
ఇద్దరూ సమానమే!
లెక్కలు, సైన్స్ లాంటి సబ్జెక్టుల్లో అబ్బాయిలు చురుగ్గా ఉంటారు. చరిత్ర, భాషలకు సంబంధించిన అంశాల్లో అమ్మాయిలకు ఆసక్తి ఎక్కువ. పైగా లెక్కల్లాంటివి అబ్బాయిలంత వేగంగా అమ్మాయిలు చేయలేరు అంటుంటారు. కానీ అలాంటిదేమీ లేదు అంటున్నారు కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయ నిపుణులు. మూడు నుంచి పదేళ్ల లోపు వందమంది ఆడామగా పిల్లల్ని ఎంపికచేసి వాళ్లకు వీడియో పాఠాల ద్వారా గణితాన్ని బోధించారట. ఆ సమయంలో వాళ్ల మెదడుని స్కాన్ చేసి చూడగా ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదట. అదే పద్ధతిలో పెద్దవాళ్లనీ పోల్చి చూశారట. అందులో భాగంగా వాళ్లకి లెక్కలకు సంబంధించిన కొన్ని వీడియోపాఠాలను చూపించారట. అవి చూస్తున్నప్పుడు వాళ్ల మెదడు పనితీరుని విశ్లేషించి చూడగా- ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదట. కాబట్టి అదంతా ఒట్టి అపోహేనని తేల్చి చెబుతున్నారు.
ఫోన్ స్క్రీన్‌కీ తెలిసిపోతుంది!
మీ ల్యాప్‌టాప్, ఫోన్, స్మార్ట్‌వాచ్... వంటి పరికరాలన్నీ మీ చేతి స్పర్శను బట్టి మీ మానసిక స్థితినీ అంచనా వేయగలిగే రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకులు. వీళ్లు టెలికామ్ పారిస్ టెక్ అండ్ సొబొనె యూనివర్సిటీ బృందంతో కలిసి ద స్కిన్- ఆన్ ఇంటర్ఫేస్ అనే కొత్త స్క్రీన్‌ని రూపొందించారు. అంటే అచ్చం మనిషి చర్మంలానే పనిచేసే కృత్రిమ చర్మం అన్నమాట. సిలికాన్ పదార్థంతో తయారైన ఈ చర్మాన్ని ఫోనుకీ కంప్యూటర్లకీ వాడటం వల్ల దాన్ని పట్టుకునే తీరూ నొక్కిన పద్ధతిని బట్టి సదరు వ్యక్తి మూడ్‌ని అది అర్థం చేసుకుంటుందట. ఉదాహరణకు కోపంగా నొక్కుతున్నామా లేదా సరదా మూడ్‌లో ఉన్నామా అన్నదాన్ని పసిగట్టి దానికి తగ్గ ఎమోజీని స్క్రీన్‌మీద చూపిస్తుందట. ఫోన్‌కి కితకితల్లా పెడితే నవ్వుతున్న ఎమోజీనీ, గిచ్చితే కోపంగా ఉన్న ఎమోజీని స్క్రీన్ మీద చూపిస్తుందట. అంటే- మున్ముందు మనం వాడే పరికరాలన్నింటికీ మన మానసిక స్థితి అర్థమై, దానికి తగ్గట్లే అవి మనకు సేవల్ని అందిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ కృత్రిమ చర్మం, భవిష్యత్తులో అన్ని రంగాల్లో దూసుకొస్తోన్న ఆగ్మెంటెడ్ రియాల్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు సదరు నిపుణులు.
ఏం తింటున్నారు?
ప్రాసెస్డ్ ఆహార పదార్థాలూ వేపుళ్లూ పాలిష్ చేసిన ధాన్యమూ కొవ్వు ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులూ తినడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు సరికదా వయసుతోబాటు వచ్చే కంటి కండరాల క్షీణత(ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్-ఏఎమ్‌డీ) మరింత ముందుగా వచ్చే అవకాశం ఉందని బఫెలో యూనివర్సిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా ఈ వ్యాధి ఒకసారి మొదలయితే దాన్ని తగ్గించలేం. అంటే- తగ్గిన చూపును మళ్లీ తీసుకురాలేం. వ్యాధి ముదిరిన దశలో కూడా ఎలాంటి చికిత్స చేసినా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని తొలిదశలో గమనించగలిగినప్పుడే అది ముదరకుండా చూడటం కొంతవరకయినా సాధ్యమవుతుంది. అందుకే దీనిగురించి కూలంకషంగా పరిశీలించినప్పుడు- తీసుకునే ఆహారం వయసుతోబాటు వచ్చే కంటి కండరాల క్షీణత మీద ప్రభావం చూపిస్తుందని తేలింది. అదెలా అంటే- పరిశోధకులు తొలిదశలో ఏఎమ్‌డీ ఉన్నవాళ్లనీ అస్సలు ఏఎమ్‌డీ లేనివాళ్లనీ ఎంపికచేసి, 18 సంవత్సరాల తరవాత వాళ్లని పరిశీలించగా- వాళ్లలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోనివాళ్లలోనే ఈ ఏఎమ్‌డీ పెరిగినట్లు గుర్తించారు. కాబట్టి ముందు నుంచీ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంవల్ల ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు అని వివరిస్తున్నారు.
వ్యాయామం ఎక్కువగా చేస్తే...
ఎక్కువగా వ్యాయామం చేసే మహిళలకి గుండె జబ్బులూ క్యాన్సర్లూ ఇతరత్రా రోగాలన్నీ తక్కువగా వస్తాయని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. మామూలుగానే స్త్రీలు పురుషులకన్నా ఎక్కువకాలం జీవిస్తారు. అయితే వీళ్లు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఎక్కువ కాలం జీవిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం కొందరు నడివయసు మహిళల్ని ఎంపికచేసి వాళ్లలో గుండెజబ్బు వచ్చే అవకాశం ఉన్నవాళ్లని గమనించి ట్రెడ్‌మిల్‌మీద వ్యాయామం చేయించారట. అదీ వాళ్లు అలసిపోయేవరకూ ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా చేయమన్నారట. అలా క్రమం తప్పక చేసే వాళ్లలో హృద్రోగ మరణాలు తగ్గడమే కాదు, ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం కూడా బాగా తగ్గినట్లు గుర్తించారు. కాబట్టి మెనోపాజ్ దాటిన తరవాత మహిళలు ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిదని సలహా ఇస్తున్నారు.
22 డిసెంబరు 2019
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్