close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందగాణ్ణని ఎప్పుడూ అనుకోలా..!

 

వడివడిగా పరుగెడుతున్న మనం ఎక్కడో చోట పడిపోవడం సహజం. కిందపడ్డ మనల్ని చూసి ‘ఇదే జీవితం. ఇదీ నీ పరిమితి. నువ్విలా ఉండిపోవాల్సిందే!’ అని పరిధుల్ని గీసేస్తుంది ప్రపంచం. చాలా కొద్దిమంది ఆ పరిధుల్ని ఛేదించి ముందుకెళ్లగలుగుతారు. అరవింద్‌ స్వామి కచ్చితంగా వాళ్లలో ఒకడు. ‘రోజా’, ‘బొంబాయి’ తర్వాత పెద్ద స్టార్‌డమ్‌ తెచ్చుకున్నా... ఆ తర్వాత పక్షవాతంతో భారీకాయుడిగా మారాడు. అలాంటివాడు ‘ధృవ’, ‘నవాబ్‌’ సినిమాలతో మళ్లీ ఫుల్‌ఫామ్‌లోకి వచ్చాడంటే దాని వెనక విధిని ధిక్కరించే ఆత్మవిశ్వాసముంది. ఆ ఆత్మవిశ్వాసానికి అక్షర రూపమిస్తే...  

 

చిన్నప్పటి నుంచీ భయంలేని తత్వం నాది. భయానికీ, మర్యాదకీ మధ్య స్పష్టమైన రేఖని టీనేజీలోనే గీసేసుకున్నా. వ్యక్తుల విషయంలోనేకాదు జీవితాన్నీ నేను నిర్భయంగానే చూస్తున్నాను. జీవితంపట్ల మనకు మర్యాద ఉండాలి, దాన్ని మనం ప్రేమించాలి... అంతే తప్ప, అది విసిరే సవాళ్లూ, విధించే పరిధుల్ని చూసి భయపడకూడదు. ఆ భయం మనల్ని ఉన్నచోటే ఉండిపోయేలా చేస్తుంది. నాలో ఈ స్పష్టత రావడానికి అమ్మానాన్నల పెంపకం ఓ కారణం. మానాన్న వీడీ స్వామి తమిళనాడులో పేరున్న వాణిజ్యవేత్తల్లో ఒకరు. అమ్మ వసంతాస్వామి నాట్యకారిణి. నాన్న తన పదేళ్లప్పుడే పొట్టకూటికోసం కోల్‌కతా వెళ్లి అక్కడ అన్నిరకాల పనులూ చేసినవాడు. స్వయంకృషితో ఎదిగినవాడు. ఆ అనుభవాలని నాకు పదేపదే చెబుతుండేవాడు. అమ్మ నాపైన ఎంత ప్రేమ చూపినా సరే... నేను ప్రతివిషయంలోనూ స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది. మేము సంపన్నులమే అయినా... డిగ్రీ వచ్చేటప్పటికి నా పాకెట్‌ మనీ నేనే సంపాదించుకోవాలని నియమం పెట్టారు. దాంతో కాలేజీలో చదువుతూ మోడల్‌గా మారాను. చిన్నాచితకా యాడ్స్‌ చేశాను. వాటిల్లో ఓ యాడ్‌ మణిరత్నం కంటపడింది.

హామీ ఇచ్చినవాణ్ణి...
యాడ్‌ వాళ్ల నుంచి నా ఫోన్‌ నంబర్‌ సంపాదించి ఆడిషన్‌కి పిలిచారాయన. కొన్ని డైలాగులిచ్చి వాటిని చెప్పమన్నారు. నేను చెప్పగానే ‘ఓకే.. రెండువారాల్లో షూటింగ్‌కి వచ్చెయ్‌’ అన్నారు. నాకు గతుక్కుమనిపించింది. సినిమా ఆడిషన్స్‌కి వస్తున్నట్టు అమ్మానాన్నలతో చెప్పనేలేదు. వాళ్ల ఒప్పుదల లేకుండా ఎలా వెళ్లేది! మణిరత్నంగారితో అదే చెప్పి ‘ఈ విషయం మీరే నాన్నతో మాట్లాడండి...’ అని చెప్పా. ఇంకెవరైనా అయితే ‘ఏమక్కర్లేదు నువ్వెళ్లొచ్చు...’ అనేవారే. ఆయన అందుకు ఒప్పుకుని, ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడారు. నాన్నా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ‘ఇక సినిమాలనే వృత్తిగా చేసుకుంటావా?’ అని అడిగారు. ‘నెవ్వర్‌. బిజినెస్‌ ముఖ్యం...’ అని చెప్పాను. ఓ రకంగా అదో హామీ కూడా. ఆ హామీని ఇప్పటికీ కాపాడుకుంటున్నా.

విదేశాలకి వెళ్లిపోయా...
‘దళపతి’ పూర్తయ్యాక ‘రోజా’లో హీరోగా చేయమన్నారు మణి. నిజానికి ‘రోజా’ రిలీజై సాధించిన విజయాల గురించి నాకు పెద్దగా తెలియదు. షూటింగ్‌ పూర్తికాగానే నేను అమెరికాలో చదవడానికి వెళ్లిపోయాను. ‘రోజా’తో నా సినిమా జీవితం అయిపోయిందనే భావనలోనే ఉన్నాను. కానీ జీవితం నన్నలా ఉండనివ్వలేదు. 1993లో అమ్మకి క్యాన్సర్‌ వచ్చి పరిస్థితి విషమంగా మారింది. చదువు పక్కనపెట్టి భారత్‌కి వచ్చాను. ఆరునెలలపాటు అమ్మతోనే ఉన్నా ఆమెని కాపాడుకోలేకపోయాను. అమ్మ దూరమైన కొద్దిరోజులకే నాన్నా చనిపోయారు. ఒక్కసారిగా ఇద్దరూ దూరం కావడాన్ని తట్టుకోలేకపోయాను. నాన్న చూస్తున్న బిజినెస్‌లన్నీ నేనే చూడాల్సిన పరిస్థితి. కానీ ఆఫీసుకెళ్లినా వాళ్ల జ్ఞాపకాలే వెన్నాడుతుండేవి. పనిపైన దృష్టిపెట్టలేకపోయేవాణ్ణి. అప్పుడే మణిరత్నంగారు పిలిచారు. ‘నీ బిజినెస్‌ నుంచి పూర్తి భిన్నమైన ఫీల్డ్‌లో దృష్టిపెడితే తేరుకుంటావు. మళ్లీ సినిమాలవైపు వచ్చెయ్‌..!’ అన్నారు. అలా ‘బొంబాయి’ సినిమా కోసం కెమెరా ముందు నిల్చున్నాను. షాట్‌ మధ్యలో విశ్రాంతిగా కూర్చుంటే ఎక్కడ విషాదంలో మునిగిపోతానో అని జనాల రద్దీని కంట్రోల్‌ చేయడం నుంచి క్లాప్‌ కొట్టడం దాకా నాకు అన్ని పనులూ అప్పగించారు. మణిరత్నంగారు అనుకున్నట్టే ఆ విషాదం నుంచి బయటపడ్డాను. ఈలోపు పెళ్లికూడా అయింది.

 

ఐటీ రంగంవైపు...
‘బొంబాయి’ తర్వాత వరసగా నాకు నచ్చిన స్క్రిప్ట్‌లన్నింటినీ ఒప్పుకున్నాను. సినిమాలు చేస్తూ ఉన్నా నాకంటూ ఓ కంపెనీ, ఉద్యోగులూ, వినియోగదారులున్నారనే విషయాన్ని ఎప్పుడూ మరవలేదు. 1999 తర్వాత పూర్తిగా బిజినెస్‌ని విస్తరించే పనిలో పడ్డాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న ఐటీ రంగంపై దృష్టిపెట్టాను. ప్రపంచవ్యాప్తంగా శాఖలు ప్రారంభించాలనుకున్నాను. కనీసం నాలుగైదేళ్లు సినిమాలకి దూరమైతే తప్ప ఇవన్నీ సక్రమంగా సాగవనిపించింది. నేను అనుకున్నదానికంటే ముందుగానే మంచి ఫలితాలు సాధించడం మొదలుపెట్టాను. ఓ రోజు అనుకోకుండా  పట్టుతప్పి కిందపడిపోయాను. తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. మూడురోజుల తర్వాత బెడ్‌ మీద నుంచి లేవబోతుంటే కుడికాలు కదల్లేదు. డాక్టర్లు చూసి పక్షవాతం అని తేల్చారు.

మీమ్స్‌తో ఎగతాళి చేశారు...
ఎన్నెన్నో చికిత్సలు... ఏవేవో మందులు. ఏడాది తర్వాత కొద్దిగా కాలు కదపగలిగినా శరీరంపైన మందులు తీవ్రప్రభావం చూపించాయి. చూస్తుండగానే నా బరువు 110 కిలోలకి చేరింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. కానీ అలాగే ఉండిపోతే... మనకు మనమే చుట్టూ కంచె కట్టుకున్నట్టు అవుతుందనిపించింది. పంటిబిగువున బాధ భరిస్తూ అతికష్టంపైన లేచి నిలబడటానికి ప్రయత్నించాను.  మెల్లగా ఆఫీసుకీ వెళ్లగలిగాను. నటుణ్ణయినప్పటి నుంచీ నన్నందరూ అందగాడినని పొగుడుతున్నా పట్టించుకున్నది లేదు... అసలు స్టార్‌డమ్‌ అన్నపదానికే నా జీవితంలో విలువలేదు. అందుకే శరీరంలో వచ్చిన కొత్త మార్పుల్ని చూసుకుని నేనేమీ సిగ్గుపడలేదు. ఎవరైనా ఫొటోలు తీస్తామన్నా కాదనలేదు! కానీ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి మీమ్స్‌తో ఎగతాళి చేయడం ప్రారంభించారు. వాటిని కూడా చిరునవ్వుతోనే ఎదుర్కొన్నాను కానీ ఒక సంఘటన మాత్రం బాగా కుంగదీసింది. అప్పటికి విడాకులు తీసుకుని... పిల్లల బాధ్యత నేనే చూస్తున్నాను. వాళ్లనోసారి వెకేషన్‌కని శ్రీలంక తీసుకెళ్లాను. అక్కడో రెస్టరెంట్‌లో ఎవరో ఒకమ్మాయి పాపతో ఎగతాళిగా అందట... ‘మీనాన్నని కాస్త తక్కువగా తినమనొచ్చుగా తల్లీ!’ అని. నా శరీరం గురించి ఆమె అలా కామెంట్‌ చేసేసరికి తట్టుకోలేక పాప నా దగ్గరకొచ్చి ఏడుస్తూ చెప్పింది. అంతవరకూ నేను ఎదుర్కొన్న అవమానాలకన్నా మా పాప బాధే నన్ను వేధించింది.

అయినా...
చెన్నైకి వచ్చిన కొద్దిరోజులకే మణిరత్నంగారు ఫోన్‌ చేసి పిలిచారు. ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి రమ్మన్నారనుకున్నా. కానీ ఆయన ‘కడలి’ సినిమాలో ఓ కీలకపాత్ర గురించి చెప్పారు. ‘నేనా... మళ్లీ సినిమాల్లోకా? అయ్యేపనేనా!’ అన్నా. అవుతుందని చెప్పి... వర్కవుట్స్‌, డైటింగ్‌పైన నా చేతే ఓ ప్లాన్‌ తయారుచేయించారు. ‘వాటిని ఫాలో అయి
నెల తర్వాత కనిపించు..’ అన్నారు. ఎలాగూ సినిమాలో కనిపించే నమ్మకమైతే నాకు లేదు. ‘ఆరోగ్యానికైనా మంచిదేగా చేసి చూద్దాం!’ అనిపించి మొదలుపెట్టాను. ముందు కొద్దికొద్ది ఆహారం రోజుకి ఎనిమిదిసార్లు తినడం మొదలుపెట్టాను. చిన్నపాటి నడకతో వ్యాయామం ప్రారంభించాను. ఆ ఉత్సాహం నాలో కసినిపెంచింది. నా చుట్టూ ఉన్న కంచెల్నిఛేదించి తీరాలనుకున్నాను. జాగింగ్‌లాంటివి చేయడం మొదలుపెట్టాను. నేనే ఆశ్చర్యపోయేలా18 కిలోలు తగ్గాను! మణిరత్నంగారు చెప్పిన గడువొచ్చింది. నన్ను చూడగానే సంతృప్తిగా నవ్వి... ‘కడలి’కోసం ఏం చేయాలో చెప్పడం మొదలుపెట్టారు. అలా సినిమాల్లోనే కాదు నా జీవితంలోనూ రెండో ఇన్నింగ్స్‌ మొదలైనట్టయింది.

 

మారథాన్‌లో నెగ్గా...
‘కడలి’ తర్వాత నాకు నేను సవాళ్లు విసురుకోవడం మొదలుపెట్టాను. నాలుగుసార్లు హాఫ్‌ మారథాన్‌(21 కిలోమీటర్లు)లో పరుగెత్తి నెగ్గాను. ముందు ఐదు కిలోమీటర్లు పరుగెత్తితే చాలనుకున్నా కానీ... ‘ఒకప్పుడు పడక నుంచి లేవలేనివాడివి నువ్వు. నువ్వేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కమాన్‌...’ అని నాకు నేనే చెప్పుకుంటూ మొత్తం పరుగెత్తాను. అందుకే ‘ధృవ’లో అంత ఫిట్‌గా కనిపించాను! తమిళంలో హీరోగా వరసగా మరో రెండుమూడు సినిమాలొచ్చాయి. అవి చేస్తుండగానే మణిరత్నంగారు ‘నవాబ్‌’ కోసం పిలిచారు. ఇందులో నాది కాస్త రౌడీయిజంతో కూడుకున్న పాత్ర అని చెప్పారు. కాబట్టి బాడీ బిల్డింగ్‌ కూడా చేయాలని అనుకున్నాను. వెన్నునొప్పివల్ల నేను ఇంతవరకూ అలాంటి వ్యాయామాలు చేయలేదు. ఈ సినిమాతో అవి కూడా చేయడం మొదలుపెట్టాను. మామూలుగా మణిరత్నం సినిమా షూటింగులు ఉదయం 5.30కి మొదలవుతాయి కాబట్టి మూడింటికే లేచి వ్యాయామాలు చేయడం ప్రారంభించా. ఆరుగంటలకి షూట్‌ అయ్యాక మళ్లీ ఎక్సర్‌సైజ్‌. రాత్రయ్యేసరికి స్పృహతప్పి పడిపోయానేమో అన్నంతగా నిద్రొచ్చేది. ఇలా రెండు నెలలు కష్టపడ్డా. నలభై ఎనిమిదేళ్ల వయస్సూ, వెన్నునొప్పి సమస్యా ఉన్న నాకు అదో పెద్ద రిస్కే! కానీ ఇంతదాకా చేసినవాణ్ణి ఆ రిస్కు కూడా తీసుకోలేనా అనిపించింది... అందుకే చేశా!

ఇదీ నా కుటుంబం...
మా పాప ఇప్పుడు కాలేజీకెళుతోంది. బాబు ప్లస్‌ వన్‌ చేస్తున్నాడు. నేను పర్‌ఫెక్ట్‌ తండ్రినేమీ కాదు... కానీ నా పిల్లలకు సాధ్యమైనంత ప్రేమను అందించటానికి ప్రయత్నిస్తా. అన్నట్టు.. మూడేళ్ల కిందటే అపర్ణ ముఖర్జీని పెళ్లి చేసుకున్నా. తను నా చిననాటి స్నేహితురాలూ, న్యాయనిపుణురాలు. వరల్డ్‌ బ్యాంకు వంటి సంస్థలకి మీడియేటర్‌గా ఉంటుంది. ఇంట్లో అందరం పరిణతితో ఆలోచిస్తాం. ఒకరికొకరం స్వేచ్ఛనిచ్చుకుంటాం. ఎవరికివాళ్లం స్వతంత్రంగానే ఉన్నా... అందరం కలిసి ప్రేమని పంచుకుంటున్నాం!

డైరెక్టర్‌ని కాబోతున్నా...!

ఆఫ్‌ స్పిన్సర్‌ని : నాకు క్రికెట్‌లోనూ ప్రవేశం ఉంది. ఒకప్పుడు లెగ్‌బ్రేక్‌ బాగా వేసేవాణ్ని. వెన్ను నొప్పి సమస్య వచ్చాక ఆఫ్‌ స్పిన్‌ వేస్తున్నా. బిజినెస్‌ టోర్నమెంట్లలో ఎక్కువగా ఆడుతుంటాను.
మెమరీ పవర్‌ : ఓసారి చుట్టూ చూసి అక్కడున్న వంద వస్తువులని చెప్పడం, వందలాది పేర్లని వివిధ వరసల్లో వల్లించడం వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన కిటుకులన్నీ నేర్చుకున్నా.
యాప్‌ తయారుచేశా: నేను కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకోలేదు. కానీ బిజినెస్‌ పరంగా ఐటీ బాధ్యతలు చూడాల్సి రావడంతో ప్రోగ్రామింగ్‌పై పట్టుసాధించేశాను. తాజాగా మా కస్టమర్లకి సంబంధించిన యాప్‌లు తయారుచేశా.
వక్తగా...: నేను చాలా రిజర్వుడు. నలుగురిని ఉద్దేశించి ప్రసంగించమంటే నావల్ల కాదు. కానీ ఈమధ్యే అది కూడా నేర్చుకున్నా. ముందు రాసుకుని చదవడం మొదలుపెట్టి... ఇప్పుడు ఏదోలా మేనేజ్‌ చేయగలుగుతున్నా.
* త్వరలో ఓ సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నాను. 20 ఏళ్లకిందే నేను స్క్రిప్టు రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.