close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆప్‌తోనే సినిమా!

మీరో వీడియో తీయాలనుకుంటున్నారు. అది ఎలా తీయాలనే ఆలోచన మీ మనసులో ఉంది. దానికోసం స్క్రిప్టు కూడా రాసుకున్నారు. ఇక తీయడమే మిగిలి ఉంది. కానీ ఇకముందు ఆ అవసరం ఉండదు. రాసినదాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌ ఆప్‌లోకి పంపిస్తే చాలు... అదే దానికి సంబంధించిన వీడియోని తీసి ఇచ్చేస్తుంది. రైట్‌-ఎ-వీడియో పేరుతో ఈ టూల్‌ని ఈమధ్యే హార్వర్డ్‌, చైనాలోని సింగువా బీహాంగ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు ఇజ్రాయెల్‌కు చెందిన ఐడిసి హెర్జిలియా యూనివర్సిటీ బృందంతో కలిసి రూపొందించారు. స్క్రిప్టులో రాసిన విషయాన్ని అర్థం చేసుకుని దానికి అందుబాటులో ఉన్న ఫొటోలూ బొమ్మలతో కథకి అనుగుణంగా ఎంతో సులభంగా వీడియో తీసేస్తుందట. పైగా దీనివల్ల వీడియో ఎడిటింగ్‌ టూల్స్‌ వంటి వాటి అవసరం కూడా ఉండదట. ఒకవేళ వీడియో పూర్తయ్యాక స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేస్తే మళ్లీ దానికి తగ్గట్లే అది షాట్‌ తీయడం, ఉన్నదాన్ని డిలీట్‌ చేయడం... వంటివి చేసి ఫైనల్‌ కాపీని అందిస్తుంది. ఈ టూల్‌ ద్వారా తీసిన వీడియోలు ఎంతో సహజంగానూ ఉన్నాయట. దాంతో ఈ టూల్‌ యానిమేటెడ్‌, గ్రాఫిక్స్‌, గేమింగ్‌ వంటి రంగాల్లో వీడియోలూ సినిమాలూ తీయడానికీ ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు సంబంధిత నిపుణులు. సో, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజిన్స్‌ అనేది మానవ సృజనకే పోటీ వచ్చినా ఆశ్చర్యం లేదు.


జన్యులోపాలే కారణమా?!

రొమ్ముక్యాన్సర్‌ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అన్న దానికి ఇప్పటివరకూ సరైన కారణం తెలీదు. అయితే మొట్టమొదటగా డీఎన్‌ఏలో 350 లోపాలు ఉండటం వల్లే అది వస్తుందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ నిపుణులు గుర్తించారు. పైగా ఈ లోపాలకు 190 జన్యువులు కారణమవుతున్నాయట. ఇందుకోసం సదరు పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 450 క్యాన్సర్‌ సంస్థల ద్వారా లక్షా పదివేల మంది రొమ్ము క్యాన్సర్‌ బాధితుల జన్యుపటాల్ని విశ్లేషించారట. మానవ జన్యుపటంలో సుమారు 20 నుంచి 25 వేల వరకూ జన్యువులు ఉంటాయి. చాలావరకూ వ్యాధులన్నీ ఏ ఒక్క జన్యులోపం వల్లో కాకుండా అనేక జన్యులోపాల వల్లే వస్తుంటాయి. రొమ్ముక్యాన్సర్‌ కూడా ఈ కోవకే చెందుతుంది. కాబట్టి ఈ సరికొత్త పరిశోధన ఆధారంగా- డీఎన్‌ఏ పరీక్ష ద్వారా రొమ్ముక్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించి, ఆయా జన్యులోపాల్ని హార్మోన్ల చికిత్స ద్వారా సరిచేయవచ్చనీ అభిప్రాయపడుతున్నారు సదరు నిపుణులు.


బెర్రీలతో బీపీ దూరం!

బీట్‌రూట్‌ రసం తాగడం వల్ల బీపీ తగ్గుతుందన్నది తెలిసిందే. అయితే ఉత్తర ఖండంలో ఎక్కువగా కనిపించే లింగన్‌ బెర్రీల రసం అధిక బీపీతో బాధపడేవాళ్లకి అద్భుతంగా పనిచేస్తుందని హెల్సింకీ విశ్వవిద్యాలయ నిపుణులు చెబుతున్నారు. ఒక్క లింగన్‌ బెర్రీలు మాత్రమే కాదు, నల్ల ద్రాక్ష, క్రాన్‌బెర్రీల్లోని పుష్కలంగా ఉండే పాలీఫినాల్స్‌ హృద్రోగాలతోబాటు బీపీనీ తగ్గిస్తాయని గుర్తించారు. ఎనిమిది నుంచి పది వారాలపాటు పాలీఫినాల్స్‌ ఎక్కువగా ఉండే ఈ జ్యూస్‌లను తాగిన వాళ్లలో రక్తప్రసరణలో స్పష్టమైన తేడా కనిపించిందట. అయితే మిగిలినవాటితో పోలిస్తే లింగన్‌ బెర్రీల రసం తాగినవాళ్లలో బీపీ బాగా తగ్గినట్లు తేలింది. కాబట్టి ఈ రకమైన బెర్రీలు నేరుగా దొరకనిపక్షంలో కోల్డ్‌ప్రెస్డ్‌ డ్రింక్‌ రూపంలో తీసుకున్నా మంచిదే అంటున్నారు సదరు నిపుణులు. మొత్తమ్మీద బెర్రీలేవయినా కూడా బీపీ రోగులకి ఎంతో మంచిదన్నమాట.


కాలుష్యంతో ఎముకలకూ ముప్పు

వాయు కాలుష్యం అనేది శ్వాసకోశ వ్యాధులకీ మానసిక సమస్యలకీ దారితీస్తుందని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఇది కీళ్లజబ్బులకీ కారణమవుతుందని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కి చెందిన నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వీళ్లు హైదరాబాద్‌ నగర శివార్లలోని 28 గ్రామాల వాతావరణంలోని కర్బన రేణువుల శాతాన్ని లెక్కించారట. ఆ తరవాత ఆయా గ్రామాల్లో నివసిస్తున్న నాలుగువేల మంది స్థానికుల ఎముక సాంద్రతని పరీక్షించారట. అలా దాదాపు నాలుగు సంవత్సరాలపాటు వాళ్లని పరిశీలించిన సమయంలో- వాళ్లు వాడుతున్న వంటచెరకు కారణంగా క్యూబిక్‌ మీటరుకి 32.8 మైక్రోగ్రాముల కర్బనరేణువులు గాల్లో పరచుకుంటున్నట్లు తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన పది మై.గ్రా. కన్నా చాలా ఎక్కువ. అంతేకాదు, గాల్లో కార్బన్‌ ఎక్కువగా ఉన్న గ్రామంలోని స్థానికుల్లో ఎముక సాంద్రత తక్కువ ఉన్నట్లూ తేలింది. బహుశా ఈ కాలుష్యం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, ఎముకలు పెళుసుబారుతున్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వాతావరణ కాలుష్యంతో ఎముక వ్యాధులూ వచ్చే ప్రమాదం ఉందన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు