close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గెలిస్తే ఆమె బొకే పంపిస్తుంది!

గత రెండేళ్లుగా టీమ్‌ ఇండియా టీ20, వన్డేల్లో నాలుగో స్థానంలో దిగే బ్యాట్స్‌మన్‌ కోసం వెతుకుతోంది. న్యూజిలాండ్‌ పర్యటనలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించి ఆ స్థానానికి తాను సరైనోడిననిపించుకున్నాడు ముంబయి బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గానూ రాణిస్తోన్న శ్రేయస్‌ తన క్రికెట్‌ ప్రస్థానం గురించి ఏం చెబుతున్నాడంటే...

మేం ఉండేది ముంబయిలోని వర్లీ ప్రాంతంలో. మంగళూరు నుంచి నాన్న వలస వచ్చి ముంబయిలో కొరియర్‌, కార్గో వ్యాపారం మొదలుపెట్టారు. నాన్న కాలేజీ స్థాయి క్రికెట్‌ ఆడారట. నాలుగేళ్ల వయసు నుంచీ నాచేత ఆడిస్తున్నారు. ఇంట్లో చిన్నపుడు నాన్న రబ్బరు బంతి విసురుతుంటే నేను బ్యాటింగ్‌ చేస్తూ సరదాగా ఆడుకునేవాళ్లం. ఆ వయసులో బంతిని మిడిల్‌ చేసి చాలా గట్టిగా కొడుతుండేవాణ్నట. ఎనిమిదేళ్లపుడు స్కూల్లో జరిగిన ఒక మ్యాచ్‌లో 40 బంతుల్లో 102 రన్స్‌ కొట్టాను. అప్పుడే నాలో క్రికెటర్‌ ఉన్నాడని గుర్తించి శిక్షణ ఇప్పించాలనుకున్నారు. పదేళ్లు వచ్చేసరికి ఫ్రెండ్స్‌తో కలిసి సీజన్‌బాల్‌తో ఆడేవాణ్ని. ఏ స్కూల్లో క్రికెట్‌ కోచింగ్‌ బాగుంటే నన్ను అక్కడ చేర్పించేవారు. అలా రెండు మూడు స్కూల్స్‌ మారాను. డాన్‌ బాస్కోలో ఎక్కువ కాలం చదివాను. స్కూల్లో క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌ కూడా బాగా ఆడేవాణ్ని. పదేళ్లపుడు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే క్రికెట్‌కే ఓటు వేశాను. కానీ చదువుని అశ్రద్ధ చేయడానికి వీల్లేదనేవారు. పరీక్షల సమయంలో క్రికెట్‌ శిక్షణకు బ్రేక్‌ ఇచ్చి చదివేవాణ్ని. కానీ క్రికెట్టే నా లక్ష్యంగా ఉండేది. మధ్య తరగతి కుటుంబమే అయినా ఆటకోసం ఏది కావాలన్నా కొనిచ్చారు.

శివాజీ పార్కులో శిక్షణ....
స్కూల్‌ కోచ్‌ల సూచనతో నన్ను శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో శిక్షణ ఇప్పించడానికి తీసుకువెళ్లారు నాన్న. అక్కడ టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు ప్రవీణ్‌ ఆమ్రె చీఫ్‌ కోచ్‌. నాకపుడు పన్నెండేళ్లు. ఆయనకు నా ఆట నచ్చింది. కానీ అక్కడ అంతా పెద్దవాళ్లు ఆడతారు. పొరపాటున దెబ్బలు తగిలించుకుంటే కష్టమని నన్ను చేర్చుకోలేదు. తర్వాత ఏడాది మాత్రం చేర్చుకున్నారు. అక్కడ ఉదయం 7-9 గంటల మధ్య ప్రాక్టీసు. 9:30కి స్కూల్లో ఉండేవాణ్ని. స్కూల్‌ నుంచి ఒక గంట ముందే వెళ్లిపోయేవాణ్ని. సాయంత్రం మళ్లీ రెండు గంటలు ప్రాక్టీసు ఉండేది. ప్రవీణ్‌ ఆమ్రె శిక్షణలో చాలా నేర్చుకున్నా. ఆయన ముంబయి రంజీ జట్టుకి కోచ్‌గానూ ఉండేవారు. ఆయన చొరవతో ముంబయి అండర్‌-13కి ఎంపికయ్యాను.

వినోద్‌ రాఘవన్‌ ముంబయి జట్టుకి జూనియర్‌ కోచ్‌. ఆయన మార్గనిర్దేశంలో అండర్‌-16, అండర్‌-19కి ఆడటమే కాదు, అండర్‌-19 ముంబయి జట్టుకి కెప్టెన్‌గా కూడా చేశాను. కెప్టెన్‌గా
12 మ్యాచ్‌లు ఆడి, నాలుగు సెంచరీలు చేశాను.

దాంతో ఇండియా అండర్‌-19 జట్టుకి ఎంపికయ్యాను. 2014లో అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో ఓడిపోయాం. గెలుపు, ఓటమి... ఫలితం ఏదైనా నాన్న మద్దతు నాకు ఉండేది. 16 ఏళ్లపుడు అనుకుంటా... వరసగా నాలుగైదు నెలలు పరుగులు చేయలేకపోయాను. మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాను. నాన్న స్పోర్ట్స్‌ సైకాలజిస్టు దగ్గరకు తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. ‘నీకు కష్టంగా ఉంటే క్రికెట్‌ మానేయొచ్చు’ అన్నారు. నేను మాత్రం నా లక్ష్యం క్రికెట్‌ అని స్పష్టంగా చెప్పాను.

ఇంగ్లాండ్‌లో ఆడాను...
నా వయసువాళ్లు సరదాకోసం చాలా చేస్తుంటారు. ఆటగాళ్లు అలాంటివాటికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ ఒకే ఫ్రెండ్స్‌, పాత మనుషుల మధ్యనే ఉంటే మన ఆలోచనా పరిధి కూడా అక్కడే ఆగిపోతుంది. వందలో ఒక్కడిగా ఉండాలంటే ఆలోచనలూ పనులూ భిన్నంగా ఉండాలి అనేది నా సిద్ధాంతం. అండర్‌-19 ప్రపంచకప్‌ తర్వాత ఇండియా-ఏ జట్టులో చోటు దొరకలేదు. అప్పటికి నేను రంజీల్లో కూడా ఆడలేదు. ఇంగ్లండ్‌లో ఒక క్లబ్‌ బ్యాట్స్‌మన్‌ కోసం చూస్తోందని ఫ్రెండ్‌ద్వారా తెలియగానే వెళ్దామనుకున్నాను. కోచ్‌ సలహా అడిగితే ‘మంచి అనుభవం వస్తుంది వెళ్లిరా’ అన్నారు. అలా నాటింగ్‌హామ్‌లోని క్లిఫ్‌టన్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున ఆడటానికి వెళ్లాను. అక్కడ మూడు నెలలు ఉన్నాను. ఆ జట్టులో 11 మందే ఉండేవారు. తుది జట్టులో ఉంటామా, లేదా అన్న సందేహమే లేదు. జట్టులో నేనే అందరికంటే చిన్నవాణ్ని. దాదాపు ప్రతిరోజూ మ్యాచ్‌లు ఆడేవాళ్లం. విదేశీ పిచ్‌లను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడింది ఆ పర్యటన. వ్యక్తిగానూ చాలా నేర్చుకున్నాను.

నా టీమ్మేట్‌తో కలిసి రూమ్‌లో ఉండేవాణ్ని. నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ని. వంట కూడా చేసుకునేవాణ్ని. అక్కడ వాతావరణం అంతా కొత్త. పరిచయాలు పెరగాలంటే క్రికెట్‌ కాకుండా ఇంకేదైనా మంచి టాలెంట్‌ ఉండాలనిపించింది. యూట్యూబ్‌లో చూసి మేజిక్‌ నేర్చుకున్నాను. ముఖ్యంగా పేక ముక్కలతో మేజిక్‌ చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నాతోపాటు పేక ముక్కలూ ఉంటాయి. దీనివల్ల చాలామంది ఫ్రెండ్స్‌ అవుతుంటారు.

టీమ్‌ ఇండియాకి ఎంపిక
ఇంగ్లండ్‌ నుంచి తిరిగొచ్చాక ముంబయి రంజీ జట్టుకి ఎంపికయ్యాను. నా మొదటి రంజీ సీజన్‌(2014-15)లో 809 రన్స్‌ చేశాను. ఆ సీజన్లో మా జట్టునుంచి అదే అత్యధిక స్కోరు. 2015-16 ఐపీఎల్‌ సీజన్లో 1321 పరుగులు చేశాను. ఒక రంజీ సీజన్లో ఇది రెండో అత్యుత్తమ స్కోరు. 2017లో టీమ్‌ ఇండియాలో చోటు దక్కింది. టీ20ల్లో న్యూజిలాండ్‌పైన, వన్డేల్లో శ్రీలంకపైన అరంగేట్రం చేశాను. ఆ టైమ్‌లో చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ సీనియర్లూ, సహాయక సిబ్బందీ చాలా సాయపడ్డారు.

వన్డే సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు చేశాను. ధోనీతో కలిసి ఆడాలనీ, అతడితో క్రికెట్‌ గురించి చర్చించాలనీ కలలు కనేవాణ్ని. ఓరోజు ధోనీ పక్కన కూర్చున్నపుడు ఈ విషయాన్ని చెప్పాను. మహీ భాయ్‌ చిన్నగా నవ్వి, ‘పత్రికలు చదవొద్దు, సోషల్‌ మీడియాలో ఎక్కువ టైమ్‌ గడపొద్దు. అప్పుడే ఆటమీద దృష్టి పెట్టగలవు’ అని చెప్పాడు.

ఈరోజుకీ ఆ మాటల్ని ఫాలో అవుతుంటా. విరాట్‌తో నా టెక్నిక్‌ గురించి తరచూ మాట్లాడతాను. కోహ్లీ, రోహిత్‌...

వీరితోపాటు ఆడుతూ, ప్రయాణిస్తూ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం టీ20లూ, వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నా. త్వరగా వికెట్లు పడితే ఈ స్థానంలో వచ్చే బ్యాట్స్‌మన్‌ మధ్య ఓవర్లలో కాస్త ఓపిగ్గా క్రీజులో నిలబడాలి. చివరి ఓవర్లు వచ్చేసరికి మళ్లీ బ్యాట్‌ని ఝుళిపించాలి. జాతీయ జట్టులోకి రావడం, పోవడం అనే విషయాల్ని గురించి ఎక్కువగా ఆలోచించను. ఇండియాకి ఆడకపోతే ఇండియా-ఎ, రంజీల్లో ఆడతాను.

నా దృష్టి ఆటమీదే ఉంచుతాను. ఏడాదిలో 300 రోజులు ఇంటికి బయటే ఉంటాను. క్రికెటర్‌గా ప్రపంచకప్‌ గెలవడం నా లక్ష్యం.

కెప్టెన్సీ భారం కాదు...
2015 ఐపీఎల్‌ వేలంలో రూ.10 లక్షల బేస్‌ ప్రైస్‌ విభాగంలో పాల్గొన్నాను. నాకు రూ.70-80 లక్షలు రావొచ్చని ఫ్రెండ్సంతా సరదాగా అనుకున్నాం. నాకైతే పది లక్షలైనా చాలు, ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావాలి అనుకునేవాణ్ని. అలాంటిది దిల్లీ జట్టు రూ.2.6కోట్లు వెచ్చించింది నాకోసం.

మా ఇంట్లో వాళ్లకైతే అది కలా, నిజమా అన్నట్టు ఉండేది. ఆ సీజన్లో 439 పరుగులు చేశాను. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అవార్డు వచ్చింది. 2018 సీజన్లో గౌతమ్‌ గంభీర్‌ అర్ధంతరంగా తప్పుకున్నపుడు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తే తీసుకున్నాను. కెప్టెన్సీ నా మైండ్‌ సెట్‌ని పూర్తిగా మార్చేసింది. మనం బాగా ఆడకపోయినా కూడా జట్టుని గెలిపించడమనేది ఎంతో ముఖ్యం. అలాంటపుడు నాయకుడిగా మంచి గుర్తింపు వస్తుంది. అయితే జట్టులోని మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌మీద విశ్వాసం పెరగడానికి ఆటగాడిగా కూడా రాణించాలి. కెప్టెన్సీ చాలా ఒత్తిడితో కూడిన పని.  ఒత్తిడిలో నేను ఇంకా బాగా రాణిస్తాను. ముఖ్యంగా రన్స్‌ ఛేజ్‌ చేయడం నాకు బాగా ఇష్టం. కొందరు ఐపీఎల్‌ కెప్టెన్లు కొత్తవాళ్లమీదకి గయ్‌మని లేస్తారు. నేను మాత్రం ఎవరినైనా సమానంగా చూస్తాను. 2019లో మా జట్టు నాలుగో స్థానంలో నిల్చింది. ఇటీవల కాలంలో మాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. నాకు ఎప్పుడు బ్యాటింగ్‌లో ఇబ్బంది ఎదురైనా ప్రవీణ్‌ ఆమ్రెను సంప్రదించి సరిచేసుకుంటాను. ప్రస్తుతం ఆమ్రె దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకి అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నారు. కోచ్‌ రికీ పాంటింగ్‌తో కూడా ఆట గురించి చర్చిస్తాను. వీళ్లంతా నా ఆటని మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించారు.

ఆట- ఆటవిడుపు...
ఆట ఎంత ముఖ్యమో ఆటవిడుపు కూడా నాకు అంతే ముఖ్యం. 2016లో క్రికెట్‌తో చాలా బిజీ అయిపోయాను. ఆ సీజన్లో రంజీ ట్రోఫీలో, దేశవాళీ మ్యాచ్‌లలో మంచి పరుగులు చేశాను. కానీ ఐపీఎల్‌లో ఆరు మ్యాచ్‌లలో 50 పరుగులైనా చేయలేకపోయాను. అప్పుడే ఆటవిడుపు ప్రాధాన్యం తెలిసింది. ఐపీఎల్‌ తర్వాత ఫ్రెండ్స్‌తో పర్యటనలకు వెళ్లాను. క్రికెట్‌ని కొద్దిరోజులు మనసులోంచి తీసేశాను. ప్రకృతికి దగ్గరైనపుడు మిగతావన్నీ మర్చిపోతాను. దాంతో రీఛార్జ్‌ అయ్యాను. తిరిగి వచ్చాక నా లక్ష్యంమీద సరిగ్గా గురి పెట్టగలిగాను. అప్పట్నుంచీ ఎప్పుడు వీలున్నా పర్యటనలకు వెళ్తుంటా. టర్కీ, వెస్టిండీస్‌ నాకు ఇష్టమైన దేశాలు. మనదేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌కి ఎక్కువగా వెళ్తుంటాను.


టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌...

నాన్న సంతోష్‌, అమ్మ రోహిణి, చెల్లి శ్రేష్ఠ... ఇదీ మా కుటుంబం.
* ముంబయిలోని ఆర్‌.ఏ.పోధార్‌ కాలేజీలో బి.కామ్‌. చేశాను.
* నలుగురిలో అంత సులభంగా కలిసేవాణ్ని కాదు. నాలో మార్పు తేవాలని అమ్మానాన్నా సరదాగా మాట్లాడుతూ మాట్లాడిస్తూ జోకులు వేస్తూ ఉండేవాళ్లు. దాంతో నేనూ నోరు విప్పేవాణ్ని.
* ఐపీఎల్‌లో మ్యాచ్‌ గెలిచినపుడల్లా ఒక అమ్మాయి బొకే పంపిస్తుంది. ‘థాంక్యూ’ అని మాత్రమే రిప్లై ఇస్తాను.
* ప్రస్తుతానికి సింగిల్‌. నిజంగానే... అయితే ఒకవేళ ప్రేమలో ఉన్నా, ఆ విషయం బయట చెప్పను. పెళ్లి తర్వాతే మా గురించి మాట్లాడుకోవాలనుకుంటాను.
* ఫ్యాషన్లు బాగా ఫాలో అవుతాను. స్ట్రీట్‌ ఫ్యాషన్‌ నచ్చుతుంది. సూట్స్‌ కూడా ఇష్టం. డేవిడ్‌ బెక్‌హామ్‌, విరాట్‌ కోహ్లి స్టైలింగ్‌ నాకు నచ్చుతుంది.
* ఒకప్పుడు ఆహార నియమాలు లేకుండా అన్నీ తినేసేవాణ్ని. కానీ ఇప్పుడు ఫిట్‌నెస్‌, ఆరోగ్యం ప్రాధాన్యం తెలిసింది. నాకు పాల పదార్థాలంటే పడదు. స్వీట్స్‌, గోధుమతో చేసిన వంటకాలూ తినను. చికెన్‌
బిరియానీ, మటన్‌ బిరియానీ ఇష్టం. కొద్దికొద్దిగా తింటాను. డ్రైఫ్రూట్స్‌, ఎగ్స్‌ తీసుకుంటాను.
* నాకు డ్యాన్స్‌ అంటే బాగా ఇష్టం. పాటలు వింటాను, నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాను. వీలున్నప్పుడల్లా కొన్ని వెబ్‌సిరీస్‌లు వరసపెట్టి చూస్తాను.
* టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ కూడా ఆడతాను. సమయం దొరికితే కాలనీలో ఫ్రెండ్స్‌తో టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతుంటాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.