close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్ధవ్‌... మహా సేనాని!

నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాల్ని అనూహ్య నిర్ణయంతో సరికొత్త మలుపు తిప్పారు శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే. భారతీయ జనతా పార్టీతో దశాబ్దాల దోస్తీకి కటీఫ్‌ చెప్పి కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలతో జట్టుకట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ మిత్రులూ ఉండరని మరోసారి నిరూపించారు. అనుకోకుండా, ఆశించకుండా ముఖ్యమంత్రి అయిన ఆయన రాజకీయ సాహసయాత్ర ఇది...

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే, మీనాతాయీల ముగ్గురు సంతానంలో చిన్నవాడు ఉద్ధవ్‌ ఠాక్రే. రాజకీయాలు అనివార్యమయ్యాయి తప్ప ఆయన కోరి రాలేదనే చెప్పాలి. 1996లో ఠాక్రే కుటుంబంలో జరిగిన సంఘటనలే ఉద్ధవ్‌ రాజకీయాలవైపు వచ్చేలా చేశాయి. ఆ ఏడాది ఉద్ధవ్‌ పెద్దన్నయ్య బిందుమాధవ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తల్లి మీనాతాయీ కూడా అదే ఏడాది చనిపోయారు.చిన్నన్న జైదేవ్‌కు తండ్రితో విభేదాలు రావడంతో అతణ్ని కుటుంబానికీ, పార్టీకీ దూరంగా ఉంచారు. అప్పటివరకూ వేరుగా ఉంటున్న ఉద్ధవ్‌... తండ్రికి చేదోదువాదోడుగా ఉండటానికి బాల్‌ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’కి భార్యాపిల్లలతో వచ్చారు.
బాలాసాహెబ్‌(బాల్‌ ఠాక్రే) రాజకీయ వారసుడు ఉద్ధవ్‌ పినతండ్రి కొడుకు రాజ్‌ ఠాక్రేనే అని భావించేవారంతా. వాగ్ధాటిలో, వేషధారణలో, హావభావాల్లో చాలావరకూ బాలా సాహెబ్‌ను పోలి ఉంటారు రాజ్‌. ఆయనలాగే కార్టూనిస్టు కూడా. 1996లో ముంబయిలో జరిగిన ఓ హత్య వెనక రాజ్‌ హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గించాలనుకున్నారు బాల్‌ ఠాక్రే. ఆ తర్వాతే ఉద్ధవ్‌ పార్టీలో చురుకైన పాత్ర పోషించాల్సి వచ్చింది.

తిరుగులేని నాయకుడు
ఉద్ధవ్‌ ముప్ఫై ఏళ్లప్పుడు మొదటిసారి 1990లో పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అప్పటికే రాజ్‌ ఠాక్రే పార్టీ విద్యార్థి విభాగానికి నాయకుడిగా ఉన్నారు. పార్టీలో లేకపోయినా 1989లో పార్టీ పత్రిక ‘సామ్నా’ ఏర్పాటైనప్పటి నుంచి పత్రిక వ్యవహారాల్ని చూసేవారు ఉద్ధవ్‌. అతడి రాకతో పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందన్న అసంతృప్తితో ఉన్న రాజ్‌ను 1998లో పార్టీ యువ విభాగానికి నాయకుడిగా ప్రకటించారు బాల్‌ ఠాక్రే. అప్పట్నుంచీ ఇద్దరిలో వారసుడు ఎవరన్న విషయంలో చర్చ జరిగేది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-భాజపా కూటమిని కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి ఓడించింది. ఆ ఓటమి తర్వాతే ఉద్ధవ్‌ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకున్నారు. తన నాయకత్వ సామర్థ్యాన్ని మొదటిసారిగా 2002లో నిరూపించుకున్నారు ఉద్ధవ్‌. ఆ సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యతల్ని తీసుకున్నారు. నిజానికి ఆ ఎన్నికలు ఉద్ధవ్‌కి ఇంటా బయటా ఒక సవాలుగా నిలిచాయి. రాజ్‌ మద్దతుదారుల్లో చాలామందికి టికెట్లు ఇవ్వడానికి సుముఖత చూపలేదు ఉద్ధవ్‌. పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు చాలాచోట్ల విజయం సాధించింది సేన. దాంతో ఉద్ధవ్‌ను 2003లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించి, పూర్తి నిర్ణయాధికారాన్నీ ఆయనకు ఇచ్చారు బాల్‌ ఠాక్రే. 1999లో పార్టీ అధికారంలో ఉన్నపుడు సీనియర్‌ నేత నారాయణ్‌ రాణె ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలలు పనిచేశారు. ఆ సమయంలో సామ్నా చీఫ్‌ ఎడిటర్‌గా ప్రభుత్వ అసమర్థ నాయకత్వాన్ని విమర్శించడానికి వెనకాడలేదు ఉద్ధవ్‌. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్ధవ్‌ని ప్రకటించాక పార్టీలో ఇమడలేకపోయిన రాణె... 2005లో 12 మంది ఎమ్మెల్యేలతో వేరుపడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత ఏడాది రాజ్‌ ఠాక్రే కూడా ‘మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన’ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీలో ఉద్ధవ్‌ నాయకత్వానికి పోటీలేని పరిస్థితి ఏర్పడింది. ‘ఉద్ధవ్‌ పార్టీలోని అత్యాశపరుల్ని సాగనంపార’ని కొనియాడారు బాల్‌ ఠాక్రే. అప్పట్నుంచీ అన్నీ తానై పార్టీని నడిపించారు ఉద్ధవ్‌. అయితే బాలా సాహెబ్‌ మాదిరిగా ‘నా మాటే శాసనం’ అన్నట్టు కాకుండా, పార్టీలోని సీనియర్లతో మాట్లాడుతూ వారి మాటనీ గౌరవిస్తారు ఉద్ధవ్‌. తరచూ పార్టీ కార్యకర్తల్ని కలిసేవారు. 2012లో బాల్‌ ఠాక్రే చనిపోక ముందు తన ఆఖరి సమావేశంలో శివసైనికులంతా ఉద్ధవ్‌కీ, ఆదిత్యకీ మద్దతుగా ఉండాలని కోరారు. తద్వారా మరో యాభైఏళ్లపాటు పార్టీ నాయకత్వంమీదా స్పష్టతనిచ్చారు. బాల్‌ ఠాక్రే మరణించాక ఉద్ధవ్‌ నాయకత్వ సామర్థ్యంపైన అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు, శివసేన నాయకులంటే ఫైర్‌బ్రాండ్‌లే. దానికి భిన్నంగా మృదుభాషీ, మితవాదీ అయిన ఉద్ధవ్‌ పార్టీని నడిపించలేరన్న వాదనలు వినిపించాయి. కానీ కాల పరీక్షలకు నిలిచి వాస్తవంలో తాను వేరని నిరూపించుకోగలిగారు ఉద్ధవ్‌.

మితవాదం వైపు
సేనతో భావ సారూప్యమున్న భాజపా రాష్ట్రంలో ప్రాబల్యం పెంచుకుంటున్నా తన పార్టీ ఉనికిని కాపాడగలిగారు ఉద్ధవ్‌. ఆ క్రమంలో ఎన్నో మార్పులు తెచ్చారు. పార్టీని అతివాదం నుంచి మితవాదంవైపు మళ్లించారు. మహారాష్ట్రీయుల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీయే అయినా... ముంబయిలో ఉండేవాళ్లంతా ముంబయివాసులేనని ‘మి ముంబయికర్‌’ ఉద్యమాన్ని తెచ్చి అన్ని ప్రాంతాలవారినీ, మతాలవారినీ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేశారు. పార్టీ పగ్గాలు తీసుకున్నాక రాష్ట్రం నలుమూలలా విస్తృతంగా తిరిగారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన విదర్భ ప్రాంతానికి తరచూవెళ్తూ వారి సమస్యలు తెలుసుకుని వారికోసం ఉద్యమించారు. తనకు వ్యవసాయం తెలియకపోయినా, రైతుల కష్టాలు తెలుసని చాలాసార్లు చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు వరాలు ఇవ్వడం వెనక కారణం అదే. తండ్రిలా మహారాష్ట్రకే పరిమితం కాకుండా దిల్లీలోనూ పరిచయాలు పెంచుకుంటూ వచ్చారు. మొత్తానికి స్వల్ప వ్యవధిలోనే తండ్రితో పోలికలేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల్‌ ఠాక్రే మరణం తర్వాత కూడా ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని కాపాడుకుంటూ వచ్చారు. ఒకప్పటి శివసేన తరహా పిడివాదంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్‌ ఠాక్రే ఎమ్‌.ఎన్‌.ఎస్‌. 13 సీట్లు గెలిచినా, 2014లో ఆ పార్టీ సున్నాకే పరిమితమైంది. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీచేద్దామని రాజ్‌ ఠాక్రే ప్రతిపాదించినపుడు రెండో ఆలోచన లేకుండానే దాన్ని తోసిపుచ్చారు ఉద్ధవ్‌. కాషాయం నుంచి లౌకికం వైపు, పట్టణం నుంచి గ్రామీణం వైపు, మహారాష్ట్రీయుల నుంచి అందరివైపూ... ఇలా పార్టీని కొత్తబాటలో నడిపించారు ఉద్ధవ్‌.

మైత్రీ బంధం తెగింది...
శివసేన-భాజపాలది మూడున్నర దశాబ్దాల బంధం. కానీ భాజపాతో శివసేన స్నేహం 2014 నుంచీ ఏమంత దృఢంగా లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తులేకుండా బరిలోకి దిగిన సేన నెలపాటు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాతే ఫడణవీస్‌ ప్రభుత్వంలో భాగమైంది. సమానమైన మైత్రీబంధాన్ని తాము కోరుకుంటుంటే భాజపా పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఉద్ధవ్‌కి నచ్చలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్లడం ఉద్ధవ్‌కి ఎదురైన అతిపెద్ద రాజకీయ సవాలని చెప్పాలి. మోదీ హవా నడుస్తున్నప్పటికీ ఒంటరిగా వెళ్లి 2009 ఎన్నికలకంటే 21 సీట్లు ఎక్కువగా 63 సీట్లు సంపాదించిందా పార్టీ. 2019 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంలో విభేదాలు రాకుండా రెండు పార్టీలూ జాగ్రత్తపడ్డాయి. కానీ ముఖ్యమంత్రి పదవిని సగం కాలం పంచుకునే విషయంలో మాత్రం సయోధ్య కుదరలేదు. దాంతో ఆ పార్టీతో బంధాన్ని వదులుకున్నారు. సాహసోపేతమైన నిర్ణయంతో ‘మహా వికాస్‌ అఘాడీ’ని ఏర్పాటు చేశారు. ‘ఉద్ధవ్‌ని మేం చూసిందాన్నిబట్టీ, విన్నదాన్నిబట్టీ మేం ఆయనతో పనిచేయగలమన్న నమ్మకం కలిగింది’ సంకీర్ణం విషయంలో వచ్చిన ప్రశ్నకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు ఇచ్చిన జవాబిది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిది తాత్కాలిక బంధం కాదనీ చెప్పారు ఉద్ధవ్‌. శివసేన నుంచి ఉద్ధవ్‌ మూడో ముఖ్యమంత్రి. కానీ పార్టీ వ్యవస్థాపకుడి కుటుంబం నుంచి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఇదే ప్రథమం. ఆ కుటుంబం నుంచి మొదటి ఎమ్మెల్యే ఉద్ధవ్‌ కుమారుడైన ఆదిత్య. బాల్‌ ఠాక్రే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా అధికారానికి దూరంగా ఉండేవారు. కాకపోతే పార్టీ అధికారంలో ఉండేటపుడు రిమోట్‌ ఆయన చేతిలో ఉండేది. కూటమిలోని ఇతర పార్టీలు కోరినపుడు ఉద్ధవ్‌ రిమోట్‌లా ఉండకుండా ముఖ్యమంత్రి పదవికి అంగీకరించారు. మొత్తానికి ఎప్పటికైనా ‘సేన’ నాయకుణ్ని ముఖ్యమంత్రి పీఠంమీద కూర్చోబెడతానని తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారీ ఉద్దండుడు.


ఆయన వెనక ఆమె...

రష్మీ ఎల్‌ఐసీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేసినపుడు- తన సహోద్యోగీ, రాజ్‌ ఠాక్రే చెల్లెలూ అయిన జయజయవంతితో స్నేహం కుదిరింది. ఆమెద్వారా ఉద్ధవ్‌కు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. 1989లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉద్ధవ్‌ను క్రియాశీల రాజకీయాలవైపు ప్రోత్సహించింది రష్మీనే అని చెబుతారు. రాజ్‌కి కాకుండా ఉద్ధవ్‌కు పార్టీ పగ్గాలు దక్కేలా బాలా సాహెబ్‌ను ఒప్పించడంలో రష్మీ పాత్ర కూడా ఉందంటారు. బాల్‌ ఠాక్రే చివరిరోజుల్లో అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయినపుడు ఆయన్ని పరామర్శించడానికి వచ్చే వారందరినీ పలకరిస్తూ వారికి భోజన ఏర్పాట్లు చేసేవారు. ఉద్ధవ్‌ రాజకీయాల్నీ రష్మీతో చర్చించి ఆమె సలహాల్ని తీసుకుంటారు. పెద్ద కొడుకు ఆదిత్యను 20 ఏళ్లనుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించారు రష్మీ. ఆదిత్య ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి 70వేల ఓట్ల మెజారిటీతో వర్లీ నుంచి గెలిపించారు. పార్టీ మహిళా విభాగం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.


ఫొటోగ్రాఫర్‌... ఉద్ధవ్‌!

భార్య రష్మీ. పిల్లలు ఆదిత్య, తేజస్‌.
* ముంబయిలోని ప్రసిద్ధ మరాఠీ మీడియం స్కూల్‌ బాల్‌మోహన్‌ విద్యామందిర్‌లో చదువుకున్నారు.
* ముంబయిలోని జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి ఫొటోగ్రఫీలో డిగ్రీ చేసిన ఉద్ధవ్‌... ఆ తర్వాత ‘ఛౌరంగ్‌’ పేరుతో కొన్నాళ్లు సొంత యాడ్‌ ఏజెన్సీని నడిపారు.
* ఉద్ధవ్‌కి వైల్డ్‌ఫొటోగ్రఫీ, ఏరియల్‌ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఈయన ఫొటోలు వివిధ మ్యాగజైన్లలోనూ ప్రచురితమయ్యేవి.
* తన ఫొటోలతో ‘మహారాష్ట్ర దేశ్‌(2010), పహావా విఠల్‌(2012)’ అనే రెండు పుస్తకాల్నీ ప్రచురించారు. మహారాష్ట్రలోని వివిధ నిర్మాణాల్నీ, గ్రామీణ మహారాష్ట్రనీ, పండార్‌పూర్‌ యాత్ర విశేషాల్నీ ఈ పుస్తకాల్లో వివరించారు.
* తన ఫొటోలతో ఎగ్జిబిషన్‌ పెట్టి అమ్మగా వచ్చిన రూ.10 లక్షల్ని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లల చదువులకు విరాళంగా ఇచ్చారు.
* బ్యాడ్మింటన్‌ ఆటగాడు, ప్రకృతి ప్రేమికుడు.
* సినీ, వ్యాపార ప్రముఖులతో సన్నిహితంగా ఉంటారు. బాలీవుడ్‌ హీరోలు సునీల్‌ శెట్టి, సంజయ్‌దత్‌ మంచి స్నేహితులు.
* ఉద్ధవ్‌ కూడా మొదట కార్టూనిస్టు. క్రమంగా ఫొటోగ్రఫీ వైపు వెళ్లారు.
* పినతండ్రి(రాజ్‌ ఠాక్రే తండ్రి) శ్రీకాంత్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. రాజ్‌ తల్లి కుందా... ఉద్ధవ్‌ తల్లికి స్వయానా చెల్లెలు కూడా.
* మద్యం, సిగరెట్‌ ముట్టుకోరు.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.