close

పార్కులు కాదు శ్మశానాలు!

పార్కులు కాదు శ్మశానాలు!

పచ్చని చెట్లూ పూల మొక్కలూ... దేవతా మూర్తుల రూపాలూ అందమైన నిర్మాణాలూ... కొత్తవాళ్లు ఆ చోటుని చూస్తే అదేదో పార్కు అనుకోవడం ఖాయం.. కానీ అదో శ్మశానం. అలాంటివి ఒకటీ రెండూ కాదు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో ఊరూరా ఉన్నాయి. ఆహ్లాదంతో పాటు సౌకర్యాలూ ఉండడం వీటి ప్రత్యేకత. ఈ అభివృద్ధి ఎలా జరిగిందంటే...
రణించాక దేహం మట్టిలోనే కలుస్తుంది. కానీ మనం ఎంతో ప్రేమించే మనవారి పార్థివదేహాన్ని మురుగూ చెత్తా చెదారం మధ్య ఉంచి అంతిమ సంస్కారాలు చేయాల్సిరావడం మాత్రం మనసుని బాధపెట్టే విషయమే. అందుకే, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న శ్మశానాలను బాగుచేసుకోవడం కనీస అవసరం అని భావించారు సత్తెనపల్లి ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు. అలా మూడు సంవత్సరాల కిందట ఆయన సహకారంతో ప్రారంభమైందే ‘స్వర్గపురి’ కార్యక్రమం. దీన్లోభాగంగా గ్రామీణస్థాయి నేతలూ ఆయా గ్రామాల ప్రజల చేయూతతో హిందువుల శ్మశానాలతో పాటు, క్రైస్తవుల సమాధుల తోటల్నీ ముస్లింల ఖబరస్థాన్‌లనూ అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. రోడ్లు దెబ్బతింటే వాటిమీద కొత్త రోడ్లు వేస్తారు. ఇళ్లూ భవంతులూ కట్టేటపుడు కాస్త ఎత్తులో ఉండేలా కడతారు. అలా చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎత్తైపోతుంటాయి. శ్మశానం పల్లంలో ఉండిపోతుంది. దాంతో ఎక్కడెక్కడ నుంచో వర్షపు నీరూ మురుగునీరూ అక్కడికి చేరుతుంటుంది. అందుకే సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లోని శ్మశానాల్లో ముందుగా ఆరడుగుల మేర మెరక తోలి చదును చేశారు. లోపలికి వెళ్లేందుకు రోడ్లూ చూడచక్కని ముఖద్వారాలూ నిర్మించారు. బోర్ల తవ్వకాలూ ప్రహరీగోడల నిర్మాణాలూ జరిగాయి. నరసరావు పేటలోని క్రైస్తవ సమాధుల తోట విస్తీర్ణం ఏడున్నర ఎకరాలు. దాని చుట్టూ ఇపుడు ప్రహరీగోడ వచ్చింది.

పార్కులు కాదు శ్మశానాలు!

పార్కులు కాదు శ్మశానాలు!

రోడ్లమీదే దహనం
ఏ-రహదారి, బీ-బోరింగ్‌, సీ- ప్రహరీ నిర్మాణం, డీ- కర్మకాండల నిర్వహణ గది, ఈ- మెరకతోలడం, ఎఫ్‌- దహనసంస్కారాల షెడ్‌, జీ- పచ్చదనం... ఇలా ఆంగ్ల అక్షరమాలలోని ఒక్కో అక్షరాన్నీ శ్మశానంలో చెయ్యవలసిన ఒక్కో పనికి గుర్తుగా పెట్టుకుని అవన్నీ పూర్తయ్యేలా చూసింది స్వర్గపురి కమిటీ. వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిధుల్ని సమకూర్చే బాధ్యతను కోడెల తీసుకున్నారు. ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే, ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడులోని హిందూ శ్మశానవాటిక మురికికూపంలా తయారయ్యేది. ఒకదశలో అయితే ఆ పరిస్థితికి నిరసన తెలియజేస్తూ స్థానికులు నడిరోడ్డుపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. అలాంటిది ఇప్పుడు పార్కులా తీర్చిదిద్దిన ఆ శ్మశానంలోకి ఆహ్లాదం కోసం వెళ్తున్నారు అక్కడి ప్రజలు.

పార్కులు కాదు శ్మశానాలు!

పార్కులు కాదు శ్మశానాలు!

పట్టణాల్లో మరిన్ని సౌకర్యాలు
పల్లెలతో పోల్చితే పట్టణాల్లోని శ్మశానాల్లో సౌకర్యాల అవసరం ఎక్కువే. అందుకే, సత్తెనపల్లి, నరసరావుపేట పట్టణాల్లోని మరుభూముల్లో అంతిమ సంస్కారాలు చేసిన తరవాత వెంటనే ఇళ్లకు వెళ్లలేనివారు కాసేపు అక్కడే ఉండేందుకూ ప్రత్యేకగదుల్ని నిర్మించారు. మహాప్రస్థానం వాహనాలూ అందుబాటులోకొచ్చాయి. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు వచ్చేవరకూ పార్థివ దేహాలను భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లూ చేశారు. ఇక, చూడగానే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేందుకు హిందూ శ్మశానవాటికల ముందు పరమశివుడి విగ్రహాలనూ క్రైస్తవ సమాధుల దగ్గర చిన్న చర్చినీ ఏర్పాటు చెయ్యడం స్వర్గపురి కార్యక్రమంలోని మరో ప్రత్యేకత. ఇలా... మూడేళ్లలో దాదాపు నాలుగువందల శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. ఈ విజయంలో స్థానిక ప్రజలతో పాటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యమూ ఉంది. ఎ.యం.జి. సంస్థ 250 బోరుబావులు తవ్వడంలో సహకరించగా ఎందరో దాతలు విరాళాలు అందించారు. కొందరు అధికారులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. గొప్ప విషయం ఏంటంటే సత్తెనపల్లి, నరసరావుపేట ప్రజలు మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబర్‌ రెండుని ఏటా శ్మశానాలను శుభ్రపరిచే రోజుగా జరుపుకుంటున్నారు. అక్కడివారికి తమ వంశ పెద్దల్ని స్మరించుకునే దినోత్సవం కూడా ఆరోజే.

మార్పు అంటే ఇలా ఉండాలి కదూ..!

సహకారం: షేక్‌ మహమ్మద్‌ ఖాసిం, న్యూస్‌టుడే, సత్తెనపల్లి

పార్కులు కాదు శ్మశానాలు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.