close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అభిమానుల్ని అడిగి ఫోన్‌ ధర నిర్ణయించాం!

అయిదేళ్ల కిందట ఆరుగురు వ్యక్తులూ పదివేల ఫోన్లతో మొదలైన ‘షామీ ఇండియా’ ప్రస్థానం... ఈరోజు 25వేల మంది ఉద్యోగులూ, 10 కోట్ల ఫోన్ల స్థాయిని చేరింది. ఈ విజయానికి కర్త, కర్మ, క్రియ అయి నిలిచారు మను కుమార్‌ జైన్‌. ప్రస్తుతం షామీ వైస్‌ ప్రెసిడెంట్‌, ఇండియా విభాగం ఎండీ... హోదాల్లో ఉన్న మను తన కెరీర్‌నీ, అందులో షామీ అధ్యయనాన్నీ చెబుతున్నారిలా...

త్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ మా సొంతూరు. మాది వ్యాపారుల కుటుంబం. నాన్న, బాబాయి అందరూ కుటుంబ వ్యాపారం చూసుకునేవారు. నేను కూడా పెద్దయ్యాక ఏదో ఒక దుకాణం పెట్టాలి అనుకునేవాణ్ని. పన్నెండో తరగతికి వచ్చేంత వరకూ కెరీర్‌ గురించి అంతకు మించి ఆలోచించలేదు. ఆ సమయంలో నాన్న ఓరోజు పిలిచి ‘ప్లస్‌టూ తర్వాత ఏం చేస్తావ’ని అడిగితే ఏమీ చెప్పలేకపోయా. ఆయన ఇంజినీరింగ్‌ చేయమని చెబితే ప్రవేశ పరీక్ష రాశాను. మేరఠ్‌లోనే ఓ ప్రఖ్యాత ప్రభుత్వ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఫ్రీ సీటు వస్తే, వెళ్లి చేరాను. ఇంట్లో అందరూ చాలా హ్యాపీ. అక్కడ క్లాసుకు వెళ్లాక ‘ఐఐటీ రాయలేదా’ అని చాలామంది అడిగారు. ఐఐటీల గురించి నిజంగా అప్పటికి నాకు తెలీదు. వాళ్ల మాటలు విన్నాక ఐఐటీలో చేరాల్సిందేనని నిర్ణయించుకుని ఇంట్లో చెప్పాను. వాళ్లు వద్దని వారించినా నెమ్మదిగా ఒప్పించాను. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఏడాదిపాటు పరీక్షకు సిద్ధమయ్యాను. ఐఐటీ దిల్లీలో సీటు వచ్చింది. అక్కడ 1998-2003 మధ్య మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. తర్వాత ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరాను. అక్కడ కోడింగ్‌ రాస్తుండేవాణ్ని. రెండేళ్లు పనిచేశాక ‘ఇదికాదు నేను చేయాల్సిన పని’ అనిపించింది. తర్వాత ఐఐఎమ్‌ కోల్‌కతాలో ఎంబీఏ పూర్తిచేసి మెకన్సీలో చేరాను. అక్కడ ఐదేళ్లపాటు మార్కెటింగ్‌ పరంగా చాలా అంశాలు నేర్చుకున్నాను, విదేశీ మార్కెట్‌లనూ పరిశీలించే అవకాశం వచ్చింది.

‘జబాంగ్‌’కు శ్రీకారం
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతోంది. ఆ దశలో నా ఫ్రెండ్స్‌ వచ్చి షూలూ, దుస్తులూ అమ్మే వెబ్‌సైట్‌ పెడదాం అన్నారు. ‘షూలూ, దుస్తులూ ట్రయల్‌ వేసి కానీ ఎవరూ కొనరుగా’ అన్నాను. కానీ ఈ కామర్స్‌కి భవిష్యత్తు ఉందని అందరూ తరచూ చెబుతుండటంతో మేమంతా కలిసి ఫ్యాషన్‌ వెబ్‌సైట్‌ ‘జబాంగ్‌’ని 2012లో ప్రారంభించాం. మాకు అప్పుడు ఆప్‌గానీ, మొబైల్‌ వెర్షన్‌ కానీ లేదు. ఎక్కువగా యువత ఆ వెబ్‌సైట్‌ని మొబైల్‌ ఫోన్లలో చూసి వస్తువులు కొనేవారు. అప్పుడే స్మార్ట్‌ఫోన్‌ రంగానికి మంచి భవిష్యత్తు ఉందనిపించింది. తర్వాత నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే షామీ వ్యవస్థాపకుల్నీ కలిశాను. ఆన్‌లైన్లో మాత్రమే అమ్మకాలు జరిపే వారి మార్కెటింగ్‌ శైలిలో కొత్తదనం కనిపించింది. జబాంగ్‌లో ఉండగానే మా అబ్బాయి పుట్టాడు. జబాంగ్‌ ఆఫీసు దిల్లీలో. మా ఆవిడా, అబ్బాయీ ఉండేది బెంగళూరులో. వాళ్లకి దూరంగా ఉండటం ఇష్టంలేక జబాంగ్‌ను వదిలేసి బెంగళూరు వచ్చేశాను. సరిగ్గా ఆ టైమ్‌లో షామీ సీఈఓ లిన్‌బిన్‌ ఫోన్‌చేసి ‘మీకు స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఆసక్తి ఉంది. మాకు ఇండియాలో మీలాంటి వ్యక్తి అవసరం ఉంది. వచ్చి చేరుతారా’ అని అడిగారు. రెండో ఆలోచన లేకుండా చేరిపోయాను. భారతీయ విభాగానికి మొదటి ఉద్యోగిని నేనే. అప్పటికి ఆఫీసు కూడా లేదు. మా ఇంటి దగ్గర్లోని కెఫేలో క్లయింట్‌లను కలిసేవాణ్ని. మూడు నెలల తర్వాత చిన్న ఆఫీసు తీసుకున్నాను. అందులో ఆరు కుర్చీలు పట్టేవి. నేనే ఆఫీసు తెరిచి కూర్చొని, టీ తెప్పించుకుని తాగేవాణ్ని. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లాంటి సంస్థలతో మాట్లాడ్డానికి వెళ్లినపుడు ఆఫీసు మూసేసి వెళ్లేవాణ్ని. మధ్యలో ఎవరో ఒకరు ‘మీ ఆఫీసుకు వచ్చాం మూసేసి ఉంది’ అనేవారు. ‘వస్తున్నా అక్కడే ఉండండి’ అని చెప్పేవాణ్ని.
మూడు నెలల తర్వాత రెండో ఉద్యోగిని చేర్చుకున్నాను. ఇండియాలో మా ఫోన్‌ని లాంచ్‌ చేసినప్పటికంటే కూడా సంస్థలో రెండో ఉద్యోగి చేరినపుడు చాలా సంతోషపడ్డాను. మొదట్లో నా ఆలోచనల్ని అతడితో అదే పనిగా పంచుకునేవాణ్ని. ఆర్నెల్లలో సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఆరుకు చేరింది. ఆ ఆఫీసు మారేంతవరకూ కొత్తవాళ్లని తీసుకోలేదు.

అదో విప్లవం
కంపెనీని ప్రారంభించినపుడు మమ్మల్ని మిగతావాళ్లు అస్సలు పట్టించుకోలేదు. కంపెనీ పేరుని కూడా జనాలు ‘షియామీ’, ‘జియామీ’... ఇలా రకరకాలుగా పలికేవారు. ‘షామీ’ అనే మాట చాలా రోజులకు గానీ వినియోగదారుల్ని చేరలేదు. కానీ మా ఫోన్లు (షామీ, ఎమ్‌ఐ, రియల్‌మి) మాత్రం అంతకంటే ముందే వాళ్ల చేతుల్లోకి చేరాయి. 2014 జులైలో మేం మార్కెట్‌లోకి వచ్చినపుడు 94 శాతం మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లు ఆఫ్‌లైన్లోనే కొనసాగేవి. మేం మాత్రం ఆన్‌లైన్‌లోనే అమ్మకాల్ని ప్రారంభించాలనుకున్నాం. ఆఫ్‌లైన్లో ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రిటైలర్‌ దగ్గరకు ఫోన్‌ వెళ్లాలి. అందులో అందరికీ లాభం ఉండాలి. రూ.100లో కంపెనీకి చేరేది సగమే. కానీ మేం ఆ యాభై వినియోగదారుడికే అందివ్వాలని ఆన్‌లైన్లో అమ్మకాలు ప్రారంభించాం. మొదట 10వేల ఫోన్లని అమ్మకానికి పెట్టాం. కారణం అప్పటికి మా ఫేస్‌బుక్‌ పేజీకి 10వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లందరూ వాటిని కొన్నా సరిపోతుంది అనుకున్నాం. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ మొదలైన రోజు సైట్‌ క్రాష్‌ అయిపోయింది. 10 వేల ఫోన్లని అయిదు లక్షల మంది కొనాలని చూశారు. మొదటి మూడు నెలల్లో లక్ష ఫోన్లు అమ్ముడుపోయాయి. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అమెజాన్‌, ఎమ్‌ఐడాట్‌కామ్‌లో అమ్మకాల్ని ప్రారంభించాం. ఆన్‌లైన్లో ఇప్పుడు అమ్ముడయ్యే ప్రతి రెండుఫోన్లనో ఒకటి మాదే. 2017 నాటికే ఆ స్థాయికి చేరాం.

ఆఫ్‌లైన్లో అడుగులు
కానీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మూడింట రెండొంతులు ఆఫ్‌లైన్లో ఉంది. అందుకే అటుగా వెళ్లాలనుకున్నాం. మొదట బెంగళూరులోని ఒక షాపింగ్‌ మాల్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్థలం కావాలని దాని యజమానిని సంప్రదిస్తే ‘ఆఫ్‌లైన్లో షామీ ఎవరు కొంటారు’ అన్నాడాయన. అయిష్టంగానే స్థలం కేటాయించాడు. ప్రారంభించిన రోజు రూ.5కోట్ల కొనుగోళ్లు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6000కుపైగా దుకాణాల్లో మా ఫోన్లు దొరుకుతున్నాయి. వాటిలో 2000 మా సొంత దుకాణాలే. ఏడాది చివరకు పదివేల దుకాణాలకు పెంచాలని చూస్తున్నాం. ప్రస్తుతం మా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 30 శాతం ఆఫ్‌లైన్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఇండియాలో పది కోట్ల ఫోన్లను అమ్మాం. మార్కెట్‌లో మాది ప్రస్తుతం 28 శాతం వాటా. సెల్‌ఫోన్‌ని మాట్లాడ్డానికే కాదు, ఫొటోలూ, గేమింగ్‌ కోసం ఎక్కువ వినియోగిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఉత్పత్తులు తేనున్నాం. భవిష్యత్తులో 100 ఎంపీ కెమెరా ఫోన్‌ తేబోతున్నాం. ఫోన్లే కాదు, షామీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద రకాల ఉత్పత్తులు తెస్తోంది. ఇప్పటికే ఇండియాలో వీటిలో చాలా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టీవీలూ,  ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌, పవర్‌బ్యాంకుల విభాగాల్లో ఎం.ఐ. టాప్‌లో ఉంది. ఇవి కాకుండా ట్రిమ్మర్లూ, ఎయిర్‌ ప్యూరిఫయర్లూ, వాటర్‌ ప్యూరిఫయర్లూ, సీసీ కెమెరాలూ, షూస్‌, లగేజ్‌ బ్యాగ్‌లూ, కళ్లద్దాలూ... ఇలా చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగాల్లో ప్రతి రంగంలోనూ అత్యుత్తమ కంపెనీగా ఎదగాలన్నది కంపెనీ లక్ష్యం.

విజయ రహస్యం...
షామీ ఉత్పత్తిని తీసుకురావడంలో అత్యుత్తమ ఫీచర్లు, సరసమైన ధర, హార్డ్‌వేర్‌లో నాణ్యత... వీటిపైనే దృష్టి పెడతాం.
మా ఉత్పత్తులపైన అయిదు శాతం లాభం ఉండేట్టు చూస్తాం. అందువల్లే తక్కువ ధరకు ఇవ్వగలం. మొదటి మూడేళ్లూ మేం ప్రకటనలకు రూపాయి కూడా ఖర్చుచేయలేదంటే నమ్మగలరా. సోషల్‌ మీడియా, నోటిమాట ద్వారా మా బ్రాండ్‌కు మంచి ప్రచారం దొరికింది. నాతోపాటు కంపెనీలో కీలక స్థానాల్లోని ఉద్యోగులంతా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నేనెప్పుడూ ఎం.ఐ. లోగో ఉన్న దుస్తులే వేసుకుంటాను. ఒక విధంగా కంపెనీకి ప్రచారం దొరుకుతుంది. షామీ ఏ దేశానికి వెళ్లినా వస్తువుల్ని  స్థానిక అవసరాలకు తగ్గట్టు మార్పులు    చేస్తుంది. ఇండియాకి వచ్చినపుడు దీన్ని ఇండియా కంపెనీగా మార్చాం. ఇక్కడ ఉద్యోగులందరూ భారతీయులే. చైనా నుంచి నిపుణులు అప్పుడప్పుడూ వచ్చి మాకు మార్గనిర్దేశం చేస్తారంతే. సంస్థ వ్యవస్థాపకుడు లీ జున్‌, నేనూ మూడు నెలలకోసారి కలిసి ప్రణాళిక రూపొందించుకుంటాం. ఎం.ఐ. టీవీ చైనా ఫీచర్లూ, ఇండియా ఫీచర్లూ వేరుగా ఉంటాయి. బ్రైట్‌నెస్‌, సౌండ్‌, యూఎస్‌బీ స్లాట్స్‌... అన్నీ వేర్వేరుగా ఉంటాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో మేం ప్రధాన భాగస్వామిగా ఉన్నాం. అసెంబ్లింగ్‌ యూనిట్‌తో ప్రారంభించాం. ఇప్పుడు ఇక్కడే తయారీ, పరిశోధన-అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఉత్పత్తుల్లోని 65 శాతం భాగాలు భారతీయ మార్కెట్‌నుంచి సేకరించినవి లేదా తయారుచేసినవే.
మా కంపెనీ ఉద్యోగుల సగటు వయసు 29 ఏళ్లు. కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్ల వయసు 30-35 ఈ మధ్యనే ఉంటుంది. నేనే వారందరిలోకీ కాస్త పెద్ద. చాలామంది షామీతోనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వినూత్నంగా ఆలోచిస్తారు తప్ప ఎవరినీ అనుకరించరు.
కంపెనీలో ప్రతి విభాగానికీ చాట్‌ గ్రూప్స్‌ ఉంటాయి. మాకు పెద్ద మీటింగులు ఉండవు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒకచోట గుంపుగా నిలబడి అప్పటికప్పుడు చర్చించుకుని నిర్ణయం తీసుకుని వెళ్లిపోతామంతే. ఇటీవల ‘ఎమ్‌ఐ ఏత్రీ’ మోడల్‌ ఫోన్‌ తెచ్చాం. దాని ధర నిర్ణయించడంలో ఒక నిర్ణయానికి రాలేకపోయాం. కొత్త ప్రొడక్ట్‌ల విడుదలకు ముందు కొద్దిమంది అభిమానుల్ని పిలుస్తుంటాం. ఏత్రీ లాంచ్‌కీ పిలిచాం. ధర ఎంతలో ఉండాలనుకుంటున్నారని అడిగాం. సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ కూడా చూశాం. ప్రొడక్ట్‌ని లాంచ్‌ చేయడానికి ఒక గంట ముందు దాని ధరని నిర్ణయించాం. నిజానికి మేం అనుకున్న ధరకంటే అది కాస్త తక్కువే. దానివల్ల దీర్ఘకాలంలో కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు కోల్పోవచ్చు. కానీ వినియోగదారుల అంచనాలకు దూరం కాకూడదన్నది మా ఉద్దేశం. మా ప్రతి ప్రాజెక్టూ విజయవంతమవుతుందని చెప్పలేం. ఎం.ఐ. 4ని మార్కెట్‌లోకి సింగిల్‌ సిమ్‌, త్రీజీ ఫోన్‌గా తెచ్చాం. మనవాళ్లు అప్పుడే 4జీకి వెళ్లరనుకున్నాం. కానీ ట్రెండ్‌ ఒక్కసారిగా మారిపోయింది. దాంతో ఆ ఫోన్‌ పెద్దగా అమ్ముడుపోలేదు. అలాంటప్పుడే నాయకుడు దృఢంగా ఉండాలి. అప్పుడే ఉద్యోగులకూ ధైర్యం వస్తుంది.

అంకురాల్లో పెట్టుబడులు
ఇండియాలో అంకుర సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాం. దాదాపు 10 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాం. వాటిలో హంగామా, క్రేజీబీ లాంటి కంపెనీలున్నాయి. లాభాలకంటేకూడా భాగస్వామ్యం ముఖ్యమనుకొని పెట్టుబడులకు సిద్ధమవుతాం. టీవీల్ని తేబోతున్నామని తెలుసు. మాకు వీడియో కంటెంట్‌ కావాలి. హంగామా నుంచి మాకు కంటెంట్‌ వస్తుంది. అది ప్రొడక్ట్‌ విలువను పెంచుతోంది.
‘ఒక వ్యక్తి తనకున్న సంపద విషయంలో ఎప్పుడూ సంతృప్తితో ఉండాలి, జ్ఞానం పొందే విషయంలో మాత్రం నిరంతరం శ్రమిస్తుండాలి’ అని చదువుకునేటపుడు అమ్మ చెప్పేది. పెద్దయ్యాకే దాని అర్థం తెలిసింది. జీవితంలో ఈ సూత్రాన్నే ఫాలో అవుతాను.

10 నవంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.