close
ఆ పాట పాడతానని నాన్నని అడగలేకపోయా

బాహుబలి2లో ‘దండాలయ్యా...’పాటతో గాయకుడిగా పరిచయమయ్యాడు సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి కుమారుడు కాలభైరవ. రెండేళ్లలో ‘అరవింద సమేత’, ‘తొలిప్రేమ’, ‘మజిలీ’ వంటి సినిమాల్లో మనసుకు హత్తుకునే పాటలెన్నో పాడిన భైరవ అంతరంగం తనమాటల్లోనే.

నేను పుట్టింది చెన్నైలో. చిన్నతనంలో అమ్మ జోలపాటలూ నాన్న సినిమా పాటలూ వింటూ పెరిగా. నాకు ఊహతెలిసే నాటికి ‘అన్నమయ్య’ సినిమా చేస్తున్నారు నాన్న. అప్పుడప్పుడూ నన్ను పాటల రికార్డింగ్‌  థియేటర్‌కీ తీసుకెళ్లేవారు. ఆ సినిమాకి నాన్నకి జాతీయ అవార్డు రావడం నాకు గుర్తే. ఇక, నేను రెండో తరగతికి వచ్చాక హైదరాబాద్‌కి మారిపోయాం. జీడిమెట్లలోని ఓ స్కూల్‌లో ఇంటర్‌ వరకూ చదువుకున్నా. అక్కడ చదువుతోపాటు, ఇతర వ్యాపకాలు నేర్పిస్తూనే కెరీర్‌గైడెన్స్‌, సంప్రదాయాల గురించీ బాగా చెబుతారని దూరమైనా అక్కడికే పంపారు. ఇంటికొచ్చాక మా అమ్మమ్మ హోం వర్క్‌ చేయించి ‘కాశీమజిలీ’ కథలు చెప్పేది, వాటిని చదివించేది కూడా. అలానే తాతగారు శివశక్తిదత్త రచయిత కావడంతో ఆయన ప్రభావం కూడా నామీద ఉంది. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఇంగ్లిష్‌ మీడియంలో చదివినా నేను చక్కగా తెలుగులో మాట్లాడుతూ, పాడుతూ ఉన్నానంటే వాళ్లిద్దరే కారణం. అంతేకాదు, నాకూ తమ్ముడు శ్రీసింహకీ, చెల్లి కుముద్వతి అపరాజితకీ పేర్లు పెట్టింది మా తాతగారే. అందుకే మా స్నేహితులు చాలామంది ‘మీ పేర్లు పలకడం చాలా కష్టంగా ఉంది’ అన్నా మేం బాధపడం.

సివిల్స్‌ రాద్దామనుకున్నా...
పదో తరగతి వరకూ నేను సంగీతం వైపు రావాలనుకోలేదు. కానీ చిన్నతనంలో అమ్మ కర్ణాటక సంగీతం నేర్పించింది. ఆసక్తి కొద్దీ నేను పియానో నేర్చుకున్నా. అలాగని మా అమ్మానాన్నలు నన్ను గాయకుడిగానో, సంగీత దర్శకుడిగానో చూడాలని కలలు కనలేదు. ‘నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావ్‌...’ అని ఎప్పుడూ నన్ను అడగలేదు. స్కూల్‌లో ఉన్నప్పుడు ఐఏఎస్‌ అవ్వాలనుకునేవాడిని. ఇంట్లో కూడా అదే చెబుతుండేవాడిని. అలానే చిన్నప్పుడు నాకు డ్యాన్స్‌ అంటే కూడా పిచ్చి. ఆ ఇష్టంతోనే నేర్చుకుని స్కూల్‌లో డ్యాన్స్‌ క్లాస్‌లు కూడా తీసుకునేవాణ్ని. ఇప్పటికీ డ్యాన్స్‌ వదల్లేదు. నా సర్కిల్‌లో ఎవరిదైనా సంగీత్‌ ఉంటే అక్కడ నేను డ్యాన్స్‌ ఇరగదీయాల్సిందే, అంతిష్టం నాకు. అయితే
ఇంటర్‌కి వచ్చాక ఒక్కసారిగా నా ఆలోచన మారిపోయింది. సంగీతం వైపు మనసు మళ్లింది. మా స్నేహితులూ, బంధువుల్లో నా వయసు వారు అప్పటికే కెరీర్‌ను నిర్ణయించుకున్నారు. నేనే ఇంకా పూర్తి స్థాయిలో ఆ పని చేయలేదు. దాంతో నేనూ బాగా ఆలోచిస్తే  సంగీతమే నాకు సూట్‌ అవుతుంది అనిపించింది. ‘నాన్నలా మ్యూజిక్‌ కంపోజర్‌ అవుదామనుకుంటున్నా’ అని ఇంటర్‌ అయ్యాక మనసులో మాట అమ్మకి చెప్పేశా. తను పెద్దగా పట్టించుకోలేదు. బహుశా తను ముందే ఇది ఊహించి ఉండొచ్చు. ‘ఇదే కెరీర్‌ అని సీరియస్‌గానే నిర్ణయం తీసుకున్నావా... ఒకవేళ అదే నీ ఫైనల్‌ డెసిషన్‌ అయితే బాగా కష్టపడాలి. ఏదేమైనా ముందు చదువు పూర్తి చెయ్‌’ అని చెప్పింది. దాంతో సెయింట్‌ మేరీస్‌లో బీఎస్సీ పూర్తి చేసి నాన్న దగ్గర సహాయకుడిగా చేరిపోయా. అప్పుడే బాహుబలి షూటింగ్‌ మొదలవుతోంది. నాన్న పనిని గమనిస్తూనే పాటలు పాడటం, కంపోజింగ్‌ ప్రాక్టీస్‌ వంటివి చేసేవాడిని. క్రమంగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడంపైనా పట్టు వచ్చింది.

బలవంతం చేసి పాడా...
‘బాహుబలి2’కి కొబ్బరికాయ కొట్టే సమయానికి నా మీద నాకు నమ్మకం పెరిగింది. దేవసేన తెరమీదకొచ్చే సీన్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేసే అవకాశమిచ్చారు నాన్న. అయితే అదే సమయంలో ‘దండాలయ్యా...’ పాట ట్యూన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వినీ వినీ అది నాకు కంఠతా వచ్చేసింది. అప్పటికి ఎవరితో పాడించాలన్నది ఇంకా నిర్ణయించలేదు. నాకు పాడాలనిపించింది. కానీ నాన్నని ధైర్యంగా అడగలేకపోయాం. ఒకరోజు నాన్న రికార్డింగ్‌ థియేటర్‌లో లేని సమయంలో ‘ఆ పాట నేనూ పాడతా ట్రాక్‌ రికార్డ్‌ చేయండి’ అని నాన్న దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసే జీవన్‌ అన్నని అడిగా. అప్పటికి తను చాలా పనిలో ఉన్నాడు. సరదాగా అడుగుతున్నాను అనుకుని ‘నాన్న పాడేశారు కదా తరవాత చూద్దాంలే’ అన్నారు. ఎంత అడిగినా కుదరదంటే కుదరదు అన్నారు. అయినా నేను వినకుండా పట్టుబట్టి పాట పాడి ట్రాక్‌ని రికార్డు చేయించా. సాయంత్రం రికార్డింగ్‌ థియేటర్‌కి వచ్చిన నాన్నకి ఆ విషయం చెప్పలేదు. యథాలాపంగా ఆ ట్రాక్‌ను ఆన్‌ చేశారు. నేను పాడింది విని ‘చాలా బాగుంది. ఎవరిదీ వాయిస్‌? ఇదే ఫైనల్‌ చేద్దాం’ అన్నారు. అక్కడున్నవాళ్లు నా పేరు చెప్పడంతో నాన్న బయటకు ఆశ్చర్యం వ్యక్తం చేసినా లోలోపల ఆనందపడ్డారని అర్థమైంది. నా గొంతు అని తెలియకుండానే నాన్న నన్ను ఫైనల్‌ చేయడం నాకూ సంతోషంగా అనిపించింది. అలా ‘బాహుబలి2’లో ‘దండాలయ్యా...’ పాటతో ప్రేక్షకులకు పరిచయమైన నేను ఆరోజు జీవన్‌ అన్నని అంతలా బలవంతం చేసి ఉండకపోతే ఈరోజుకీ సింగర్‌ని అయి ఉండేవాడిని కాదేమో. ఆపాటలోని ఆర్ద్రత పిన్నల నుంచి పెద్దల వరకూ అందర్నీ ఆకట్టుకుంది. అందుకే అంత హిట్‌ అయింది. దాంతోపాటు ‘ఒకప్రాణం... ’ అనే ట్రాక్‌ కూడా పాడించారు. ఆ తరవాత అరవింద సమేతలో ‘పెనిమిటి..’; మజిలీలో ‘ఏడు ఎత్తు మల్లెలే...’; వినయ విధేయరామలో ‘అమ్మా నాన్నా...’; జెర్సీలో ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’; ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ‘నువు రాముడేషమే కట్టావంటే...’, ‘రాజర్షి..’; యాత్రలో ‘ఈనాటి ఈ సుప్రభాతగీతం...’; డియర్‌ కామ్రేడ్‌లో ‘ఎటుపోనే...’ తదితర పాటలు పాడా. అయితే నాన్న దగ్గర పాడింది కేవలం రెండే సినిమాల్లో అంటే నమ్ముతారా. మిగతావన్నీ ఇతర సంగీత దర్శకుల దగ్గరే పాడా. నేను పాటలు పాడుతున్నా నా లక్ష్యం మాత్రం మ్యూజిక్‌ కంపోజర్‌ అవ్వడమే. పాటలు పాడటం సంగీత దర్శకుడికి ఒక అర్హత అవుతుందని ఎవరు అవకాశమిచ్చినా పాడేస్తున్నా.

‘దండాలయ్యా...’ పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పటికీ ఏ షోకి వెళ్లి మైక్‌ పట్టుకున్నా ప్రేక్షకులు నన్ను ఆ పాటే పాడమంటారు. ఆ తరవాత వచ్చిన ‘అరవింద సమేత’లో ‘పెనిమిటి’ పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. రాయలసీమ యాసలో చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. నాకంటే ముందు చాలామంది గాయకులతో ఆ పాటను పాడించారు తమన్‌ అన్న. కానీ ఎవరి గొంతూ సూట్‌ కాకపోవడంతో ఇంకా గాయకుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ అన్నకీ, త్రివిక్రమ్‌గారికీ నేను గుర్తు రావడంతో తమన్‌ అన్నకి నా పేరు సూచించారట. అలా నాకు ఆ పాట పాడే అవకాశం వచ్చింది. తమన్‌ అన్న ఫోన్‌లో లిరిక్స్‌, ట్యూన్‌ చెబితే నేను పాడి రికార్డ్‌ చేసి పంపా. అది వినగానే నా గొంతును ఓకే చేశారు. అలానే ‘అంతరిక్షం’, ‘తొలిప్రేమ’, ‘జెర్సీ’లో టైటిల్‌ సాంగ్స్‌ మంచి పేరు తెచ్చిపెట్టాయంటే ప్రేక్షకులు ఆదరించడమే అందుకు కారణం.

నాన్న ముద్ర లేకుండా...
ప్రస్తుతం నేను సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న రెండు సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. వాటిలో ఒక సినిమాతో మా తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ పనుల్లో బిజీగా ఉన్నా. అలాగని దగ్గరుండి నాకు అన్నీ నేర్పించడం, నిర్మాతల వద్ద రికమండేషన్లు చేయడం నాన్నకి ఇష్టం ఉండదు. చాలామంది ‘భైరవకి ఎదురేంటి... తను కీరవాణి గారి అబ్బాయి’  అనుకుంటారు. నేను కేవలం నాన్న దగ్గర సహాయకుడిగా చేరి ప్రత్యక్షంగా ఆయన్ని గమనిస్తూనే అన్నీ నేర్చుకున్నా. పాటలూ, మ్యూజిక్‌ కంపోజిషన్‌ అంతా స్వతహాగా చేస్తున్నా. ఏదైనా సందేహం అడిగితే నాన్న తీరుస్తారు అంతవరకే. మా తమ్ముడి విషయంలోనూ నాన్న అలానే ఉంటారు. శ్రీసింహకు సినిమాలు తీయడం, నటించడం అంటే చాలా ఇష్టం. అలాగని తను రాజమౌళి బాబాయ్‌ దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరితే కాదనకుండా తీసుకుంటారు. కానీ తమ్ముడికి అది ఇష్టం లేదు. అలాగని నాన్నకి మరో దర్శకుడి దగ్గర రికమండ్‌ చేయడం ఇష్టం ఉండదు. అందుకే దర్శకుడు సుకుమార్‌గారి ఇంటి ముందు మూడు నెలలు పడిగాపులు కాచి మరీ ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు. ఎక్కడా నాన్న పేరు వాడుకోకుండా తన ఆసక్తి చెప్పి... సుకుమార్‌గార్ని ఒప్పించి ఆయన బృందంలో అసోసియేట్‌గా స్థానం సంపాదించుకున్నాడు. అలా ‘రంగస్థలం’ సినిమాకి పనిచేశాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యాక వాడు కీరవాణిగారి అబ్బాయని ఎవరి ద్వారానో తెలిసి సుకుమార్‌ గారు ఎంతో ఆశ్చర్యపోయారు. తమ్ముడు తన పేరు వాడుకోనందుకు నాన్న కూడా సంతోషించారు. అలా తమ్ముడూ నేనూ మేం కోరుకున్న రంగాల్లో ఎదగాలని ఆశపడుతున్నాం.

జ్ఞాపకం

రాజమౌళి బాబాయ్‌ చిన్నప్పుడు నన్ను బాగా ఎత్తుకుని తిప్పేవారు. అప్పట్లో తనకి కెమెరా ఉండేది.  నన్ను బయటకు తీసుకెళ్లి తెగ ఫొటోలు తీసేవారు. బాబాయ్‌ ఫొటోగ్రఫీకి నేను మోడల్‌ని అన్నమాట! అది గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది.

సరదా

నా చిన్నప్పుడు నాన్న తరచూ ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో విమానంలో ప్రయాణికులకు చాక్లెట్లు ఇచ్చేవారు. అవి చాలా బాగుంటాయి. వాటితోపాటు, ఎయిర్‌పోర్టులో మాకోసం ఏదో ఒకటి కొని తెచ్చేవారు నాన్న. అవి మాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉండేవి. అందుకే నాన్న ఎక్కడికైనా వెళితే తిరిగి వచ్చే వరకూ వాటికోసం ఎదురు చూస్తుండేవాళ్లం. అలాంటి సరదాలు మళ్లీ మళ్లీ రావనుకోండీ.

సంతోషం

చెల్లి కుముద్వతి అపరాజిత నాకంటే తొమ్మిదేళ్లు చిన్నది. అది పుట్టినప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నా. దాన్ని నేనూ, తమ్ముడూ ఎత్తుకొని పెంచాం. మామూలుగా అయితే తోబుట్టువుల మధ్య ఒకటి రెండేళ్లు తేడా ఉంటుంది. తమ్ముళ్లూ, చెల్లెళ్ల బాల్యం అంతగా గుర్తుండదు. మా చెల్లి విషయంలో మాత్రం దాని బాల్యాన్ని మేం కూడా ఎంజాయ్‌ చేశాం. ఇలాంటి సంతోషం అరుదుగా దొరుకుతుంది. చెల్లి ఇప్పుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

అభిమానం

క్రికెటర్‌ ఎమ్‌.ఎస్‌ ధోనీ అంటే చాలా ఇష్టం. ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఆటలోనూ దాన్ని కనబరుస్తాడు. కష్టపడి తన ప్రతిభను నిరూపించుకుంటూ భారత క్రికెటర్లను లీడ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. తన గురించి రాసిన పుస్తకాల్లో ఆ విశేషాలు చదివినా తెర మీద చూసినా ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది.

ప్రశంస

‘పెదనాన్న, పెద్ద అన్న గొంతుల్లో బేస్‌ తక్కువ. మేం అది కాస్త లోటుగా ఫీల్‌ అయ్యేవాళ్లం. అయితే భైరవ గొంతులో ఆ బేస్‌ ఎక్కువ. వాడు పాడిన దండాలయ్యా పాట విన్నాక ఎంత సంతోషమనిపించిందో’ అని రాజమౌళి బాబాయ్‌ అనడం నాకు పెద్ద ప్రశంస.

దటీజ్‌ అమ్మా...

అమ్మ శ్రీవల్లిది కష్టపడి పనిచేసే తత్వం. ఏ పనైనా టైమ్‌ అంటే టైమే. ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌కి లైన్‌ ప్రొడ్యూసర్‌గా చేస్తోంది. ‘ఈగ’ నుంచే అమ్మ పని చేయడం మొదలుపెట్టింది. తను తెల్లవారుజామున మూడు గంటలకే లేచి ఇంట్లో పనీ, మా కోసం వంటా చేసి వెళుతుంది. ప్రతి ఆదివారం కచ్చితంగా మాతోనే గడుపుతుంది. అమ్మని చూసినప్పుడు నాకు ఆడవాళ్ల మీద మరింత గౌరవం పెరుగుతుంది. వాళ్ళు కుటుంబాన్నీ, వృత్తినీ ఎంత బాగా సమన్వయం చేసుకుంటారో అనిపిస్తుంది.
- పద్మ వడ్డె

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.