close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముఖం మీద ఉమ్మేసి వెళ్లారు..!

ప్రభుత్వాలు అవార్డు ఇచ్చే సందర్భాలు రెండురకాలుగా ఉంటాయి. ఒకరి సేవల్ని ప్రపంచానికి తెలియచెపుతూ ఇచ్చే సందర్భం ఒకటి, వారి సేవలగ్గాను యావజ్జాతి తరపున ప్రణామాలర్పిస్తూ అందించే సందర్భం ఇంకొకటి. మొదటిది ప్రశంస అయితే... రెండోది ప్రణతి! కృష్ణమ్మ జగన్నాథన్‌కి కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మభూషణ్‌ ఈ రెండో కోవకే చెందుతుంది. నిరుపేద మహిళలకి కూడూ గూడూ అందించడం కోసం ఇప్పటికీ వందల కిలోమీటర్లు ప్రయాణించే ఆ 94 ఏళ్ళ వృద్ధురాలి మనసు పొరల్ని కదిలిస్తే...
దో క్రిస్మస్‌ రాత్రి. మా ఇంటాయన ఏదో బహిరంగ సభ కోసమని బయట ప్రాంతానికి వెళ్లారు. గాంధీగ్రామ్‌లో నేనూ, కొందరు మహిళలం ఆరుబయట కూర్చుని పాటలు పాడుకుంటూ ఉన్నాం. సరిగ్గా అదే సమయంలో... మాకు వంద కిలోమీటర్ల దూరంలోని కీళ్‌వెన్మణి అనే గ్రామంలో దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన ఘోరం ఒకటి జరుగుతూ ఉంది. తంజావూరు జిల్లాలో ఓ కుగ్రామం అది. ఆ గ్రామానికి ఆ రోజు రాత్రి పదిమంది భూస్వాములు... రెండువందలమంది దుండగులతో వచ్చారు. అక్కడి దళిత వాడని చుట్టుముట్టారు.
నాటు తుపాకులూ, వేట కొడవళ్లతో కనిపించినవాళ్లని కనిపించినట్టు చంపడం మొదలుపెట్టారు. అది చూసి ఆడవాళ్లు పిల్లల్ని చంకనెత్తుకునీ, వృద్ధుల్ని వీపులపైకి ఎక్కించుకునీ పరుగెత్తారు. ఓ పెద్ద గుడిసెలోకి వెళ్లి తలదాచుకున్నారు. వాళ్లు అక్కడున్న విషయం తెలుసుకున్న భూస్వాములు ఆ ఇంటి చుట్టూ చేరారు. దానిపైన పెట్రోలు పోశారు. లోపలున్నవాళ్లందరూ వేడుకుంటూ ఉన్నా... నిప్పుపెట్టేశారు. కనీసం తమ పిల్లలైనా బతకాలని కొందరు ఆడవాళ్లు బిడ్డల్ని బయటకు విసిరేస్తే... ఆ పసివాళ్ళనీ పట్టుకుని మళ్లీ నిప్పుల్లోకి వేశారు. తప్పించుకోవడానికని బయటకొచ్చిన యువతుల్ని నిలువునా నరికి... మళ్లీ మంటల్లోకి తోశారు. ఆ అమానుష క్రీడలో చనిపోయినవారి సంఖ్య 43! వాళ్లలో ఎక్కువమంది పిల్లలూ, ఆడవాళ్లూ. ఆ వార్త తెలిసి నాకు కడుపు భగ్గుమంది... రక్తం మరిగిపోయింది. అప్పటికప్పుడే ఆ ప్రాంతానికి ప్రయాణం కట్టాను. నా జీవితాన్ని మలుపు తిప్పిన ప్రయాణం అది.
మదురై దగ్గర దిండుక్కల్‌ జిల్లాలో పట్టివీరన్‌ పట్టి అనే ఊరు మాది. అక్కడి దళితవాడలో పుట్టాన్నేను. నాన్న పచ్చి తాగుబోతు. అమ్మకి పన్నెండుమంది పిల్లలు పుడితే అందులో నాతో కలిపి ఆరుగురం బతికి బట్టకట్టాం. తాగుడువల్లో ఏమో తెలియదుకానీ, నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. వితంతువుగా మారేటప్పటికి అమ్మ వయసు ముప్పై రెండేళ్లే. గ్రామాల్లో ఓ ఒంటరి ఆడది వితంతువుగా, అదీ పేదరికంలో బతకడమంత నరకం ఇంకోటి ఉండదు. అమ్మ ఉదయం మూడుగంటలకే లేచి అడవికెళ్లి ఆకులూ అలముల్ని ఏరుకొచ్చి భూస్వామి చేలల్లో ఎరువుగా వేసేది. ఆ తర్వాత అక్కడి పొలం పనుల్లో నడుం వంచితే మళ్లీ లేచేది సాయంత్రానికే. అప్పటికిగాని కూలీ బియ్యం ఇవ్వరు. అదీ, పనిలో నానా వంకలు పెట్టి ఇవ్వాల్సిందానికంటే తక్కువే ఇస్తారు. అప్పటిదాకా మధ్యలో ఏ దుంపో, కాయో తినడం తప్ప పిల్లలం అందరం పస్తులుండాల్సిందే. అమ్మ ఇంటికొచ్చి వంట చేసేసరికి... ఆకలికి ఏడ్చిఏడ్చి పిల్లలం నిద్రలోకి జారుకునేవాళ్ళం. మమ్మల్ని లేపి కాస్త తినిపించి మిగిలితే తనూ ఇంత తినేది. అమ్మ కష్టం చూశాకే ప్రతి మహిళకీ సొంతంగా భూమి ఉండి తీరాలనే నిశ్చయం కలిగింది నాలో. నేను మా ఊళ్ళోని బడిలోనే ఏడో తరగతి దాకా చదువుకున్నాను. ఆ తర్వాత మానేస్తానంటే అమ్మ వినకుండా మదురైలోని ఓ పెద్దబడిలో చేర్చింది. నాకు చదువుపైన ఆసక్తి మొదలైంది అక్కడే. అన్ని క్లాసుల్లో ఫస్ట్‌ వచ్చే నన్ను హెడ్‌మిస్ట్రెస్‌ అలీస్‌ ఎంతో ఇష్టపడేవారు. పదో తరగతి పూర్తయ్యాక ఆమే నన్ను టీవీఎస్‌ మోటార్‌ పరిశ్రమ వ్యవస్థాపకుడు సుందరం అయ్యంగార్‌ కూతురు సౌందరమ్మ దగ్గరకి తీసుకెళ్లి, ‘ఈ పాపని చదివించండి. భవిష్యత్తులో మీ పేరు నిలబెడుతుంది!’ అని చెప్పారు. అలా సౌందరమ్మ పంచన చేరాను. ఆమె ప్రతిరోజూ ఓ పోలీస్‌నీ నన్నూ వెంటపెట్టుకుని మదురైలోని వ్యభిచార గృహాలకెళ్లి ఆ వృత్తిని వదిలి రమ్మని వాళ్ళకి చెబుతుండేది. అలా ఆశ్రమానికి వచ్చినవాళ్లందరికీ చదువు చెప్పించే బాధ్యత నాకు అప్పగించింది సౌందరమ్మ. అప్పట్లో మహిళలు కనీసం నాలుగో తరగతి దాకా చదివినా టీచర్‌గానూ, నర్సులుగానూ ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆ ఉద్యోగాలు వాళ్లకి రావాలని పట్టుదలతో చదువు చెప్పాను. సమాజ సేవలో అది నా తొలి అడుగు. అలా పాఠాలు చెబుతూనే బీఏ పాసయ్యాను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బీఏ పట్టా సాధించిన తొలి దళిత మహిళగా నిలిచాను. టీచర్‌ ట్రైనింగ్‌లో చేరాను.
ఆ ఏడాదే గాంధీగారిని చూశాను. జీవితంలో ఎప్పుడైనా ఆయన్ని కళ్లారా చూస్తానా అనుకుంటున్న నాకు... మూడురోజులపాటు ఆయనకి సపర్యలు చేసే అవకాశం కల్పించింది సౌందరమ్మ. ఓసారి అక్కడికి రాజాజీ వచ్చారు. ఆయన గాంధీ, సౌందరమ్మలతో ఏదో మాట్లాడాలి కాబోలు నన్ను బయటకు వెళ్లమన్నారు. వెంటనే సౌందరమ్మ ‘కృష్ణ ఉంటుందిలెండి...’ అంది. రాజాజీ నా వైపు పరీక్షగా చూసి ‘ఎవరీ అమ్మాయి...?’ అని అడిగారు. ‘నా కూతురే’ అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది సౌందరమ్మ. ఆ తల్లిగుండె చల్లదనానికి కన్నీళ్లొచ్చేశాయి నాకు. అలాంటి సౌందరమ్మే నాకో పెద్ద సమస్య తెచ్చిపెట్టింది... గాంధీగారి సహాయనిరాకరణ ఉద్యమంలో ఉన్న జగన్నాథన్‌ని పెళ్ళి చేసుకోవాలని కోరింది. ఆయన నన్ను ఏదో సత్యాగ్రహ సభలో చూసి ఇష్టపడ్డారట. నాన్న తాగి అమ్మని ఎలా కొట్టేవాడో చూస్తూ పెరిగిందాన్ని కాబట్టి నాకసలు పెళ్ళి జంజాటమే వద్దన్నాను. సౌందరమ్మ వినకపోవడంతో... ఒప్పుకోక తప్పలేదు. మాది కులాంతర వివాహం కావడంతో అటు పుట్టింటా, ఇటు మెట్టింటా కూడా నన్ను చేరదీయలేదు. అప్పుడే వినోబాభావే భూదాన ఉద్యమం మొదలుపెట్టారు. భూస్వాముల భూమిని పేదలకి పంచి ఇచ్చే ఆ మహోన్నత ఉద్యమం కన్నా నా టీచర్‌ ట్రైనింగ్‌ ముఖ్యం కాదనుకుని వినోబా దగ్గరకు బెనారస్‌ వెళ్లాను. ఆ అడుగే నన్ను వేలాది మహిళల కష్టాల్లో పాలుపంచుకునేలా చేసింది. వినోబాభావేతో కలిసి నేనూ, మా ఆయనా సర్వోదయ ఉద్యమంలో దేశమంతా తిరిగాం. పేదలకి వందలాది ఎకరాలు దానమిప్పించాం. మాదైన సేవలో తరిస్తున్నామని సంతృప్తి పడుతుండగానే కీళ్‌వెన్మణి ఘటన చోటుచేసుకుంది.

ఏదైనా సాధ్యమే!
కీళ్‌వెన్మణిలో ఆ రోజు మసిబొగ్గుల్లా పడి ఉన్న పిల్లలూ ఆడవాళ్ల శవాలని చూడగానే దుఃఖం ఆగలేదు నాకు. ఊరంతా నిర్మానుష్యంగా శ్మశానంలా ఉంది. అప్పటికే కొందరు ప్రతీకార దాడులకి సిద్ధమవుతున్నారు. ఒకరిమీద ఒకరు దాడులు చేసుకుంటూ పోతే... దానికి అంతెక్కడ?! అందుకే అక్కడ మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఆపడమే నా కర్తవ్యం అనిపించింది. ముందు భూస్వాములూ, కూలీల కుటుంబాలని కలిశాను. ఈ సంఘటన ముందుదాకా రైతు కూలీలని ముందుండి నడిపించిన కమ్యూనిస్టులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పోలీసుల నిఘా కళ్లు కప్పి ప్రాణాలకి తెగించి మరీ వాళ్లదగ్గరకెళ్లాను. అందరూ తమ వాదన చెప్పేవాళ్లు తప్ప... శాంతి కోసం ప్రయత్నించేవాళ్లు కనిపించలేదు. అలాకాదని నేను అక్కడి దళితవాడలోనే ఉండిపోయాను. పిల్లల్ని చేరదీసి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. మెల్లగా ఆడవాళ్లకి నాపైన నమ్మకం కుదిరింది. వాళ్లని కూడగట్టుకుని శాంతి యాత్రలు చేయడం మొదలుపెట్టాను. రోజూ రాత్రి ఓ దీపం వెలిగించి ప్రార్థనలు చేస్తూ కూర్చునేవాళ్లం! ‘ఈ యాత్రలూ, ప్రార్థనల్లో ఏముంది!’ అనిపిస్తుందికానీ... ఇవన్నీ అహింసా సంకేతాలు. అవి ఫలితాలనివ్వడం మొదలుపెట్టాయి. బాధితుల్లో ప్రతీకారేచ్ఛ రగల్చకుండా శాంతి బాట పట్టిస్తున్న నన్ను భూస్వాములు చర్చలకి పిలిచారు. ‘కూలీ పెంచడం కాదు... 72 మంది బాధితుల కుటుంబాలకి బతకడానికి భూముల్ని ఇవ్వండి’ అని అడిగాను. వాళ్లు ఒప్పుకోకపోవడంతో నిరాహారదీక్షకి కూర్చున్నాను. దాంతో ‘మాకు ఎంతోకొంత ధర చెల్లిస్తే భూములిస్తాం!’ అన్నారు. ‘ఎంత రాక్షసత్వంతో ప్రవర్తించినా వాళ్లకీ పిల్లాపాపలు ఉంటారుకదా. భూముల్ని ఊరికే ఎలా వదులుకుంటారు!’ అనిపించింది. దాంతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి 72 ఎకరాలు కొని ఆ కూలీల కుటుంబాల పేర రాయించాను. దాన్నే మిగతా జిల్లాలకీ విస్తరించాలనుకున్నాను. నా అసలు పోరాటం అప్పుడే మొదలైంది.
పిల్లవాడితోపాటూ దీక్షలు...
దున్నేవాళ్లకే భూములివ్వాలని పోరాటం చేస్తున్నప్పుడే మా పెద్దవాడు భూమి
కడుపులో పడ్డాడు. ఏ ఊరికి వెళ్లినా అక్కడ మావాణ్ణి ఆరుబయట చెట్లకి ఊయలకట్టి పడుకోబెట్టేదాన్ని. ఓసారి ఓ భూస్వామి చర్చలకి రమ్మంటే వెళ్లాను. నాకు గెస్ట్‌ హౌస్‌ కూడా ఇచ్చి రాచమర్యాదలు చేశాడు. కానీ ఆ రోజు జరిగిన సభలో నేను కూలీలకి మద్దతుగా మాట్లాడేసరికి అర్ధరాత్రి వేళ గెస్ట్‌హౌస్‌ నుంచి నన్ను బయటకు గెంటేశాడు. ఆ రాత్రి వేళ పిల్లాడితో సహా నన్ను పోలీసు స్టేషన్‌లో పెట్టించాడు. ఇంకోచోట నిరాహార దీక్ష చేస్తుంటే ఒళ్ళో బిడ్డ ఉన్నాడనే కనికరం లేకుండా ముఖం మీద ఉమ్మేసి వెళ్లారు. అలా నా బిడ్డ నెలల వయసు నుంచే నాతో కలిసి పోరాటాల్లో పాల్గొన్నాడు. ఆరో తరగతి దాకా వాడికి నేనే టీచర్‌ని. ఆ తర్వాత రామకృష్ణమఠం వాళ్లు వాడి బాధ్యత తీసుకున్నారు. వాడు అక్కడే హాస్టల్‌లో ఉంటూ డాక్టర్‌ అయ్యాడు. ఇప్పుడు కంబోడియాలో యుద్ధ బాధితుల కోసం సేవలందిస్తున్నాడు.
జైల్లో ఎన్ని ఘోరాలో...
నా పోరాటాల్లో భాగంగా నెలల తరబడి జైల్లో ఉండాల్సి వచ్చేది. ఒక చిన్న సెల్‌లో 40 మంది ఆడవాళ్లని ఉంచేవారు. ఒంటిమీది చీర తప్ప వేరేది ఇవ్వరు. దాంతో వాటితోనే స్నానం చేయాలి... అవి ఒంటిపైనే ఆరాలి. అలా బట్టలన్నీ మురికితో అట్టకట్టుకుని పోయేవి. రెండువారాల తర్వాత నాకు మాత్రం రెండు చీరలిచ్చారు. ఆరుబయటకు వచ్చి బట్టలు ఉతుక్కునే అవకాశమూ కల్పించారు. నేను స్నానం చేసి ఓ చీర మార్చుకుని... ఇంకొకదాన్ని నా పక్కనుండేవాళ్లకిచ్చి... వాళ్లు అప్పటిదాకా కట్టుకున్నదాన్ని తెచ్చి ఉతికి ఇంకొకరికి ఇచ్చేదాన్ని. ఇన్ని జైల్‌ భరో పోరాటాలూ,  నిరాహారదీక్షలూ, ఊరేగింపుల తర్వాతే భూస్వాముల మనసు కరగడం మొదలైంది. భూమిని ఎంతోకొంత ధరకి అమ్ముతామని ముందుకొచ్చారు. అప్పుడే నేను లాఫ్టి(ల్యాండ్‌ ఫర్‌ టిల్లర్స్‌ ఫ్రీడమ్‌) అనే సంస్థని స్థాపించాను. భూస్వాములు అందించే భూమిని కూలీలు కొనుక్కోవడానికి బ్యాంకు ద్వారా రుణాలిప్పించడం ఆ సంస్థ లక్ష్యం. ఆ భూమిలో సాగుచేసి వచ్చే ఆదాయంతో రుణాలు తీర్చాలన్నది పద్ధతి. కాకపోతే చిన్నప్పుడు అమ్మ కష్టాలని దగ్గరగా చూస్తూ పెరిగిందాన్ని కాబట్టి... ఈ భూములన్నీ ఆడవాళ్ల పేరుమీదే రాయించాను. అలా ఇప్పటిదాకా 15 వేల ఎకరాలని ఇప్పిస్తే... ఏ ఒక్క మహిళా రుణం ఎగ్గొట్టిన దాఖలాల్లేవు! లాఫ్టి మాత్రమే కాకుండా మరో నాలుగు ఎన్జీఓలనూ అనాథాశ్రమాన్నీ ఏర్పాటుచేశాను. ఈ మధ్యే గుడిసెలున్న కూలీలకి పక్కా ఇళ్లు కట్టివ్వాలనే ఉద్యమాన్ని మొదలుపెట్టాను. నాగపట్నంలో పేదల కోసం రెండువేల ఇళ్లని కట్టిస్తున్నాను. ‘94 ఏళ్ల వయసులో ఇన్ని ప్రయాణాలూ అవసరమా!’ అంటుంటారు. ‘వయసు శరీరానికే కానీ... మనసుక్కాదు!’ అంటూ నవ్వేస్తాను.

నా బాధ చెప్పలేదు...
నా ఎనభైయేళ్ల ప్రజాజీవితంలో దేశమంతా తిరగడం తప్ప ఏ ఒక్క ఏడాది కూడా ఒకే కప్పుకింద ఉండలేదు నేను. అలాంటిది, మా ఆయన చనిపోయాక జీవితంలో ఇప్పుడే తొలిసారి నా కూతురితో ఉంటున్నాను. తన పేరు సత్య. మావాడైనా నాతో పదేళ్లదాకా ఉన్నాడుకానీ మా పాపనైతే ఎనిమిదో నెలకే అమ్మ దగ్గర విడిచిపెట్టి వచ్చేశాను. ఎప్పుడూ తన ఆలనాపాలనా చూసింది లేదు. తను పదేళ్లదాకా మా అమ్మదగ్గరే ఉండి తర్వాత హాస్టల్‌లోనే చదువుకుంది. ఓ ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలిగా చేస్తోంది. ‘నాకు మరో జన్మంటూ ఉంటే నీకు తల్లిగా పుట్టి చిన్నప్పుడే నిన్ను హాస్టల్లో వదిలేస్తా... నా బాధేమిటో అప్పుడు తెలుస్తుంది నీకు!’ అంటుంటుంది సరదాకి. తనకంటే ఆ బాధ నాకు వెయ్యిరెట్లు ఉండేదని సత్యకి నేనెప్పుడూ చెప్పలేదు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.