close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండు ఉత్తరాలు

- వలివేటి నాగచంద్రావతి

ఉత్తరం... తాతయ్య దగ్గర్నుంచి.
సెల్‌ఫోన్‌లూ ఈమెయిల్సూ ఛాటింగులూ... మాట్లాడటానికి ఎన్ని ఫెసిలిటీస్‌ వచ్చినా తాతయ్య ఉత్తరమే రాస్తారు.
‘ఈ యంత్రాల ముందు సంభాషణకంటే సంగతులు కూర్చుకుంటూ అక్షరాలు పేర్చుకుంటూ ఉత్తరం రాయటముందే... ఆ అనుభూతే వేరురా తల్లీ’ అంటారు తాతయ్య.
కరక్టే. ఆ వచ్చిన ఉత్తరాన్ని ఆత్రంగా అందుకోవటం, లైను తరవాత లైను ఉత్సాహంగా చదువుకోవటంలో కలిగే ఆ ఆనందం గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంటుంది నాక్కూడా.
ఇంతకీ తాతయ్య ఉత్తరంలో సారాంశం ఏమిటంటే, ‘విదేశాలకి వెళ్ళబోతున్నావ్‌, మళ్ళీ ఎప్పుడొస్తావో. ఓసారొచ్చి ఈ ముసలివాళ్ళ దగ్గర నాల్రోజులుండి వెళ్ళరాదా’ అని.
ఆయన పిలిచారని కాదు- యూఎస్‌ వెళ్ళటానికి ముందు నేను పెట్టుకున్న కార్యక్రమాల్లో తాతా బామ్మగార్ల ఆశీస్సులు తీసుకోవటం ముఖ్యమైనది.
తాతగారంటే నాకు చాలా ఇష్టం. వాత్సల్యం కురిపించే ఆయన మందహాసమన్నా, అనుభవాలతో పండినట్టుండే ఆయన కబుర్లన్నా, ప్రశాంతంగా ఉండే ఆయన కళ్ళన్నా నాకెంతో ఇష్టం. అంత ఇష్టమైన తాతయ్యతో గడపటమంటే సంతోషమే కదా!

* * * * *

నన్ను చూడగానే తాతయ్యా బామ్మల మొహాలు పుచ్చపువ్వుల్లా విచ్చుకున్నాయ్‌. కుశల ప్రశ్నలు అయినాయి.
‘‘ఎప్పుడు తిన్నావో’’ బామ్మ హడావుడి పడింది.
‘‘బామ్మా, నేనున్నన్నాళ్ళూ నాకిష్టమైనవన్నీ చేసిపెట్టాలి నువ్వు. ఈరోజు వంకాయ పచ్చిపులుసు, మినప వడియాలు’’ అన్నాను.
ఆవిడ కష్టపడకుండా తేలికైన మెనూ ఇచ్చిన తృప్తి నాది. నాకిష్టమైనవి చేసిపెట్టానన్న తృప్తి ఆవిడది.
నేను ఫ్రెషప్‌ అయ్యాను. బామ్మ వంటింటి పనిలో పడింది. తాతయ్య ఫోన్‌ చేసినట్టుంది- నలుగురు, ఆయన ఫ్రెండ్స్‌ అనుకుంటా- వచ్చారు. ‘‘నా మనవరాలు స్టేట్స్‌ వెళుతోంది’’ అని పరిచయం చేశారు. ఆయనకదో తృప్తి. పెద్దవాళ్ళతో కాలక్షేపం... ఇంటర్వ్యూలా ఉంటుంది. వాళ్ళు వెళ్ళగానే ‘అమ్మయ్య’ అనిపించింది.
మధ్యాహ్నం భోజనానికి మాతోపాటు బామ్మని కూడా బలవంతాన కూర్చోపెట్టాను. ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకుంటామంటే వినదే. మా కంచాల వంకే చూస్తూ కొసరి కొసరి తనే వేస్తూ సరిగ్గా తిననేలేదు బామ్మ.

* * * * *

మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్ర కొరిగారు తాతయ్యా బామ్మాను. పగటి నిద్ర అలవాటు లేదు నాకు. తోచక ఇల్లంతా కలియతిరిగాను.
స్టడీస్‌ మూలంగా నేనిక్కడికి వచ్చి చాలా కాలమైంది. ఈ ఇల్లు తాతగారి పిత్రార్జితం. గట్టిగానే ఉంది కానీ చాలా పాతది. చువ్వల కిటికీలూ గోడలకి ఎప్పటివో రవివర్మ పెయింటింగులూ... ఇల్లు చిన్నదే, సామాన్లు కూడా తక్కువే. అవి కూడా సరిగా సర్దుకోలేదు. పాపం పెద్ద వయసు కదా. చావడిలో అటు కుర్చీలు ఇటూ, ఇటు బల్లలు అటూ జరిపి నాకు తోచినట్టుగా సవరించాను. కబోర్డులో... కాదు కాదు అలమరాల్లో బట్టలూ వగైరా మడతలు పెట్టాను. చకచకా చేస్తే అరగంట పట్టలేదు ఈ పన్లకి.
తాతగారి పుస్తకాల అలమర ముందునుంచి మాత్రం కాళ్ళు కదల్లేదు. ఎన్ని పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు... అరల నిండా పుస్తకాలే! ఇందాక కాదు, కడుపునిండా ఇప్పుడు భోంచేసినట్టుంది నాకు. తాతగారు ఈ ఊళ్లోనే కాలేజీలో పనిచేసేవారు. అప్పట్నుంచీ ఆయనకు ఈ పఠనాభిలాష ఉందని నాకు తెలుసుకానీ ఇన్ని బుక్స్‌ సేకరించి ఉంచుతారని మాత్రం ఊహించలేదు. ఒక్కొక్కటే తీసి దులుపుతూ అట్టపైన రచయితల పేర్లూ పేజీ తిప్పి ప్రస్తావనో ముందుమాటో పరిచయం చేసుకుంటూ వరుసలుగా పేరుస్తున్నాను.
పై అర కాస్త ఎత్తుగా ఉంది. స్టూలు లాక్కుని ఎక్కాను. ఆ అరలో ఎక్కువ పుస్తకాలు లేవుగానీ ఒక మూల పైవరుసన ఒక మేకు, దానికి తగిలించి ఓ సన్నని తీగనిండా గుచ్చి చివరలు నలిగి పాతగిల్లిన ఉత్తరాలు. అవి చూడగానే నాకెందుకో పురావస్తు శాఖకు అందని కళాఖండమేదో నా కళ్ళబడినంత ఆనందం కలిగింది.
తీయనా వద్దా అనే తటపటాయింపులోనే ఉన్నాన్నేను.
‘‘దింపు దాన్ని’’ ఎప్పుడు లేచి వచ్చారో తాత.
‘ఆహా ఓహా’ అనుకున్నాను. నా కోరిక అదే గదా. జాగ్రత్తగా దించాను దాన్ని.
‘‘ఎప్పట్నుంచో అనుకుంటాను... తెగ పేరుకుపోయాయీ, ఇంపార్టెంటువి కానివి చూసి తీసెయ్యాలీ అని. నాకు సాయం చేస్తావా నువ్వు? దా... వెలుతురు బావుంటుంది- వరండాలో కూర్చుందాం’’ అన్నారు తాతయ్య. ఆనందంగా అనుసరించాను.
చాప పరుచుకు కూర్చున్నాం. ఒక్కొక్కటే తీగ నుంచి తీసి తాతయ్యకి అందిస్తున్నాను. తాతగారు దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ... రాసింది బంధువులో స్నేహితులో వాళ్ళ గురించి ప్రత్యేకతలేమన్నా ఉంటే అవి చెబుతూ పక్కన పెట్టేస్తున్నారు.
అబ్బో... ఎప్పటెప్పటివా ఉత్తరాలు?
వాటిమీద తారీఖులు చూస్తుంటే మతిపోతోంది. నాలుగేళ్ళ కిందటినుంచీ మొదలుపెట్టి కిందికి వెళ్ళేకొద్దీ అయిదేళ్ళు... పది... పదిహేను... ఇరవై... ఆగాను. ఒక లావుపాటి కవరు. బలవంతాన గుచ్చటం మూలంగా కవరు మధ్యగా పెద్దదిగా ఉంది రంధ్రం. అడ్రసు ఇంగ్లిషులో రాసుంది.
ఫ్రమ్‌... వాసుదేవరావు, కేరళ.
దాన్ని చేతికివ్వగానే తాతయ్య మొహం వివర్ణమయింది. తెరిచి చూడకుండానే పక్కకు పెట్టేశారు దాన్ని. ఏమన్నట్టుగా చూశాను ఆయన వంక. ‘‘మిగతావి చూడు’’ అన్నారు ముభావంగా.
కుతూహలం పెరుగుతున్నా మరి తరచి అడగ లేదు. అయిదు నిమిషాల తరవాత తాతయ్య లేచి నించున్నారు ‘‘ఇక రేపు చూద్దాం’’ అంటూ.
నాకర్థమయింది... ఆయనెందుకో డిస్ట్రబ్‌ అయ్యారని. టీ టైములో కూడా మౌనంగానే ఉన్నారు. సాయంత్రమంతా మూడీగా గడిచిపోయింది. బామ్మతో గుడికి వెళ్ళి వచ్చానంతే. రాత్రి భోజనాల దగ్గర కూడా తాతయ్య మూడీగానే ఉన్నారు. అంత ఉదాశీనత ఎందుకో నాకర్థంకాలేదు.
రాత్రి పడుకోబోయే ముందర నా దగ్గరకొచ్చారు ఆయన. చేతిలో ఆ కవరు. ‘‘నీకు ఇందులో ఏముందా అని క్యూరియాసిటీగా ఉందని నాకు తెలుసు- చదువు’’ అన్నారు అది నాకందిస్తూ.
ఈ నిర్ణయానికి వచ్చేముందు ఆయనెంత మధనపడి ఉంటారో అనిపించింది నాకు- ఆయన్ని చూస్తే.
‘‘వాసుదేవరావు మా మేనమామ. పాతికేళ్ళక్రితం మా అమ్మ జానకమ్మకు రాసిన ఉత్తరమది’’ గదిలోంచి వెళ్ళిపోతూ చెప్పారు.

* * * * *

చెల్లీ, నేను ఇండియా వచ్చేసిన ఈ నెలరోజుల్లో నీకు రాసిన మూడో ఉత్తరమిది. మొదటి ఉత్తరం పోస్ట్‌ చేసిన క్షణంనుంచీ నీ రాకకోసం చకోరపక్షిలా ఎదురుచూశాను. కనీసం నీ జవాబైనా అందుకోలేకపోయినందుకు చాలా నిరాశపడ్డాను.
జానీ, జన్మించిన గడ్డమీద బూడిదవ్వాలనే వాంఛతో నెల క్రితమే ఇండియా వచ్చాను. ఒకరి ఆధారం లేనిదే జీవించలేని అతి నిస్సహాయ స్థితిలో ఈ ఆశ్రమానికి వచ్చి చేరాను. ఈ లోకాన్ని వదలాల్సిన ఘడియలు దగ్గరవుతోన్న ఈ చివరి రోజుల్లో నిన్నొకసారి కళ్ళారా చూసుకోవాలనీ నీ సమక్షంలో అమ్మనీ నాన్ననీ గుర్తుచేసుకోవాలనీ బాల్యస్మృతుల్ని కలబోసుకోవాలనీ నా ఆశ, ఆకాంక్ష.
నా ఈ చివరి కోరికని నీకు ప్రతి జాబులోనూ తెలుపుకుంటూనే ఉన్నాను.
నీ ఉదాశీనత కరగలేదు... ఎందుకమ్మా?
నిజమే. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూడకుండా కనీసం క్షేమ సమాచారాలైనా తెలుసుకోకుండా ఉండిపోయిన నా అలక్ష్యం క్షమించరానిదే. నీ కోపానికి నేను అర్హుణ్ణే.
కానీ ఒక్కటి మాత్రం నమ్ము. మీకు దూరంగా ఉన్నా మిమ్మల్ని మరిచిపోయిన రోజూ తలుచుకోని క్షణాలూ లేవు తల్లీ.
రక్తసంబంధంతో మీ చుట్టూ అల్లుకుపోయిన నా మనసూ మమతా ఈ రోజుకీ చెక్కుచెదరలేదు. నేను మొదటిసారి విదేశాలకు వెళుతున్న రోజు ఎయిర్‌పోర్ట్‌లో నాన్న మొహాన గూడుకట్టుకున్న దిగులూ నీ కళ్ళనుంచి ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్ళూ నాకిప్పటికీ జ్ఞాపకమే. ఆకాశంలో వెలిగే నిండు జాబిల్లిని చూడగానే- పెరట్లో మంచంమీద నాన్న మనిద్దర్నీ చెరోపక్కన పడుకోపెట్టుకుని ఆ వెన్నెల్లో చెప్పిన ప్రతి కథా నాకు గుర్తొస్తుంది.
ఆ తలపులు మదిలో మెదిలితే చాలు- గుండెల్లో గుబులు, వెంటనే అన్నీ మరిచిపోయి మీ సమక్షంలో వాలాలనే తహతహ... చాలా ఏళ్ళు నన్ను సతమతం చేస్తూనే ఉండేవి.
కానీ- నీకు తెలీందేం ఉంది... నా ప్రేమ, రోజ్‌లిన్‌తో నా వివాహం. తరాలమధ్య అంతరాలు. నాన్న మా పెళ్ళిని అంగీకరించలేకపోవటం, నన్ను క్షమించలేకపోవటం, ఆయనకూ నాకూ మధ్య మనస్తాపాలూ మన నడుమ పెరిగిన ఎడం... నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి.
నువ్వన్నావు- ‘నాన్న పాతకాలం మనిషి... ఆయన మారటానికి కొంచెం వ్యవధి పడుతుంది. నీ మీదున్న ప్రేమాభిమానాలు ఆయన కోపాన్ని సడలించి తీరతాయి. అందాకా కొంచెం ఓపికపట్టు’ అని.

ఔను, నిజమే. కొన్ని సమస్యలను సాల్వ్‌ చేసే శక్తి కాలానికే ఉంటుందని సమాధానపడ్డాను. నీకు తెలుసు... ఇండియా రావటం కూడా తగ్గించాను. కానీ ఆ పరిష్కారం సుఖాంతమే అవుతుందని నేననుకోవటమే నా అవివేకం.
అకస్మాత్తుగా నాన్న హార్ట్‌ఎటాక్‌తో పోయారు. నన్ను క్షమించకుండానే మరణించి నాన్న నాకు దారుణమైన శిక్ష వేశారు. పట్టరాని దుఃఖంతో ఇంటికి వచ్చిన నన్ను నిష్ఠూరమైన మాటలతో మరీ కుంగదీశారు - మన సారధి మామయ్యా సుధ అత్తా.
భరించలేని బాధతో తిరిగి అమెరికా వెళ్ళిపోయానేగానీ మళ్ళీ ఎగిరి ఇండియా రావాలనీ నీతో నా ఆవేదన చెప్పుకోవాలనీ నీ ఒడిలో తల ఉంచి, నా హృదయంలో కరుడుకట్టిన దుఃఖ భారాన్ని కరిగించుకోవాలనీ మరీ మరీ అనిపించేది.
కానీ ఏ మొహంతో అక్కడికి రాను? హాయిగా తిని తిరుగుతోన్న నాన్న గుండె హఠాత్తుగా బలహీనపడి ఆగిపోవటానికి కారణం నేనే కదా అన్న ఆలోచన- మానని గాయమై సలుపు పెడుతూనే ఉండేది. అందువల్లే  తరవాత నువ్వెన్నిసార్లు బ్రతిమాలినా ఇండియా రావటానికి మొహం చెల్లలేదు.
తినేస్తున్న జ్ఞాపకాల నుంచి తప్పించుకోవటానికి వర్క్‌లో బిజీ అయ్యాను. విరక్తే పుట్టిందో అహంకారమే ఆవహించిందో చెప్పలేను కానీ ఉత్తరాల సంబంధం కూడా కొనసాగించలేకపోయాను మీతో. ఆ తరవాత... కాలం తిరిగిపోయింది. గడిచిన తోవలో ఎన్నో ఒడుదొడుకులూ ఎదురుదెబ్బలూ. బతుకు ఎన్ని వెలుగునీడల్ని దాటుకొచ్చింది... రోజ్‌లిన్‌ క్యాన్సర్‌తో పోయింది. అమ్మపేరు పెట్టుకున్న నా కూతురు గౌరి అక్కడి స్వేచ్ఛా వాతావరణానికి నిదర్శనంగా ఎయిడ్స్‌ తెచ్చుకుని సూసైడ్‌ చేసుకుంది. నా కొడుకులిద్దరూ బిజినెస్‌ స్టార్ట్‌ చేసుకుని దూరంగా వెళ్ళిపోయారు.

రాత్రి పడుకోబోయే ముందర నా దగ్గరకొచ్చారు ఆయన. చేతిలో ఆ కవరు. ‘‘నీకు ఇందులో ఏముందా అని క్యూరియాసిటీగా ఉందని నాకు తెలుసు- చదువు’’ అన్నారు అది నాకందిస్తూ.

వయసు ఉడిగిన ఈ స్థితిలో కూడా విధి నాతో ఆటలాడుకుంటూనే ఉంది.
ఒక కారు యాక్సిడెంట్‌ నా రెండు కాళ్ళనూ బలి తీసుకుంది.
కరకు కోతకు గురైన మనసు కన్నీరు కారుస్తున్న వేళల్లో నేనున్నాననే తోడు మనిషికి ఎంతో అవసరం. బతుకుబాట చివరికంటా నడిచి వెనక్కితిరిగి చూసుకుంటే నా బాధకి స్పందించి కనులు చెమరింపచేసుకునే ఒకే ఒక్క ఆత్మబంధువ్వి నువ్వొక్క దానివే అనిపించిందమ్మా.
కానీ మన నడుమ ఎంత దూరం!
వీల్‌చైర్‌కి పరిమితమైన నా బాధ్యతని ఎవరు మోస్తారు? ఇది ఇండియా కాదు- విసుక్కుంటూనో కసురుకుంటూనో ముసలివాళ్ళని భరించటానికి. నా కొడుకులని కోరాను- నన్ను ఇండియా పంపించమనీ అక్కడ ఏ ఆశ్రమంలోనైనా చేర్పించమనీ. డబ్బుకి కొదవలేదు కదా, కేరళలోని ఓ మంచి ఆశ్రమంలో నాకు చోటు దొరికింది. పక్కనే దీనికి సంబంధించిన ప్రకృతి చికిత్సాలయం కూడా ఉంది. బరువుగా భారంగా ఈడ్చాల్సిన నా చివరి రోజుల్ని తేలికచేసే ప్రయత్నం చేస్తుంటారు డాక్టర్లూ నర్సులూ.
నా గది కిటికీలోంచి కనిపించే ప్రకృతి రమణీయతా సన్నగా పారే సెలయేటి మృదుమధుర సంగీతమూ పూలనుంచీ వేర్లనుంచీ సుగంధాన్ని మోసితెచ్చే గాలి అలలూ... ముదిమి నాలో పేర్చుతున్న స్తబ్దతని కరిగించాలని ప్రయాసపడుతూ ఉంటాయి.
నాలో తీరని ఓ అసంతృప్తి- నిన్ను చూడలేదనీ నీతో చెప్పుకోవాలనుకున్నవన్నీ చెప్పుకోలేదనీ. నాకు తెలుస్తోంది- ఇంకొన్ని రోజుల్లో ఈ లోకంతో నా రుణం తీరబోతోందని.
జానీ! మృత్యువు నన్ను తన కౌగిట్లోకి లాక్కోకమునుపే ఒకే ఒక్కసారి రావా.
కడసారిగా నీ చూపు నాకు దక్కనీవా!

* * * * *

చప్పున ఉత్తరం మూసి వెనక్కి వాలిపోయాను. మనసంతా చేదు, విషాదం.
చటుక్కున లేచాను. అప్పటికప్పుడు తాతయ్య గదిలోకి వెళ్ళాను. ఆయన పడుకున్న మంచం మీదకు వంగి అడిగాను. ‘‘తాతయ్యా- తాతమ్మని కేరళ పంపించారా?’’
తాతయ్య పలకలేదు. నిద్రపోతున్నారా లేక ‘ఉహు’ అని సమాధానమివ్వడానికి ఇబ్బందిపడి మౌనంగా ఉండిపోయారా?
‘‘పంపలేదు కదూ?’’ అన్నాను గుసగుసగా. నిశ్శబ్దమే నాకు సమాధానం. రెండునిమిషాలు నిలబడి వెనక్కొచ్చేశాను.

* * * * *

ఈరోజే నా తిరుగు ప్రయాణం. బామ్మ ఏవేవో ప్యాక్‌ చేసి బ్యాగ్‌ నింపేసింది. తాతయ్య స్టేషన్‌కి వచ్చారు. సిగ్నల్‌ వాలి రైలు కదలబోయేముందు కిటికీలోంచి నా చేతికో లెటరు ఇచ్చారు ‘‘ఆ రాత్రి నువ్వడిగినదానికి సమాధానమిది’’ అంటూ.
రైలు కదిలింది. ఉత్తరం తెరిచాను.
‘‘తల్లీ! నా చిన్నప్పుడు మా అమ్మ తన ఒడిలో మమ్మల్ని కూర్చోబెట్టుకుని పాలబువ్వ తినిపిస్తూ చెప్పేది ‘మీ మామయ్య అమెరికా నుంచి వస్తాడు. మీకు బోలెడన్ని బహుమతులు తెస్తాడు’ అని.
ఆ మాటలు వింటూ పెరిగి పెద్దవాళ్ళమయిపోయామే తప్ప ఆయనెప్పుడూ రానేలేదు.
ఉన్నట్టుండి ఓరోజు గులాబీరంగు కవరొచ్చింది అమ్మ పేరున. ‘జానూ, ఫలానా ఆశ్రమంలో ఉంటున్నాను, వచ్చి కలువు’ అని.
ఏనాడో దేశం విడిచిపోయిన అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ ఉత్తరం అమ్మకి అందించటానికి లేచినవాణ్ణి- అంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గాను.
అమ్మకి అన్నగారంటే ఎంత ఆపేక్షో నాకు తెలుసు. పరదేశం వెళ్ళి ఆయనెంత గొప్పవాడయ్యాడో చెప్పే కథలు వింటూనే ఎదిగాం. అమ్మ పెట్టెలో మామయ్య ఫొటో ఒకటుంది. అది తీసిచూసి అప్పుడప్పుడూ కళ్ళు తడి చేసుకుంటూ ఉండేదమ్మ. ఆయన పుట్టిన తారీఖున ఇదీ అని చెప్పకుండా పాయసం చేసేది. ఇప్పుడీ ఉత్తరం చూపిస్తే ఏమవుతుంది?
అప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదనుకున్నావ్‌? మీ బామ్మకి డబుల్‌ టైఫాయిడ్‌. టైఫాయిడ్‌ అంటే ఈ రోజుల్లోలాగా సామాన్యం కాదు. ప్రమాదం పొంచివున్నట్టు భయపడేవాళ్ళు. ఇక డబుల్‌ టైఫాయిడ్‌ అంటే నెలల తరబడి మంచానికి అంటుకుపోయి ఇవ్వాళో రేపో అన్నట్టుండేవాళ్ళు. మీ అత్త మంజుల తొలిసారి పురిటికి వచ్చి ఉంది. నిండు నెలలు. మీ నాన్న ఫుట్‌బాల్‌ ఆడుతూ కాలు ఫ్రాక్చర్‌ అయి వాడో మంచం మీద ఉన్నాడు. ఆ గడ్డు సమయంలో అమ్మ ఒక్కతే ఇంటికి దిక్కు. ఆధారాన్ని ఎలా వదులుకోను? అన్నీ తెలిసిన మనిషి కాబట్టి ఇప్పుడే వెడతానని అమ్మ కూడా గట్టిగా పట్టుపట్టకపోవచ్చు. కానీ నాకు తెలుసు- కీ ఇస్తే పరిగెత్తే బొమ్మకి ‘కీ’ మాత్రం ఫుల్‌గా ఇచ్చి కదలకుండా పట్టేసుకుంటే ఏమవుతుంది? అలాంటి టెన్షన్‌కి అమ్మనెందుకు గురిచేయటం? మామయ్య ఆశ్రమంలో ఉన్న సంగతి తెలిసింది కదా.
ఈ ఇబ్బందులన్నీ కొంత సద్దుమణిగాక ఉత్తరం సంగతి చెప్పి వెంటబెట్టుకు వెడితే సరిపోతుంది అనుకున్నాను. ఉత్తరాన్ని బయటపెట్టలేదు.
నాలుగు రోజులకే మరో ఉత్తరం.
‘ఏమిటీయన... ఇన్నేళ్ళుగా లేని ప్రేమ ఇప్పుడు పొంగుకొచ్చినట్టు ఏమిటా తొందర.’
విసుగ్గా అనిపించింది. కానీ తప్పు చేస్తున్నావంటున్న అంతరాత్మ నోరు నొక్కటం మూలంగా కలుగుతోన్న అశాంతి, ఊగిసలాట.

సరిగ్గా వారం గడిచింది. ఆరోజు మీ అత్త మంజులను ఆస్పత్రిలో చేర్పించాం. డెలివరీ టైమ్‌. అమ్మని మంజు దగ్గర ఉంచి కొన్ని సామాన్ల కోసం ఇంటికి వచ్చాను. అప్పుడందించాడు పోస్ట్‌మేన్‌ ఈ మూడో ఉత్తరాన్ని. చదివాను. రాయిని కాదమ్మా... నువ్వు చలించిపోయినట్టే నేనూ ద్రవించిపోయాను.
వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాను.
ఎలాగైనా అమ్మని మామయ్య దగ్గరకు పంపించాలని. నా ప్రాణ స్నేహితుడు గిరి భార్యని ఆసుపత్రిలో మంజు దగ్గర కొన్ని రోజులు సాయంగా ఉండమని బతిమలాడుకోవాలనీ, అమ్మని మామయ్య దగ్గర దిగవిడిచి రమ్మని గిరిని కోరాలనీ అనుకున్నాను.
బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశాను. రిజర్వేషన్‌ కోసం స్టేషన్‌కి వెళ్ళటమే తరువాయి- ఆసుపత్రి నుంచి కబురు- మంజు పరిస్థితి బాగోలేదని... కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందట. గుండెలు బాదుకుంటూ పరుగెత్తాను.
ఆపరేషను... హడావుడి... కంగారు... ఎవరికీ మనసు మనసులో లేదు. మంజుని అల్లారుముద్దుగా పెంచిందమ్మ. రెండు రోజులు- మంజుకి పూర్తిగా తెలివొచ్చేదాకా ఆసుపత్రి గది నుంచి అడుగు బయటపెట్టలేదమ్మ. గండం గడిచింది. తల్లీ బిడ్డా క్షేమం అన్న తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చాను.

ఏనాడో దేశం విడిచిపోయిన అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ ఉత్తరం అమ్మకి అందించటానికి లేచినవాణ్ణి- అంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గాను.

అప్పుడు వచ్చింది టెలిగ్రామ్‌...
పిడుగు పడినట్టుగా. మామయ్య మరణించారు. పోయే ముందు కూడా చెల్లెల్ని తలుచుకున్నారట.
నిశ్చేష్టుడినయ్యాను. అపరాధభావంతో కుంగిపోయాను. చెల్లెల్ని చూడాలని ఆయన ప్రాణం ఎంతగా తపించిపోయిందో. ఇప్పుడీ విషయం అమ్మకెలా చెప్పటం... చెప్పి ఆమె మొహాన్నెలా చూడటం? ఆ రాత్రంతా కలవరం, వేదన, మానసిక సంఘర్షణ.
పొద్దున్నే అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చింది. స్నానం చేసింది. దేవుడి దగ్గర దీపం వెలిగించి వెనక్కి తిరిగింది. ఎదురుగా నుంచున్నాను దీనంగా.
‘‘ఏమైంది నాన్నా, అలా ఉన్నావ్‌?’’ అంది అమ్మ కంగారుగా.
‘‘ఒక తప్పు చేశానమ్మా. ఒకరి నుంచి ఓ నిజాన్ని దాచాను’’ అన్నాను తల వంచి.
అమ్మ నిదానించి చూసింది. ‘‘ఆ నిజం వాళ్ళకు మేలు చేస్తుందా?’’
‘‘లేదు. బాధే కలిగిస్తుంది. అయినా...’’
అమ్మ చల్లగా నవ్వింది. ‘‘పిచ్చి సన్నాసీ, మరెందుకయ్యా విచారం, వదిలెయ్‌’’ అంది నిశ్చింతగా కదిలి వెళుతూ.
అంతే. అమ్మ ఉన్నంతకాలం తన అన్నగారు ఎక్కడో అమెరికాలో చల్లగా ఉన్నారనే భ్రమలోనే బతికింది. నేనా నిజాన్ని అమ్మకి చెప్పలేదు. ఆమె మొహంలోకి మరెన్నడూ సూటిగా చూడలేదు.
తల్లీ, నీకు మా అమ్మపేరు పెట్టుకున్నాం. నిన్ను నేను తల్లీ అనే పిలుచుకుంటాను. నిన్ను మా అమ్మ అనే అనుకుంటాను. అందుకే ఇన్నాళ్ళూ దాచిన నిజాన్ని నీకు చెప్పేస్తున్నాను. చెప్పు తల్లీ, నేను తప్పు చేశానా? నాకు క్షమాపణ ఉంటుందా?

* * * * *

ఉత్తరం మూశాను. మనసంతా బాధగా ఉంది. ‘నీది తప్పని అనలేను తాతయ్యా. పరిస్థితులకి అందరమూ బానిసలమే’... ఈ సందేశం తాత మనసుకి అందాలి అంటోంది నా హృదయం.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు