close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ పాట ఆ అమ్మాయి కోసం..!

చర్మాన్ని ఎముకలకి గట్టిగా బిగదీసి కట్టినట్టూ శరీరంలో పిసరంత కండలేనట్టూ కనిపిస్తాడు అనిరుధ్‌! ఇరవై తొమ్మిదేళ్లొచ్చినా ఇంకా కాలేజీ విద్యార్థిలా కనిపిస్తేనేం... తను సంగీతం అందిస్తున్నవన్నీ చాలా భారీ ప్రాజెక్టులు. రజినీకాంత్‌ తాజా సంచలనం ‘దర్బార్‌’... ఇప్పటికే ‘దుమ్మూధూళి’ పాటతో ఉర్రూతలూగిస్తుంటే ఈ ఏడాది రాబోతున్న ‘భారతీయుడు-2’ అంచనాలని పెంచేస్తోంది. ‘అజ్ఞాతవాసి’, ‘యూటర్న్‌’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్‌’లతో తెలుగు ప్రేక్షకులకి కొత్త సంగీతానుభూతులిచ్చిన ఈ యువ సంచలనంతో చిట్‌చాట్‌...

ఐదొందల బాణీలున్నాయ్‌

మూడేళ్లప్పుడే పియానోపైన ప్రాక్టీస్‌ చేయడం మొదలుపెట్టాను. ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఓ కర్ణాటక-ఫ్యూజన్‌ బ్యాండులో సభ్యుణ్ణయ్యాను. పదో తరగతికి వచ్చేటప్పటికల్లా ఓ రాక్‌బ్యాండునీ ఏర్పాటుచేశాను. ఈ బ్యాండ్‌ల కోసం పాడుతున్నప్పటి నుంచే సొంతంగా బాణీలు కట్టి దాచుకోవడం మొదలుపెట్టాను. సినిమాలతో సంబంధంలేకుండా రోజూ ఇలా ఒకటో రెండో చేస్తుంటాను. చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా అలా నేను చేసిపెట్టుకున్నవి ఐదొందలదాకా ఉంటాయి. దర్శక, నిర్మాతలు పాటల్ని అడిగినప్పుడు వాళ్లు చెప్పే సిట్యుయేషన్‌కి సరిపోయే నా బాణీలని ఇస్తాను. అలా తప్ప అప్పటికప్పుడు బాణీలు కట్టిన సందర్భాలు చాలా తక్కువ!


దాని వెనకో కథ ఉంది

‘రఘువరన్‌ బీటెక్‌’ పాటల గురించి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు ఫోన్‌ చేస్తుంటారు. అందులో ‘లక్కన్న మాటే నిల్లు’ అంటూ సాగే ఊర మాస్‌ పాట ఒకటుంది. దాని వెనకున్న కథ మీకు చెప్పాలి. ఆ సినిమా పాటలు చేస్తున్నప్పుడు నేనో పార్టీకి వెళ్లాను. నేను బాగా ఇష్టపడే ఓ అమ్మాయి అక్కడికొచ్చింది. వచ్చినమ్మాయి నాకో చిన్న హాయ్‌ చెప్పి... ఇంకెవరితోనో క్లోజ్‌గా డాన్స్‌ చేయడం మొదలుపెట్టింది. అది చూసి తట్టుకోలేకపోయాను. ఉడుక్కుని ఇంటికొచ్చి ఆ కోపాన్నంతా వెళ్లగక్కేలా ఆ ట్యూన్‌ చేశాను. హీరో ధనుష్‌ ఆ ట్యూన్‌ విని ‘దీన్ని మన సినిమాకి వాడుకుందాం’ అన్నాడు. ‘మరి దానికి తగ్గ సిట్యుయేషన్‌ లేదుకదా’ అన్నాను. ‘మనం క్రియేట్‌ చేద్దాం’ అని ఆ పాటని చేశాడు. ఈ పాట నేపథ్యం ఆ అమ్మాయికి ఇంకా తెలియదు మరి!


మైలురాళ్లు ఇవి

అమ్మానాన్నలు నన్నో ఇంటికి ఫంక్షన్‌కి తీసుకెళ్లారట. అక్కడున్న పియానో వింతగా అనిపించి దాని కీస్‌ మీద చేత్తో గట్టిగా కొట్టానట. అది ‘భాం...’ అంటూ చేసిన సౌండ్‌ బాగా నచ్చి మళ్లీమళ్లీ అదే సౌండ్‌ చేశానట. నా సరదా చూసి దాని యజమాని వాయించి చూపారట. తర్వాతి నుంచీ రోజూ ఆ ఇంటికే వెళతానని మారాం చేశానట. దాంతో, నా ఆసక్తి సంగీతంపైనేనని గుర్తించి పియానో నేర్పడం మొదలుపెట్టామని... నాన్న చెబుతాడు. అదీ ప్రారంభం. ఐదేళ్లకే పియానోపైన పట్టు సాధించాను. ‘ఇంత చిన్నవయసులో ఎలా నేర్చుకున్నావురా!’ అని రజినీకాంత్‌ మావయ్య ఆశ్చర్యపోయేవారు. ఆరో తరగతికి వచ్చేటప్పటికే కర్ణాటక ఫ్యూజన్‌ బృందం ‘జింక్స్‌’లో సభ్యుణ్ణై ఆ తర్వాత దానికి లీడర్‌గా మారాను. ఇంటర్‌ చదివేటప్పుడు లండన్‌ ట్రినిటీ కాలేజీ నుంచి ‘వెస్టర్న్‌ పియానో’ వాద్యానికి సంబంధించిన కోర్సు పూర్తిచేశాను. సొంతంగా రాక్‌బ్యాండ్‌ ప్రారంభించాను. ఓ తమిళ ఛానెల్‌ ‘ఊ లలల్లా’ పేరుతో నిర్వహించిన పోటీల్లో మేమే ఫస్ట్‌ వచ్చాం. ఏఆర్‌ రెహ్మాన్‌గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న రోజుని ఎప్పటికీ మరచిపోలేను. ఆ అవార్డు అందుకున్న రెండేళ్లకే సంగీతదర్శకుణ్ణయిపోయా!


అందుకే అంత తక్కువ

తెలుగులోనే కాదు తమిళం, హిందీలోనైనా సరే నేను స్వేచ్ఛగా కలిసిపోగలిగే టీమ్‌తోపాటూ నన్ను ఎగ్జైట్‌ చేసే కథలుంటేనే పనిచేస్తాను. అందుకే నాతోపాటు కెరీర్‌ మొదలుపెట్టినవాళ్లంతా వంద సినిమాలకి దగ్గరవుతుంటే నేను 22 సినిమాలే చేయగలిగాను! పైగా కొత్త భాషలో చేయాలంటే నాకు బెరుకు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ గురువులా ఆ బెరుకు పోగొట్టి నా చేత ‘అజ్ఞాతవాసి’ చేయించారు. ‘అరవింద సమేత’ కూడా చేయాల్సిందే కానీ... నాకున్న వేరే కమిట్‌మెంట్స్‌ వల్ల మానుకున్నాను. ‘జెర్సీ’ కథ నాకు బాగా నచ్చడంతో ఒప్పుకున్నా. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ కూడా చేశాను. తెలుగులో నేరుగా చేయకున్నా ‘రఘువరన్‌ బీటెక్‌’, ‘రెమో’, ‘నేనూ రౌడీనే...’ సినిమాలు నన్నిక్కడివాళ్లకి బాగానే దగ్గర చేశాయి.


అందుకే తనెప్పుడూ వెళ్లదు

నా తొలి సినిమా ‘3’ పాటల  రికార్డింగ్‌ రెహ్మాన్‌గారి స్టూడియోలోనే చేశాను. ఓసారి నాలుగైదురోజులపాటు అక్కడే ఉండిపోయాను. నేను సినిమా ఒత్తిడిని ఎలా తట్టుకుంటానో తింటున్నానో లేదో అంటూ అమ్మ ఫోన్‌ చేస్తుండేది. మరీ పసిపిల్లాడిలా ట్రీట్‌ చేస్తోందని(నాకప్పుడు 18 ఏళ్లు!) అమ్మ ఫోన్‌ చేస్తే తీయడం మానేశాను. స్టూడియోకీ రావొద్దని గట్టిగా చెప్పేశాను. నాకు ఏసీ బొత్తిగా పడదు. రికార్డింగ్‌ స్టూడియోలో మామూలుకంటే టెంపరేచర్‌ బాగా తగ్గించి పెడతారు. నేను వణుకుతూనే అక్కడ పనిచేసేవాణ్ణి. ఓ రాత్రి నిద్ర ముంచుకొచ్చి పడుకోవాలనుకున్నాను. కానీ, ఆ చలికి పడుకోలేక... బేస్‌గిటారుని కప్పే కవర్‌లోపల దూరి గొంతు దాకా జిప్‌ వేసుకుని నిద్రపోయాను. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి కళ్ళు తెరిస్తే ఎదురుగా అమ్మ... కన్నీళ్లతో నన్ను చూస్తూ ఆ పక్కనే కూర్చుని ఉంది. ఆ రోజు నేనూ ఉద్వేగానికి గురయ్యాను. ఇప్పటికీ అంతే. రికార్డింగులు ఉంటే ఉదయం ఏ మూడింటికో ఇంటికొస్తాను. ఎంత నిద్రలో ఉన్నా తలుపుతెరిచి, అప్పటికప్పుడు అన్నం వండి వేడిగా భోజనం పెడుతుంది అమ్మ. నాకోసం ఇంకెవరూ అలా పెట్టరేమోనని తప్పనిసరైతే తప్ప ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్లదు.


పోలీసులు తరుముకొచ్చారు

కాలేజీలో చదివేటప్పుడు ఓసారి ‘రాక్‌’ కార్యక్రమం చేసి రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికొస్తూ ఉన్నాం. కారు నేనే నడుపుతున్నా. అంత రాత్రిపూట వెళుతున్నామని అనుమానం వచ్చిందేమో పోలీసులు వెంబడించడం మొదలుపెట్టారు. నేను కారు ఆపి వాళ్లకి విషయం చెబితే సరిపోయేది. కానీ నేను కారు స్పీడు పెంచాను. ఇక ఛేజింగ్‌ మొదలు...! నాకు కావాల్సిందీ అదే... ఆ థ్రిల్లే! నా ఆటలు ఎంతో సేపు సాగలేదు. పోలీసులు ఐదు నిమిషాల్లోనే మమ్మల్ని అటకాయించేశారు. మేము ఎంత బతిమిలాడినా వినలేదు... చివరికి గిటారు బయటకు తీసి నడిరోడ్డుపైన నిల్చుని పెద్దగా పాట పాడాం. అప్పుడుకానీ నమ్మి వదిలిపెట్టలేదు.


మా సూపర్‌స్టార్‌ మామయ్య

రజినీకాంత్‌ భార్య లత నాకు మేనత్త. నాన్న రవిచందర్‌ రాఘవేంద్ర బిజినెస్‌మ్యాన్‌, నటుడు. అమ్మ లక్ష్మి భరతనాట్య కళాకారిణి. ఇంట్లో నేనూ, మా అక్కయ్యే. తనకి పెళ్లైంది. సంగీతదర్శకుణ్ణైన కొత్తల్లో నాపైన ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు రజినీ మామయ్య ఫోన్‌ చేసి వాటి గురించి ఏమాత్రం స్పందించకూడదని చెబుతుండేవారు. ఇప్పుడూ అదే పాటిస్తున్నా. ఎంత దగ్గరి బంధువయినా... సంగీతదర్శకుడిగా ఆయన సినిమా చేయడానికి ఏడేళ్లు పట్టింది నాకు. గత ఏడాది ‘పేట’ వచ్చిన వెంటనే ‘దర్బార్‌’ అవకాశం రావడం నా అదృష్టమనే అనుకుంటున్నా! ఓ అభిమానిగానూ నాకు ఇది డబుల్‌ ధమాకా!


ఆ ట్రెండ్‌ అలా మొదలైంది

మా అత్తకూతురు ఐశ్వర్యతో పెళ్ళైనప్పటి నుంచే ధనుష్‌ నాకు మంచి ఫ్రెండయిపోయాడు. ‘3’ సినిమాకి సంగీతం చేయాలని బలవంతంగా ఒప్పించాడు నన్ను. పాటలన్నీ పూర్తిచేసి మిగతాపనుల కోసం హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడే ‘కొలవెరి’ పాటని ఎవరో యూట్యూబ్‌లో లీక్‌ చేశారని ఫోన్‌ వచ్చింది. వింటే... పాట అదే కానీ వాద్య సంగీతం ‘మిక్స్‌’ చేయడానికి ముందటి వెర్షన్‌ అది. చెత్తగా అనిపించింది. నా తొలిసినిమా పాట ఇన్ని అవకరాలతో జనాలముందుకొచ్చిందేమిటా అని కన్నీళ్లుపెట్టుకున్నాను. ‘సరే! అయిందేదో అయింది. అసలు పాటల్ని శ్రోతల ముందుకు తెస్తే ఈ డూప్లికేట్‌ని ఎవ్వరూ పట్టించుకోరు కదా’ అనుకున్నాను. ఆ విషయం మా ఆడియో కంపెనీవాళ్లతో మాట్లాడితే సీడీలు తయారుచేయడానికి కనీసం నాలుగైదు రోజులు పడుతుందన్నారు. ఈలోపు ఆ నకిలీ పాట జనంలోకి వెళ్లిపోతే ఎలా... ఆ భయంతో ఆన్‌లైన్‌లోనే ఒరిజినల్‌ పాటని విడుదల చేశాం! దేశంలో ఈ ఒరవడి మా ‘కొలవెరి’తోనే మొదలైంది. 20 కోట్ల వ్యూస్‌తో ఆ పాట నాకు అంతర్జాతీయంగా పేరుతెచ్చింది!


రెండు బ్రేకప్స్‌

నాటి కల : 30 ఏళ్లకే సంగీతదర్శకుణ్ణి కావాలన్నది.
నేటి కల : ఇండీపాప్‌ సృష్టికర్తగా గ్రామీ అవార్డు... అందుకోలేకపోయినా కనీసం నామినేట్‌ అయితే చాలు!
పారితోషికం : ప్రతి పైసా అమ్మకి ఇచ్చేస్తా! మిగతా సంగీత దర్శకుల కోసం పాడాల్సి వస్తే ఒక్కపైసా కూడా తీసుకోను.
భయం : దెయ్యం అనే మాట వింటే గుండె ఆగిపోయినంత పనవుతుంది.
నచ్చిన విజయం : అమెరికన్‌ పాప్‌ సింగర్‌ డుప్లేతో కలిసి ఓ ప్రయివేటు ఆల్బమ్‌కి పనిచేయడం.
సినిమా ఫ్రెండ్స్‌ : శ్రుతి హాసన్‌, అక్కినేని అఖిల్‌.
ఒంటిపైన టాటూ : ఎడంచేతి మణికట్టు కింద ‘ప్లే రివైండ్‌ ఫార్వర్డ్‌’ అని ఉంటుంది.
నటనపైన ఆసక్తి : అస్సల్లేదు. తెలుగు ‘యూ-టర్న్‌’ కర్మ సింగిల్‌ ట్రాక్‌లో కనిపించడం, అజ్ఞాతవాసి ‘గాలి వాలుగా’ పాటకి కవర్‌ చేయడం-జస్ట్‌ సరదా కోసం చేసినవి మాత్రమే.
సెలెబ్రిటీ క్రష్‌ : అమెరికన్‌ పాప్‌గాయని టేలర్‌ స్విఫ్ట్‌ అంటే పడిచస్తాను. ఆమెతో ఒక్క డ్యూయెట్‌ అయినా పాడాలి.
డేటింగ్‌ : ఇప్పటికి రెండు బ్రేక్‌-అప్స్‌ అయ్యాయి. ప్రస్తుతానికి గర్ల్‌ఫ్రెండ్‌ ఎవ్వరూ లేరు.
డైటింగ్‌ : హ్హా..హ్హా... అన్నీ తింటా. ఎంత తింటున్నా ఇంతే ఉంటున్నా... అదీ బాధ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.