close

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

నగరం నడిబొడ్డున తీవ్రవాదుల స్థావరం. పౌరులను బందీగా చేసుకున్న తీవ్రవాదులు. స్థావరాన్ని చుట్టుముట్టిన అధికారులు. చుట్టూ జనసంచారం. బయటా లోపలా ఎవరికీ హాని కలగకుండా తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలన్నది లక్ష్యం. తుపాకులు గురిపెడుతూ ఒక్కో అడుగూ వీరు లోపలికి వేస్తుంటే... వారు స్థావరాన్ని మరింత కట్టుదిట్టంగా మార్చుకుంటున్నారు. రెండు పక్కల్నుంచీ చెవులు చిల్లులుపడేలా తుపాకుల మోత. ఏమవుతుందో తెలియని ఉత్కంఠ! ఇది తీవ్రవాదుల దాడో,క్రైమ్‌ సినిమా దృశ్యమో కాదు... పబ్‌ జి వీడియోగేమ్‌లో దృశ్యం. యుద్ధరంగాన్ని తలపించే ఇలాంటి క్రీడలే నేటి యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఆటల్నే కెరీర్‌గా ఎంచుకునేలా వారిని ప్రోత్సహిస్తున్నాయి.

 

దో తరగతి చదువుతున్న గౌతమ్‌కి క్రికెట్‌ అంటే ఎంతిష్టమో మొబైల్‌లో ‘ఆర్‌సీబీ స్టార్‌ క్రికెట్‌’ ఆడటమన్నా అంతే ఇష్టం. ఇంటర్‌ చదువుతున్న వాళ్ల అన్నయ్యకైతే కార్‌ రేసింగ్‌ పిచ్చి. అతని చేతిలోని మొబైల్‌లో ‘ఆస్ఫాల్ట్‌9’ గేమ్‌లో కారు రయ్యిన దూసుకుపోతుంటుంది. ఇంట్లో సోఫాలోనే కూర్చున్నా తానే కారును నడుపుతున్న అనుభూతికి లోనవుతుంటాడు ఆ కుర్రాడు. ఇక వాళ్ల అమ్మా అక్కా కలిసి సరదాగా క్యాండీ క్రష్‌ సాగా ఆడేస్తుంటారు. వాళ్ల నాన్నగారికి మాత్రం సాయంత్రం ఓ అరగంట యాంగ్రీ బర్డ్స్‌ ఆడితే చాలు, ఆఫీసు ఒత్తిడినుంచి రిలాక్సయినట్లు ఉంటుంది. ఇవాళా రేపూ గేమింగ్‌ ప్రియుల కుటుంబాల్లో ఇలాంటి వాతావరణమే కన్పిస్తోంది. నిన్న మొన్నటిదాకా పరిస్థితి ఇలా ఉండేది కాదు. పిల్లలెవరైనా గేమ్‌ ఆడుతుంటే ‘ఎందుకూ పనికిరాని ఆటలతో టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నావు. ఇలాగైతే చదువు సాగినట్లే...’ అంటూ తల్లిదండ్రులు కోప్పడుతుండేవారు. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. వీటి స్టైల్‌ మార్చి ఈ-స్పోర్ట్స్‌ అంటున్నారు. అనడమే కాదు, కొత్త కొత్త ఆటలూ ఆ ఆటల పేరు మీద క్లబ్బులూ, టోర్నమెంట్లూ గేమింగ్‌ లీగులూ పెద్దమొత్తంలో ప్రైజ్‌మనీ... చాలా తతంగమే జరుగుతోంది. దాంతో ఈ గేమ్స్‌ని అభిమానించే వారికి భవిష్యత్తు ఆశాజనకంగా కన్పిస్తోంది. క్రికెట్‌, టెన్నిస్‌ మాదిరిగా తామూ ఆన్‌లైన్‌ ఆటల ప్రొఫెషనల్స్‌గా మారవచ్చన్న ఆశ కలుగుతోంది.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

వీడియో గేమ్స్‌లో ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది?
ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు. విదేశాల్లో ఈ-స్పోర్ట్స్‌ చాలాకాలంగానే ఆదరణ పొందుతున్నాయి. అక్కడ వివిధ స్థాయుల్లో టోర్నమెంట్లు క్రమం తప్పక  జరుగుతుంటాయి. ‘మనదేశంలో మామూలు ఆటలకే తల్లిదండ్రులిచ్చే ప్రోత్సాహం అంతంతమాత్రం. ఇక ఈ-స్పోర్ట్స్‌ అన్న కాన్సెప్ట్‌ అంత త్వరగా ప్రజల్లోకి వెళ్తుందని మొన్నీ మధ్య దాకా ఎవరూ అనుకోలేదు. కానీ ఊహించనివిధంగా పరిస్థితులు మారిపోయాయి’ అంటాడు జీత్‌ రాజేష్‌ కుంద్రా. అతడి వీడియో గేమ్స్‌ పిచ్చిపై ఇంట్లో రోజూ యుద్ధమే జరిగేది. ‘నువ్వు ఆటలు ఆపి సరిగ్గా చదువుతావా లేదా...’ అంటూ అమ్మానాన్నలు అల్టిమేటమ్‌ ఇస్తుండేవారు. తప్పనిసరై రాజేష్‌ బుద్ధిగా చదివి ఇంటర్‌ పాసై డిగ్రీలో చేరాడు. కానీ ఆడడం ఆపలేదు. ఆ ఆటల్లో అతడి స్కోరు చూసిన గేమింగ్‌ కంపెనీలు రాజేష్‌ నైపుణ్యాన్ని గుర్తించి పోటీలకు పిలవడం మొదలెట్టాయి. పోటీలు ఎక్కువైపోవడంతో డిగ్రీ మధ్యలోనే మానేశాడు. డోటా-2 ఆటలో నిష్ణాతుడై ఏ పోటీకి వెళ్లినా బహుమతితో తిరిగివస్తున్న కొడుకుని చూసి అమ్మానాన్నా కూడా ఇక చదువు గురించి బలవంతం చేయలేదు. ఇప్పటివరకూ ఇతర దేశాల్లో జరిగిన టోర్నమెంట్లలో పాల్గొన్న రాజేష్‌ ఈమధ్యే ముంబయిలో ఈఎస్‌ఎల్‌ ఇండియా మాస్టర్స్‌ టోర్నమెంట్‌ గెలిచాడు. తనకు ఇష్టమైన వీడియో గేమ్స్‌ని కెరీర్‌గా మలచుకోవచ్చన్న కల నెరవేరడం సంతోషంగా ఉందంటాడు రాజేష్‌. తాను ఆట మొదలుపెట్టినప్పుడు నిజానికి ఈ పరిణామాన్ని ఊహించలేదనే రాజేష్‌ మాటలకు గణాంకాలూ తోడవుతున్నాయి.

ఎలా?
గత రెండేళ్లలో ప్రొఫెషనల్‌ గేమర్లుగా మారిన క్రీడాకారుల సంఖ్య పెరిగింది. ఫ్రాస్ట్‌ అండ్‌ సల్లివాన్‌ సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో 16 కోట్ల మంది మొబైల్‌ గేమర్లు ఉన్నారు. మూడేళ్లలో ఆ సంఖ్య 38 కోట్లకు చేరుతుందని అంచనా. వీరంతా క్యాజువల్‌ గేమర్స్‌ కిందికి వస్తారు. వీరిలో ప్రొఫెషనల్‌ గేమర్లుగా మారగలవాళ్లు అరకోటిదాకా ఉంటారని అంచనా. పెరుగుతున్న ఈ మార్కెట్‌ని అందిపుచ్చుకోవడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మొన్నటివరకూ చాలామంది ఏ గేమ్‌నైనా క్యాజువల్‌గా 5-10 నిమిషాలు ఆడేవారట. ఇప్పుడు అరగంటకు తగ్గడం లేదు- అంటున్నారు నజారా టెక్నాలజీస్‌ సీఈవో మనీష్‌ అగర్వాల్‌. దేశంలో తొలి గేమింగ్‌ కంపెనీగా నజారా ఐపీవోకి వెళ్లి చరిత్ర సృష్టించింది. పలు విదేశీ కంపెనీలూ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. భారతీయ సంస్కృతీ, యువత ఇష్టాయిష్టాలనూ దృష్టిలో పెట్టుకుని ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీలను ఉపయోగించి సరికొత్త ఆటల్ని తయారుచేసేందుకు రంగం సిద్ధమైంది. గేమింగ్‌కి సంబంధించి ప్రపంచంలోని టాప్‌-5 దేశాల్లో భారత్‌ ఒకటనీ, ఇక్కడ స్మార్ట్‌ఫోన్‌ వాడేవాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒకరికి గేమ్‌ ఆడటం అనేది రోజువారీ పనుల్లో ఒకటనీ ఒక సర్వే చెబుతోంది.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

ఒకరిద్దరికి బహుమతి వస్తే లక్షలాది మందికి ఆశాజనకమని ఎలా చెబుతాం?
గేమింగ్‌ టోర్నమెంట్లు మన దేశంలో ఇప్పుడిప్పుడే తరచుగా జరుగుతున్నాయి. ఆటల్ని రూపొందిస్తున్న కంపెనీలే వాటి పేరు మీద క్లబ్బుల్ని ఏర్పాటుచేస్తున్నాయి. ఈ క్లబ్బుల ఆధ్వర్యంలో టోర్నమెంట్లూ లీగ్‌ పోటీలూ నిర్వహిస్తూ ఆడేవాళ్లను ప్రోత్సహిస్తున్నాయి. చాలామంది గేమర్లు బృందాలుగా ఏర్పడి పోటీలు పడుతుంటారు. కాబట్టి నిజంగా ప్రొఫెషనల్స్‌గా మారాలనుకునేవారికి ఇది సరైన సమయమే.

కానీ, వాటికి గుర్తింపూ, గౌరవం ఉంటాయా?
గుర్తింపు అంటే- టెన్నిస్‌లానో, బ్యాడ్మింటన్‌లానో టోర్నీలూ పతకాలూ ఉంటాయా, ప్రభుత్వం గౌరవిస్తుందా... అన్న సందేహం సహజమే. 2022 ఆసియా క్రీడల నుంచీ వీటిలో కూడా అధికారికంగా పోటీలు జరుగుతాయి. ఒలింపిక్స్‌లోనూ వీటిని చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లలోనూ ఆప్‌ రూపంలో గేమ్స్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ సేవలు చౌకగా లభించడంతో ఈ ఆటలు ఆడేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతోపాటే వాటి పట్ల సమాజ దృక్పథమూ మారుతోంది.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

వీడియో గేమ్స్‌ ఎన్నో రకాలుంటాయి. వాటిల్లో ఏవి మంచిదో ఎలా తెలుస్తుంది?
నిజమే. స్మార్ట్‌ఫోన్‌ చేతిలోకి వచ్చాక రకరకాల వీడియోగేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడుకోవడం మామూలైపోయింది. కాలక్షేపానికి ఆడేవీ, ఒక స్ట్రాటజీతో ఆడేవీ, డబ్బుతో కొనేవీ, డబ్బు పెట్టి ఆడేవీ... ఇలా చాలా ఆటలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. ఈ-స్పోర్ట్స్‌ అన్నీ వీడియో గేమ్సే కానీ వీడియో గేమ్స్‌ అన్నీ ఈ-స్పోర్ట్స్‌ కావు. వీడియో గేమ్స్‌లో సరదాగా కాలక్షేపానికి ఆడేవీ ఉంటాయి. బుర్రకి పదును పెట్టేవీ ఉంటాయి. ఈ-స్పోర్ట్స్‌గా గుర్తింపు పొందాలంటే పోటీపడడానికి వీలవ్వాలి. ఆటకి ఒక స్ట్రాటజీ, లక్ష్యమూ ఉండాలి. వరల్డ్‌ ఆఫ్‌ వార్‌క్రాఫ్ట్‌, సూపర్‌ మారియో బ్రదర్స్‌ లాంటివి ఈ-స్పోర్ట్స్‌ కావు. ఇక మంచీ చెడూ కన్నా అభిరుచిదే ప్రాధాన్యం. కొందరు యాంగ్రీబర్డ్స్‌ లాగా సరదాగా ఉండేవి ఇష్టపడితే కొందరు యుద్ధక్రీడల్ని ఇష్టపడతారు. కొందరు రమ్మీ లాంటి కార్డ్‌గేమ్స్‌ని ఇష్టపడతారు. ఇష్టపడి సాధన చేస్తున్న ఆటలో మనకి నైపుణ్యం ఉందీ అనుకుంటే దాని గురించి పూర్తి వివరాల్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. పైగా టాప్‌ స్కోర్లు రికార్డవుతూ ఉంటాయి కాబట్టి బాగా ఆడేవారిని కంపెనీలూ గుర్తిస్తాయి.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

ప్రోత్సహించే సంస్థలేమన్నా ఉన్నాయా?
ఆట అన్నాక ఆడడానికి ఓ వేదిక కావాలి. ప్రత్యర్థులుండాలి. పోటీ పడాలి. గెలిచినవారికి బహుమతులుండాలి... అప్పుడే మజా వస్తుంది. ఈ-స్పోర్ట్స్‌కి మన దేశంలో ఆ వాతావరణాన్ని తేవడానికి కృషిచేస్తున్నారు రోనీ స్క్రూవాలా, సుప్రతీక్‌ సేన్‌ లాంటివారు. ఈ-స్పోర్ట్స్‌ పోటీలకోసం టీవీ వేదికగా పనిచేసేందుకు తమ సొంత కంపెనీ ‘యూ స్పోర్ట్స్‌’కి అనుబంధంగా ‘యూ సైఫర్‌’ని వీళ్లు ప్రారంభించారు. ఆ సంస్థ నిర్వహించే ఈ-స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ఎంటీవీ ప్రసారం చేస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం ఈ షో లక్ష్యం.

కానీ, గంటల తరబడి కూర్చుని ఆడితే ఆరోగ్యం ఏమవ్వాలి?
ఈ ప్రశ్న రోనీ, సేన్‌లకూ ఎదురయింది. దానికి వారు చెబుతున్న సమాధానం ఏమిటంటే- ‘గంటల తరబడి కూర్చుని చదరంగం ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అది ఆటేగా? పైగా మనదేశంలో దానికెంతో ప్రాధాన్యం కూడా ఉంది’ అని. నిజమే, కదలకుండా కూర్చుని ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఆటలాడుతూ కూర్చున్నా ఆఫీసులో కూర్చున్నా. మనం చేయాల్సిందల్లా ఆ విషయాన్ని గుర్తుంచుకుని గంటకోసారి అయినా లేచి రెండు నిమిషాలు నడవడం, కాసేపు నిలబడి ఆడుకోవడం లాంటివి. అంతేకానీ నిజంగా ఇష్టమూ ప్రతిభా ఉన్న ఆటను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆటలు ఆడడానికి ఎంతో ఏకాగ్రతా తెలివితేటలూ నైపుణ్యమూ కావాలి. అందుకే చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. అలాంటివారికి ప్రొఫెషనల్‌ క్రీడాకారులుగా రాణించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి యూ సైఫర్‌ లాంటి సంస్థలు.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

కొన్ని వీడియో గేమ్స్‌ బొమ్మలు భయంకరంగా ఉంటాయి. వాటితో ఆటలా?
కొందరికి సైన్సుఫిక్షన్‌ సినిమాలంటే ఇష్టం. కొందరు రొమాంటిక్‌ సినిమాలను ఇష్టపడతారు. మరికొందరికి హారర్‌ సినిమాలంటే ఇష్టం. అలాగే ఆటలు కూడా. ఎవరికి ఇష్టమైన ఆటలు వాళ్లు ఆడుతుంటారు. వీడియో గేమ్స్‌ రూపొందించే కంపెనీలు రకరకాల ఆటల్ని తయారుచేసి విడుదల చేస్తుంటాయి. ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన ఆటలు ఎక్కువమందికి నచ్చినట్లు. అయితే హింస అనేది ఇక్కడా చర్చకు వచ్చింది. ఒలింపిక్‌ క్రీడల్లో వీటిని చేర్చాలన్న అంశం మీద జరుగుతున్న చర్చలో ఇదే ప్రధానాంశం. ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ సంఘం అనుమతి పొందాలంటే ఆటల్లో హింసాత్మకవాతావరణం ఉండకూడదు. ఈ నేపథ్యంలో ‘లీగ్‌ ఆఫ్‌ లెజెండ్స్‌’ లాంటి యుద్ధక్రీడలు కాకుండా ‘ప్రొ ఇవల్యూషన్‌ సాకర్‌’ లాంటి సాధారణ క్రీడల థీమ్‌ ఉన్న ఈ-స్పోర్ట్స్‌కి అనుమతీ ఆదరణా లభించవచ్చని భావిస్తున్నారు. ‘క్రీడలన్నాక అవి క్రీడాస్ఫూర్తినే చాటాలికానీ హింసను చూపకూడదు. వాటిని మేం కిల్లర్‌ గేమ్స్‌ అంటాం...’ అంటున్నారు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌ థామస్‌ బాక్‌. కాబట్టి, భయంకరమైన ఆటలు టోర్నమెంట్ల దాకా వెళ్లే ప్రశ్నే లేదని దీన్నిబట్టి అర్థమవుతోంది.

ఆటలేమో కానీ వాటికి సంబంధించిన వస్తువులు కనబడితే కొనేదాకా వదలరు పిల్లలు...
కంపెనీలు తాము విడుదల చేసిన ఆటలకు ప్రచారం కోసం పలురకాల వస్తువులనూ తయారుచేసి విక్రయిస్తుంటాయి. అదీ వ్యాపారంలో ఓ భాగమే. టీషర్టులూ, టోపీలూ, బ్యాగులూ, మౌస్‌ప్యాడ్లూ, పెన్సిల్‌ బాక్సులూ, గేమ్‌లోని క్యారక్టర్ల రూపంలో బొమ్మలూ... ఇలా చాలారకాల వస్తువుల్ని తయారుచేస్తారు. పిల్లల సరదాని సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికి వాడుకుంటుంటాయి.

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

ఇంతగా అభివృద్ధి చెందుతోందంటే ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలూ ఎక్కువేనేమో?
అవును. అందుకే గేమింగ్‌ రంగానికి దేశంలో ఇది స్వర్ణయుగం అంటున్నాయి సంస్థలు. చాలా రకాలుగా ఈ ఆటలు ఉపాధి కల్పిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలపింగ్‌లో గేమ్స్‌ రూపకల్పన కూడా ఒక విభాగం. తయారైన గేమ్‌ని పరీక్షించేందుకూ కొందరుంటారు. ఆ పని చేస్తూనే లక్షలు సంపాదిస్తున్నవారున్నారు. మనదేశంలో గేమింగ్‌ పరిశ్రమ విలువ 64వేల కోట్ల రూపాయలు. గేమ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు 250 దాకా ఉన్నాయి. 2020 నాటికి మొబైల్‌ గేమ్స్‌ మార్కెట్‌ విలువ 80 వేలకోట్లకు చేరుతుందని అంచనా. కాబట్టి ఉపాధికీ ఢోకాలేని రంగం అన్నమాట.

                    *

మనసేం బాగోలేదు. టెన్షన్‌గా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌చేసి, ఇష్టమైన గేమ్‌ ఓపెన్‌ చేసి, నచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే... ఇక ఆ తర్వాత ఏమీ గుర్తుండదు. మనసు విచారంగా ఉంటే ఓ సరదా ఆట. ఎవరి మీదైనా కోపంగా ఉంటే ఓ ఫైటింగ్‌ గేమ్‌... పది నిమిషాలు చాలు. మహా అంటే అరగంట. కోపమూ ఒత్తిడీ విసుగూ విచారమూ... అన్నీ పరార్‌! ఎంత మార్పు? ఏదో సాధించిన తృప్తి! ఏదైనా సాధించగలనన్న ధైర్యం! ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉత్సాహం నాలుగింతలవుతుంది. అందుకే మరి, గేమ్స్‌ అంటే అందరికీ అంత ఇష్టం!

వస్తున్నారు.. కొత్త ఛాంపియన్లు! 

 

మంచీ చెడూ..!

వీడియో గేమ్స్‌ అనగానే చాలామందికి వాటి నెగెటివ్‌ ప్రభావమే గుర్తొస్తుంది. అయితే దేనికైనా మంచీ చెడూ రెండూ ఉంటాయి. పిల్లలు బయటికెళ్లి ఆడుకోవడం శరీరానికి ఎలా వ్యాయామమవుతుందో వీడియో గేమ్స్‌ ఆడటం మనసుకీ అలాంటి వ్యాయామమే అవుతుందంటున్నాయి అధ్యయనాలు. అయితే బ్లూవేల్‌ లాంటి ప్రమాదకరమైన ఆటల జోలికి పిల్లలు వెళ్లకుండా చూసుకోవడం ముఖ్యం.
* ఈ గేమ్స్‌ని చాలావరకూ ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో మళ్లీ మళ్లీ ప్రయత్నించి చూస్తూ ఆడాలి కాబట్టి ఓర్పూ నేర్పూ అలవడతాయట. ఒకటికి రెండుసార్లు విఫలమైనా నిరుత్సాహపడక మళ్లీ ప్రయత్నించి చూసే పట్టుదల వస్తుందట.
* త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అలవడుతుంది.
* ఒత్తిడి తగ్గడానికి టీవీ చూడడం కన్నా కాసేపు వీడియో గేమ్స్‌ ఆడడం మంచిదని ఒక అధ్యయనం చెబుతోంది.
* ఆట అన్నాక ఎత్తులూ పైఎత్తులూ, పథకాలూ... ఉంటాయి. కాబట్టి ఏకాగ్రతతో ఆడాలి. నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇవి తోడ్పడుతాయంటున్నారు నిపుణులు.
* రోజూ కాసేపు వీడియోగేమ్స్‌ ఆడేవారిలో వయసు మీరుతున్న లక్షణాలు తగ్గుతాయని యూనివర్శిటీ ఆఫ్‌ అయోవా వారి అధ్యయనంలో తేలింది. అరవయ్యేళ్లు నిండిన కొంతమంది వృద్ధుల చేత రోజూ కొన్ని గంటలపాటు వీడియో గేమ్స్‌ ఆడించి పరిశీలించగా వారి వయసు దాదాపు పదేళ్లు తగ్గినంత ఉత్సాహంగా ఉన్నారట.
* శస్త్రచికిత్స లాంటి సంక్లిష్టమైన పనులు చేసేవారి నైపుణ్యాన్ని ఇవి పెంచుతాయని మరో అధ్యయనం పేర్కొంటోంది.
* దంపతుల మధ్య సాన్నిహిత్యం పెంపొందడానికీ వీడియోగేమ్స్‌ దోహదపడతాయని యూనివర్శిటీ ఆఫ్‌ డెన్వర్‌కి చెందిన మనస్తత్వ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

తొలిపతకంతో రికార్డు  

ఏడాది ఆసియాక్రీడల్లో ఈ-స్పోర్ట్స్‌ని ‘డిమాన్‌స్ట్రేషన్‌ స్పోర్ట్‌’గా ప్రవేశపెట్టారు. అంటే పోటీలు మామూలుగానే జరుగుతాయి కానీ పతకాలను అధికారిక జాబితాలో చేర్చరు. 18 దేశాలు పాల్గొనగా మన దేశానికి కాంస్య పతకం వచ్చింది. గుజరాత్‌కి చెందిన 23 ఏళ్ల తీర్థ్‌ మెహతా హార్త్‌స్టోన్‌ అనే కార్డ్‌గేమ్‌లో పతకం గెలిచాడు. వీడియోగేమ్‌లతో పిల్లలు టైమ్‌ వేస్ట్‌ చేస్తున్నారని భావించే తల్లిదండ్రులకు తన పతకమే సమాధానం అంటాడు మెహతా. ఇది సాధ్యమని తన తల్లిదండ్రులే కాదు, ఎవరూ అనుకోలేదనీ, తాను పతకం గెలిచి, స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు ఇతర క్రీడాకారులకు లభించినట్లే ఘనంగా స్వాగతం లభించిందనీ గర్వంగా చెబుతాడు. తల్లిదండ్రుల్ని మెప్పించడానికి అతడు చదువు దెబ్బతినకుండా చూసుకుంటూనే వీడియో గేమ్స్‌ ఆడేవాడట. చిన్నప్పుడు చెస్‌ బాగా ఆడినందువల్ల పథకం ప్రకారం ఆడే కార్డ్‌గేమ్‌ హార్త్‌స్టోన్‌ తనకు నచ్చిందనే తీర్థ్‌ ఇలాంటి స్ట్రాటజీ గేమ్స్‌లో మన దేశ క్రీడాకారులు స్వతహాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటాడు. ఏదైనా టోర్నమెంట్‌ దగ్గరలో ఉంటే రోజుకు 4 నుంచి 14 గంటల పాటు ప్రాక్టీస్‌ చేసే మెహతా ఏమీ లేనప్పుడు రోజూ రెండు గంటలు చేస్తాడట. టోర్నమెంట్లు ఆడుతూనే ప్రైవేటుగా ఐటీలో పీజీ చేస్తున్న తీర్థ్‌ భవిష్యత్తులో గేమ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలనుకుంటున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.