద్ధులకీ, జైనులకీ అది పవిత్రమైన సంఖ్య. ఇక అంబులెన్స్‌లో రోగుల్ని తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ మాత్రమే కాకుండా ఐదురకాల వీల్‌ఛెయిర్‌లు ఉంచడం, ప్రాథమిక చికిత్సకి కావాల్సిన సమస్త పరికరాలూ సిద్ధం చేయడం, రోడ్డుప్రమాదంలో ఎవరైనా వాహనాల్లో ఇరుక్కుంటే ఆ శిథిలాలని తొలగించేందుకు వీలుగా అంబులెన్స్‌లో రంపాలు కూడా పెట్టడం... ఇలా ప్రతి అంశంలోనూ కొత్తగా ఆలోచించి అంబులెన్స్‌ డిజైన్‌ చేశాము. మామూలు డిగ్రీలు చేసిన యువకులకీ పారామెడికల్‌ శిక్షణ ఇచ్చి... ప్రాథమిక చికిత్సా నిపుణులుగా మార్చాను. సత్యం సంస్థ ద్వారా నాక్కావాల్సిన సాంకేతికతని రూపకల్పన చేయించి... ఫోన్‌ చేసిన పదిహేను నిమిషాల్లోనే అంబులెన్స్‌ వచ్చేలా ఏర్పాటుచేశాను. అంబులెన్స్‌లు నడిపేవాళ్లని డ్రైవర్‌లు అని కాకుండా ‘పైలట్‌’ అని పిలవడం వల్ల... వాళ్లకి గౌరవంగా అనిపించడమే కాదు... రోగుల్నించి లంచాలు తీసుకోరని నమ్మాను. నా నమ్మకాలేవీ వమ్ముకాలేదు. రాష్ట్రం నలుమూలల నుంచీ రోజూ ఇన్ని వందలమంది ప్రాణాలు కాపాడామని రిపోర్ట్‌ వస్తుంటే... నాన్న మాటలే గుర్తొచ్చేవి. నా చదువుకి ఇదే సార్థకత అనిపించేది.

ఇలాంటివెన్నో...
హైదరాబాద్‌లోని ఓ మురికివాడ అది. అక్కడో యువతికి మాయ బయటకురాకుండానే ప్రసవమైంది. లక్షల్లో ఒకరికి అలా జరుగుతుంటుంది. కాన్పు కాగానే ఆమె స్పృహతప్పింది. ఇంట్లోనే  ప్రసవం జరిగిందికాబట్టి వైద్యులెవ్వరూ లేరు. భర్తా, బంధువులూ ఆమె చనిపోయిందని పాడెకట్టేశారు. ఆ బిడ్డనైనా కాపాడుకుందామని ‘108’కి ఫోన్‌ చేశారు. మావాళ్లు వెళ్లి... ఆ బిడ్డని ఆదుకున్నారు. ఎందుకో అనుమానం వచ్చి ఆ యువతిని పరీక్షిస్తే బతికే ఉందని తేలింది. ఆ తల్లీబిడ్డల్ని కాపాడటం 108 చరిత్రలో ఓ మైలురాయి! అన్నట్టు... నా హయాంలో 108 అంబులెన్స్‌లోనే అప్పట్లో 1.5 లక్షల ప్రసవాలు చేశారు మా సిబ్బంది! ఆంధ్రప్రదేశ్‌తో మొదలుపెట్టి గుజరాత్‌, అసోం, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు... ఇలా 11 రాష్ట్రాల్లో విస్తరించాం. దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కాపాడాం! అంతా బావుంది అనుకుంటూ ఉండగా... సత్యం కుంభకోణం వెలుగులోకొచ్చి మా సంస్థకి ఛైర్మన్‌గా ఉన్న రామలింగరాజు రిజైన్‌చేశారు. ఆ రెండోరోజే అరెస్టయ్యారు. టీవీల్లో ఆయన అరెస్టు దృశ్యాలు చూస్తూ... ఒక్కో ఇటుకా పేర్చి కట్టుకున్న ఈఎంఆర్‌ఐ సంస్థ కూడా కుప్పకూలుతోందని ఏడ్చేశాను. గట్టెక్కింది కానీ... ఈఎంఆర్‌ఐలో అంబులెన్స్‌లు నడపడానికి అవసరమయ్యే రోజువారీ ఖర్చుల్లో 90 ప్రభుత్వమిస్తే... 10 శాతం సత్యం సంస్థ ఇచ్చేది. రామలింగరాజు దాన్ని ఉపసంహరించుకున్నాక... అంతే మొత్తం పెట్టుబడి పెట్టేవాళ్లు కావాలి. మూడునెలలపాటు వివిధ ప్రయివేటు సంస్థలతో చర్చలు జరిపితే... పిరామల్‌ సంస్థ ముందుకొచ్చింది. ఇంకే సమస్యాలేదని  ఊపిరి పీల్చుకుంటుండగా... చివరి క్షణంలో వాళ్లు ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారు. ఏమీ పాలుపోని సమయంలో జీవీకే వాళ్లు ఆదుకున్నారు. కానీ, కొంతకాలానికే ‘ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు కాస్తయినా ప్రతిఫలం చూసుకోకపోతే ఎలా!’ అనుకున్నారు. ఈఎంఆర్‌ఐ వంటి సేవాసంస్థలకి అది పనికిరాదన్నది నా అభిప్రాయం. మూడేళ్లలో ఆ భేదాభిప్రాయాలు ఇంకాస్త పెరగడంతో రాజీనామా చేసి బయటకొచ్చేశాను.

కలాం ఫోన్‌...
ఈఎంఆర్‌ఐ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి కలాంని పిలిచాం. ఆయన దీన్ని మెచ్చుకుని ‘నీతో కలిసి పనిచేయాలనుంది వెంకట్‌.  రాష్ట్రపతిగా నా పదవీకాలం పూర్తికాగానే మీ సంస్థలో చేరతాను!’ అన్నారు. చెప్పినట్టే గౌరవ అధ్యక్షుడిగా వచ్చారు. నేను రిజైన్‌ చేసిన విషయం తెలియగానే మొదటి ఫోన్‌ ఆయన్నుంచే వచ్చింది. ‘నువ్వెందుకు రిజైన్‌ చేశావో అడగను. కానీ, తర్వాతేం చేయబోతున్నావో మాత్రం చెప్పు. నీ అనుభవం కూడా నలుగురికి ఉపయోగపడేలా చూడు!’ అని చెప్పారు. అప్పట్నుంచీ కార్పొరేట్‌ సంస్థల్లోని సీఈఓలకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నాను.
ఇది కేవలం వ్యక్తిత్వ వికాసంలాంటిది కాదు. సీఈఓలకి కంపెనీ విజయాలకి కావాల్సిన దృక్పథాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, సమస్యలు అధిగమించడానికి అవసరమైన నైపుణ్యాలనీ నా అనుభవంతో చెబుతాను. ఇప్పటిదాకా మూడువందలమంది సీఈఓలూ, జనరల్‌ మేనేజర్‌లకి మెంటార్‌గా వ్యవహరించాను. మూడేళ్లకిందట ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి పోలీసుల కోసం 108 తరహాలో సంస్థని స్థాపించమని చెబితే చేసిచ్చాను. అది చూశాక హరియాణా ప్రభుత్వం నన్ను సలహాదారుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 108, 104 సేవల్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించే పనినీ ఇటీవల నాకు అప్పగించింది. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన అత్యవసర ‘100’ నంబర్‌ని అన్ని జిల్లాలకూ విస్తరించే పనుల్లో ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎవరు ఫోన్‌ చేసినా పదిహేను నిమిషాల్లో పోలీసులు చేరుకునేలా దీన్ని మారుస్తాం. దీంతోపాటూ జిల్లా ఎస్పీలకి లీడర్‌షిప్‌ మెంటార్‌గానూ ఉంటున్నాను. ఇవి కాకుండా మనదేశంలో ఏ విద్యాసంస్థ ఎక్కడికి పిలిచినా వెళ్లి మోటివేషనల్‌ తరగతులు నిర్వహిస్తుంటాను. నాకు కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చే డబ్బు సరిపోతుండటంతో... ప్రభుత్వాల నుంచి కానీ, విద్యాసంస్థల నుంచి కానీ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. ఆ విషయంలో కలాంగారే నాకు స్ఫూర్తి!

వాళ్లే వెన్ను... దన్ను!

నేను ఈఎంఆర్‌ఐకి రిజైన్‌ చేసిన విషయం... టీవీల ద్వారా ముందుగానే నా కుటుంబానికి తెలిసిపోయింది. నేను ఇంటికి వెళ్లగానే మా ఆవిడ ‘హమ్మయ్య... ఇకపైన మీరు ఫ్రీ అయిపోతారు. హాలిడేస్‌కి ఎక్కడికెళ్దాం చెప్పండి...!’ అంది నవ్వుతూ. మా అబ్బాయిలూ, కోడళ్ళూ ‘ప్రస్తుతం గూగుల్‌లో నీకు సంబంధించి 15 పేజీలే ఉన్నాయి నాన్నా. వాటిని 40కి చేరుద్దాం రండి!’ అన్నారు ఉత్సాహంగా. వాళ్ళందరూ నేను దిగులుపడకుండా చూడాలనే అంత ఆరాటపడుతున్నారని గ్రహించి హాయిగా నవ్వేశాను. అప్పుడే కాదు నా కెరీర్‌లోని ప్రతిస్థాయిలోనూ కుటుంబమే నా వెన్నుదన్ను. ముఖ్యంగా మా ఆవిడ... మా పెళ్ళయ్యేటప్పటికి తను బ్యాంకు ఉద్యోగిని. ఇరవై ఏళ్లపాటు పిల్లల్నీ, ఉద్యోగాన్నీ చక్కగా చూసుకుంది. అంతేకాదు, మా తమ్ముళ్లు స్థిరపడటంలోనూ తన సహకారం ఎంతో ఉంది. తను లేని ఏ విజయాన్నీ ఊహించలేను నేను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.