close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏం శోధించారంటే...

(2019 ప్రత్యేకం)

మనిషి ఆరోగ్యం, పర్యావరణం, పరిణామం... ఇలా భిన్న శాస్త్ర రంగాలకు సంబంధించి ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలానూ కొంతకాలానికయినా వాడుకలోకి వచ్చేలానూ ఉంటాయి. ఈ ఏడాదికి సంబంధించి అలాంటి పరిశోధనల్లో కొన్ని...


శాకాహారమే మిన్న!

మాంసాహారం తక్కువగానూ శాకాహారం ఎక్కువగానూ తినడంవల్ల పర్యావరణం మెరుగవడమే కాదు, గుండె ఆరోగ్యానికీ ఎంతో మంచిది అని తేల్చి చెబుతున్నారు జాన్‌ హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కి చెందిన నిపుణులు. ఎందుకంటే శాకాహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకునేవాళ్లలో గుండెజబ్బులు వచ్చే ఆస్కారం 40 శాతం తగ్గినట్లు వాళ్ల పరిశీలనతో స్పష్టమైంది. ముఖ్యంగా కూరగాయలూ చిక్కుళ్లూ గింజలూ ముడిధాన్యాలూ కొద్దిపాళ్లలో పాల ఉత్పత్తులూ తీసుకునేవాళ్లలో గుండెజబ్బులు వచ్చే ముప్పు సగానికి సగం తగ్గిందట. కాబట్టి మున్ముందు శాకాహారప్రియుల సంఖ్య మరింత పెరగొచ్చన్నమాట.


రక్తపరీక్షతో క్యాన్సర్‌!

కొన్ని రకాల క్యాన్సర్లు ముఖ్యంగా ఒవేరియన్‌ వంటివి ముదిరిన దశలోగానీ బయటపడవు. దాంతో చికిత్స కష్టసాధ్యంగా మారుతుంది. అందుకే కన్సాస్‌ యూనివర్సిటీ నిపుణుల బృందం రక్తపరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. త్రీడీ-నానోప్యాటర్న్‌డ్‌ మైక్రోఫ్లూయిడ్‌ చిప్‌ అనే ఈ పరికరం, ఓ రక్తపు చుక్క లేదా అందులోని ప్లాస్మాని పరిశీలించి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చెబుతుందట. అదెలా అంటే- వడబోత ప్రక్రియ ద్వారా రక్తకణాల్లోని ఎక్సోజోమ్స్‌ను వేరుచేసి, వాటిద్వారా కంతి పెరుగుదల, వ్యాప్తి వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటుందట. ఎందుకంటే కంతి ఏర్పడాలా వద్దా అన్న సమాచారం ఎక్సోజోమ్స్‌ ద్వారానే మిగిలిన కణాలకీ వెళుతుంది. కాబట్టి వీటి కదలికల ఆధారంగా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా లేదో గుర్తించగలిగే ఈ పరిశోధన క్యాన్సర్‌ చికిత్సలో గొప్ప మైలురాయి కానుంది.


మధుమేహం తగ్గుతుంది!

మధుమేహం ఒకసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లమంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేలా అంటే- శరీరమే ఇన్సులిన్‌ను తయారుచేసుకునేలా మందును రూపొందించింది ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన నిపుణుల బృందం. రెండు రకాల మందులు కలగలిపి ఇచ్చినప్పడు- ఇన్సులిన్‌ను స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే. కానీ  దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందుతోబాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్‌ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధి నిర్మూలనలో ఈ పరిశోధన మంచి పరిణామం.


భాషలే మెదడుకి మేత!

మనిషి జీవించడానికి గాలీనీరూ ఎంత అవసరమో, మెరుగైన జీవితానికి భాష, మాటా కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. భాషానైపుణ్యం, వాక్చాతుర్యం... అనేవి సంబంధాలు పెంపొందడానికీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ చక్కగా జీవించడానికే కాదు, మెదడు అభివృద్ధికీ మానసిక వికాసానికీ తోడ్పడతాయట. అందుకే మెదడులో భాషా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎలాంటి ప్రభావాన్ని కనబరుస్తాయి అనేదానిమీద అనేక బృందాలు పరిశోధనలు చేశాయట. భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండే విద్యార్థుల్లో మెదడులోని హిప్పోక్యాంపస్‌ అభివృద్ధి చెందినట్లు ఈ పరిశోధనల్లో గుర్తించారు. చిన్నతనంలోనే భాషల్ని నేర్చుకుంటే మెదడు సమాచారాన్ని సులభంగా నిక్షిప్తం చేసుకుంటుందనీ; రెండుకన్నా ఎక్కువ భాషలవల్ల మెదడు పనితీరు మెరుగై ఆల్జీమర్స్‌, డిమెన్షియా వంటివి త్వరగా రావనీ ఆలోచనాశక్తి తగ్గదనీ ఎడిన్‌బర విశ్వవిద్యాలయం, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన నిపుణులు కలిసి చేసిన పరిశోధనలో తేలింది. సో, ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నమాట.


ఇవేకాదు, ప్రస్తుతం భూగోళం మీదున్న మనుషులంతా జాంబెజి నదికి దక్షిణంగా ఉన్న బోట్స్‌వానాలో రెండు లక్షల సంవత్సరాల క్రితం జీవించిన స్త్రీ సంతతేననీ; ఈ-సిగరెట్లూ ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్నాయనీ; రాత్రివేళలో కాళ్లూ పాదాలూ చేతులూ వంకర్లు తిరగడానికి కండరాలు అలసిపోవడమే కారణమనీ; ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాల్లోని ఎమల్సిఫయిర్లు పొట్టలోని బ్యాక్టీరియాకి హాని కలిగించి ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులకూ దారితీస్తున్నాయనీ; బాగా వేడి టీ తాగడంవల్ల అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువనీ; ఊబకాయం పెరిగేకొద్దీ మెదడు పరిమాణం తగ్గుతుందనీ- నడుం చుట్టూ ఉన్న కొవ్వు మానసిక ఆరోగ్యాలకి మంచిది కాదనీ... ఇలా ఈ ఏడాది చేపట్టిన ఎన్నో పరిశోధనలు శాస్త్రరంగాల్లో కీలకమార్పులు తీసుకురానున్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు