close

అక్కడికి వెళితే వైకుంఠానికి చేరినట్లే!

‘ముక్తినాథ్‌... పేరులోనే ఉంది ముక్తినిచ్చే దేవుడని. అంతటి మహత్తు కలిగిన దేవుడి ఆలయాన్ని చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే’ అంటూ ఆ యాత్రా విశేషాలనూ ఆలయ ప్రాశస్త్యాన్నీ వివరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన నున్నా వేణుగోపాలరావు.

ఈయాత్రకోసం 45 మందితో కూడిన బృందంతో కలిసి సికింద్రాబాద్‌ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాం. మొదటి మజిలీగా అలహాబాద్‌ ప్రయాగరాజ్‌ దగ్గర దిగి, త్రివేణీ సంగమంలో స్నానం చేసి, అక్కడి నుంచి మాధవేశ్వరీ శక్తి పీఠాన్నీ భరద్వాజ మహర్షి ఆశ్రమాన్నీ దర్శించి వారణాసికి చేరుకున్నాం. కాశీ విశ్వేశ్వరుడినీ విశాలాక్షినీ అన్నపూర్ణనీ దర్శించుకుని రైల్లో నేపాల్‌ సరిహద్దు పట్టణమైన గోరఖ్‌పూర్‌కి చేరుకున్నాం. గోరఖ్‌నాథ్‌ మందిరాన్ని దర్శించుకున్నాక బస్సులో నేపాల్‌ బయలుదేరాం. సరిహద్దును దాటి నేపాల్‌లోకి ప్రవేశించాం. భారత్‌ వైపున్న సరిహద్దు పట్టణం నునౌలి కాగా, నేపాల్‌ వైపు బెలాహియా. ఈ రెండూ దుమ్మూధూళితో నిండి ఉంటాయి. ఇక్కడ భారత్‌ నుంచి నేపాల్‌కు సరకులను రవాణా చేసే లారీల రద్దీ ఎక్కువ.

ఎవరెస్ట్‌ శిఖరాన్నీ చూశాం!
నేపాల్‌లో ఎక్కడైనా మన రూపాయల్ని తీసుకుంటారు. మన కరెన్సీకి అక్కడ డిమాండ్‌ ఎక్కువ. ఆ దేశ కరెన్సీ కూడా ఉంటే మంచిదని మన కరెన్సీని మార్చుకున్నాం. మన వందకి నేపాల్‌లో నూట అరవై రూపాయలు వస్తాయి. పాస్‌పోర్టూ వీసా అక్కర్లేదు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని బయలుదేరేటప్పటికి ఆలస్యమైంది. దాంతో మేం లుంబినీకి వెళ్లేసరికి ఆలయం మూసేశారు. అక్కడినుంచి బయలుదేరి రాత్రికి పోఖ్రాకి చేరుకున్నాం. ముక్తినాథ్‌కు బస్సులో వెళ్లలేని వారికి పోఖ్రా నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాతావరణ అనుకూలతను బట్టి వీటిని నడపడం లేదా రద్దు చేయడం చేస్తుంటారు. అలాగే ఇక్కడి నుంచి ఎవరెస్టు శిఖరం చూడ్డానికీ, దానిచుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా మరో సర్వీసు కూడా ఉందట. మేం ఉన్న హోటల్‌ వాళ్లు చెప్పినదాని ప్రకారం- పైకి వెళ్లి చూస్తే ఎవరెస్టు శిఖరం, దాని సమీపానికి వెళ్లే బస్సు మార్గం కనిపించాయి. దాంతో అక్కడినుంచే దాన్ని చూసి సంతృప్తిచెందాం. తరవాత పోఖ్రాలో భూగర్భంలో ఉన్న గుప్తేశ్వర ఆలయాన్నీ దర్శించుకుని ముక్తినాథ్‌కు బయలుదేరాం.

అదిగో... ముక్తినాథుడి ఆలయం!
అక్కడికి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది ముక్తినాథ్‌. ఆ రోడ్డంతా కొండలమీదే ఉంటుంది. ఒకవైపు నిలువెత్తు పర్వతాలూ మరోవైపు పాతాళాన్ని తలపించే లోయలూ భయకంపితుల్ని చేస్తుంటాయి. బస్సు వెళుతుంది కాబట్టి దాన్ని రోడ్డు అనుకోవాలేగానీ లేకపోతే అదో మార్గం అని కూడా తెలీదు. అన్నీ గుంతలే. దాంతో మేం ఎక్కిన బస్సు కిందకీ పైకీ ఊగుతూ వెళుతోంది. వర్షాకాలంలో అయితే మోకాలి లోతు బురద ఉంటుందట. దీనికితోడు అక్కడక్కడా కొండచరియలు విరిగి రోడ్డుమీద పడు తుంటాయి. సంబంధిత సిబ్బంది వచ్చి రోడ్డు మీద పడిన రాళ్లనూ మట్టినీ తొలగించేవరకూ వాహనాలన్నీ నిలిచిపోతాయి. ఒక్కోసారి ఒకట్రెండు రోజులు కూడా పట్టొచ్చు. మేం వెళుతుంటే ఓ కొండచరియ విరిగి మా బస్సు కిటికీ అద్దాన్ని పిప్పి చేసేసింది. బస్సులో ఒకామెకు గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అంతకుమించి ఎలాంటి ప్రమాదమూ జరగనందుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడెప్పుడు గుడిని చేరుకుంటామా అన్నట్లు కూర్చున్నాం. అయితే ఇంతటి భయానక స్థితిలోనూ కిటికీలోంచి చూస్తే ఆహ్లాదరకమైన ప్రకృతి దృశ్యాలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. ఆకాశం నుంచి గంగ కిందకు దూకుతుందా అన్నట్లు పర్వత శిఖరాల నుంచి జాలువారే జలపాతాలూ, దారి పొడవునా ఎవరో తరుముకొస్తున్నట్లుగా తెల్లటి నురగలు కక్కుకుంటూ పరుగులు తీస్తోన్న నదులూ, మబ్బులతో పోటీపడుతున్నట్లుండే ఎత్తైన పర్వత శిఖరాలూ, కొండలలో అక్కడక్కడా కట్టుకున్న ఇళ్ల నుంచి మిణుకుమిణుకుమంటూ కనబడే విద్యుద్దీపాలూ... ఇలా ఎన్నో దృశ్యాలు కనువిందు చేస్తుంటే వాటిని చూస్తూ కొండపైకి ప్రయాణించాం. ఎట్టకేలకు నేపాల్‌లోని ధవళ వర్ణంలో మెరిసిపోతున్న హిమాలయ పర్వతాల్లో అన్నపూర్ణ ట్రెక్కింగ్‌ సర్క్యూట్‌ పరిధిలో సముద్ర మట్టానికి 3,710 మీటర్ల ఎత్తులో ఉన్న ముక్తినాథ్‌ దివ్యదేశానికి చేరుకున్నాం. రాణి పౌవ అనే గ్రామం వద్దనున్న ఈ ఆలయం, 51 శక్తిపీఠాలలో ఒకటిగా చెబుతారు.

దివ్యదేశాల్లో ఒకటి!
వైష్ణవ విశ్వాసాల ప్రకారం- శ్రీమహావిష్ణువు కొలువైన క్షేత్రాలు 108 ఉన్నాయి. వీటిని దివ్యదేశాలుగా పేర్కొంటారు. ఇంకో రెండు అడుగులు వేస్తే వైకుంఠం చేరుకుంటాం అనేట్లుగా ఉన్న ఈ ముక్తినాథ్‌ ఆలయం 106వది అన్నమాట. ఈ భూమి మీద మొత్తం 106 మాత్రమే వైష్ణవ దివ్యదేశాలు ఉన్నాయి. 107వది క్షీరసాగరం కాగా, 108వది పరమపథం అంటే- శ్రీ వైకుంఠం. యాత్రలు చేయడానికి చివరి రెండూ అందుబాటులో ఉండవు కాబట్టి భూలోకంలో చిట్టచివరి వైష్ణవ దివ్యదేశం ఇదే. వీటిల్లో 105 మనదేశంలోనే ఉండగా 106వది నేపాల్‌లో ఉంది. ఒకటో దివ్యదేశమైన శ్రీరంగం నుంచి ఉత్తరదిశగా పయనిస్తూ పోతే 96వది తిరుమల ఆలయం.

స్వయం వ్యక్త క్షేత్రం!
ముక్తినాథ్‌ మరో ప్రత్యేకత ఏమంటే ఇది నారాయణుడి స్వయం వ్యక్త క్షేత్రం. మొత్తం 108 దివ్య దేశాల్లో 8 మాత్రమే శ్రీమహావిష్ణువు స్వయం వ్యక్త క్షేత్రాలు ఉన్నాయి. అవేమంటే- శ్రీరంగం, తిరుమల, నైమిశారణ్యం, తోటాద్రి, పుష్కర్‌, బదరీనాథ్‌, శ్రీముష్ణం, ముక్తినాథ్‌లు. ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవీ సమేత ముక్తినారాయణ స్వామిగా విష్ణుమూర్తి పూజలందుకుంటున్నారు. మూల మూర్తులతో పాటు ఇక్కడ సరస్వతి, జానకి, లవకుశులు, గరుత్మంతుడు, సప్తరుషుల మూర్తులు ఉన్నాయి. జనన మరణ చక్రభ్రమణంతో కూడిన ఈ ప్రపంచం ఒక మాయ అని భావించే హిందువులు, దాని నుంచి తప్పించుకుని ముక్తిని పొందాలని భావిస్తుంటారు. ముక్తినాథ్‌ ఆలయ దర్శనం ఈ లక్ష్యసాధనకు ఉపకరిస్తుందని వారి నమ్మకం. స్థలపురాణం ప్రకారం- జలంధరుడు అనే రాక్షసుడి భార్య బృంద ఇచ్చిన శాపం నుంచి విష్ణుమూర్తి ముక్తినాథ్‌ వద్ద శాప విముక్తుడయ్యాడనీ, అందుకనే ఇక్కడ ఆయనను ముక్తినాథుడుగా పూజిస్తారనీ చెబుతారు.

ఆలయం వెనక వైపున వరసగా 108 నందుల నోటి నుంచి చల్లటి నీరు(ముక్తిధారలు) కొంచెం ఎత్తు నుంచి కింద పడుతూ ఉంటుంది. దర్శనానికి వచ్చిన భక్తులు వరసగా ఒకటో నంది నుంచి 108వ నంది వరకూ తలమీద పడేలా వాటి కింద నడిచి వెళ్తుంటారు. ముక్తిధారతో స్నానం పూర్తికాగానే గుడి ముందు లక్ష్మీ, సరస్వతుల పేరిట ఉన్న రెండు కుండాలలో దిగి స్నానం చేసినవారికి తప్పకుండా ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ మూడింటికి నీరు కాలాగండకీ నది నుంచి వచ్చేట్లుగా ఏర్పాటుచేశారు. ముక్తినాథ్‌ దిగువన ఉన్న కాలాగండకీ నది పరీవాహ ప్రాంతంలోనే సాలగ్రామ శిలలు లభిస్తాయి. వైష్ణవాలయంలో సాలగ్రామ శిల తప్పనిసరిగా ఉంటుంది.

ఈ ఆలయం ఇటు హిందువులకూ అటు బౌద్ధులకూ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయంలోని పూజాదికాలన్నీ బౌద్ధుల నిర్వహణలో జరుగుతుంటాయి. భక్తులు ఇచ్చే విరాళాలను వారే స్వీకరిస్తుంటారు. గర్భాలయంలో బౌద్ధ సన్యాసిని ఒకరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహం ఉంది. టిబెట్లో బౌద్ధానికి ఆద్యుడుగా చెప్పుకునే పద్మసంభవుడు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. అక్కడ నుంచి నేరుగా సీతమ్మవారు తన బాల్యం గడిపిన, వివాహం చేసుకున్న ప్రాంతంగా చెప్పుకునే జనకపురికి చేరుకున్నాం. జనకపురిలోని ఆ మందిరం అత్యంత సుందరంగా ఉంటుంది. దీన్లో సీతాదేవి పుట్టినప్పటినుంచీ వివాహం జరిగేవరకూ వివిధ ఘట్టాలను కదిలే బొమ్మల ద్వారా చూడముచ్చటగా ఓ ప్రదర్శన ఏర్పాటుచేశారు. దీనికి పది రూపాయల టిక్కెట్టు. ఆ తరవాత అక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్‌ ధామ్‌కు వెళ్లాం. అది శ్రీరాముడు శివుని విల్లు విరిచిన ప్రదేశంగా చెబుతారు. అక్కడ విల్లు విరిచినప్పుడు ఏర్పడినవిగా చెప్పే కొన్ని ముక్కలను శిలాజ రూపంలో మనం చూడొచ్చు. అనంతరం ఖాట్మండుకు వెళ్లాం.

పశుపతినాథుడి ఆలయం!
ముందుగా పశుపతినాథ్‌ ఆలయానికి వెళ్లాం. అది చాలా పెద్ద గుడి. ఆవరణలోకి ప్రవేశించగానే పండిట్‌లు ఎదురై అభిషేకం జరిపిస్తామని వచ్చారు. ఆలయం లోపల శివలింగానికి అభిషేకం చేయడం వీలు కాదు. కాబట్టి వెలుపలే అందరినీ కూర్చోబెట్టి సంకల్పం చెప్పించి, అభిషేక కార్యక్రమాన్ని ముగించి చివరలో అందరి మెడలో రుద్రాక్ష మాలలను వేశారు. అనంతరం లోపలకు వెళ్లి పశుపతి నాథుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. తరవాత ఎత్తైన కొండమీద ఉన్న మనోకామనాదేవి ఆలయానికి వెళ్లాం. ఇక్కడ అమ్మవారిని భక్తుల మనసులోని కోరికలు తీర్చే మనోకామనాదేవిగా చెప్పుకుంటారు. తిరుగు ప్రయాణంలో పశ్చిమబంగా వైపున నేపాల్‌ సరిహద్దు కాకరవిట్ట మీదుగా రాణిగంజ్‌ వద్ద భారత్‌లో ప్రవేశించి, నక్సలైట్‌ ఉద్యమం ఆరంభమైన నక్సల్బరీ మీదుగా డార్జిలింగ్‌ చేరుకున్నాం. అక్కడినుంచి మర్నాడు కోల్‌కతాకి చేరుకుని, కాళీమాతను దర్శించుకుని షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు తిరిగొచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.