close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిట్టెలుకకి పూలపాన్పు

పువ్వులో ఒదిగి చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ చిట్టెలుక పేరు హార్వెస్ట్‌ మౌస్‌. పువ్వుల్లో పువ్వై అన్నట్లు వాటిలో కలిసిపోయే హార్వెస్ట్‌ మౌస్‌లు చూపరుల్ని కట్టిపడేస్తాయి. పచ్చిక మైదానాలూ, పంట పొలాల్లో అటూఇటూ తిరుగుతూ ఇవి చేసే సందడిని చూస్తుంటే కళ్లను తిప్పుకోలేమనుకోండి. యూరప్‌, ఆసియా ఖండాల్లో ఎక్కువగా కనిపించే వీటి ఆవాసం పచ్చికమైదానాలూ పంటపొలాలూ పూలూ వెదురు బొంగులే. అంత చిన్న పువ్వుల్లో నుంచి తొంగిచూస్తుండే వీటితో ఫొటోల్ని తీసుకోవడానికి ఎంతోమంది పోటీపడతారు.

 


ఇది పిల్లలు నడిపే రైలు

సాధారణంగా ఏ ఉద్యోగమైనా- పెద్దవాళ్లే చేస్తారు. రైల్వే శాఖలోనూ అంతే. రైళ్ల రాకపోకల సమాచారం అందించే అనౌన్సర్‌, టికెట్లు జారీ చేసే వ్యక్తి, టికెట్‌ కలెక్టర్‌, స్టేషన్‌ మాస్టర్‌... ఇలా అన్ని బాధ్యతలనూ పెద్దవారే నిర్వర్తిస్తారు. దీనికి భిన్నంగా ఓ రైల్వే స్టేషన్‌లో మాత్రం పిల్లలే అనౌన్సర్లూ, స్టేషన్‌ మాస్టర్లూ. వారే టికెట్లు ఇస్తారు, రైలును తనిఖీ చేస్తారు. ఆ విశేషాల్ని తెలుసుకోవాలంటే హంగరిలోని బుడాపెస్ట్‌కు వెళ్లాల్సిందే. అక్కడి బుడాహిల్స్‌లోని స్జెచెన్యి నుంచి హువోస్వోల్గీ మధ్య నడిచే రైల్లో ఇంజిన్‌ డ్రైవర్‌ మినహా మిగిలిన బాధ్యతలన్నింటినీ పది నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలే నిర్వర్తిస్తారు. యూనిఫామ్‌ ధరించి వారికి కేటాయించిన వేళల్లో విధులకు హాజరవుతారు. అంకితభావాన్ని పెంపొందించుకుంటూ బృందస్ఫూర్తితో బాధ్యతాయుతంగా మెలగడం చిన్నతనం నుంచే అలవాటు కావాలన్న ఉద్దేశంతోనే అక్కడి రైల్వే యంత్రాంగం గత కొన్ని దశాబ్దాలుగా పిల్లలతో పనిచేయిస్తోంది. రైల్లో పనిచేస్తుంటే మరి చదువు సంగతేంటీ అన్న అనుమానం వస్తుంది కదూ! వారు ఓ వైపు చదువుకుంటూనే ఇలా స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తారు. దీనికి పాఠశాలల అనుమతీ ఉంటుంది. సెలవు రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు విధులకు హాజరవుతుంటారు. స్జెచెన్యి నుంచీ హువోస్వోల్గీ మధ్య దాదాపు పన్నెండు కిలోమీటర్లు నడిచే ఈ రైలు ఎనిమిది స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులకు సేవల్ని అందిస్తుంది.


బసవన్నకు వేరుశనగల అభిషేకం

సాధారణంగా దేవుడికి వేటితో అభిషేకం చేస్తారు... పంచామృతాలూ పుష్పాలతోనే కదా. కానీ ఆ దేవుడికి మాత్రం భక్తులు వేరుశనగల కాయలతో అభిషేకం చేస్తారు. బసవేశ్వరుడు వేరుశనగల్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడని వారి నమ్మకం. బెంగళూరులోని బసవేశ్వర ఆలయంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీని వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం నగర సమీపంలో రైతులు సాగు చేసే వేరుశనగ పంటను దొంగలు రాత్రి వేళల్లో ఎత్తుకెళ్తూ నష్టపరిచేవారు. దీంతో రైతులు రాత్రిళ్లు పంటకు కాపలా ఉండేవారు. అప్పుడే పంటను కాపాడటానికి మహాశివుడు బసవన్నను పంపాడనీ, ఈ విషయం తెలియని రైతులు పంట పాడు చేస్తోందని దాన్ని చంపేశారనీ, దాంతో నందీశ్వరుడు పంటకు శాపం పెట్టాడనీ, తరవాత వాస్తవం తెలుసుకున్న రైతులు అక్కడ బసవన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేరుశనగలతో అభిషేకం చేస్తున్నారనీ, అప్పటి నుంచీ పంట దిగుబడి పెరిగిందనీ ప్రచారంలో ఉంది. అందుకే, పంట బాగా పండి లాభాలు రావాలంటూ రైతులూ భక్తులూ ఇప్పటికీ బసవన్నకు వేరుశనగలతో అభిషేకం చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


ఈ సంతలో వాహనాలూ అమ్ముతారు!

మామూలుగా ఏ సంతలో అయినా కూరగాయలూ పండ్లూ అమ్ముతారు. మహా అయితే పిల్లల ఆట వస్తువుల్నీ విక్రయిస్తారు. కానీ ఆ సంతకు వెళ్తే మాత్రం ఎంచక్కా బైక్‌లూ కార్లూ ఆటోలూ కొనుక్కోవచ్చు. సంతేంటీ, బైక్‌లూ కార్లూ కొనుక్కోవడమేంటీ అనుకుంటున్నారా... అవును, తెలంగాణలోని కామారెడ్డిలో నిర్వహించే వారసంతలో కూరగాయలూ పండ్లూ ఆట వస్తువులూ మాత్రమే కాదు... మనకు నచ్చిన వాహనాల్నీ కొనుక్కోవచ్చు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి గురువారం వార సంత నిర్వహిస్తున్నారు. ఇందులోనే కొందరు తమ వాహనాల్నీ అమ్మకానికి పెడుతున్నారు. అవసరమున్న వారు తమకు నచ్చిన వాహనాన్ని కొనుక్కొని తీసుకెళ్లొచ్చు. ఈ సంతకు చుట్టుపక్కల జిల్లాలవారూ వాహనాల్ని కొనుక్కోవడానికి వస్తుండగా ప్రతివారం ముఫ్పై నుంచి యాభై వాహనాల దాకా అమ్ముడుపోతుండడం విశేషం.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు