
బుజ్జాయికి జల్లు స్నానం!
పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు ముక్కులోకి నీళ్లు పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ సమయంలో తల్లులకు మరొకరి సాయం చాలా అవసరం. లేదంటే ఇబ్బందే. మరి అలాంటి తల్లులు ఈ షవర్ టాయ్‌ని తెచ్చుకుంటే ఎవరి సాయం లేకుండానే ఎంచక్కా బుజ్జాయిలకు స్నానం చేయించొచ్చు. ఈ షవర్ టాయ్‌ని పిల్లలకు స్నానం చేయించే టబ్‌లోనో, నీళ్ల బకెట్లోనో వేసి దానికున్న బటన్ ఆన్ చేస్తే నీళ్లు తేలికపాటి జల్లుగా మీద పడతాయి. ఆ జల్లుకి ఫోర్స్కూడా ఉండదు. ఒళ్లంతా నలుగూ, సబ్బూ పెట్టాక మగ్గుకి బదులు ఈ షవర్‌తో నీళ్లు పోయొచ్చు. పిల్లలు కూడా హాయిగా స్నానం చేయించుకుంటారు. తల్లులకీ చాలా సౌకర్యం కూడా.
బల్బు కోరుకున్న రంగులో!
ఇంట్లో అలంకరణకి రకరకాల రంగుల బల్బులు పెడుతుంటాం. ఒకవేళ ఆ రంగులు వద్దంటే బల్బులు మార్చేసి వేరేవి పెట్టుకోవాల్సిందే. పైగా తీసిన బల్బులు వృథా అయిపోతాయి. అదే స్మార్ట్ ఎల్ఈడీ బల్బులు తెచ్చుకుంటే ఆ ఇబ్బందేమీ ఉండదు. ఫోన్లోని ఆప్‌కు అనుసంధానం చేసుకునే వీలున్న ఈ బల్బులు మనకి కావల్సిన రంగులోనూ, ఒకేసారి పలు రంగుల్లోనూ కూడా వెలుగుతాయి. అందుకు ముందుగానే ఫోన్లో రంగుల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం బయటకు వెళ్లేప్పుడు లైట్ తీసేయడం మర్చిపోతే ఆప్ నోటిఫికేషన్ ఇస్తుంది. దాంతో ఫోన్లోనే ఉన్నచోటు నుంచి లైట్ ఆపేయొచ్చు.
ఫ్రేములో పిల్లి
ఆ గోడ మీదున్న పిల్లికి ఫ్రేము కట్టారేంటి... అదెలా సాధ్యమైంది అనుకుంటున్నారు కదూ. అది నిజం పిల్లి కాదు. ఊలు, నైలాన్ దారాలతో చేసిన బొమ్మ. అచ్చం పిల్లిలా కనిపించడానికి ఆ దారాలకు రంగులు వేసి రూపొందిస్తోంది వాకునికో అనే జపాన్ కళాకారిణి. ఆమె తయారు చేస్తున్న ఈ పిల్లి బొమ్మలకు ఆన్లైన్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వాటిని విక్రయిస్తోంది వాకునికో. కావాలంటే మన పెంపుడు పిల్లి ఫొటోలు పంపినా అచ్చం అలాంటి బొమ్మల్నీ, త్రీడీ ఫ్రేముల్నీ కూడా చేసిస్తుంది. బాగున్నాయి కదూ చూడ్డానికి!
వంపేయండిక...
ప్రతిరోజూ వంట చేయడానికి బియ్యం, పప్పులూ కడుగుతుంటాం. వాటిని కడిగి చెయ్యి అడ్డుపెట్టి వంపేసేటప్పుడు కొన్నిసార్లు నీళ్లతోపాటు అవి కూడా కిందపడిపోతుంటాయి. అలా పడిపోకుండా నీటిని తేలికగా వంపేయడానికి అందుబాటులోకి వచ్చిందే డ్రెయిన్ బౌల్. ఒకవైపు మాత్రమే రంధ్రాలున్న ఈ గిన్నెలో బియ్యం, పప్పులూ, కాయగూరలూ, పళ్లూ... ఇలా ఏవైనా కడిగేశాక దాన్ని కాస్త పక్కకు వంపితే నీళ్లు మాత్రం కిందకు కారిపోతాయి. ఇక, ఈ బౌల్‌ను సలాడ్లు కలుపుకోవడానికీ, కూరగాయముక్కలు వేసుకోవడానికీ కూడా వాడుకోవచ్చు.
8 డిసెంబరు 2019
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్