close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ పదివేలే నన్ను కుబేరుణ్ణి చేశాయి!

దిలీప్‌ సంఘ్వీ... ప్రపంచంలోనే ఐదో పెద్దదైన, భారతదేశంలో అతిపెద్దదైన మందుల తయారీ సంస్థ ‘సన్‌ ఫార్మా’కి అధినేత. భారతీయ కుబేరుల్లో ఒకరు. సాధారణంగా ఓ వ్యక్తి ఆ స్థాయికి వెళ్లాడంటే ఆయన జీవిత చరిత్ర నెట్‌లో ఎన్నో రూపాల్లో కనిపిస్తుంటుంది. కానీ దిలీప్‌ గురించి ఒకట్రెండు వివరాలు తప్ప ఇంకేవీ ఉండవు. దిలీప్‌కానీ, ఆయన సన్నిహితులు కానీ ఇన్నాళ్లూ మీడియాకి దూరంగా ఉండిపోవడం ఓ కారణం. కానీ ఇప్పుడిప్పుడే ఆ మౌనం వీడుతున్నారు. అలా నోరువిప్పిన ఓ సందర్భమే ఈ స్ఫూర్తికథ.

మేం గుజరాతీలమే కానీ నాన్న కోల్‌కతాలో స్థిరపడ్డారు. అక్కడ కొన్ని మందుల కంపెనీలకి పంపిణీదారుగా ఉండేవారు. ఇంట్లో నాతోపాటూ తమ్ముడూ, ఇద్దరు చెల్లెళ్లూ ఉండేవారు. చదువుల్లో ఎప్పుడూ యావరేజ్‌ విద్యార్థినే. కాకపోతే, ఏ సబ్జెక్టూ నాకు కష్టంగా అనిపించేది కాదు. అంత ఈజీగా ఉన్నప్పుడు ఇంటికొచ్చి చదవడం ఎందుకు అనుకునేవాణ్ని. అందుకే బడికాగానే నేరుగా నాన్న షాపుకి వెళ్లిపోయేవాణ్ణి. అక్కడ వరసగా పేర్చిపెట్టిన మందులూ, వాటిపైనున్న లేబుళ్లూ చూస్తూ వాటిని ఎందుకు వాడతారో తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. తొమ్మిదో తరగతయ్యాక చాలా ఇష్టంగా కామర్స్‌ తీసుకున్నాను. అకౌంటెన్సీలో నంబర్‌ వన్‌ అనిపించుకున్నాను.

మా మాస్టారు బోర్డుపైన ఏదైనా లెక్కరాసి చేయమంటే... పాఠ్యపుస్తకంలో ఉన్నట్టుకాకుండా అంతకంటే సులభంగా కేవలం రెండుమూడు స్టెప్స్‌తో ఆన్సర్‌ రాబట్టేవాణ్ణి. ‘అలాకాదు... నువ్వు పుస్తకంలో ఉన్నట్టే చేయాలి!’ అనంటే అలా ఎందుకని వాదించేవాణ్ణి. రకరకాల ప్రశ్నలతో వేధించేవాణ్ణి. చాలాసార్లు నా ప్రశ్నలకి చిరాకుపడి మాస్టారు వెళ్లిపోతే... స్టాఫ్‌ రూమ్‌లోకి వెళ్లి సారీ చెప్పి నేనే క్లాసుకి తీసుకొచ్చేవాణ్ణి. మొత్తానికి మంచి మార్కులతోనే ప్రి-డిగ్రీ కోర్సు పాసయ్యాను. తర్వాత బీకామ్‌ చదవాలని బొంబాయి వెళ్లిపోయాను. ఏడాది చదవాల్సిన బీకామ్‌ పుస్తకాలని మూడునెలల్లోనే ముగించేశాను. ఇక అక్కడ మా అన్నతో కలిసి చిన్న వ్యాపారమొకటి పెట్టాను. ఇంతలో మానాన్న చేస్తున్న వ్యాపారం నుంచి ఆయన భాగస్వామి తప్పుకున్నాడు. ఇంట్లో పెద్దవాణ్ణి నేనే కాబట్టి కోల్‌కతా వెళ్లి నాన్న వ్యాపారంలో సాయంచేయడం మొదలుపెట్టాను. ఈ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో వచ్చే మార్జిన్‌ చాలా తక్కువని తెలుసుకోవడానికి నాకు ఎంతో కాలం పట్టలేదు. దానికన్నా మందుల తయారీ రంగంవైపు వెళితే మంచి లాభాలు వస్తాయనిపించింది. మరి ఏ మందులు తయారుచేయాలి?! 1970ల కాలం అది. దేశంలో అంటువ్యాధులు ఎక్కువై యాంటీబయోటిక్స్‌ విస్తృతంగా వాడుతున్నారప్పట్లో. వాటిని తయారుచేసే సంస్థలన్నీ ఒకదానితో ఒకటి తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఆ పోట్ల గిత్తల మధ్య నాలాంటి లేగదూడలు వెళితే నలిగిపోతాం! అందుకే బడా సంస్థలు పెద్దగా పట్టించుకోని మానసిక సమస్యలకి చెందిన మందులపైన దృష్టిపెట్టాను. రోజుల తరబడి ఎంతోమంది మానసిక వైద్యులని సంప్రదించి, కోల్‌కతా లైబ్రరీలోని ఫార్మసీ పుస్తకాలనీ శోధించి అప్పటిదాకా ఎవరూ తాకని ‘లిథియం కార్బనేట్‌’ని ఎంచుకున్నాను. మూడ్‌స్వింగ్స్‌ (మేనియాక్‌ డిప్రెసివ్‌ సైకోసిస్‌-ఎండీపీ) అనే మానసిక సమస్య ఉపశమనానికి ఉపయోగపడే జనరిక్‌ మందు అది. అప్పట్లో కేవలం రెండు బహుళజాతి కంపెనీలు వాటిని అత్యధిక ధరకి అమ్ముతుండేవి. దాన్నే ఇక్కడ  తక్కువ ధరకి తయారుచేయాలన్నది నా ప్లాన్‌!

పదివేల అప్పుతో...
1978 సంవత్సరం అనుకుంటా... నెల సరిగ్గా గుర్తులేదు. ఇంట్లోవాళ్లందరూ బంధువుల పెళ్లికి వెళ్లారు. నేనూ, నా నలుగురు మిత్రులూ గదిలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మాటల మధ్యలోనే సడన్‌గా నా సొంత సంస్థ ఆలోచనల్ని చెప్పాను. సంస్థ పేరు కూడా ‘సన్‌ ఫార్మా’ అని ప్రకటించేశాను! వాళ్లే నా పార్ట్నర్స్‌ అనీ చెప్పాను. వాళ్లందరూ నవ్వుతారనుకున్నాను కానీ... చాలా సీరియస్‌గా విన్నారు. మరి పెట్టుబడి ఎలా అని అడిగారు. అదే నాకూ తెలియలేదు. చివరికి నాన్నని అడుగుదామని అనుకున్నాం. నాన్న కోప్పడలేదుకానీ... ఆయనకి పెద్దగా ఇష్టం కూడా లేదు. నాన్న ‘ట్రాడెంట్‌’ అనే మందుల కంపెనీకి పంపిణీదారు. ఆ సంస్థ కూడా సైకియాట్రీ మందుల్నే తయారుచేసేది(లిథియం కార్బనేట్‌ కాకుండా మిగతావాటిని). వాళ్లకి పంపిణీదారుగా ఉంటూ మేమూ మందుల్ని తయారుచేయడం వల్ల ఆ సంస్థవాళ్లు తన డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని రద్దుచేస్తారు కదా... అనే భయం ఆయనది. అయినాసరే నేను పట్టుబట్టడంతో పదివేల రూపాయలు అప్పుగా తెచ్చి ఇచ్చారు.

తొలి మూడు సమస్యలు!
ఆ సొమ్ముతో ఉత్పత్తి మొదలుపెట్టాలనుకున్నాం కానీ... ఫ్యాక్టరీ ఏర్పాటుకి ఎన్నో అవరోధాలొచ్చాయి. నాటి కోల్‌కతాలో ఏదైనా చిన్న పరిశ్రమల్ని స్థాపించేవాళ్లని కూడా పెట్టుబడిదారులనీ, బూర్జువాలనీ విమర్శిస్తూ నిరుత్సాహపరిచేవారు. లైసెన్సులివ్వరు, ఇచ్చినా కార్మికులెవరూ పనిచేయరు. ఆ పరిస్థితుల్లో అప్పటికే ఉన్న ఓ ఫ్యాక్టరీలోని కొంతభాగాన్ని లీజుకి తీసుకుని అక్కడ మందుల్ని తయారుచేయడం మొదలుపెట్టాం. ఇంకో నెలలో మందులు చేతుల్లోకి వస్తాయనగా... ఆ ఫ్యాక్టరీ అతను పనిచేయకుండా మొండికేశాడు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉంటే... శశికాంత్‌ అనే ఆయన తన ఫ్యాక్టరీని వాడుకోమని పెద్దమనసుతో ముందుకొచ్చాడు. ఆ సాయం లేకుంటే... మా సంస్థకి పురిట్లోనే సంధికొట్టేదే! మార్కెట్‌లోకి వచ్చిన ఏడాదివరకూ ఏ సైకియాట్రిస్టూ మా మందుల్ని ప్రిస్క్రైబ్‌ చేయలేదు. ఓ డాక్టర్‌ని అడిగితే ‘లిథియమ్‌ వాడిన పదివేల మందిలో ఒకరికి అది టాక్సిక్‌గా(విషతుల్యంగా) మారే ప్రమాదముంది! కాబట్టి, ఈ మందుని వాడుతున్నవాళ్లందరికీ నెల తర్వాత టెస్టు చేసి టాక్సిన్‌ లెవెల్స్‌ చూడాలి. మీ మాత్రల స్ట్రిప్‌ రెండు రూపాయలైతే ఆ టెస్టుకేమో రూ.40 అవుతుంది. పేషెంట్లకి అది చాలా పెద్ద భారం. ఏం చేద్దాం!’ అన్నాడు. ఇదో ఛాలెంజ్‌ నాకు. కానీ మనసుంటే మార్గం ఉండదా?! మా మందువాడిన పేషెంట్లందరికీ ఓ కార్డు ఇవ్వమని డాక్టర్లని అడిగాను. ఆ కార్డు చూపించినవాళ్లు ల్యాబ్‌కి వెళితే రూ.40 టెస్టుని రూ.20కే చేస్తారు. ఇరవై రూపాయలు మా కంపెనీ భరిస్తుంది...!’ ఇదీ నా ప్లాన్‌. అది సక్సెస్‌ అయ్యింది. తొలిసారి వందరూపాయల మందులు అమ్ముడుపోయాయి. ఇంతలోనే మరో సమస్య వచ్చింది. ‘లిథియం కార్బొనేట్‌’ మాత్రలు ప్యాక్‌ తీసిన వెంటనే పొడిపొడిగా అయిపోయేవి. బడా సంస్థలు తయారుచేస్తున్న మందులది కూడా అదే పరిస్థితి. ఆ సంస్థలు కూడా అధిగమించలేని ఆ సమస్యని నేను పరిష్కరిస్తే... వాళ్లకంటే మా సేల్స్‌ వందరెట్లు పెరగడం గ్యారెంటీ అనిపించింది. దాదాపు మూడు నెలలు పగలూరాత్రీ శ్రమించి శాస్త్రవేత్తల సాయంతో దానికి పరిష్కారాన్ని కనిపెట్టాను. అంతే... మొదటి ఏడాది రూ.25 వేల రెవెన్యూ వచ్చింది. ఆ తర్వాతి నుంచి ఏటా 50 వేల రూపాయల పెరుగుదల నమోదైంది. 1982 ఏదాదికంతా పదిలక్షలకి చేరుకున్నాం కానీ... ఒకదశలో మా నాన్న భయపడ్డట్టే అయింది!

ప్చ్‌... పోటీ తప్పలేదు!
మేం సైకియాట్రీ మందుల్ని తయారుచేస్తుండటం తెలిసి, మమ్మల్ని పోటీదారుగా భావించిన ట్రాడెంట్‌ కంపెనీ నాన్న పంపిణీని రద్దుచేసింది. దాన్ని పక్కనే ఉన్న మరో షాపుకిచ్చింది. మానాన్న వ్యాపారం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆ సంస్థతో నేరుగా పోటీకి దిగాను. సైకియాట్రీతోపాటూ గ్యాస్ట్రిక్‌ మందుల్నీ, కార్డియాలజీ మందుల్నీ తక్కువ ధరకి మార్కెట్‌లోకి తేవడం మొదలుపెట్టాను. ప్రతి విభాగానికీ ప్రత్యేకమైన సేల్స్‌ఫోర్స్‌ని రూపొందించిన తొలి సంస్థగా గుర్తింపు సాధించాం. ఎనిమిదేళ్లపాటు ట్రాడెంట్‌తో సాగిన పోటీలో ఎట్టకేలకు దాన్ని అధిగమించేశాం! అప్పటికే దేశంలోని టాప్‌ 10 ఫార్మసీ సంస్థల్లో ఒకటిగా చోటు సంపాదించాం. ఇప్పటి మా రెవెన్యూ 30,800 కోట్ల రూపాయలతో పోల్చితే ఇవన్నీ చాలా చిన్న అడుగులేకానీ... అవే మా సంస్థకి పునాదులు! ఆ పునాదుల దన్నుతోనే పదుల సంఖ్యలో ఫార్మసీ సంస్థల్ని కొని మా సంస్థలో కలుపుకున్నాం. ముఖ్యంగా- 2010లో అమెరికాలో అతిపెద్ద వ్యాపారం ఉన్న టారోని సొంతం చేసుకుని ఆ దేశంలో పట్టుసాధించాం. 2014లో అవినీతితో కొట్టుమిట్టాడుతూ కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ‘రాన్‌బాక్సీ’ సంస్థని మాదాంట్లో కలిపేస్తున్నప్పుడు... ఇక సన్‌ ఫార్మా సామ్రాజ్య పతనం మొదలైపోయిందనే అందరూ అన్నారు. కానీ అక్కడా మాదైన నాణ్యతా ప్రమాణాలూ, నిజాయతీని చొప్పించి... లాభాలు చవిచూశాం. ఆ తర్వాతి ఏడాదే ఫోర్బ్స్‌ భారతదేశ సంపన్నుల జాబితాలో మొదటిస్థానం నాకొచ్చింది. ఆ తర్వాత ‘పద్మశ్రీ’ కూడా ఇచ్చారు. అప్పటి నుంచీ మా సంస్థ ఎన్నో ఆటుపోట్లూ ఎదుర్కొన్నా అవన్నీ తట్టుకుని స్థిరంగా అడుగులేస్తూ వస్తోంది. చక్కటి రెవెన్యూతో దేశంలో నంబర్‌వన్‌ ఫార్మా సంస్థగా తన స్థానాన్ని పదిలపరచుకుంటూనే ఉంది. మిగతా అన్ని పురస్కారాలకన్నా... నేను ఏటా అందుకుంటున్న అతిపెద్ద అవార్డు ఇదే! చివరిగా మీకో వ్యక్తి గురించి చెప్పాలి...  

ఆయన పేరు మోహన్‌లాల్‌ దోషి. ఆరో తరగతితోనే చదువు మానేయాల్సి వచ్చినా... రోజులో ఎక్కువభాగం పుస్తకాలతోనే గడిపేవాడు. ఓసారి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికాకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పనులు ముగించుకుని ఉత్సాహంగా ఓడ ఎక్కాడు. మధ్యలో ఏం జరిగిందో తెలియదుకానీ... ఇండియా చేరుకునేటప్పటికి మానసికరోగిగా మారాడు. అప్పట్లో దానికి ఇక్కడ మందులుకానీ, చికిత్సకానీ లేవు. పదిహేనేళ్లకి రోగం బాగా ముదిరి... భార్యనీ, ముగ్గురు ఆడపిల్లల్నీ అనాథల్ని చేసి ఆయన చనిపోయారు. ఆ మోహన్‌లాల్‌ మా తాతయ్య. మా అమ్మవాళ్లనాన్న. ఓ అంతుతెలియని మానసిక రోగానికి తాతయ్యని కోల్పోయిన నేను మానసికరోగ చికిత్సకి సంబంధించిన మందుల తయారీతో ఇంతటివాణ్ణి కావడం కేవలం యాదృచ్ఛికం... అనుకుంటున్నాను. ‘కాదు. దీని వెనక మనకు తెలియని లంకె ఏదో ఉంది!’ అంటుంది అమ్మ. ఆమె నమ్మకాన్ని కాదనే హక్కు నాకేముంది చెప్పండి?


ఆయన చెప్పనివి...

ఆ రాత్రి : ఇంటర్‌లో ఉన్నప్పుడు అయాన్‌రాండ్‌ రాసిన 650 పేజీల ‘ది ఫౌంటెయిన్‌ హెడ్‌’ పుస్తకాన్ని ఒకేరాత్రి చదివేశాడట దిలీప్‌. తాను పారిశ్రామికవేత్త కావాలనే సంకల్పాన్నిచ్చింది ఆ పుస్తకమేనట.
సెకెండ్‌ క్లాస్‌లోనే : దేశంలోనే టాప్‌టెన్‌ ఫార్మసీ కంపెనీల్లో ఒకయ్యాక కూడా రైల్లో స్లీపర్‌ క్లాస్‌ ట్రెయిన్‌లోనే ప్రయాణించేవాడు. అదీ దొరక్క గార్డు క్యాబిన్‌లో ప్రయాణించిన సందర్భాలూ చాలా ఉన్నాయి. గుజరాత్‌లోని వాపీ నుంచీ ముంబయి దాకా ఓ స్లీపర్‌ కోచ్‌ని బుక్‌ చేసి ఆ ప్రయాణంలోనే బోర్డు మీటింగ్‌లు పెట్టుకునేవారు!
ఆమె సైతం : సంఘ్వీ భార్య విభా ఫార్మసీ నిపుణురాలు. సంస్థలో ఒకప్పుడు ప్రత్యేకంగా ‘సేల్స్‌ విమెన్‌’ విభాగాన్ని ఏర్పాటుచేస్తే అందులో ఆమె కూడా పనిచేసి ముంబయి నగరంలో తిరుగుతూ మందులు అమ్మారట! పిల్లలు ఆలోక్‌, విధి ఇద్దరూ సంస్థలోనే పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు బయటకు వెళ్లి తమకంటూ సొంత సంస్థను ఏర్పాటుచేసుకోవాలనే దిలీప్‌ చెబుతున్నాడట.
తానే దిగిపోయాడు : సన్‌ ఫార్మాలో తనకన్నా, తనవారికన్నా బాగా పనిచేసేవాళ్లు దొరికితే వాళ్లకే అధికారం కట్టబెట్టాలంటాడు సంఘ్వీ. చెప్పడమే కాదు, సంస్థ ఛైర్మన్‌-సీఈఓగా విదేశీయుడైన డెబ్భైయేళ్ల ఇజ్రాయెల్‌ మెకావ్‌ని నియమించి తాను తప్పుకుని సంచలనం సృష్టించాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.