close

మా ఇంటికి రండి..!

ఇంటికి చుట్టాలొస్తే పండగ. చుట్టాలుగా మరొకరింటికి వెళ్లినా మనకి పండగే. అభిమానంతో కూడిన పలకరింపులూ ప్రేమగా కొసరికొసరి వడ్డింపులూ... పదిమందీ చేరి పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడమూ కష్టసుఖాలు కలబోసుకోవడమూ... మనసుకు ఊరటనిస్తాయి, ఉత్సాహాన్నిస్తాయి. అందుకే చుట్టంచూపుగా ఎక్కడికైనా వెళ్లొస్తే కొన్నాళ్లపాటు భలే ఉల్లాసంగా ఉంటుంది. పర్యటకమూ ఆ కాన్సెప్ట్‌ని అందిపుచ్చుకోవటానికి కారణమదే. కొత్త కొత్త ప్రదేశాలు చూసిరావడానికి ఎక్కడికెళ్లినా ఇప్పుడు బస చేయడానికి చక్కటి ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. ‘కొత్త ప్రదేశమని కంగారు పడవద్దు, మా ఆతిథ్యం స్వీకరించండి, అచ్చం మీ ఇంట్లోలాగే స్వేచ్ఛగా ఉండండి’ అంటూ ఆహ్వానిస్తున్నారు గృహస్థులు.

చుట్టూ కొబ్బరి చెట్లూ, దూరంగా నీలాల సముద్రమూ... ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుందీ..! శతాబ్దాల క్రితం రాజులు నడచిన నేల. ఎత్తైన కోటగోడల మధ్య, విశాలమైన  రాజప్రాసాదాల్లో నెమ్మదిగా నడచివెళ్తుంటే- చారిత్రక వైభవం కళ్లముందు కదలాడదూ..!ఇంట్లో వెచ్చగా చలికాచుకుంటూనే కిటికీలోనుంచి కన్పించే ఎత్తైన మంచుకొండల్నీ జాలువారే జలపాతాల్నీ చూడటం భలే బాగుంటుంది కదూ..! కళ్లాపి చల్లిన వాకిట్లో అరుగు మీద తీరిగ్గా కూర్చుని కొట్టంలో తిరుగుతున్న లేగదూడల్ని చూస్తూ పక్కనే ఉన్న మల్లెతోట మీదుగా తేలివచ్చే పూల పరిమళాల్ని గుండెల నిండా పీల్చుకుంటే...ఆ హాయే వేరు కదా!


ఇలాంటి అనుభూతుల్ని ఇష్టపడని వారు అరుదు. అందుకే ఏ కాస్త అవకాశం దొరికినా రైలో బస్సో ఎక్కుతాడు మనిషి.ఉద్యోగవ్యాపారాల్తో అసలేమాత్రం తీరనివారో... లేదా ఇల్లే తీర్థం వాకిలే వారణాసి... అని సరిపెట్టుకునే ఏ కొద్దిమందో తప్పించి ఇవాళా రేపూ ప్రయాణాలు చేయని వారు ఉండరు. పై చదువులూ ట్రైనింగులూ, వ్యాపార పనులూ, కొత్త కొత్త ప్రాంతాలను చూడాలన్న ఆసక్తీ ఇలా రకరకాల కారణాలు మనిషిని పర్యటకుడిని చేస్తున్నాయి. రోజులూ వారాలూ ఒక్కోసారి నెలలూ ఇంటికి దూరంగా ఉంచుతున్నాయి. అలా ఉండాల్సివచ్చినప్పుడు ఒంటరిగా హోటళ్లలో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు, ఆర్థికంగానూ అది భారమే. అలాంటివారికి అందుబాటులో ఉంటున్నాయి ‘హోమ్‌స్టే ఫెసిలిటీస్‌’. స్థానికులు తాము ఉండే ఇంటిలోనే ఓ భాగాన్ని పర్యటకులకు అద్దెకిస్తారు. విద్యార్థుల దగ్గర్నుంచి టూరిస్టులవరకూ అందరికీ ఉపయోగకరంగా ఉండే ఈ ‘ఇంటి బస’ విధానం ఇప్పుడు దేశంలోని నగరాలన్నిట్లోనే కాదు, కొన్నిచోట్ల గ్రామాలూ ఆఖరికి గిరిజన గూడేల్లోనూ అందుబాటులో ఉంది. ఇంటికి దూరంగా ఉన్నవారికి ఇంటిని మరిపించేలాసేవలందించడమే వీటి ప్రత్యేకత.bఆతిథ్యానికి మరోపేరు భారతీయులని ప్రపంచదేశాల్లోనూ మనకి మంచిపేరు. అపరిచితులనైనా ఆదరణగా పలకరించి కడుపునిండా తిండిపెట్టి పంపడం అన్ని ప్రాంతాలవారికీ అలవాటే. ఆ అలవాటును గృహస్థుగా వారికీ, అతిథులుగా పర్యటకులకీ లాభసాటిగా మారుస్తోంది ఇంటిబస విధానం. కేవలం వ్యాపారంగా కాక ఆత్మీయతను రంగరించి ఆతిథ్యం ఇస్తారు. దాంతో స్వదేశీయులే కాక విదేశీయులు కూడా ఎక్కువగా ఇలాంటి వసతి సౌకర్యాలను ఇష్టపడడం వల్ల రాష్ట్రాల టూరిజం విభాగాలు కూడా ఇంటి బస విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

ఇల్లుంటే చాలు..!
సొంతింట్లో తాము నివసిస్తున్నా అదనంగా ఖాళీ గదులు ఉన్నవారు ఎవరైనా ‘ఇంటి బస’ కింద ఆ గదుల్ని అతిథులకు అద్దెకివ్వవచ్చు. టూరిజం శాఖ ద్వారానూ యాత్రా.కామ్‌, ఎయిర్‌బీఎన్‌బీ లాంటి ప్రైవేటు సంస్థలతోనూ నమోదు చేసుకుంటే పర్యటకులకు వీటి వివరాలు తెలుస్తాయి. కొందరు సొంతంగా వెబ్‌సైట్‌ పెట్టుకుని నిర్వహించుకునేవారూ ఉంటారు. ఇలా పర్యటకులకు ఇంటి బస కల్పించాలనుకునేవారు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. పడక గదీ బాత్రూములూ నీటి సౌకర్యమూ కనీస వసతుల కింద లెక్క. ఉదయం అల్పాహారం ఇవ్వాలి. ఇంటర్నెట్‌, టీవీ, పుస్తకాలూ పత్రికలతో చిన్న లైబ్రరీ... తదితరాలన్నీ అదనపు వసతులు. వసతుల్ని బట్టి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ బుక్‌ చేసుకునేవారికి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది.
పర్యటకుల ఆసక్తులు విభిన్నంగా ఉంటాయి. వాతావరణాన్ని ఆస్వాదించడానికి కొన్ని చోట్లకు వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొన్నిచోట్లకు వెళ్తారు. సంస్కృతీ సంప్రదాయాల గురించో చారిత్రక వారసత్వాన్ని చూడడానికో మరికొన్ని చోట్లకు వెళ్తారు. ఉద్యోగ, వ్యాపార పనులకోసం వెళ్లేవాళ్లూ, వైద్యం కోసం వెళ్లేవాళ్లూ కూడా ఉంటారు. అలా వెళ్లిన ప్రతిచోటా సౌకర్యవంతమైన హోటళ్లుండకపోవచ్చు. అటువంటప్పుడు ఇంటి బస సౌకర్యం చక్కగా ఉపయోగపడుతుంది. పర్యటకుల ఆసక్తులకు తగినట్లుగా వైవిధ్యంతో కూడిన బసలనుఏ బడ్జెట్‌లో కావాలంటే ఆ బడ్జెట్‌లో ఎంచుకోవచ్చు. ఒకటి రెండు రోజులతో మొదలుపెట్టి అత్యధికంగా సంవత్సరం వరకూ బస కల్పించేవీ ఉన్నాయి.

ఆ అనుభూతి వేరు!
ఓ చారిత్రక ప్రదేశాన్ని చూస్తాం. రాజభవనాన్నీ అక్కడ నివసించిన రాజుల వైభవాన్ని తెలిపే వస్తువుల్నీ చూశాక అదే నేపథ్యంలో అచ్చంగా ఆనాటి సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమంలో మనమూ కాసేపు లీనమైతే... ఆ అనుభూతే వేరుగా ఉంటుంది కదా. రాజభవనాలకు పేరొందిన జయపుర, ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌ లాంటి చోట్ల ఆ అవకాశం పర్యటకులకు లభిస్తుంది. ఆ రాజ భవనాలు ఇప్పుడు కొన్ని స్టార్‌ హోటళ్లుగా మారితే కొన్ని హోమ్‌స్టేలుగా సేవలందిస్తున్నాయి. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు పేరొందిన భవనాలు కూడా మిగిలిన సమయాల్లో అతిథులను అలరిస్తున్నాయి. రాజుల విందు భోజనాన్ని తలపించేలా అతిథులకు భోజనం వడ్డించడం, చరిత్ర కథల్ని ఆసక్తికరంగా చెప్పడం... లాంటివన్నీ చేస్తారు ఆ గృహస్థులు. రాచరిక మర్యాదలతో విలాసాలతో ఉండే ఈ ఖరీదైన భవనాల్లో బసకి సంపన్నులూ విదేశీయులూ వస్తుంటారు. ఒక్క రాజస్థాన్‌లోనే కాదు, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల్లోనూ వారసత్వంగా వచ్చిన పెద్ద పెద్ద భవనాలెన్నో ఇప్పుడు ఇంటిబసలుగా మారాయి. విలాసవంతంగా సెలవులు గడపాలనుకునేవారి అవసరాలు తీరుస్తున్నాయి. అలాగని ఈ సౌకర్యం సంపన్నులకే పరిమితం కాదు. రకరకాల కాన్సెప్టుల్లో ఎవరి అభిరుచికి తగిన ప్రాంతాన్నీ, ఇంటి బసనీ వారు ఎంచుకోవచ్చు.

తాతగారిల్లు!
నగరాల్లో పుట్టిపెరుగుతున్న ఇప్పటిపిల్లలకు అచ్చమైన పల్లెటూళ్లు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా బాల్యం గడచిపోతోందనుకున్న ఓ జంట వారికా అనుభూతిని కలిగించేందుకు ప్రారంభించిందే ‘ఆజోల్‌- ద విలేజ్‌ హోమ్‌స్టే’. మహారాష్ట్రలో లోనావాలాకి పాతిక కిలోమీటర్ల దూరంలో గోలెవాడి అనే పల్లె శివార్లలో రితేష్‌, యోగిని దంపతులు దీన్ని  నిర్వహిస్తున్నారు. ఆజోల్‌ అంటే మరాఠీలో ‘తాతగారిల్లు’ అని అర్థం. అన్ని సౌకర్యాలతో ఉండే ఈ పల్లెటూరి ఇంటి ఆవరణలో కోళ్లూ పాడిపశువులూ ఉంటాయి. చుట్టూ పచ్చని తోటలూ దూరంగా కొండలూ జలపాతాలూ కనిపిస్తుంటాయి. కాస్త దూరంలో ఓ ఆనకట్ట, అభయారణ్యాలూ ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉండదు. అచ్చం పల్లెటూళ్లో ఉన్నట్లు ప్రశాంతంగా ఉంటూ చుట్టుపక్కల వాటిని సందర్శించిరావచ్చు. రితేష్‌ దంపతులు ఊహించినట్లుగానే చాలామంది కుటుంబాలతో వచ్చి పల్లెటూరి జీవితం ఎలా ఉంటుందో పిల్లలకు చూపిస్తున్నారట.

గ్రామీణులకు ఉపాధి
తరచూ వరదలతో సతమతమయ్యే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ లాంటి రాష్ట్రాలు అటు పర్యటకాన్నీ ఇటు పల్లె ప్రజల ఆదాయాన్నీ పెంచడానికి ఇంటి బసని ఓ ఉపాధి మార్గంగా చేపట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి అందాలకూ దేవాలయాలకూ పేరొందిన ఈ ప్రాంతాలకు పర్యటకుల తాకిడి ఎక్కువే. అయితే వాళ్లు దూరంగా ఉన్న నగరాల్లో బస చేసి ఆయా ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటారు. వాటికి దగ్గరగా ఉన్న పల్లెల్లోనే బస ఏర్పాటు చేస్తే ఎక్కువ రోజులూ ఉంటారు, ఖర్చూ తగ్గుతుంది అనుకున్న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మొట్టమొదట నందాదేవి బయోస్ఫియర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టు సమీపంలోని మూడు గ్రామాల్లో గ్రామానికి ఐదేసి ఇళ్ల చొప్పున బస ఏర్పాట్లు చేయించింది. దానికి మంచి స్పందన రావడంతో ఇతర గ్రామాలూ అదే దారి పట్టాయి. దెహరాదూన్‌ ప్రాంతంలోని నాగ్‌టిబ్బా అనే గ్రామం మరొకడుగు ముందుకేసి ఫార్మ్‌స్టే పేరుతో ఇంటిబసని ఏర్పాటుచేసింది. అతిథులు వ్యవసాయ పనుల్ని చూడడమే కాక ఆసక్తి ఉన్నవారు పాలు పితకడం నుంచీ పొలం దున్నడం వరకూ ఏ పనైనా స్వయంగా చేయవచ్చు. ఈ పద్ధతిలో ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో చాలా ఇంటిబసలు ఏర్పాటయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వారాంతం సెలవులు గడపడానికి ఇలాంటి వాటిని ఎంచుకుంటున్నారు.

గ్రామాల్లో సౌకర్యాలు సరిగా ఉంటాయో లేదో అన్న సంశయంతో వచ్చే పర్యటకుల్ని శుభ్రమైన వసతిసౌకర్యాలతో మెప్పించడమే కాక, డబ్బు విషయంలోనూ వారి ఇష్టానికే ప్రాధాన్యమిస్తోంది గ్రీన్‌ పీపుల్‌ అనే స్వచ్ఛంద సంస్థ. ‘రణగొణ ధ్వనులు లేని ప్రశాంత వాతావరణంలో రెండురోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు అనుకునేవారికోసమే ఈ పల్లె నివాసాలు. పక్కా ఇళ్లున్న గ్రామీణులకూ గిరిజనులకూ ఆతిథ్యంలో శిక్షణ ఇచ్చి ఇంటిబస ఏర్పాటుచేయిస్తున్నాం. అతిథులు తమకు నచ్చినంత ఇవ్వచ్చు. పర్యటకులు ఎక్కువగా వస్తే స్థానిక ఉత్పత్తులకు గిరాకీ లభించి గ్రామీణులకు లాభసాటిగా ఉంటుంది’ అంటున్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు రూపేష్‌ రాయ్‌.

ఆత్మీయత అదనం
పైకి కన్పించడానికి హోటల్లో ఉండే సౌకర్యాలే ఉన్నాయనిపించినా ఇంటి బస వల్ల అదనపు వెసులుబాట్లు ఇంకెన్నో ఉన్నాయి. స్థూలంగా చూస్తే...

వ్యక్తిగత శ్రద్ధ: అతిథులు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంటివాళ్లు వ్యక్తిగత శ్రద్ధ చూపుతారు. సొంత చుట్టాలను చూసినట్లు అభిమానంగా చూస్తారు. ఇష్టాయిష్టాలను కనుక్కుని తగిన సేవలందిస్తారు.
భద్రత: మహిళలకూ ఒంటరిగా వెళ్లేవాళ్లకూ భద్రత ఉంటుంది. గృహస్థులు పెద్దదిక్కుగా ఉండి కావలసిన సహాయం అందజేస్తారు. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్య వచ్చినా పట్టించుకుంటారు. టాక్సీల వాళ్లూ షాపుల వాళ్లూ టూరిస్టులను మోసం చేయడమూ ఎక్కువ డబ్బు వసూలు చేయడమూ సహజం- ఇంటి యజమానుల సూచనలు పాటిస్తే మోసపోయే పరిస్థితి రాదు.
స్థానిక సమాచారం: ఇంటి యజమానులు అక్కడివారే కాబట్టి స్థానిక విశేషాలూ సందర్శనీయ ప్రాంతాల గురించీ బాగా తెలిసివుంటుంది. మనకి సమయమూ డబ్బూ వృథా కాకుండా అన్ని ప్రాంతాలనీ ఎలా చూడవచ్చో చెబుతారు.
ఇంటి భోజనం: బయటకు వెళ్లినా ఇంటి భోజనాన్ని మిస్సవకుండా మనకు నచ్చేలా వంటచేసి పెడతారు నిర్వాహకులు. వాళ్ల వంటగదిని వాడుకుని అతిథులే స్వయంగా వంట చేసుకునే వెసులుబాటూ కొన్నిచోట్ల ఉంటుంది. పిల్లలతో, పెద్దవారితో ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొత్త స్నేహాలు: పండగలూ వేడుకలప్పుడు అతిథుల్నీ తమతో కలుపుకోవడం, బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే వేడుకలకు తీసుకెళ్లడం లాంటివి చేస్తారు ఈ గృహస్థులు. అలా ఇక్కడివారితో కలిసిపోయి సంస్కృతీ సంప్రదాయాల గురించి దగ్గరగా తెలుసుకునే అవకాశం ఉంటుందని విదేశీయులు ఇంటిబసలను ఎక్కువగా ఇష్టపడతారు. గృహస్థులకూ అతిథులకూ మధ్య మంచి స్నేహబంధాలు ఏర్పడతాయి.

దేని ప్రత్యేకత దానిదే!
వారసత్వ సంపదను చాటే విలాసవంతమైన బంగళాలూ, బీచ్‌ హౌసులూ, పచ్చని ప్రకృతి ఒడిలోనో కాఫీ, టీ తోటల మధ్యో ప్రశాంతంగా సేదదీర్చే కాటేజీలూ, పల్లెటూరి వాతావరణాన్ని రుచిచూపించే ఫార్మ్‌స్టేలూ... ఇంటి బసల్లో దేని ప్రత్యేకత దానిదే. ఇవేవీ కాదు, ఏ ఆస్పత్రిలోనో చికిత్స తీసుకోవటానికో, ఏ ఉద్యోగానికో శిక్షణ పొందడానికో నగరం మధ్యలోనే ఓ నెల రోజులు ఉండాలనుకున్నా అలాంటివీ ఉన్నాయి. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌లో ఒక గదిని అద్దెకిచ్చేవారి నుంచీ విల్లాలను అద్దెకిస్తున్నవారి వరకూ కొన్ని వందల మంది ఇంటిబసలను నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో బీచ్‌కి దగ్గర్లో ఉన్న వాటికైతే మంచి డిమాండు ఉంది

నాసిక్‌ దగ్గర్లో ఉటోపియా ఫార్మ్‌స్టే నిర్వహిస్తున్నారు ఉత్తరా, అద్వైత్‌ ఖేర్‌లు. ఓరోజు ఉత్తర ఫోన్‌కి ఓ టెక్ట్స్‌ మెసేజ్‌ వచ్చింది. ‘అక్కా చాలా సంతోషంగా ఉంది. నేను కోరుకున్న ఉద్యోగం వచ్చింది’ అన్న ఆ సందేశం అమెరికా నుంచి వచ్చినట్లు ఫోన్‌ నంబరు చూస్తే తెలుస్తోంది. ఎంత ఆలోచించినా అమెరికాలో తనని అక్కా అని పిలిచే బంధువులెవరూ గుర్తురాలేదు ఆమెకి. వారం తర్వాత మళ్లీ ఈ-మెయిల్‌ వచ్చింది. ఏడాది క్రితం వాళ్ల ఆతిథ్యం పొంది వెళ్లిన ఓ యువతి ఇచ్చిన మెయిల్‌ అది. ఉద్యోగం వచ్చిందని శుభవార్త పంచుకున్నదీ ఆ యువతే. అది చూసి ఉత్తర కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘ఆమెకు మేము ఏమీ కాము, వారం రోజులు మా ఇంట్లో ఉండి వెళ్లినందుకే ఆత్మీయులతో పంచుకునే శుభవార్తని మాతో పంచుకుంది...’ అంటుంది ఉద్వేగంగా ఉత్తర. అదే ఇంటి బస మహత్యం. అది రెండు రోజులు తలదాచుకునే నాలుగు గోడల గది కాదు... నాలుగు కాలాలపాటు నిలిచే అనుబంధాలకూ పునాది. అందుకే పర్యటకుల మనసును అంతగా దోచుకుంటోంది.


మిలెనియల్స్‌ దారే వేరు!

మయూర్‌ శెట్టికి తాను కోరుకున్న సబ్జెక్టులో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేయడానికి సీటొచ్చింది. అందుకు కారణం డిగ్రీలో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. మరేంటంటే- బెంగళూరుకు చెందిన మయూర్‌ పర్యటకుడిగా కశ్మీర్‌ వెళ్లాడు. అక్కడ ఓ మారుమూల పల్లెలో పిల్లలు మైళ్లకొద్దీ దూరం నడిచి బడికెళ్లడం చూశాడు. చదువు పట్ల వారి ఆసక్తికి ముచ్చటపడి రెణ్ణెల్లపాటు అక్కడే ఉండి, ప్రధానోపాధ్యాయుడి అనుమతితో విద్యార్థులకు కంప్యూటరు వాడకం, ఇంగ్లిష్‌ మాట్లాడడం లాంటివి నేర్పించాడు. అతడి క్లాసుల వల్ల పిల్లల్లో పెరిగిన ఉత్సాహాన్ని చూసి ప్రధానోపాధ్యాయుడు మయూర్‌ని ప్రశంసిస్తూ ఓ లేఖ ఇచ్చాడు. ఆ లేఖే అతడికి పీజీలో సీటు సంపాదించిపెట్టింది. టూరిజాన్నీ స్వచ్ఛంద సేవనీ ముడిపెడుతూ ఈ మధ్య యువత చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పై చదువులకీ ఉద్యోగాలకీ వెళ్లే ముందు ఇలా చేయడం వల్ల సమాజానికి సేవ చేసినట్లూ ఉంటుంది, తామూ ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశమూ ఉంటుందన్నదే వారి ఆలోచన. తమకు తెలియని కొత్త ప్రదేశాలను ఎంచుకుని మరీ వెళ్తున్న వీరంతా మారుమూల పల్లెల్లో స్థానికులతో కలిసి ఉంటున్నారు. కొందరు డబ్బు చెల్లించి ఉంటుండగా, కొందరేమో తాము చేస్తున్న పనికి ప్రతిఫలంగా బస, భోజన వసతి పొందుతున్నారు. ఇలా స్థానికులతో కలిసి జీవించడం వల్ల ఎన్నో నేర్చుకుంటున్నామంటోంది జనరేషన్‌ జడ్‌ యువత.


అవసరం చాలా ఉంది!

పర్యటకం మనదేశంలో ఏటా రెండంకెల వృద్ధిరేటు నమోదుచేస్తున్న లక్షల కోట్ల పరిశ్రమ. 2018లో విదేశీయులే కోటిమందికి పైగా మనదేశాన్ని సందర్శించారు. ఇలా పెరిగే పర్యటకుల అవసరాలను తీర్చేందుకు చాలా గదులు కావాలంటోంది ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్‌ అండ్‌ రెస్టరెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా. ఇంటిబస ఏర్పాటు చేయాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం. ఇప్పటివరకూ రాష్ట్రాల టూరిజం విభాగాల్లో నమోదైనవాటికన్నా ప్రైవేటు వాటిల్లో నమోదైన హోమ్‌స్టేలే ఎక్కువ. యాత్రా.కామ్‌లో 300 నగరాల్లో 3500లకు పైగా హోమ్‌స్టేలు రిజిస్టర్‌ కాగా, ఎయిర్‌బీఎన్‌బీలో 50 వేలదాకా నమోదయ్యాయట. ట్రీహౌస్‌ల దగ్గర్నుంచి పర్యావరణమిత్ర, వారసత్వ, చారిత్రక, ప్రైవేటు బంగళాల వరకూ... అన్ని రకాలూ వీటిల్లో ఉన్నాయి. లీజర్‌ డెస్టినేషన్స్‌గా పేరొందిన గోవా, కేరళ, పాండిచ్చేరి లాంటి ప్రాంతాలూ, ఉత్తరాదిన హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, డెహ్రాడూన్‌, రాజస్థాన్‌ లాంటి ప్రాంతాల్లో ఇంటిబసలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఒక్క సిమ్లాలోనే 200లకు పైగా హోమ్‌స్టేలు రిజిస్టర్‌ అయ్యాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.