close

వెయ్యి కోట్లతో సినిమాతీస్తా!

వెయ్యి కోట్లతో సినిమాతీస్తా!

2.ఓ... మనదేశంలో ఇప్పటిదాకా వచ్చినవాటిలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన సినిమా. దీని నిర్మాణ వ్యయం సుమారు 500 కోట్ల రూపాయలు. ఈ సినిమా కోసం అంత ఖర్చుకి సాహసించిన వ్యక్తి... లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత సుభాస్కరన్‌ అల్లిరాజా. ఇరవైఏళ్లకిందట శ్రీలంక శరణార్థిగా ఐరోపా వెళ్లిన ఆయన ఇప్పుడు ప్రపంచ కోటీశ్వరులలో ఒకడు! సినిమా కథని తలదన్నే ఆయన జీవితంలోకి ఓసారి తొంగిచూస్తే...
శ్రీలంకలో ముల్లైత్తీవు (మల్లెల దీవి అని అర్థం) అనే ప్రాంతం అల్లిరాజాది. అంత అందమైన పేరున్న ఆ ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా అగ్నివర్షం కురుస్తుండేది. ఆంబోతుల యుద్ధంలో చిక్కుకున్న లేగదూడల్లాంటి జీవితం అక్కడి సామాన్యులది. ప్రజలని మానవ కవచంగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధంచేసే ఎల్టీటీఈ ఓ వైపు, అది తెలిసీ విచక్షణారహితంగా ప్రజావాసాల్లో బాంబులు కురిపించే ప్రభుత్వ సేనలు మరోవైపు...! రెండువైపుల నుంచీ తీవ్రమైన అణచివేతకి గురయ్యేవాళ్లు అక్కడి ప్రజలు! ఇల్లు దాటి బయటకు వెళ్లినవాళ్లు మళ్లీ ఇంటికొస్తారో లేదో తెలియదు. ఎవరి ప్రాణాలకీ హామీ లేదు! అలాంటి పరిస్థితుల్లోనే అల్లిరాజా తండ్రి సుభాస్కరన్‌ కన్నుమూశాడు. అప్పటికి అల్లిరాజా వయసు పదేళ్లు. ఓ అన్నా, చెల్లెలు ఆయన తోబుట్టువులు. తల్లి బిక్కుబిక్కుమంటూ ఒంటరిపక్షిగా పిల్లల్ని సాకింది. ఓ దశలో తన పిల్లల బతుకులు దినదినగండంగా గడవకూడదని నిశ్చయించుకుంది. అప్పటిదాకా తాను దాచుకున్న డబ్బంతా కూడగట్టి పెద్దకొడుకుని విదేశాలకి పంపాలనుకుంది. విదేశాలకి పంపడమంటే మనలాగా పాస్‌పోర్టు తెప్పించి, వీసా ఇప్పించి భద్రంగా విమానమెక్కించి వీడ్కోలు పలకడం కాదు. ముందు ఎప్పుడు ఏ తుపాకీ తూటా దుసుకొస్తుందా అని భయపడుతూ లంక సముద్రతీరానికి చేరాలి. సముద్రంలో కంటపడ్డ ఏ నాటుపడవో ఎక్కి మధ్యలో కనిపించే ఏ విదేశీ పడవనో బతిమిలాడి శరణార్థిగా ఆ దేశాలకి వెళ్లాలి. అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కాళ్లావేళ్లాపడ్డాక వాళ్లు కరుణిస్తే అక్కడ తలదాచుకోవాలి. లేదంటే జైల్లో మగ్గిపోవాలి! అలా వెళ్లినవాళ్లు ఓ ఉత్తరం పంపేదాకా వాళ్లు బతికున్నారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనే అల్లిరాజా తల్లి జ్ఞానాంబిక తన పెద్దకొడుకుని లంక దాటించింది. అతను ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ చేరుకున్నాడు. అక్కడ ఉద్యోగం సంపాదించి డబ్బు కూడా పంపడం మొదలుపెట్టాడు. ఏడేళ్లు గడిచాయి. 1989లో.. శ్రీలంకలో పరిస్థితి మరింతగా విషమించింది. అక్కడి తమిళ ప్రజలందరూ ఉన్న ఊరు వదిలి తండోపతండాలుగా విదేశాలకి పారిపోవడం మొదలుపెట్టారు. అల్లిరాజా, అతని చెల్లెలితో వాళ్లమ్మ పెద్దకొడుకున్న ప్యారిస్‌కి వచ్చేసింది. అక్కడికొచ్చాక భుక్తి కోసం ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకుంది.

‘కాల్‌కార్డు’లతో మొదలుపెట్టి...
కొన్నాళ్లకి టిఫిన్‌ సెంటర్‌తోపాటూ తినుబండారాలమ్మే దుకాణం కూడా పెట్టారు. తినుబండారాలతోపాటూ ‘కాల్‌కార్డులు’ కూడా అమ్మడం మొదలుపెట్టారు. సెల్‌ఫోన్లు రాకముందు ల్యాండ్‌లైన్‌ నుంచి చవక ధరల్లో ఎస్టీడీ, ఐఎస్డీ కాల్స్‌ చేయడానికి ఈ కాల్‌కార్డులని ఉపయోగిస్తుండేవారు. ప్యారిస్‌లో అల్లిరాజా ఉంటున్న ప్రాంతంలో ఎక్కువగా భారత్‌, శ్రీలంకకి చెందిన ప్రవాసులు ఉండేవారు. వాళ్లందరూ స్వదేశంలో ఉండేవాళ్ళతో మాట్లాడుకోవడానికి వీటినే వాడేవారు. కాబట్టి అల్లిరాజా షాపులో కాల్‌కార్డుల విక్రయాలు జోరుగా సాగేవి. కానీ ఉన్నపళంగా వీళ్లకి వాటిని పంపిణీ చేస్తున్న సంస్థ సరఫరా ఆపేసింది. దాంతో తామే సొంతంగా పంపిణీని తీసుకోవాలనుకున్నారు. అల్లిరాజా ఓ వ్యాపారిగా వేసిన తొలి అడుగు అది.

లండన్‌కి మారారు...
కాల్‌ కార్డుల వ్యాపారం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్యారిస్‌కన్నా లండన్‌లో ప్రవాస భారతీయులూ, లంకేయులూ ఎక్కువ కాబట్టి అల్లిరాజా అక్కడికి మకాం మార్చాడు. ఇంకెవరివో కార్డులు అమ్మడంతో సంతృప్తి చెందకుండా తానే కాల్‌కార్డుల సంస్థని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు. తన చెల్లెలు లేఖ పేరు ధ్వనించేలా ‘లైకా టెల్‌’ ఏర్పాటుచేశాడు. ‘‘ధ్వనించేలా’ ఎందుకు... నేరుగా లేఖ అనే పెట్టొచ్చు కదా’ అని అడిగితే ‘చెల్లెలి పేరుపెట్టాక వ్యాపారంలో నష్టం వస్తే ఆ అమ్మాయిని అందరూ దురదృష్టవంతురాలంటారేమో అనుకుని అలా చేశాను. అప్పట్లో వ్యాపారమంటే నాలో అంత భయం ఉండేది. ఇప్పుడనుకుంటే ఎంత నవ్వొస్తోందో..’ అంటాడు అల్లిరాజా. 1999లో ప్రారంభించిన ‘లైకా టెల్‌’ ప్రవాసుల మధ్య మంచి ఆదరణ పొందింది. 2002 వరకు బాగానే సాగింది కానీ... ఆ తర్వాతి నుంచి సెల్‌ఫోన్‌ల వాడకం పెరిగింది. మొబైల్‌ ఫోన్లలో మొదట్లో ఎస్టీడీ, ఐఎస్‌డీ ధరలు ల్యాండ్‌లైన్‌కీ సమానంగానే ఉండేవి. క్రమంగా అవి తగ్గడం మొదలయ్యాక కాల్‌కార్డుల అవసరం లేకుండా పోయింది. అది ‘లైకా టెల్‌’ వ్యాపారాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది. ఈ సమస్యనీ అవకాశంగా మలచుకున్నాడు అల్లిరాజా. తన దృష్టిని ‘ఎంవీఎన్‌ఓ’ సేవలవైపు మళ్లించాడు.

వెయ్యి కోట్లతో సినిమాతీస్తా!

వాటితోనే...
ప్రధాన మొబైల్‌ ఆపరేటర్ల నుంచి ఏకమొత్తంగా ఎస్టీడీ, ఐఎస్‌డీ, ఎస్సెమ్మెస్‌, డేటా ప్యాకేజీలు కొనుక్కుని... వాటిని తమ బ్రాండ్‌తో తక్కువ ధరలకి వినియోగదారులకి అందించడమే ఈ ‘ఎంవీఎన్‌ఓ’ సేవల లక్ష్యం! ఇలాంటి సేవలని మనదేశంలో మొన్నీమధ్యే అనుమతించారు కాబట్టి... మనకి పెద్దగా పరిచయం లేదు కానీ ఐరోపా దేశాల్లో 2006లోనే ఇది మొదలైంది. నెదర్లాండ్స్‌ దీనికి తొలిసారి పచ్చజెండా ఊపింది. లైకా మొబైల్‌ అక్కడే తన తొలి సేవల్ని మొదలుపెట్టింది.

ముందు కొంత మొత్తం చెల్లిస్తే మొబైల్‌ ఫోనూ, సిమ్‌కార్డు ఇచ్చేసి అతితక్కువ ధరకి ఐఎస్‌డీ మాట్లాడే అవకాశం కల్పించడంతో ప్రవాసులకి అది గొప్ప వరంగా మారింది. ఎంవీఎన్‌ఓలకి అనుమతిచ్చిన అన్ని దేశాల్లోనూ లైకా మొబైల్‌ విస్తరణ మొదలైంది. ముందు ప్రవాసులే వాడుతున్న లైకా మొబైల్‌ సేవల్ని క్రమంగా స్థానికులూ వినియోగించుకోవడం మొదలుపెట్టారు. చూస్తుండగానే ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని 22 దేశాలకి విస్తరించిన లైకా 1.5 కోట్ల మంది వినియోగదారులని సొంతంచేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద ఎంవీఎన్‌ఓగా నిలిచింది. యూరప్‌లోని మొబైల్‌ వాడేవాళ్లలో 15 శాతం మంది ఈ సంస్థ వినియోగదారులే! మెల్లగా ‘లైకా టీవీ’ పేరుతో ఓటీటీ సేవలూ, కొత్తగా విదేశాలకి వెళ్లినవాళ్లకి ఉపయోగపడే ‘లైకా మనీ’ డెబిట్‌ కార్డులూ, ప్రవాసులు సులభంగా విదేశీ మారకద్రవ్యాన్ని మార్చుకునేందుకు ‘లైకేర్‌ మిట్‌’ సేవలూ, శ్రీలంకకీ భారతదేశానికీ అతితక్కువ ధరకే పర్యటనలు నిర్వహించే ‘లైకా ఫ్లై’ విమాన సర్వీసులూ... ఇలా పది సంస్థల్ని స్థాపించింది! ఇవన్నీ కూడా విదేశాల్లోని భారతీయుల్నీ, లంకేయుల్నీ లక్ష్యంగా చేసుకున్నవే. ‘ఈరోజు వాళ్ల అవసరాలేమిటీ అని తెలుసుకోవడమే కాదు... రేపు వాళ్ల ఆకాంక్షలు ఎలా ఉంటాయో కూడా అంచనావేసి వ్యాపార వ్యూహాల్ని రచిస్తున్నా. మా విజయం వెనకున్న రహస్యం అదొక్కటే!’ అంటాడు అల్లిరాజా. ఈ వ్యాపారాలతో లైకా గ్రూపు టర్నోవర్‌ ముప్పైవేల కోట్లరూపాయలకి చేరింది. బ్రిటన్‌కు చెందిన సండే టైమ్స్‌ సంస్థ ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అల్లిరాజాని చేర్చింది!

మూలాలు మరచిపోలేదు...
దేశాలకి అతీతంగా యుద్ధబాధితులని ఆదుకోవడం కోసం ‘జ్ఞానం ఫౌండేషన్‌’ని ప్రారంభించాడు అల్లిరాజా. తన తల్లి జ్ఞానాంబిక పేరుతో దీన్ని స్థాపించాడు. శ్రీలంక యుద్ధం కారణంగా ఇళ్ళు కోల్పోయి పాతికేళ్ళుగా రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్న 150 కుటుంబాలకి 30కోట్ల రూపాయలతో... కొత్త ఇళ్ళూ, సకల వసతులున్న ఓ గ్రామాన్ని నిర్మించి ఇచ్చాడు. శ్రీలంకతోపాటూ భారత్‌, ఆఫ్రికా దేశాల్లోని పేద విద్యార్థులకి స్కాలర్‌షిప్పులూ, నైపుణ్యాభివృద్ధి కోసం గ్రాంట్లూ అందిస్తున్నాడు.

వెయ్యి కోట్లతో సినిమాతీస్తా!

‘ప్రేమ’ కోసం...
అల్లిరాజన్‌ భార్య ప్రేమది కూడా అతనిలాంటి నేపథ్యమే! తను కూడా ఊహ తెలియనప్పుడే తండ్రిని కోల్పోయింది. ఆరుగురు సంతానంలో చివరమ్మాయి. ‘ప్రేమని ఎలాగైనా డాక్టర్‌ని చేయాలని వాళ్లమ్మ కోరిక. అనుకున్నట్టే వైద్యవిద్యలో చేర్చింది. కానీ 1998లో శ్రీలంకలోని యుద్ధ పరిస్థితులు తమిళులెవర్నీ ఉన్నత విద్య చదవనివ్వలేదు. దాంతో ప్రేమ చదువు మానేసింది. ‘అందుకే పెళ్లయ్యాక తన కోసమే ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో ‘లైకా హెల్త్‌’ క్లినిక్‌లని ఏర్పాటుచేశాను. ఆ రంగంలో ఆమె అల్లుకుపోయింది. తనదైన ముద్ర వేసింది’ అంటాడు అల్లిరాజా. ప్రస్తుతం ‘లైకా గ్రూప్‌’లో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదివేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అన్నట్టు ఈ కార్యాలయంలో జరిగే ప్రతి సమావేశంలోనూ తన ఉద్యోగులకి అల్లిరాజానే స్వయంగా వంటచేసి వడ్డిస్తాడట!
చిరుతోనే మొదలు...
శ్రీలంకలోనే ఉన్నా అక్కడి తమిళులందరూ మన భారతీయ సినిమాలే ఎక్కువగా చూస్తారు! ఇక్కడి నటుల్నీ ఆరాధిస్తారు. అల్లిరాజా కూడా అంతే. ‘ప్యారిస్‌కి వచ్చాకే నేను సినిమాలు చూడటం ప్రారంభించాను. చెబితే నమ్మరు... ఇప్పటికీ రోజుకి రెండు సినిమాలు చూడనిదే నిద్రపోను. అందుకే విజయ్‌ హీరోగా తమిళంలో ‘కత్తి’ సినిమా  చేశాం. చిరంజీవిగారు దాన్ని ‘ఖైదీ 150’గా రీమేక్‌ చేస్తాననడంతో రామ్‌చరణ్‌తోపాటూ సహనిర్మాతగా వ్యవహరించాను. సగటు ప్రేక్షకుడిగా నాలో ఆసక్తి రేకెత్తించే కథలూ, దర్శకులూ, నటుల సినిమాలనే ఎంచుకుంటున్నాను. నాకిక్కడ లాభాలు ప్రధానం కాదు. మంచి సినిమాలు తీశాడు అన్న పేరొస్తే చాలు...!’ అంటున్నాడు అల్లిరాజా.


ఎంతైనా ఫర్వాలేదు!

‘మూడేళ్లకిందట శంకర్‌ ‘2.ఓ’ కోసం నిర్మాణ సంస్థల్ని వెతుకుతున్నారని తెలిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం దాని బడ్జెట్‌ మూడువందల కోట్లరూపాయలు. అందువల్ల ఏ నిర్మాణ సంస్థా ముందుకు రాలేదు. శంకర్‌ని సంప్రదించి కథ వింటే... అద్భుతమనిపించింది. ఆ కథని వెండితెరపై చూపగలిగితే దేశం ఇప్పటిదాకా చూడని గొప్ప సినిమా అవుతుందది! అందుకే నిర్మాణానికి సిద్ధమయ్యాను. అన్నీ కలిపి బడ్జెట్‌ 500 కోట్లరూపాయలకి చేరింది. అయినా నాలో ఏ ఆందోళనా లేదు... ప్రేక్షకులకి ఓ గొప్ప సినిమాని ఇవ్వగలుగుతున్నాననే ధీమా నాకుంది. శంకర్‌పైన ఉన్న ఆ నమ్మకంతోనే ‘భారతీయుడు-2’ సినిమానీ నిర్మిస్తున్నాను. శంకర్‌ అనే కాదు... మంచి కథ, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించే సత్తా ఉన్నవాళ్లు ఎవరు ముందుకొచ్చినా వెయ్యికోట్ల బడ్జెట్‌ పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను!’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.