close

కోర్కెలు తీర్చే రేడు కోటిలింగేశ్వరుడు!

ఈశుడు... అనంతుడు, ఆద్యంత రహితుడు, భక్తసులభుడు, లయకారుడు. శంభో అంటే స్వయంభువై వెలసేవాడు. ఆ కైలాసనాథుడు... ఒకటి కాదు రెండు కాదు కోటి లింగాల్లో కొలువైన క్షేత్రం గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని కోటిలింగేశ్వర ఆలయం. యంత్ర, మంత్ర, తంత్ర క్షేత్రాల్లో మూడు రూపాల్లో కొలువైన ముక్కంటి ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకమే.

ఓంకారం ప్రణవం వందే ఓంకారం పరమాత్మకం।
ఓంకారం శివరూపంచ శివజ్ఞానపరేతరా।।

అంటే... ఓంకారం నుంచే సృష్టి పుట్టింది. ఆ ఓంకారమే శివుడు. అందుకే శివుడికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాయో ఓంకారానికీ అంతే ప్రాముఖ్యాన్ని కల్పించాయి మన పురాణాలు. దీనికి గుర్తుగానే ప్రధానాలయం పై భాగంలో శివయ్య ఓంకారేశ్వరుడిగా కొలువయ్యాడు. ఓం నమ:శివాయ మహా మంత్రానికి మాతృస్వరూపిణి అయిన శివపంచాక్షరీ దేవితో కలసి పూజలందుకుంటున్నాడు. దీంతోపాటు సనాతన ధర్మంలో భాగాలైన యంత్ర, మంత్ర, తంత్రాలు మూడూ మూడు ఆలయాలుగా వెలుగొందుతున్న క్షేత్రం తాళ్లాయపాలెం కోటిలింగేశ్వర క్షేత్రం. యంత్రాలయంలో స్వామివారు కోటిలింగేశ్వరుడిగా, అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా పూజలందుకుంటున్నారు. త్రిలోకాలకూ, త్రికాలాలకూ గుర్తుగా ప్రధానాలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడి గర్భాలయంలోకి అందరూ ప్రవేశించవచ్చు. లింగమూర్తిని తాకి అభిషేకాలూ, అర్చనలూ, పూజలను స్వయంగా చేసుకోవచ్చు.
పరమశివుడు లింగాకారంలోనే పూజలందుకుంటాడన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆ స్వామి ఒక్కో యుగంలో ఒక్కో లింగం రూపంలో ఆవిర్భవించాడంటారు. కృతయుగంలో పాదరసలింగం, త్రేతాయుగంలో రత్నలింగం, ద్వాపరంలో స్ఫటిక లింగం, కలియుగంలో పంచలోహలింగంగా ఉంటాడని చెబుతారు. దీనికి గుర్తుగానే గర్భాలయానికి నాలుగుమూలలా ఈ నాలుగు లింగాలతో ఆలయాలను నిర్మించారు.

మంత్ర క్షేత్రం...
మంత్ర క్షేత్రంలో స్వామి బాలాత్రిపురసుందరీ సమేతుడై త్రిపురాంతకుడిగా దర్శనమిస్తాడు. ఈ ప్రాంగణంలోనే మహాగణపతి 32 మూర్తులను ప్రతిష్ఠించారు. శివతత్వ ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం నుంచీ ఒక లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలా ఇప్పటి వరకూ 662 గ్రామాల వారు ఈ మంత్రక్షేతంలో శివలింగాలను ఏర్పాటుచేశారు. పరమ శివభక్తులైన అరవై మూడు మంది నాయనార్ల పంచలోహమూర్తులనూ ఈ ఆలయప్రాంగణంలో దర్శించుకోవచ్చు.

తంత్ర క్షేత్రం...
ఈ క్షేత్రంలో స్వామి అష్టభుజ దుర్గాదేవితో కలిసి అమృతలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. తంత్ర శాస్త్రంలోని అతిప్రాచీన పాషాణ విద్య ఆధారంగా నవపాషాణ లింగాలను తయారు చేశారు. వీటికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేస్తే రసాయన చర్య జరిగి ఆ జలం దివ్యౌషధంగా మారుతుందనీ, ఆ తీర్థాన్ని తాగడం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు తొలగుతాయనీ భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఎనిమిది చేతుల్లో అభయ హస్తం, శంఖం, చక్రం, బాణం, ధనుస్సు, చిలుకలను ధరించి ఉంటుంది. శివకేశవులకు అభేదాన్ని చాటుతూ ఇక్కడ విశ్వవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు.

ఫలప్రదాయిని ప్రత్యంగిరాదేవి
ఈ క్షేత్రానికి ఉన్న మరో వైశిష్ట్యం... ప్రత్యంగిరాదేవి ఆలయం. దేశంలో చాలా అరుదుగా ప్రత్యంగిరాదేవి ఆలయాలు ఉన్నాయి. యుద్ధంలో దేవతలకు విజయం ప్రసాదించడానికి ఆదిపరాశక్తి ఈమెను సృష్టించిందని చెబుతారు. ప్రతిపక్షనాశిని, ప్రతిమంత్ర భక్షిణి అవడంతో అమ్మవారికి ప్రత్యంగిర అనే నామం వచ్చింది. ఈ అమ్మనే కృత్య, అధర్వణ భద్రకాళి, నికుంభిల అనీ పిలుస్తారు. నవదుర్గల్లో ఈమెది మూడో అవతారం. శ్రీరాముడు, నలుడు, పంచపాండవులు ప్రత్యంగిరాదేవిని పూజించిన తర్వాతే వారి రాజ్యాలను తిరిగి పొందారని పురాణ కథనం.
తాళ్లాయపాలెంలోని కోటిలింగేశ్వరాలయం దక్షిణాదిలోనే మహిమాన్విత శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తెల్లవారుజామున అయిదు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకూ నిత్యపూజలూ, అభిషేకాలూ జరుగుతూనే ఉంటాయి. మాసశివరాత్రి, పౌర్ణమి, అమావాస్య... లాంటి విశేష రోజుల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తిక మాసాల్లో ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగుతుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ వాహనాలమీద స్వామివారిని ఊరేగిస్తారు. చివరి రోజున శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు.

ఇలా చేరుకోవచ్చు
ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గంలో... రాష్ట్రం నలుమూలల నుంచీ గుంటూరు బస్టాండుకు బస్సు సదుపాయం ఉంది. గుంటూరు నుంచి మంగళగిరి మీదుగా ప్రయాణించి మందడంలో దిగాలి. అక్కడి నుంచి శైవక్షేత్రానికి ఆటో సౌకర్యం ఉంది. రైలు మార్గంలో వచ్చే భక్తులు... మంగళగిరి రైల్వే స్టేషన్‌లో దిగాలి. స్టేషన్‌ నుంచి ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు.

- మోహిత్‌ ప్రసాద్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.