close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారసులు వచ్చారోచ్‌!

తెలుగు సినీ పరిశ్రమలో హవా అంతా మూడో తరం వారసులదే.  తాజాగా ఇప్పుడు వాళ్ల వారసులూ కొందరు తెరపైకొచ్చి తళుక్కుమంటున్నారు. మరి వాళ్లెవరో... ఏ సినిమాలో నటించారో తెలుసా!


వహ్వా అనిపిస్తున్నారు!
  - గౌతమ్‌, సితార

హేశ్‌బాబు పిల్లలైన గౌతమ్‌, సితారలకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘1 నేనొక్కడినే’లో చిన్నప్పటి మహేశ్‌గా కనిపించిన గౌతమ్‌ తన నటనతో వహ్వా అనిపించాడు. 
ఈ మధ్యనే ఓ ప్రకటనలో గౌతమ్‌ సితారలు తమ తల్లిదండ్రులతో కలిసి నటించారు. 
ఆ యాడ్‌తోనే తొలిసారి సితార తెరమీదకు రావడం. చక్రాల కళ్లతో ముద్దొస్తూ ఉండే సితార ఈమధ్యనే తన స్నేహితురాలైన వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టింది. అందులో ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా కనిపిస్తూ పిల్లలకి ఆసక్తి కలిగించే పలు వీడియోలు రూపొందిస్తోంది. అలానే డబ్బింగ్‌ ఆర్టిస్టుగానూ మారిపోయి ‘ఫ్రోజెన్‌2’ అనే డిస్నీ మూవీలో ఎల్సా అనే ప్రధాన పాత్రకు గొంతు అరువిచ్చింది. ఏడేళ్లకే ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటోంది సితార.


పెద్ద సాహసమే చేశాడు
- చరిత్‌ మానస్‌, దర్శన్‌

‘భలే భలే మగాడివోయ్‌’ అనగానే మతిమరుపు నానీనే గుర్తొస్తాడు. ఆ సినిమాలో చిన్నప్పటి నానీగా నటించింది మరెవరో కాదు, సూపర్‌స్టార్‌ కృష్ణకి మనవడూ, హీరో సుధీర్‌ బాబు కొడుకూ అయిన చరిత్‌ మానస్‌. ఆ సినిమా తరవాత ‘విన్నర్‌’లో సాయిధరమ్‌తేజ్‌ చిన్ననాటి పాత్రనూ పోషించాడు. అందులో గుర్రాల ముందు పరుగెత్తి రిస్కీ స్టంట్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదట్లో గుర్రాలు మీదకొస్తాయని భయపడ్డాడట... కానీ తను ఆగిపోతే సీన్‌ కంటిన్యుటీ పోతుందని అలానే పరుగెత్తాడట చరిత్‌. చిన్న వయసులోనే ఎంత సాహసం అని పలువురు ఈ చిన్నారిని మెచ్చుకుంటున్నారు. అలానే చరిత్‌ చిట్టి తమ్ముడు దర్శన్‌కి కూడా సినిమాలంటే ఇష్టం. గతేడాది వచ్చిన ‘గూఢచారి’లో చిన్నారి అడవిశేష్‌గా ఎంతో అమాయకంగా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. తాత కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారని తెరపైన వీళ్లిద్దర్నీ చూసినవాళ్లు తెగ పొగిడేస్తున్నారు.


అచ్చం అమ్మలానే...
- నైనిక

మూడేళ్ల క్రితం వచ్చిన ‘పోలీసోడు’లో విజయ్‌ కూతురిగా మెప్పించిన చిన్నారి ఎవరో తెలుసా... నటి మీనా కూతురు నైనిక. చక్రాల కళ్లతో... చెక్కిన శిల్పంలా ఉండే మీనాలానే కూతురు నైనిక కూడా ఎంతో చురుగ్గా చలాకీగా ఉంటుంది. ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్‌ కూడా చెప్పుకుంది ఈ చిన్నారి. ఆ ముద్దు ముద్దు మాటలకే ప్రేక్షకులు నైనిక నటనకు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన ‘పోలీసోడు’ చిత్రానికి ఈ చిన్నారి పలు అవార్డులు కూడా అందుకుంది. తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తోన్న నైనిక స్టేజీ ఎక్కితే చక్కగా ఉపన్యాసమిస్తుంది. రజనీకాంత్‌ సినిమాలో బాలనటిగా పరిచయం అయిన మీనాలానే నైనిక కూడా భవిష్యత్‌లో మంచి నటి అవుతుందేమో.


సినిమాలంటే ఇష్టం...
- అకీరా నందన్‌

రేణూదేశాయ్‌ నిర్మాతగా, దర్శకురాలిగా మారి తీసిన సినిమా ‘ఇష్క్‌ వాలా’. మరాఠీ, తెలుగుల్లో వచ్చిన ఈ సినిమాలో మొదటిసారి అకీరా నందన్‌ తెరమీద కనిపించాడు. ఈ సినిమాలో అకీరా తన పాత్రకి రెండు భాషల్లోనూ డబ్బింగ్‌ కూడా చెప్పుకున్నాడు. చిన్నప్పట్నుంచీ ఈ లిటిల్‌ పవర్‌స్టార్‌కు సినిమాలంటే ఇష్టం. తండ్రితో కలిసి సెట్‌కీ వెళ్లేవాడు. చాలాసార్లు సెట్‌లోనే పుట్టినరోజులు కూడా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం తల్లి రేణూదేశాయ్‌ వద్ద పుణెలో ఉండి చదువుకుంటున్నాడు పదిహేనేళ్ల అకీరా. ఎడమ చేతివాటమున్న అకీరా ఎత్తు 6.4అంగుళాలు. తండ్రి కంటే ఎత్తు ఎదిగిన అకీరా ఫొటోలిప్పుడు ‘అయ్య బాబోయ్‌ ఎంత పొడుగో...’ అంటూ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అలానే పవన్‌, త్రివిక్రమ్‌లు మంచి స్నేహితులైనట్టు... అకీరా, త్రివిక్రమ్‌ కొడుకైన రిషీ మనోజ్‌లు కూడా ప్రాణ స్నేహితులు. భవిష్యత్‌లో వీళ్లిద్దరు కూడా కలిసి సినిమాలు తీస్తారేమో చూడాలి మరి.


హీరో కావాలని! 
- మహాధన్‌

కుటుంబాన్ని ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉంచే రవితేజ ‘రాజా ది గ్రేట్‌’తో కొడుకు మహాధన్‌ని వెండి తెరకు పరిచయం చేసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు. అంధుడి పాత్రలో నటించిన రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్‌ చేశాడు మహాధన్‌. రాధిక కొడుకుగా చూపులేని పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయిన మహాధన్‌ కర్రసాము, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటూ కనిపిస్తాడు. పోలికలూ, నటనలోనూ అచ్చం రవితేజని దించేశాడని పలువురు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జూనియర్‌ రవితేజ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ యాక్షన్‌ సినిమాలంటే ఇష్టపడే మహాధన్‌కి నటనంటే చాలా ఇష్టమట. అందుకే భవిష్యత్‌లో హీరో కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. 


డైలాగులతో అదరగొట్టారు 
- శౌర్య రామ్‌, తారక అద్విత 

న్టీఆర్‌ వారసులూ, కల్యాణ్‌ రామ్‌ పిల్లలూ అయిన శౌర్య రామ్‌, తారక అద్వితలు కూడా వెండితెరపైన మెరిశారు. 2016లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాలో కల్యాణ్‌రామ్‌ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు శౌర్యరామ్‌. తొలిసారి తెరపైన కనిపించిన ఈ నందమూరి వారసుడు ‘ఇజం’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలానే ఈ మధ్య బాలకృష్ణ స్వీయ నిర్మాణసంస్థలో వచ్చిన ఎన్టీఆర్‌ ‘మహానాయకుడు’లో శౌర్యరామ్‌తోపాటు తారక అద్విత కూడా నటించింది. ఎన్టీఆర్‌ తొలిసారి ఎన్నికల్లో నిలబడినప్పుడు ఫలితాల వేళ మనవళ్లూ, మనవరాళ్లతో కబుర్లు చెబుతూ ఆడుకుంటుంటాడు. ఆ సన్నివేశంలో చక్కగా డైలాగులు చెప్పి ప్రేక్షకుల మెప్పుపొందారీ బాలనటులు.


యూట్యూబ్‌ సంచలనం
- శివి

జాతీయ అవార్డులు అందుకున్న ‘మహానటి’ చూసిన వాళ్లకి ప్రతి పాత్రా గుర్తుండిపోతుంది. అందులో సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి పాత్రలో నటించింది గాయనీ, నటి అయిన స్మిత కూతురు శివి. పెద్ద పెద్ద కళ్లతో అచ్చం స్మితలానే ఉండే శివిని ఆడిషన్‌ చేయకుండానే ఆ పాత్రకి తీసుకున్నారట. శివి నటించడంతోపాటు చక్కగా పాడుతుంది కూడా. గతేడాది ‘బాహుబలి’లో రాజమౌళి సృష్టించిన కిలికి భాషలో రాసిన ఓ పాటను పాడింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆ పాటకి ఒక్కరోజులోనే దాదాపు ఎనభై లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఆ పాట టిక్‌టాక్‌లోనూ బాగా ఫేమస్‌ అయింది. మాషప్‌ వీడియోలు తెగ చేశారు నెటిజన్లు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ఓటు అవగాహనకు సంబంధించి స్మిత రూపొందించిన పలు వీడియోల్లో శివి కూడా కనిపించింది. ‘నా పేరు ఆంధ్రప్రదేశ్‌.. నా వయసు ఐదేళ్లు’ అంటూ ఎంత చక్కగా డైలాగులు చెప్పిందో.


డాన్స్‌ ఇరగదీస్తాడు!
- అయాన్‌, అర్హ

మధ్యనే ‘అల వైకుంఠపురములో’లోని మూడో పాట టీజర్‌ విడుదలైంది. అందులో ‘ఓ మైగాడ్‌ డాడీ...’ అనే పాటలో విసుగ్గా తల కొట్టుకుంటూ చెల్లి అర్హతో కలిసి స్టెప్పులు వేశాడు అయాన్‌. ఈ వీడియోలో పాట కంటే వీళ్ల అల్లరి చేష్టలకే ఎక్కువ మార్కులు పడ్డాయి. రామ్‌చరణ్‌కి వీరాభిమాని అయిన అయాన్‌ మంచి డాన్సర్‌ కూడా. సోషల్‌ మీడియాలో అయాన్‌ డాన్స్‌ చేస్తున్న వీడియోలు చాలానే వైరల్‌ అయ్యాయి. 
ఆ డాన్స్‌కి ఫిదా అయిన రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ వచ్చినప్పుడు ఆ సినిమాలో ధరించిన కాస్ట్యూమ్స్‌ అయాన్‌ కోసం ప్రత్యేకంగా కుట్టించి మరీ ఇచ్చాడు. అలానే అల్లు అర్జున్‌ కూడా ఎప్పుడూ పిల్లలతో కలిసి అల్లరి చేస్తున్న ఏదో ఒక వీడియోని నెటిజన్లకోసం పోస్టు చేస్తూనే ఉంటాడు. ముద్దుముద్దుగా ఉండే అయాన్‌, అర్హల్ని వెండితెరపైన చూడాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!


8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు