close

శివకేశవుల మాసం.. కార్తికం!

శివకేశవుల మాసం.. కార్తికం!

శివకేశవులకు ప్రీతికరమైన మాసం... ఆధ్యాత్మిక శోభను భావితరాలకు అందించే మాసం...  మనిషిని సంఘజీవిగా మలిచే మాసం... ఇలా చెప్పుకుంటూ పోతే కార్తిక మాసానికి ఎన్ని విశేషాలో. మనిషిగా వికసించడానికీ, ఆధ్యాత్మికంగా ఎదగడానికీ ఈ మాసం లోని ప్రతి తిథీ ఓ జీవనశైలి పాఠమే.
పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్లే ఈ నెలకు కార్తిక మాసం అని పేరు. శివకేశవులకు ఎలాంటి భేదం లేదని చెప్పడానికి ఈ మాసానికి మించిన ఉదాహరణ లేదు. కార్తిక సోమవారాలూ, మాసశివరాత్రులూ శివుడికి ప్రీతిపాత్రమైనవి అయితే, కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశులు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవి. హరిహర మాసంగా పేర్కొనే ఈ మాసంలో కార్తిక స్నానం, దీపారాధన శ్రేష్ఠమైనవి. సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం చేసి, ఉసిరిచెట్టూ, రావిచెట్టూ లేదంటే తులసికోట దగ్గరో దీపం వెలిగించి, కార్తిక దామోదరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. నిజానికి ఈ మాసంలోని ప్రతి తిథీ ప్రత్యేకమైందే ప్రతి రోజూ పండగే. వీటిలో కార్తిక పౌర్ణమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి మరింత ప్రత్యేకమైనవి.

శివకేశవుల మాసం.. కార్తికం!

కార్తిక పౌర్ణమి
కార్తికమాసం మొత్తానికీ పౌర్ణమి తలమానికంగా చెబుతారు. పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుడి దర్శనం, అభిషేకాలూ అత్యంత శుభఫలితాలను ఇస్తాయంటారు. కార్తిక పౌర్ణమికి త్రిపురపౌర్ణమి అనే మరో పేరుంది. త్రిపురాసురులను శివుడు కార్తిక పౌర్ణమి రోజునే సంహరించడం వల్ల దీనికా పేరు వచ్చినట్టు పురాణ కథనం. తారకాసురుడికి తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. తండ్రి మరణానంతరం దేవతలమీద ప్రతీకారం తీర్చుకోవడానికి బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సుచేశారు. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ అసురులు ‘రథంకాని రథం ఎక్కి విల్లుకాని విల్లుతో, నారికాని నారితో, బాణంకాని బాణాన్ని ఎక్కుపెట్టి ముగ్గుర్నీ ఒకేసారి కొట్టేవరకూ మాకు చావు రాకూడదు’ అని వరాన్ని కోరారు. విధాత అనుగ్రహించాడు. వరగర్వంతో వారు దేవతలనూ సాధువులనూ హింసించడం మొదలుపెట్టారు. ఆ అకృత్యాలు భరించలేని దేవతలు శివుడికి మొరపెట్టుకున్నారు. శివుడు త్రిపురాసురులను సంహరించటానికి సిద్ధం కాగా దేవతలందరూ శివుడికి సహకరించేందుకు ముందుకొచ్చారు. భూమి రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, నాలుగువేదాలూ గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా మారిన రథంమీద శివుడు యుద్ధానికి బయలుదేరుతాడు. మేరుపర్వతాన్ని విల్లుగా, ఆదిశేషువుని వింటినారిగా, మహావిష్ణువుని బాణంగా చేసుకుని పరమేశ్వరుడు ఆ రాక్షసులను అంతంచేశాడు. అందుకే కార్తిక పౌర్ణమి రోజున శివుడిని శుద్ధ జలాలతో అభిషేకించి, మారేడు దళాలతో, జిల్లేడు పూలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటారు.

శివకేశవుల మాసం.. కార్తికం!

ఉత్తమమైంది ఉత్థాన ఏకాదశి
కార్తికంలో అత్యంత విశేషమైంది ఉత్థాన ఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుడి పాన్పుమీద ఆషాడ శుద్ధ ఏకాదశిరోజు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి రోజు కన్నులు విప్పి యోగనిద్రనుంచి మేల్కొన్న రోజునే ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తిని షోడశోపచారాలతో పూజిస్తే యశస్సు, అపూర్వ వైభవాలు పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి.

క్షీరాబ్ది ద్వాదశి
కార్తిక శుద్ధ ద్వాదశికే క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. పూర్వం దేవతలూ దానవులూ అమృతం కోసం ఈ ద్వాదశి రోజునే క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారట. ఈ కారణంగానే ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, మథన ద్వాదశి అని పేర్కొంటున్నారు. లక్ష్మీనారాయణులు ద్వాదశి నాడే బృందావనంలోకి ప్రవేశిస్తారని పురాణవచనం. అందువల్లనే ఈ రోజు తులసి పూజ చేస్తే సకలపాపాలూ హరిస్తాయని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీ కల్యాణం చేసే సంప్రదాయమూ కనిపిస్తుంది. విష్ణుమూర్తికి ప్రతీకగా ఉసిరి కొమ్మనూ లక్ష్మీదేవి నెలవైన తులసికోటలో ఉంచి లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో అర్చిస్తారు.

సోమవారం ప్రత్యేకత

కార్తికంలో సోమవారానికి విశేష ప్రాధాన్యాన్ని కల్పించారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల సోమవారాలకు మరింత విశిష్టత ఏర్పడింది. సోమ అంటే చంద్రుడు. శివుడి సిగలో వెలిగే చంద్రుని వారం కాబట్టి సోమవారం ఉపవాసానికి విశేష ఫలితం లభిస్తుందంటారు. వీటితోపాటు సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైందిగా పేర్కొంటారు. అందుకే భక్తులు కార్తిక మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహర మహాదేవ శంభో శంకర’ అంటూ స్తుతిస్తూ భక్తిసాగరంలో ఓలలాడతారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ పరమపావనమైనదే కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కైలాసవాసం సిద్ధిస్తుందన్నది శాస్త్రోక్తి. అలా నెలంతా చేయలేనివారు కనీసం కార్తిక సోమవారమైనా ఉపవాసం చేసి రాత్రి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణతాంబూలాలు ఇచ్చినా అంతే ఫలితం కలుగుతుందంటారు.

శివకేశవుల మాసం.. కార్తికం!

ఆశీర్వదించేప్పుడు అక్షింతలు ఎందుకు చల్లుతారు?

శివకేశవుల మాసం.. కార్తికం!

బారసాల, అన్నప్రాశన, పెళ్లి, పేరంటం... ఇలా హైందవ సంప్రదాయంలో జరిగే ప్రతి శుభకార్యంలోనూ తలమీద అక్షింతలు వేసి ఆశీర్వదించడం పరిపాటి. మన సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఆ సందర్భంలో ఉపయోగించే అక్షింతలకూ అంతే ప్రాధాన్యం ఉంది. అక్షింతలు అంటే క్షయం కానివీ పరిపూర్ణమైనవీ అని అర్థం. విరిగిపోని మంచి ధాన్యాన్ని ఎంచి, పొట్టుతీసి, పసుపు, ఆవునెయ్యి కలిపి అక్షింతలు తయారుచేస్తారు. ఇందులో బియ్యాన్ని చంద్రుడికి ప్రతీకగా చెబుతారు. ‘మనః కారకో ఇతి చంద్రః’ అంటే చంద్రుడు మనసుకి కారకుడు లేదా అధిపతి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి చిహ్నంగా బియ్యాన్ని ఉపయోగిస్తాం. అంతేకాదు బియ్యంలో కలిపే పసుపు గురువుకు ప్రతీక. గురు గ్రహం శుభ గ్రహం. అందుకే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.