
అబ్బా... బోర్ కొడుతోంది..!
పిల్లల పెంపకంలో కౌమారదశ చాలా కీలకమైనది. పైగా ఎనిమిదో తరగతి దాటిన దగ్గర్నుంచి చాలామంది పిల్లలు బోర్ అనడం వింటుంటాం. అయితే ఇలా బోర్‌గా ఫీలవడం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే ఎక్కువని వాషింగ్టన్ స్టేట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు. అయితే వాళ్లు తరచూ అలా అంటుంటే దాన్ని అంత తేలికగా తీసుకోకూడదనీ, దాన్ని పొగొట్టే ప్రయత్నం చేయాలనీ లేదంటే అది కాస్తా డిప్రెషన్‌కు దారితీసే అవకాశం ఉందనీ చెబుతున్నారు. పైగా వాళ్లు ఆ వయసులో బోర్‌గా ఫీలవుతున్నారంటే వాళ్లు తమ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదనీ ఏదో అసంతృప్తితో జీవిస్తున్నారనీ అర్థం చేసుకోవాలి. బాల్యం నుంచి పెద్దవాళ్లుగా మారే దశే కౌమారం. కాబట్టి వాళ్లు ఆ సమయంలో తమకు తామే పెద్దవాళ్లమైపోయామన్న భావనతో విపరీతమైన స్వేచ్ఛని కోరుకుంటుంటారు. అందుకే వీలయినంత ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ చదువూ ఆటల్లో పూర్తిగా నిమగ్నమయ్యేలా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్లదేననీ హెచ్చరిస్తున్నారు.
ముడతలు పోతాయిలే!
రాపామైసిన్... సుమారు యాభై సంవత్సరాల క్రితం ఈస్టర్ దీవిలో నేలలో గుర్తించిన ఈ బ్యాక్టీరియాలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ తరవాతి నుంచి దీన్ని మూత్రపిండాల మార్పిడి సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎదురు తిరగకుండా ఉండేందుకు వాడుతున్నారు. అయితే దీనిమీద తాజాగా ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనల్లో ఇది చర్మకణాలను నెమ్మదిగా పెరిగేలా చేస్తుందనీ ఫలితంగా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందనీ కూడా తేలడం విశేషం. దీన్ని క్రీము రూపంలో పదమూడు మందికి ముడతలు పడిన చేతులమీద కొన్ని నెలలపాటు రాసి చూడగా- అది చర్మంలో సాగేగుణాన్ని పెంచి, వయసును పెంచే ప్రొటీన్‌ను అడ్డుకున్నట్లు గుర్తించారు. అదేసమయంలో ఇది రక్తంలోకి ప్రవేశించలేదు కాబట్టి ఆరోగ్యంమీద ఎలాంటి దుష్ప్రభావం కనబరచదని పేర్కొంటున్నారు. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తే వృద్ధాప్యంలోనూ చర్మ సౌందర్యంతో మెరిసిపోవచ్చన్నమాట.
కాలుష్యంతో గ్లకోమా..!
వాతావరణంలోని కాలుష్యం కారణంగా గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువ అని యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు కోట్లమంది గ్లకోమా కారణంగా అంధత్వం బారిన పడుతున్నారు. కంటి నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడంతో కంటిలో ఒత్తిడి పెరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధే గ్లకోమా. సాధారణంగా గ్లకోమాకి పెద్దవయసు లేదా జన్యువులే కారణం అని ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. మొట్టమొదటగా కంట్లో ఒత్తిడి పెరగడంతోబాటు మరో కారణాన్ని గుర్తించారు. కంటిపరీక్షల్లో భాగంగా లక్షన్నర మంది రెటీనా స్కాన్లను పరిశీలించినప్పుడు- గ్లకోమాకి గురయిన వాళ్లలో ఎక్కువమంది కాలుష్య ప్రదేశాల్లో నివసిస్తున్నట్లు తేలిందట.
ఈ కాలుష్యంవల్ల కంట్లో ఒత్తిడి పెరగడం లేదు కానీ రక్తనాళాలు కుంచించుకుపోవడంతో గ్లకోమాకి దారితీస్తుండవచ్చు లేదా హానికర రసాయనాలేవయినా నేరుగా కంట్లోకి వెళ్లడంతో నాడీవ్యవస్థ దెబ్బతిని కూడా ఈ సమస్య తలెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా వాతావరణ కాలుష్య కారణంగా గుండె, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నట్లే ఆ జాబితాలోకి గ్లకోమా కూడా చేరిందనీ ఆ కారణంతోనే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నివసించేవాళ్లలోనే 50 శాతం ఎక్కువగా గ్లకోమా కేసులు ఉంటున్నాయనీ వివరిస్తున్నారు.
కాఫీ తాగొచ్చు..!
చాలామంది లేవగానే కాఫీ తాగకుండా ఉండరు. కొందరయితే రోజుకి మూడు నాలుగుకప్పులు కాఫీ కూడా తాగుతుంటారు. అయితే అందరూ అనుకున్నట్లుగా కాఫీ గుండె ఆరోగ్యానికి హానికరం కాదు అంటున్నారు క్వీన్ మేరీ విశ్వవిదాలయ నిపుణులు. ఏకంగా పది కప్పులపైగా కాఫీ తాగేవాళ్లలో కూడా రక్తనాళాలు బాగానే ఉన్నాయనీ కాబట్టి కాఫీ తాగడానికీ గుండెజబ్బులకీ సంబంధం లేదనీ అంటున్నారు. శరీర భాగాలన్నింటికీ ఆక్సిజన్నీ పోషకాలనీ రక్తంతోబాటుగా సరఫరా చేసే రక్తనాళాల గోడలు మందమై గట్టిగా అయిపోతే అవి రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయలేవు. దాంతో హృద్రోగాలూ పక్షవాతం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వీళ్లు రోజుకి ఒక కప్పు/ మూడు కప్పులు/అంతకన్నా ఎక్కువ తాగేవాళ్లని ఎంపికచేసి వాళ్ల గుండెను స్కాన్ చేసి పరిశీలించారట. అందులో వీళ్లందరిలో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదట. అయితే కాఫీతోబాటుగా ఆల్కహాల్, సిగరెట్ కాల్చేవాళ్లలో మాత్రం రక్తనాళాల గోడలు గట్టిగా అయిపోవడాన్ని గుర్తించారు. అంటే కేవలం కాఫీ ఒక్కదానివల్లా రక్తనాళాలు గట్టిగా అయిపోవడం అనేది జరగదని తేల్చి చెబుతున్నారు
8 డిసెంబరు 2019
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్