close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినని పాటలెన్నో వినిపిస్తున్నారు!

ఒకప్పుడు సినిమావాళ్లు ప్రజలతో కమ్యూనికేట్‌ చేయడం చాలా అరుదు. ఇప్పుడలా కాదు... దాదాపు ప్రతి ఒక్కరూ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ అంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అవి రెండూ చాలవన్నట్టు తాజాగా ‘అఫిషియల్‌’ యూట్యూబ్‌ ఛానళ్లూ ప్రారంభించేస్తున్నారు. హీరోహీరోయిన్లే కాదు... వాళ్లకి దీటుగా సంగీతదర్శకులూ వీటిలో హల్‌చల్‌ చేస్తున్నారు. ‘కొత్తగా ఏముంటుంది. నాయికానాయకుల్లాగే వీళ్లూ తమ సినిమాల ప్రోమోలూ ఇంటర్వ్యూలూ పెడుతుంటారు... అంతేగా!’ అనుకుంటున్నారా... ‘కాదు. అంతకుమించి!’ అని చెబుతున్నాయి వారి ఛానళ్లు!

మ్యూజిక్‌ మొఘల్‌ ముందడుగు!
టెక్నాలజీ విషయంలో ఏఆర్‌ రెహ్మాన్‌ది అందెవేసిన చేయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లకంటే ముందు 2006లోనే యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించేశాడీ మ్యూజిక్‌ మొఘల్‌. విశేషమేంటంటే... ఇందులోని 98 శాతం వీడియోలు సినిమాలకి అతీతంగా ఆయన చేస్తున్న ఆల్బమ్‌లకి సంబంధించినవే. విదేశాల్లో చేసిన సింఫనీ లైవ్‌తో మొదలుపెట్టి గత ఏడాది ‘యూట్యూబ్‌ ఒరిజినల్స్‌’ కోసం రూపొందించిన ఏఆర్‌ అరైవ్డ్‌ కార్యక్రమాలూ, ప్రస్తుతం ‘క్యూకీ’ అనే ఛానల్‌ కోసం వారానికోసారి చేస్తున్న జామ్‌-ఇన్‌ ఒరిజినల్స్‌ పాటలన్నీ ఇందులో వినొచ్చు. ఆల్బమ్స్‌ విషయానికొస్తే ‘వందేమాతరం’తో మొదలుపెట్టి డిమానిటైజేషన్‌దాకా ప్రతిదీ ఇక్కడున్నాయి. మరి సినిమాపాటలూ... అంటారా! రాశిలో తక్కువైనా ‘ది బెస్ట్‌ ఆఫ్‌ రెహ్మాన్‌’ కింద తమిళ, తెలుగు, హిందీ పాటలన్నీ ఈ ఛానెల్‌లో ఉన్నాయి. ఈ పాటలు ఇంకెక్కడా దొరకవు కాబట్టే ఈ ఛానల్‌ 17.5 లక్షలమందిదాకా సబ్‌స్క్రైబర్స్‌ని సొంతం చేసుకుంది. మొత్తం 33 కోట్లపైచిలుకు వ్యూస్‌ సాధించింది!


రాజాధిరాజా!
యూట్యూబ్‌ ఛానల్‌ విషయంలో లేట్‌గా వచ్చినా తాను లేటెస్టేనని నిరూపిస్తున్నారు సినీ సంగీత రాజాధిరాజు ఇళయరాజా! కొత్తతరంవాళ్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ ఛానల్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. ‘రాజా’కి దక్షిణాది మొత్తం అభిమానులున్నారు కదా... వాళ్లందరికీ, భాషలకతీతంగా పంచభక్ష్యపరమాన్నంలాంటి విందునిస్తుంది ఈ ఛానల్‌. ఆయన తన తొలినాళ్ల నుంచీ ఇప్పటిదాకా చేసిన, చేస్తూ ఉన్న సూపర్‌హిట్‌ సినిమాల పాటలన్నీ ఇందులో చూడొచ్చు. ఏవో ఒకట్రెంటు గీతాలు కాదు... ఏకంగా ఆల్బమ్‌లకి ఆల్బమ్‌లే విని ఆనందించొచ్చు. పాత పాటల్నీ చక్కటి డిజిటల్‌ ప్రమాణాలతో రికార్డు చేసి అందిస్తున్నారు. ఇళయరాజా ఇంటర్వ్యూలూ, ఇతర ఆల్బమ్‌లూ, ఆయనకి సంబంధించిన డాక్యుమెంట్రీలు కూడా ఉన్నాయిందులో.


డీఎస్పీ ఊపు!
తెర వెనకే కాదు... సినిమాలకి బయటా తన ఊపూ ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తుంటాడు ‘రాక్‌స్టార్‌’ దేవిశ్రీ ప్రసాద్‌. ఇక, ఆయన చేసే డాన్సుల గురించీ చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తన ఛానల్‌ని వేదికగా మార్చాడు డీఎస్పీ. తన గురువు మాండలిన్‌ శ్రీనివాస్‌, మైఖెల్‌ జాక్సన్‌, శ్రీదేవీలకి నివాళులర్పించినా, మెగాస్టార్‌ చిరంజీవికి పాటలతో హ్యాపీ బర్త్‌డే చెప్పినా తనదైన ముద్రతో ఎలా కట్టిపడేస్తాడో ఇందులోని స్పెషల్‌ వీడియోలు నిరూపిస్తాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికాల్లో ఆయన చేసిన సంగీతపర్యటనల పూర్తి నిడివి వీడియోలు ఈ ఛానల్‌కి అదనపు ఆకర్షణ. ఇవిపోగా, డీఎస్పీ తమిళం, తెలుగుల్లో చేసిన సూపర్‌హిట్‌ ఆల్బమ్‌లు ఉండనే ఉన్నాయి.


ఆ ఇద్దరూ...
తెలుగు సినిమా సంగీతమనే ఇంద్రచాపానికి ప్రత్యేక రంగులద్దుతుంటారు యువ సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌, మిక్కీ జె.మేయర్‌లు. వీళ్లలో సీనియర్‌ అనూప్‌ రూబెన్స్‌ ఛానల్‌లో సృష్టించిన అపురూప గీతాల మేకింగ్‌ వీడియోలున్నాయి. ‘జై’ సినిమాలోని ‘దేశం మనదే...’ నుంచి ‘మనం’లోని ‘కనిపించని మా అమ్మకి...’ దాకా వినసొంపైన ఎన్నో మెలోడీలని ఇందులో ఆస్వాదించొచ్చు. ఇవే కాకుండా క్రిస్మస్‌, స్వాతంత్య్ర, వికలాంగుల దినోత్సవాల కోసం ఆయన రూపొందించిన గీతాలు మరో విశేషం. ముఖ్యంగా మానసిక వికలాంగుల కోసం చేసిన ‘లవ్‌ ఇట్‌ డ్రీమ్‌ ఇట్‌...’ పాట తన సంగీతంతో శ్రోతల్లో అనూప్‌ ఎంత చక్కటి ఉద్వేగాలని నింపగలరో చెబుతుంది. ఇక, మిక్కీ జె.మేయర్‌ ఈ మధ్యే ఛానల్‌ ప్రారంభించారు. ఇందులో ‘మహానటి’లో ఆయన చూపిన సంగీత వైభవాన్ని కాస్త విభిన్నంగా వినొచ్చు. ఆ సినిమాలోని టైటిల్‌ పాటని పూర్తిగా విదేశీయుల చేత పాడిస్తూ మేయర్‌ చేసిన కవర్‌ మైమరపిస్తుంది!


8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు