close

పదివేలకే బీఎండబ్ల్యూ...

పుట్టినరోజున మెర్సిడీస్‌ బెంజ్‌లో, పెళ్లిరోజున ఆడీలో... ఇలా సందర్భానికో లగ్జరీ కారులో తిరిగే అదృష్టం కోటీశ్వరులకు తప్ప ఇంకెవరికి ఉంటుంది... అనుకోవద్దు. ఇప్పుడు అలాంటి అవకాశం మధ్య తరగతికీ కల్పిస్తోంది ‘ఎకో రెంట్‌ ఎ కార్‌’. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ కార్లూ, ఎస్‌యూవీల్ని అద్దెకు ఇస్తుంది. ఈ సంస్థ దగ్గర మన మార్కెట్‌లో ఉన్న లగ్జరీ కార్లన్నీ ఉంటాయి. ఇంకా కావాలనుకుంటే విదేశాల నుంచీ తెప్పిస్తారు. ఈ కార్ల అద్దె రోజుకు రూ.10వేల వరకూ ఉంటోంది. బారాత్‌కీ, కొత్తదంపతులు పెళ్లివేదిక నుంచి ఇంటికి రావడానికీ లగ్జరీ కార్లని బుక్‌ చేస్తున్నారట యువత. వధూవరులు పెళ్లివేదిక నుంచి వెళ్లేటపుడు క్రైస్లర్‌ లెమిజిన్‌ కారునీ, బారాత్‌కి మెర్సిడీస్‌ స్ప్రింటర్‌నీ వినియోగించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెబుతారు సంస్థ వ్యవస్థాపకుడు ఆదిత్య లూంబ. లెమిజిన్‌ అద్దె రోజుకు రూ.15వేలు. డ్రైవర్‌తోపాటూ, డ్రైవర్‌ లేకుండానూ ఈ కార్లు అద్దెకు దొరుకుతాయి. దేశవ్యాప్తంగా నలభై నగరాల్లో ఈ సంస్థ సేవల్ని అందిస్తోంది. ఈ సంస్థకు లగ్జరీ కార్ల బుకింగ్స్‌లో 20 శాతం తెలుగు రాష్ట్రాలనుంచే వస్తున్నాయట. 


అనుభవించు రాజా!

పెళ్లికి సవ్యసాచి ముఖర్జీ దుస్తులూ, వీకెండ్‌కి బెంజ్‌ కారులో షికార్లూ, స్టార్‌ హోటల్‌ ఈతకొలనులో స్విమ్మింగ్‌... ఇవన్నీ ఖరీదైన అలవాట్లు. శ్రీమంతులు మాత్రమే తీర్చుకోగలిగే కోరికలు. కానీ ఇప్పుడు మధ్య తరగతి యువత కూడా తమ కోరికల జాబితాలో వీటిని చేర్చుతోంది. కారణం వీటిని అద్దెకు అందించే సంస్థలు రావడమే!

డిజైనర్‌ దుస్తులు పది శాతానికే...రీతూ కుమార్‌, అంజు మోదీ, సవ్యసాచి ముఖర్జీ, మనీష్‌ మల్హోత్ర... లాంటి ప్రఖ్యాత డిజైనర్ల చేతుల్లో రూపొందిన దుస్తులు కొనాలంటే రూ.50వేలకు అటూఇటూగా ఖర్చుచేయాల్సిందే. కానీ ‘స్టేజ్‌త్రీ’ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఆ డిజైనర్ల దుస్తుల్ని కేవలం అందులో పది శాతం ధరకే పొందొచ్చు. కాకపోతే మూడురోజుల్లో తిరిగిచ్చేయాలి. ఆరు రోజులపాటు ఉంచుకోవాలనుకుంటే మరికొంత మొత్తం చెల్లించాలి. ముంబయి కేంద్రంగా సబేనా పూరీ, సంచిత్‌ బవేజా 2017లో ఈ సంస్థని ప్రారంభించారు. వీరు పదుల సంఖ్యలో డిజైనర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా పది ప్రధాన మెట్రో నగరాల నుంచి ఖాతాదారులున్నారు. వీరి దగ్గర వివాహాది శుభకార్యాలకూ, పార్టీలకూ సరిపోయేలా లెహంగాలూ, అనార్కలీ డ్రెస్‌లూ, గౌన్లూ, చీరలూ, షేర్వాణీలూ, సూట్‌లూ, నెహ్రూ జాకెట్‌లూ, కుర్తాపైజమాలూ ఉంటాయి. వీటికి అద్దెలు రూ.1000-10,000 వరకూ ఉంటాయి. నెలకు దేశవ్యాప్తంగా 20వేల మంది వీరి సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. వారిలో మహిళలే 85 శాతం. ఇటీవల కాలంలో సినిమా, టీవీ నిర్మాణ సంస్థలూ వీరి సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఆ జాబితాలో రెడ్‌ చిల్లీస్‌, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఉన్నాయి. ఒకసారి అద్దెకు తీసుకున్న వ్యక్తినుంచి తిరిగివచ్చిన దుస్తుల్ని వాషింగ్‌-ఐరన్‌, డ్రైక్లీనింగ్‌చేయడంద్వారా మళ్లీ కొత్తగా కనిపించేలా చేస్తారు. దుస్తులతోపాటు జ్యువెలరీ కూడా వీరి వెబ్‌సైట్లో అద్దెకు దొరుకుతుంది. అంతేకాదు, ఎవరి దగ్గరైనా డిజైనర్‌ దుస్తులు ఉంటే, వాటిని వీరి సాయంతో అద్దెకు ఇవ్వొచ్చు కూడా. వీరికి దిల్లీలో ఆఫ్‌లైన్‌ స్టోర్‌ కూడా ఉంది. 


లగ్జరీ హోటల్‌లో జిమ్‌...

అమెరికాలో బీబీఏ చేశాడు యశ్‌ మాలిక్‌. అప్పుడే అక్కడ బహుళ జాతి సంస్థల్లో పనిచేశాడు కూడా. యశ్‌... వ్యాయామాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. చిన్నప్పట్నుంచీ స్విమ్మింగ్‌ అలవాటు. మన దగ్గర మంచి స్విమ్మింగ్‌ పూల్‌ దొరకడం పెద్ద సవాలు. గృహ సముదాయాల్లో స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉండేది తక్కువ. ఉన్నా, రద్దీ ఎక్కువ. తనకు కావాల్సిన స్థాయి శుభ్రతతో స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉండేది లగ్జరీ హోటల్స్‌లో మాత్రమేనని అర్థమైంది యశ్‌కి. కానీ హోటల్‌లో దిగకుండా కేవలం పూల్‌ వినియోగించుకుంటామంటే చాలా హోటళ్లు ఒప్పుకోలేదు. దిల్లీలో ఒకే ఒక్క హోటల్‌ మాత్రమే అందుకు అంగీకరించింది. అప్పుడే హోటళ్లలో ఉండే స్విమ్మింగ్‌ పూళ్లూ, జిమ్‌లూ, స్పా/సెలూన్‌ సేవల్ని బయటివారికి అందుబాటులోకి తేవొచ్చనే వ్యాపార ఆలోచన అతడికి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ‘ది లక్స్‌పాస్‌’ పేరుతో వెబ్‌సైట్‌, ఆప్‌లను తెచ్చి సేవల్ని ప్రారంభించాడు. దిల్లీ, ముంబయి నగరాల్లో 25 హోటళ్లలో ప్రస్తుతం ఇలాంటి సేవల్ని అందిస్తున్నాడు. తక్కువలో తక్కువ రూ.500 చెల్లించి ఈ హోటళ్లలోని కొలనుల్లో ఈత కొట్టొచ్చు. ఈ సేవలతోపాటు రోజులో కొన్ని గంటలు మాత్రమే హోటల్‌ గది అవసరమైనవారూ ఈ ఆప్‌/వెబ్‌సైట్‌ ద్వారా గదుల్ని బుక్‌చేసుకునే వెసులుబాటునీ కల్పిస్తున్నాడు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

సెల్‌ఫోన్‌ను తయారుచేసి, తొలిసారిగా వాడిన కంపెనీ మోటారోలా అయితే దాని రూపకల్పనలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఆ కంపెనీ ఇంజినీర్‌ కమ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన మార్టీ కూపర్‌. ఆ మొబైల్‌ ఫోన్‌ నుంచి ఆయన ఏప్రిల్‌ 3, 1973న తొలి కాల్‌ మాట్లాడారట.


మీకు తెలుసా!

పావురాల గొంతులో సంచిలాంటి గ్రంధి ఉంటుంది. పెద్ద పావురాలు తాము తెచ్చిన ధాన్యపు గింజల్నీ విత్తనాల్నీ ఆ సంచిలో కాసేపు నాననిస్తాయి. అప్పుడు అందులో నుంచి పాలవంటి చిక్కని ద్రవం ఉత్పత్తి అవుతుంది. ఆ పాలను పిల్లల నోటిలో వేస్తాయి. రెక్కలొచ్చి గూడు వదిలి వెళ్ళిపోయే వరకూ పావురాల పిల్లలకు ఆ పాలే ప్రధాన ఆహారం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.