close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగరుపొగలో... అత్తరులో...

పరిమళం దేవుడిని దివి నుంచి భువికి  రప్పిస్తుందనీ  దెయ్యాలను దూరంగా తరిమికొడుతుందనీ పూర్వికుల విశ్వాసం.  ఆ భావనతోనే ఆలయాల్లో సువాసనభరితమైన మొక్కల్ని పెంచేవారు. అందులోంచి పుట్టుకొచ్చినదే అగరుధూపం.  భక్తుడినీ భగవంతుడినీ  అనుసంధానించే  ఈ అగరు పవిత్ర పూజాద్రవ్యం మాత్రమే కాదు...  ఔషధ సుగంధం కూడా..!

ఉదయాన్నే పూజ ముగించిన సుమ వంటింట్లో పనిచేసుకుంటోంది. అప్పుడే నిద్రలేచిన అంకిత్‌ ‘అమ్మా... పైనాపిల్‌ జ్యూస్‌ చేస్తున్నావా’ అని అడిగాడు. పైనాపిలా... ఇంట్లోనే లేదే అని ఆశ్చర్యపోయింది సుమ. తరవాత గుర్తొచ్చింది... అది పూజాగదిలో తను వెలిగించిన పైనాపిల్‌ అగరుబత్తీ వాసన అని. అవునుమరి... ఒకప్పుడు సాంబ్రాణికడ్డీ వాసన అచ్చంగా సాంబ్రాణినో లేదంటే జాజి, మల్లె, సంపెంగ... వంటి పూల పరిమళాన్నో తలపించేది. కానీ ఇప్పుడు స్ట్రాబెర్రీ, పైనాపిల్‌, నారింజ, నిమ్మ... వంటి పండ్లూ; చెక్క, జాజికాయ, లవంగం, అశ్వగంధ, చందనం, తులసి, తేయాకు... వంటి ఔషధ దినుసులతోనూ అగరుబత్తీల్ని చేస్తున్నారు. వీటిని ఇంట్లోనే కాకుండా అరోమాథెరపీలో భాగంగా స్పాల్లోనూ వాడుతున్నారు. ఇవి నాడుల్ని ఉత్తేజపరచడం ద్వారా మనసుని ప్రభావితం చేస్తూ కొన్ని రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు, ఇటీవల దోమల్నీ కీటకాల్నీ రానివ్వకుండా సిట్రొనెల్లా, వేపతైలాలతోనూ అగరుబత్తీల్ని తయారుచేస్తున్నారు. దాంతో అగరుబత్తీ ఇప్పుడు పూజాద్రవ్యంగా మాత్రమే కాక మనసుకి ఆనందాన్నీ ఆహ్లాదాన్నీ పంచే పరిమళంగానూ వ్యాధుల్ని నివారించే ఔషధంగానూ దోమల్ని పారదోలే కీటకసంహారిణిగానూ ఇంటింటా వెలుగుతోంది.

ఏమిటీ అగరుబత్తీ?
పరిమళంతో ధూపం వేయడమనేది పూర్వం నుంచీ వాడుకలో ఉంది. అప్పట్లో బంగారం వంటి విలువైన లోహాల కన్నా ధూపం వేసే సాంబ్రాణే విలువైనదట. ఎందుకంటే ఫ్రాంకిన్‌సెన్స్‌, మిర్‌ అనే అరుదైన చెట్ల జిగురే సాంబ్రాణి. అరేబియా దేశాల్లో పెరిగే ఈ చెట్ల జిగురునే అందరూ దిగుమతి చేసుకునేవారు. మొదట్లో దీన్ని ఈజిప్టువాసులే ఎక్కువగా వాడేవారట. ప్రతిరోజూ దేవుడిముందు సాంబ్రాణిని వెలిగించడంతోబాటు చనిపోయినవాళ్ల ఆత్మల్ని దేవుడికి దగ్గరకు చేరుస్తుందన్న కారణంతో శవపేటికల్లోనూ ఉంచేవారట.హైందవం, క్రైస్తవం, బౌద్ధం... ఇలా అన్ని మతాల్లోనూ పరిమళాన్ని వెలిగించి ధూపం వేయడం వాడుకలో ఉంది. కాకపోతే వీటిని తయారుచేసే రూపాల్లోనే తేడా ఉండేది. సాంబ్రాణి ధర ఎక్కువ కావడంతో దానికి తోడుగా చెక్క లేదా బొగ్గుపొడికి రకరకాల పరిమళతైలాలను కలిపి ముద్దలా చేసి అందులో వెదురు పుల్లలను ఒకటికి నాలుగుసార్లు దొర్లించి అగరుబత్తీల్లా చేసి వాడటం ఆసియా దేశాల్లో క్రమేణా వాడుకలోకి వచ్చింది. వెదురుకి బదులుగా చందనం పుల్లల్నీ వాడతారు కానీ అవి ఖరీదు ఎక్కువ. పర్యావరణ పరిరక్షణ పేరుతో పుల్లలు వాడకుండా సన్నగానూ కాస్త లావుపాటి కడ్డీల్లానూ కూడా అగరుబత్తీల్ని చేస్తున్నారు. స్తూపాకారం, త్రికోణం, దీర్ఘచతురస్రం, తాళ్లు, ఆకులు, చుట్టలు... ఇలా రకరకాల ఆకారాల్లోనూ విభిన్న డిజైన్లలోనూ తయారయ్యేవీ వస్తున్నాయి. తూర్పు ఆసియా దేశాల్లో చుట్టలుగా వేలాడే అగరుబత్తీల వాడకం ఎక్కువ. పుల్లలు వాడకుండా చేసే ఈ చుట్టలు కొన్ని గంటల నుంచి రోజుల తరబడి వెలుగుతుంటాయి. తాళ్లు ఆకారంలో ఉండే వాటిని ఇసుక లేదా రాళ్లు పోసిన పాత్రల్లో ఉంచి వెలిగిస్తారు నేపాల్‌, టిబెట్‌ వాసులు. ఇలా చేయడం వల్ల అవి చాలాసేపు వెలుగుతుంటాయి. చైనా, వియత్నాం, జపాన్‌ దేశాల్లో వీటిని మరో పద్ధతిలోనూ తయారుచేస్తుంటారు. లక్షల సంఖ్యలో పుల్లలను శుభ్రం చేసి కట్టలు కట్టి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌లో ముంచి తీసి ఆరబెడతారు. ఇలా నాలుగైదు సార్లు చేయడం వల్ల ఆ పుల్లలను వెలిగించినప్పుడు అవి మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి. పుల్లలకు ఆయా తైలాలకి సంబంధించిన రంగుల్ని అద్దడం వల్ల అవి ఆకర్షణీయంగానూ ఉంటాయి.

సాంబ్రాణికడ్డీ... ఓ సంప్రదాయం!
రూపమేదయినా అగరుబత్తీ ధూపం పరిమళభరితం. సంపెంగ, మల్లె, గులాబీ... వంటి పూల పరిమళ ధూపం మత్తుని కలిగిస్తూ శృంగారేచ్ఛని కలిగిస్తుందన్న కారణంతో పడకగదుల్లో వెలిగిస్తే, ఇంట్లో చెడువాసనల్ని పీల్చేయడానికి చెక్క, లవంగాలు, జాజికాయ... వంటి సుగంధద్రవ్య తైలాలతో చేసిన ఊదొత్తులు వెలిగిస్తారు. ఆహ్లాదకరంగా ఉంటుందన్న కారణంతో చందనం, దేవగన్నేరు, సిట్రస్‌ తైలాలతో చేసిన వాటిని శుభప్రదమైన వేడుకల్లో వాడుతుంటారు. జపనీయుల టీ వేడుకలో అగర్‌వుడ్‌, చందనంతో తయారుచేసిన అగరుధూపం తప్పనిసరి. ఇక టిబెటన్ల సాంబ్రాణి కడ్డీల్లో ఔషధగుణాలు ఎక్కువ. దాల్చినచెక్క, లవంగాలు, తామరపువ్వు కాడలు, అవిసెపూలు, అశ్వగంథ, షాజీరా... వంటివన్నీ వాడి భిన్న పద్ధతుల్లో చేసిన సాంబ్రాణి కడ్డీల్ని వ్యాధుల నివారణలో వాడతారు. దెయ్యాల పండగ సందర్భంగా తైవాన్‌, సింగపూర్‌, జపాన్‌, మలేషియా వంటి దేశాల్లో స్తంభాల్లాంటి భారీ అగరుబత్తీల్ని వెలిగిస్తారు. వీటినే డ్రాగన్‌ స్టిక్స్‌ అంటారు.

 

ప్రస్తుతం అగరుబత్తీల వాడకం అందరికన్నా చైనాలోనే ఎక్కువ.  దేవతలను ఆహ్వానిస్తూ గుమ్మంముందూ కిటికీల్లోనూ వీటిని వెలిగిస్తారు. మనలా కాకుండా సందర్భాన్ని బట్టి- అంటే, పండగలూ వేడుకల సమయంలో రంగురంగుల్లో సన్నగా పొడవుగా ఉండేవాటినీ, పెద్దగా మందంగా ఉండేవాటినీ కర్మకాండలప్పుడు వాడతారట. అలాగే గంటాకారంలో కాయిల్స్‌లా తయారుచేసిన వాటిని గదుల్లో గుడుల్లో వేలాడదీస్తుంటారు. వీళ్లు ఊదొత్తుల్ని గడియారాలుగా వాడుతూ, అవి ఎంత వరకూ వెలిగాయి అన్నదాన్ని బట్టి ఎన్ని గంటలు అయ్యిందో లెక్కిస్తారు. కొన్ని అగరుబత్తీల్ని సరిగ్గా అర్ధరాత్రి వరకూ వెలిగేలా తయారుచేస్తారట. పరిమళం మనసుని మరోలోకంలో విహరింపజేస్తూ ధ్యానం చేసుకోవడానికి దోహదపడుతుందన్న కారణంతో అగరుబత్తీల్ని వాడుతుంటారు బౌద్ధులు.

 

మొత్తమ్మీద నలుగురూ ఒకచోట చేరే అన్నివేళల్లోనూ అగరుబత్తీలతో ధూపం వేస్తే చెడువాసన రాదు. ఆ కారణంతోనే గుడుల్లో ఆరామాల్లో చర్చిల్లో వాటిని వెలిగించే సంప్రదాయం మొదలైంది. ఆ పరిమళం పవిత్ర భావాన్ని కలిగిస్తూ మనసునీ ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే అగరుధూపం... ఔషధ సుగంధం కూడా!

 

 

 

 

 

 

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు