close

వ్యాయామం ఎక్కువైతే...

తి ఏదయినా సమస్యే... ఇందుకు వ్యాయామమూ మినహాయింపు కాదు అంటున్నారు ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకులు. కసరత్తు అనేది శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, దాని ప్రభావం మెదడుమీదా ఉంటుంది. ఆ అలసట ఆలోచనలమీదా ప్రతిఫలిస్తుందనీ ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోలేరనీ వాళ్లు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు 37 మంది అథ్లెట్లను ఎంపికచేసి వాళ్లతో క్రమబద్ధమైన వ్యాయామంతోబాటు మూడువారాలపాటు అదనంగా మరో 40 శాతం సైక్లింగ్‌, రన్నింగ్‌ వంటివి చేయించారట. ఆపై వాళ్ల ఎమ్మారై స్కాన్‌ని పరిశీలించగా- మెదడులోని కొంతభాగం చురుకుదనాన్ని కోల్పోయినట్లు గుర్తించారు. దాంతో వ్యాయామం మితిమీరితే ప్రణాళికాబద్ధంగా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇతరత్రా ప్రవర్తనాలోపాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. సో, అతి ఎందులోనూ మంచిది కాదన్నమాట!

ముఖాన్ని మెరిపించేద్దాం!

కాలుష్యంవల్ల కాంతిని కోల్పోయిన ముఖాన్ని మెరిపించాలంటే...
* అరటిపండు, టీస్పూను నిమ్మరసం, టీస్పూను తేనె తీసుకుని అన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి పొడి టవల్‌తో తుడిచి ఆ మిశ్రమాన్ని పట్టించి పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడగాలి. అరటిపండులోని ఎ, బి, ఇ విటమిన్లూ పొటాషియం అన్నీ కలిసి ముఖంమీద ఉన్న మచ్చల్ని పోగొట్టి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. లేదా రెండు టేబుల్‌స్పూన్ల సెనగపిండిలో నాలుగు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌ పోసి పేస్టులా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మం మీదున్న టాక్సిన్లనీ మృతకణాలనీ తొలగించి మెరిసేలా చేస్తుంది.
* టేబుల్‌స్పూను బేకింగ్‌సోడాలో ఒకటిన్నర టీస్పూన్ల నీళ్లు పోసి పేస్టులా కలిపి ముఖంమీద మర్దన చేసినట్లుగా రుద్ది ఐదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా మచ్చలన్నీ పోయి తేటగా అవుతుంది.
* బొప్పాయిపండు ముక్కని తీసుకుని దానికి టీస్పూను నిమ్మరసం, టీస్పూను పాలు జోడించి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేసినా ఫలితం ఉంటుంది. ఇందులోని నిమ్మరసం, బొప్పాయి కలిసి చర్మాన్ని బ్లీచ్‌ చేస్తే, పాలు మృదువుగా మెరిసేలా చేస్తాయి.


కుక్క ఉంటే గుండె పదిలం

కుక్కల్ని పెంచుకోవడం వల్ల శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారన్నది తెలిసిందే. వాళ్లే కాదు, గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నవాళ్లు కూడా కుక్కల కారణంగా ఎక్కువ కాలం జీవించినట్లు వెల్లడైంది. స్వీడన్‌కి చెందిన ఉపాసల, స్వీడిష్‌ విశ్వవిద్యాలయాలు కలిసి నిర్వహించిన పరిశీలనలో ఇది స్పష్టమైంది. ఇందుకోసం వీళ్లు ఇరవై ఏళ్ల క్రితం గుండెజబ్బు బారినపడ్డ కొందరు వ్యక్తుల్ని ఎంపికచేసి, వాళ్లలో కుక్కల్ని పెంచుకునేవాళ్లనీ పెంచని వాళ్లనీ రెండు విభాగాలుగా చేసి వాళ్లు ఎంతకాలం జీవించారనేది అధ్యయనం చేశారు. అందులో కుక్కల్ని కలిగి ఉన్నవాళ్లలో మరణాల సంఖ్య 33 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఒంటరిగా జీవిస్తూ కుక్కల్ని పెంచుకునేవాళ్లలోనూ 15 శాతం మరణాల సంఖ్య తగ్గిందట. వీళ్లతో పోలిస్తే గుండెజబ్బు సోకిన వాళ్లలో శునక తోడు లేనివాళ్లు త్వరగా మరణించడం లేదా మళ్లీ ఆసుపత్రిలో చేరడం వంటివి ఎక్కువగా కనిపించాయట. అందుకే ఒంటరితనంతో బాధపడేవాళ్లతోబాటు హృద్రోగుల ఆయుష్షు పెరిగేందుకూ పెంపుడు కుక్కలు తోడ్పడతాయని పేర్కొంటున్నారు పరిశోధకులు.


అమ్మ కోపంగా చెబితే... నచ్చదంతే..!

పిల్లల పెంపకంలో అసలైన సవాల్‌ ఎదురయ్యేది టీనేజ్‌లోనే. ఏది చెప్పినా ఓ పట్టాన అర్థం చేసుకోరు. తల్లి నియంత్రిస్తున్నట్లుగా చెబితే అస్సలు నచ్చదని కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం 14-15 సంవత్సరాల వయసున్న వెయ్యిమంది పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లను రెండు విభాగాలుగా చేసి అధ్యయనం చేశారట. ఈ రోజు ఫలానా బుక్‌ చదవాలన్న విషయాన్ని రెండు రకాలుగా- అంటే గదమాయిస్తున్నట్లూ సుతిమెత్తగా లాలిస్తున్నట్లూ తల్లులతో చెప్పించి రికార్డు చేసి వాళ్లకు వినిపించారట. గద్దించిన గొంతు విన్నప్పుడు ఆ విషయాన్ని పిల్లలు అస్సలు పట్టించుకోలేదట. కానీ మృదువుగా చెప్పిన తల్లి గొంతు వినగానే పాజిటివ్‌గా స్పందించారట. దీన్నిబట్టి టీనేజీ పిల్లలను గద్దించడం కన్నా ప్రేమతోనే కన్విన్స్‌ చేయాలని సూచిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.