close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరిలేరు మీకెవ్వరూ..!

వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే, ప్రతి చిన్నపనికీ మరొకరి సాయం అడగాల్సిరావడం మనసుని మెలిపెడుతుంది. ఆ రెంటితో నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఆరాటంతో బయటకు వస్తే- బడీ గుడీ బ్యాంకూ పార్కూ... ఎక్కడా వారికి అనువైన దారి ఉండదు. ఇంటా బయటా ఇన్ని కష్టాల్ని ఎదుర్కొంటూనే విధికి ఎదురీది, విజేతలుగా నిలిచి, తమలాంటివారికి స్ఫూర్తినిస్తున్న కొందరి పరిచయం... ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబరు 3) సందర్భంగా...

ఆమె మాటే స్ఫూర్తిమంత్రం!

ఎక్కడో ఆయుధాగారంలో జరిగిన ఓ పేలుడు ఫలితం పదమూడేళ్ల చిట్టితల్లి చేతుల్ని విరిచేసింది. మాళవిక ఓరోజు ఆడుకుంటుండగా చిరిగిన తన జీన్స్‌పాంట్‌ని జిగురుతో అతికించాలనుకుంది. దాని మీద బరువు పెడితే బాగా అతుక్కుంటుందని పెరట్లో దొరికిన రాయి తీసుకుని గదిలోకి వెళ్లింది. అంతే, మరుక్షణం ఢామ్మని పెద్ద శబ్దం. పిల్ల రెండు చేతులూ మోచేతుల కిందినుంచీ తెగిపడ్డాయి. కాళ్లు ఛిద్రమై రక్తం మడుగయ్యింది. ఆ పాప రాయి అనుకుని తీసుకున్నది ఆయుధాగారం నుంచి ఎగిరిపడిన గ్రెనేడ్‌. అలా కొనప్రాణాలతో ఆస్పత్రి చేరిన ఆ చిన్నారికి పుస్తకాలు పట్టుకోడానికి చేతులే లేవనీ ఎముకలు విరిగి నరాలు తెగిన కాళ్లతో అసలు నడిచే ప్రసక్తేలేదనీ అర్థం కావటానికి చాలా సమయం పట్టింది. అర్థమయ్యాక -ఏడ్చింది చాలు, ఇక గతం గురించి ఆలోచించకూడదు అనుకుంది. ఏడాదిన్నర పాటు ఆస్పత్రిలో ఉండి ఇంటికొచ్చిన ఆమె ఎలాగైనా నడిచితీరాలన్న లక్ష్యంతో పట్టుదలగా పోరాటం మొదలెట్టింది. భరించలేని నొప్పితోనే నడక సాధన చేసి తన కాళ్లమీద తాను నిలబడింది. పదో తరగతి పరీక్షలకు నాలుగు నెలలే గడువున్నా సొంతంగా చదువుకుని ప్రైవేటుగా పరీక్ష రాసి స్టేట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంది. అప్పుడు ఆమె గురించి పేపర్లలో వచ్చిన వార్తల్ని నాటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చూసి ఆమెను తన అతిథిగా ఆహ్వానించి దీవించారు. ఆ సంఘటన పదిహేనేళ్ల మాళవిక జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ‘నేనేం పాపం చేశానూ అని కుమిలిపోతూ కూర్చుంటే ఒరిగేదేమీ లేదు.జరిగినదాన్ని మార్చలేను కానీ జరగబోయేది నాచేతిలోనే ఉంది’ అనుకున్న మాళవిక సోషల్‌ వర్క్‌లో పీహెచ్‌డీ చేసింది. అవకాశాలు అందిపుచ్చుకోడానికి వైకల్యం అడ్డుకాకూడదనుకున్న ఆమె తనలాంటి వారికి స్ఫూర్తినివ్వడానికి మొండిచేతులు కన్పించేలా మోడలింగ్‌ చేసింది. స్ఫూర్తినిచ్చే ప్రసంగాలతో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆర్థికవేదికల దాకా వెళ్లి ఎందరి మనసుల్నో గెలుచుకుంది. ‘నా మాటలు తమను మార్చాయంటూ నాకు రోజుకు కొన్ని వందల మెయిల్స్‌ వస్తాయి. ఆ మార్పే నేను కోరుకుంటున్నది’ అంటుంది మాళవిక.

 

ఒంటికాలితో ఎవరెస్టుని గెలిచింది!

తనకిష్టమైన పోలీసు ఉద్యోగానికి ఇంటర్వ్యూ అని సంబరంగా బయల్దేరిన అరుణిమ జీవితం దొంగల కారణంగా ఊహించని మలుపు తిరిగింది. గొలుసు లాక్కోవటానికి ప్రయత్నించిన దుండగుల్ని ప్రతిఘటించినందుకు ఆమెను నడుస్తున్న రైల్లోంచి తోసేశారు. పక్కనున్న రైలు పట్టాలపై పడిన ఆమె కాళ్ల మీదనుంచీ మరో రైలు వెళ్లడంతో రెండు కాళ్లూ విరిగాయి. చీకట్లో ఏడుగంటల పాటు స్పృహలేకుండా పడివున్న ఆమె శరీరాన్ని ఎలుకలు కొరుకుతున్న దశలో గ్రామస్థులు చూసి ఆస్పత్రిలో చేర్చారు. కనీస సదుపాయాలు లేని ఆ ఆస్పత్రిలో డాక్టరూ సిబ్బందీ రక్తదానం చేసి, ప్రాణాలను కాపాడటానికి కనీసం అనస్తీషియా లేకుండానే ఒక కాలిని తీసేశారు. ఆ తర్వాత ఆమె వాలీబాల్‌ క్రీడాకారిణి అరుణిమ అని తెలిసి ప్రభుత్వం ప్రత్యేక విమానంలో దిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించింది. వరస శస్త్రచికిత్సలతో వైద్యులు ఆ అమ్మాయి శరీరానికి అయిన గాయాల్ని మాన్పేందుకు ప్రయత్నిస్తుంటే మరోపక్క మనసును చిక్కబట్టుకుని భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంది అరుణిమ. అంత భయంకరమైన ప్రమాదం తర్వాత కూడా బతికి ఉందంటే తాను చేయాల్సిన పెద్ద పనేదో ఉందనుకున్న ఆమె ఏకంగా పర్వతారోహణనే లక్ష్యంగా ఎంచుకుంది. ఒకటేమో పెట్టుడు కాలు. ఇంకోదానికేమో లోపలన్నీ అతుకులు. ఆ కాళ్లతోనే ఎవరెస్టు ఎక్కాలనుకుంది. నిర్ణయం తీసుకున్నంత తేలిక కాదు... ఆచరణ. పంటి బిగువున నొప్పిని భరిస్తూ రక్తమోడుతున్న కాళ్లతోనే రోజూ సాధన చేసేది. ఆర్నెల్లలోనే ఆమె మామూలు పర్వతారోహకులతో సమానంగా ఎక్కగలగడంతో స్పాన్సర్లు ముందుకొచ్చారు. అలా, ప్రమాదం జరిగిన రెండేళ్లలోనే అనుకున్నది సాధించి కృత్రిమ కాలుతో ఎవరెస్టు ఎక్కిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది అరుణిమా సిన్హా. అంతటితో ఊరుకోలేదు, అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలనూ అధిరోహించింది. తన సాహసానికి మెచ్చి వచ్చిన ఎన్నో అవార్డుల సొమ్మునూ సంఘసేవాకార్యక్రమాలకు ఇచ్చేసిన 26 ఏళ్ల అరుణిమ ఇప్పుడు నిరుపేద బాలబాలికల కోసం ఓ స్పోర్ట్స్‌ అకాడమీని పెట్టే ప్రయత్నాల్లో ఉంది. సత్తా శరీరంలో కాదు, మనసులో ఉండాలనే అరుణిమ ‘బార్న్‌ ఎగైన్‌ ఆన్‌ ద మౌంటెయిన్‌’ పేరుతో తన జీవితకథని రాసింది.

 

కనుచూపు లేని కలెక్టరు

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కి చెందిన ప్రాంజల్‌కి పుట్టుకతోనే కనుచూపు బలహీనంగా ఉంది. ఆరేళ్లొచ్చేసరికి అదీ పూర్తిగా పోయింది. తమ కలలపంట అయిన ప్రాంజల్‌కి చూపు తెప్పించడానికి ఆ అమ్మానాన్నలు చేతనైనంతా చేశారు. రెటీనాకి ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. ఒక్కో సర్జరీ తర్వాత కొన్ని నెలలపాటు  నొప్పితో విలవిల్లాడేది, అలాగని ఫలితమూ ఉండేది కాదు. ఆ బాధలోనుంచి బయటపడడానికి చదువులో లీనమయ్యేది ప్రాంజల్‌. తల్లి సహకారంతో మంచి మార్కులతో పాసవుతూ డాక్టరేట్‌ పట్టా పొందింది. ముంబయి లాంటి మహానగరంలో కాలేజీకి ఒంటరిగా వెళ్లొచ్చేది ప్రాంజల్‌. రోడ్డు దాటడానికీ రైలు ఎక్కడానికీ ఎవరినైనా సాయమడిగితే- ఇంటికి దగ్గరగా ఉండే కాలేజీలో చేరొచ్చుగా, ఎవరూ తోడు లేకుండా ఎందుకీ చదువు అంటూ విసుక్కునేవారట. ‘కొందరు మాత్రం అడక్కుండానే సాయం చేసేవారు. అలాంటి వారి వల్లే సెయింట్‌ జేవియర్స్‌లో, జేఎన్‌యూలో చదివి ఐఏఎస్‌కి వెళ్లాలన్న నా కోరిక తీరింది’ అంటుంది ప్రాంజల్‌. అంతర్జాతీయ సంబంధాల్లో పీజీ, పీహెచ్‌డీ కూడా చేసి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసింది ప్రాంజల్‌. తొలి ప్రయత్నంలోనే రైల్వే సర్వీసులకు ఎంపికైనా ఆమె వైకల్యం కారణంగా వారు ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో కసిగా మళ్లీ రాసి ఐఏఎస్‌ సాధించి ఆ ఘనత సాధించిన తొలి అంధురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం తిరువనంతపురం సబ్‌కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తోంది. పుస్తకాలను చదివి వినిపించే సాఫ్ట్‌వేర్‌ సాయం తప్ప మరెలాంటి కోచింగూ లేకుండానే సివిల్స్‌కి సిద్ధమై జాతీయ స్థాయిలో 124వ ర్యాంకు సాధించిన ప్రాంజల్‌ని పట్టుదలే విజేతగా నిలిపింది. దివ్యాంగుల కోసం ఏమైనా చేయగల అవకాశం కోసమే ఐఏఎస్‌ ఎంచుకున్నానంటుంది ప్రాంజల్‌.

 

కళ్లులేవని... ఐఐటీ వద్దంది!

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లె అది. కొడుకు పుట్టాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు క్షణకాలం కూడా లేకపోయింది. ‘పుట్టుగుడ్డి పిల్లవాడిని చూస్తూ జీవితకాలం ఏడ్చే బదులు పురిట్లోనే గొంతుపిసికి పడేస్తే ఒక్కసారే ఏడ్చి ఊరుకోవచ్చు’ అని సలహా ఇచ్చారట ఇరుగూపొరుగూ. కన్నపేగును అలా తుంచుకోడానికి ఆ అమ్మానాన్నలకు మనసు రాలేదు. చేసేది కూలిపనే అయినా బిడ్డను కళ్లల్లో పెట్టుకుని పెంచారు. కానీ ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే చాలు అవమానాలు. బడిలో వెనక బెంచీలోకి తోసేసేవారు. దాంతో తండ్రి అతడిని హైదరాబాద్‌లోని వికలాంగుల పాఠశాలలో చేర్పించాడు. అక్కడ చదువుతోపాటు చెస్‌, క్రికెట్‌ లాంటి క్రీడల్లోనూ రాణించాడు శ్రీకాంత్‌. అయితే పదో తరగతి తర్వాత సైన్సు చదవాలన్న కోరికకి వైకల్యం అడ్డుపడింది. ఎంపీసీ తీసుకుని ఇంటర్‌లో 98శాతం మార్కులతో పాసయ్యాడు. ఐఐటీలో చేరడానికి దరఖాస్తు చేస్తే అక్కడా వైకల్యమే అడ్డొచ్చింది. దాంతో అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కి దరఖాస్తు చేశాడు. సీటుతో పాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చి గౌరవించింది ఎంఐటీ. చదువయ్యాక మంచి ఉద్యోగావకాశాలు వచ్చినా స్వదేశంలో తనలాంటివారి పరిస్థితి గురించి ఎన్నో ప్రశ్నలు వేధిస్తుండడంతో హైదరాబాద్‌ వచ్చేసిన శ్రీకాంత్‌ మొదట దివ్యాంగుల కోసం వృత్తివిద్యా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. కొన్ని వందల మందికి ఉపాధి మార్గం చూపాడు. ఆ తర్వాత వ్యాపార రంగంవైపు దృష్టి మళ్లించాడు. వ్యాపారం పట్ల స్పష్టతా దూరదృష్టీ ఉన్న ఆ యువకుడు త్వరగానే పెట్టుబడిదారుల దృష్టిలో పడ్డాడు. ఇరవైఏడేళ్ల శ్రీకాంత్‌ ఇప్పుడు హైదరాబాద్‌లోని బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌కి సీఈవో. తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో నాలుగు శాఖలున్న ఈ సంస్థ దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ రూ.150 కోట్ల టర్నోవరు సాధించింది. రెండేళ్ల క్రితమే ఫోర్బ్స్‌ యువ వ్యాపారవేత్తల జాబితాలో చోటు సంపాదించిన శ్రీకాంత్‌ తన కంపెనీని ఐపీవోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. వైకల్యమో పేదరికమో కాదు, మమ్మల్ని బాధించేదీ ఎదగడానికి అడ్డుగా నిలిచేదీ వివక్ష... అంటాడు శ్రీకాంత్‌.

 

చైతన్యం ఆమె ఇంటిపేరు!

భర్త సైనికుడిగా కార్గిల్‌లో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె వెన్నెముకలో ట్యూమర్లతో యుద్ధం చేస్తోంది. ఆయన యుద్ధం గెలిచివచ్చాడు. ఆమె వెన్నెముకకి మూడు శస్త్రచికిత్సలు చేయించుకుని భుజాల మధ్య 183 కుట్లు వేయించుకుని చక్రాలకుర్చీలో ఇంటికి చేరింది. శరీరంలో రెండొంతులు ఆమె ఆధీనంలో ఉండదు. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు. ఓరోజు ఆడుకుంటూ రోడ్డు మీదికి వెళ్లిన ఐదేళ్ల పెద్ద పాపని మోటర్‌ సైకిల్‌ ఢీకొంది. మెదడుకి దెబ్బ తగలడంతో పాప శరీరంలో ఒక పక్క అంతా పక్షవాతం వచ్చింది. తల్లీకూతుళ్లిద్దరూ అలా అయ్యేసరికి ఆ ఇంటికి ఏదో శాపం తగిలిందన్నారు బంధువులు. ఉత్సాహానికి చిరునామాగా ఉండే దీప పని అయిపోయిందనే అనుకున్నారు స్నేహితులు. ఆమె మాత్రం అలా అనుకోలేదు. వాస్తవాన్ని తాను అంగీకరించి కుటుంబమంతా అంగీకరించేలా చేసింది. చక్రాలకుర్చీలో తిరుగుతూనే పనులన్నీ చేసుకునేలా ఇంటిని తనకనువుగా తీర్చిదిద్దుకుంది. ప్రతిపనిలోనూ పిల్లల్ని కలుపుకుంటూ తాను అనుక్షణం వారికి అండగా ఉంటూ పెంచింది. మరో పక్క సొంత రెస్టరెంట్‌ నిర్వహణ బాధ్యతలూ చూసుకునేది. చక్రాల కుర్చీతోనే ఆటలపోటీల్లో, బైక్‌ ర్యాలీల్లో పాల్గొనేది. ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి, రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు అందుకున్న తొలి పారా అథ్లెట్‌గా, స్ఫూర్తిదాయక ప్రసంగకర్తగా, సంఘసేవకురాలిగా దీప చరిత్ర సృష్టిస్తే, తల్లిని చూసి స్ఫూర్తి పొందిన కూతురు దేవిక కూడా క్రీడల్లో రాణిస్తోంది. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా, సామాజిక వ్యాపారవేత్తగా పలు అవార్డుల్నీ అందుకుంది. ‘ఆర్థికస్తోమత ఉండబట్టి అందుబాటులో ఉన్న సదుపాయాల్ని ఉపయోగించుకుని మేమీ స్థాయికి వచ్చాం. కానీ చాలామంది దివ్యాంగులకు జీవితంలో ప్రతి అడుగూ సవాలే. వారి సమస్యల్ని అందరి దృష్టికీ తేవాలనే మా ప్రయత్నం’ అంటుంది దీప.

 

ఒంటికాలితో వరల్డ్‌ నంబర్‌ 2

బ్యాడ్మింటన్‌లో సింధూ సైనాల పక్కన చేరిన కొత్త పేరు- మానసీజోషి. పెట్టుడు కాలితో ఆడి తన కేటగిరిలో ప్రపంచంలోనే రెండో ర్యాంక్‌ సాధించింది. గత ఏడాదే గోపీచంద్‌ అకాడమీలో చేరిన మానసి అంత త్వరగా ఈ స్థాయికి చేరుకోడానికి కారణం... కృషి, పట్టుదల. చిన్నప్పుడే బ్యాడ్మింటన్‌ నేర్చుకున్న మానసి తండ్రితో సరదాగా ఆడేది. ముంబయిలో ఇంజినీరింగ్‌ చదివి, ఉద్యోగంలో చేరింది. 2011 డిసెంబరులో ఓరోజు స్కూటర్‌మీద ఆఫీసుకు వెళ్తున్న ఆమెను వెనకనుంచీ ట్రక్కు ఢీకొంది. కింద పడిపోయిన మానసి కాలిమీదినుంచి ట్రక్కు టైరు వెళ్లడంతో ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. చాలా రక్తంపోయి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కాలు తీసేయాల్సివచ్చింది. దాదాపు రెండు నెలలు ఆస్పత్రిలో చికిత్స పొంది ఆ తర్వాత క్రచెస్‌ మీద నడవడం నేర్చుకునే వరకూ... భౌతికంగా మానసికంగా ఆమె పడ్డ బాధ వర్ణనాతీతం. ఆ బాధనుంచి తేరుకుని కృత్రిమ కాలు పెట్టుకున్నాక ఆఫీసుస్థాయిలో జరిగిన ఓ ఆటల పోటీలో బ్యాడ్మింటన్‌ ఆడి గెలిచింది మానసి. ఆ గెలుపు ఆమె ఆలోచనల్ని మార్చింది. ఒంటికాలితోనూ బ్యాడ్మింటన్‌ ఆడగలనన్న నమ్మకం రావడంతో ప్రాక్టీసు చేస్తూ టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలుపెట్టింది. ఏరోజుకారోజు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, అది సాధించేవరకూ ప్రాక్టీసు చేయడం... అలా పట్టుదలగా ప్రావీణ్యం పెంచుకుని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లకు చేరుకుంది. తన నైపుణ్యానికి మరింతగా మెరుగులు దిద్దుకోడానికి హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో చేరిన మానసి ఇటీవలే స్విట్జర్లాండ్‌లో జరిగిన పారాబ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో స్వర్ణపతకం గెలిచింది. ‘చాలామంది అమ్మాయిల్లాగే నేనూ మంచి ఉద్యోగమూ పెద్ద ఇల్లూ ఖరీదైన కారూ గురించి కలలు కనేదాన్ని. ఇప్పుడు మేమెదుర్కొంటున్న సవాళ్లముందు అవి ఎంత అప్రధానమైన అంశాలో తెలిసింది’ అంటుంది మానసి.

 

అందరి హక్కులకోసం... అతని పోరాటం!

ఆడుతూ పాడుతూ సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా కుదుపు. తొమ్మిదేళ్ల సతేంద్ర సింగ్‌ పోలియో సోకడంతో కుప్పకూలిపోయాడు. ఇక ఆటలు కాదు కదా తిన్నగా నిలబడడం కూడా తనకు సాధ్యం కాదని తెలుసుకున్నప్పుడు చాలా ఏడ్చాడు. చిన్నప్పటినుంచీ డాక్టరవ్వాలని కలలు కనేవాడు సతేంద్ర. తల్లి ఆ కలలకు ఊతమిస్తూ ‘నీకోసమే కాదు అందరికోసం నువ్వు పనిచేయాలి’ అని చెప్పడంతో చదువే లోకంగా కష్టపడ్డాడు. తండ్రి బడి గేటు ముందు దించివెళ్తే కాళ్లీడ్చుకుంటూ మెట్లెక్కి తరగతిలోకి వెళ్లేసరికి ఏడుపొచ్చేది. కాస్త పెద్దయ్యాక చక్రాల కుర్చీ కొనుక్కున్నా అన్నిచోట్లకీ వెళ్లడం వీలయ్యేది కాదు. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరి సాయం అవసరమయ్యేది. కొందరు కనీస సహానుభూతి కూడా లేకుండా తిరస్కారంగా చూడడం అతడిని బాధించేది. అలాగని అందరూ చెడ్డవాళ్లే కాదు, ఎంతో మంది మంచివారు ప్రోత్సహించేవారనీ, వారివల్లే తన డాక్టర్‌ కల సాకారమైందనీ అంటాడు సతేంద్ర. సమాజంలో దివ్యాంగుల సమస్యల పట్ల ఉన్న వివక్షని గమనిస్తూ పెరిగిన సతేంద్ర చదువవుతూనే పోరుబాట పట్టాడు. దివ్యాంగులైన డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ వైద్యసేవల్లో ప్రవేశం ఉండేది కాదు. సతేంద్ర నాలుగేళ్ల పాటు పోరాడి విజయం సాధించటంతో ఒక్కసారిగా 1,674 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వైద్యవిద్యాసంస్థలూ వసతిగృహాల్లో దివ్యాంగుల ప్రవేశానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆదేశాలు జారీచేయడానికి కారణమూ అతడి పోరాటమే. ‘ఇల్లు దాటి రోడ్డుమీదికి వస్తే ఏటీఎం, బ్యాంకు, స్కూలు, కాలేజీ, ఆఖరికి పోలింగ్‌ బూత్‌తో సహా ఎక్కడా దివ్యాంగులు వెళ్లగలిగే సౌకర్యం ఉండదు. భవనాలు కట్టేటప్పుడే అందరికీ సౌకర్యంగా ఉండే యూనివర్సల్‌ డిజైన్‌ని ఎందుకు ఎంచుకోరూ’ అని ప్రశ్నించే డాక్టర్‌ సతేంద్ర సింగ్‌ దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా ప్రతిష్ఠాత్మక హెన్రీ విస్కార్డి గ్లోబల్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు.

 

చక్రాల కుర్చీలో టెన్నిస్‌

ఆడుకునే వయసులో అతడేనాడూ ఆటలమీద ఆసక్తి చూపలేదు. చదువుకుని ఉద్యోగంలో చేరి తల్లిని బాగా చూసుకోవాలనుకునేవాడు. అలాంటి మధుసూదన్‌కి ఇప్పుడు ఆటే లోకమయింది. ఎనిమిదో తరగతిలో ఉండగా ఓరోజు రద్దీగా ఉన్న లోకల్‌ రైల్లో ఎక్కిన అతడిని తలుపు దగ్గర ఉండగానే ఎవరో తోశారు. దాంతో కిందపడిన మధు కాళ్లమీదినుంచీ రైలు వెళ్లడంతో రెండు కాళ్లూ పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న కుటుంబ ఆర్థికస్థితీ కాళ్లు లేని తన పరిస్థితీ ఆ టీనేజీ కుర్రాణ్ని డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. నాలుగేళ్లపాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. తల్లి ధైర్యం చెప్పి చదువుకోమని ప్రోత్సహించడంతో ప్రైవేటుగా పదోతరగతి పాసయ్యాడు. తర్వాత గ్రాఫిక్‌ డిజైనింగ్‌ నేర్చుకోడానికి దివ్యాంగులకు ఉపాధి శిక్షణ ఇచ్చే సంస్థలో చేరడం అతడి దృక్పథాన్ని మార్చేసింది. చక్రాలకుర్చీలో ఉండి ఆటలాడుతున్నవారిని చూశాక టెన్నిస్‌ మీద ఇష్టం పెంచుకున్నాడు మధుసూదన్‌. కానీ ప్రాక్టీసు చేయడానికి గ్రౌండ్‌కి వెళ్లిరావాలంటే చాలా ఖర్చయ్యేది. అందుకని ఎవరైనా దయతలచి లిఫ్ట్‌ ఇస్తే వెళ్లేవాడు. అతని ఆసక్తి చూసి వీల్‌చెయిర్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ వారు ఉచితరవాణా ఏర్పాటుచేశారు. అంతదూరం వెళ్లాక కోర్టులోకి వెళ్లడానికి ఆరు మెట్లు అతనికి పరీక్ష పెట్టేవి. సాయం కోసం గంటల తరబడి వేచివుండేవాడు. చూసీ చూడనట్లు వెళ్లిపోయేవాళ్లను ఆత్మాభిమానం చంపుకుని అడిగేవాడు. ‘నడవలేని నీ మొహానికి ఆట కావాలా అన్నట్లు వాళ్లు చూసే చూపులకు చచ్చిపోవాలనిపించేది’ అనే మధుసూదన్‌ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆట సాధన చేస్తూనే బీకాం ఫస్టు క్లాసులో పాసై ఉద్యోగంలో చేరాడు. తల్లిని ఉద్యోగం మాన్పించాడు. ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటిన మధు 2020 పారాలింపిక్స్‌లో పతకమూ వింబుల్డన్‌లో ప్రవేశమూ సాధించడానికి కృషిచేస్తున్నాడు.

 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు