close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హల్దీరామ్‌’ మా తాతయ్య పేరు!

ఓ చల్లని సాయంత్రం... పార్కులో ప్రేయసీప్రియుడూవారి చేతుల్లో హల్దీరామ్స్‌ కారప్పూస. పండగవేళ... ఇంట్లోచేసిన వంటలకు తోడు దుకాణంలో కొనితెచ్చిన హల్దీరామ్స్‌ సోన్‌ పాపిడి. ఉద్యోగం వచ్చినరోజు... ఆ తీపి కబురుచెప్పి అమ్మానాన్నల నోరు తీపిచేయడానికి చేతిలో హల్దీరామ్స్‌ గులాబ్‌జామ్‌! ఇలా ప్రతి సందర్భంలోనూ హల్దీరామ్స్‌ భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. హల్దీరామ్స్‌ బ్రాండ్‌ సృష్టికర్తల్లో ప్రధానమైన వ్యక్తి శివ్‌ కిషన్‌ అగర్వాల్‌. బికనేర్‌ నుంచి మొదలైన ఆయన వ్యాపార ప్రస్థానాన్ని మనతో చెబుతున్నారిలా...

నా వయసు 79. రోజూ ఉదయం అయిదింటికి నిద్రలేస్తాను. రోజుకి 10 గంటలు చొప్పున వారంలో ఆరు రోజులు పనిచేస్తాను. పదేళ్ల వయసునుంచి ఇలా పనిచేయడం అలవాటైపోయింది. ‘కష్టపడి పనిచెయ్యి జీవితంలో పైకి ఎదుగు’ అనేది నా సిద్ధాంతం. ఇది మా తాత దగ్గర్నుంచి అలవాటు చేసుకున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా- కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా పేరున్న ‘హల్దీరామ్స్‌’ ప్రస్థానం రాజస్థాన్‌లోని బికనేర్‌లో మొదలైంది. బికనేర్‌లో కారప్పూస(భుజియా) తయారుచేసి అమ్మేవాళ్లు మా కుటుంబ సభ్యులు. గంగా భిషెన్‌ అగర్వాల్‌ మా తాతయ్య. ఆయన శరీరఛాయ పసుపు(హిందీలో హల్దీ)రంగులో ఉండడంతో ఆయన్ని అందరూ ‘హల్దీరామ్‌’ అని ముద్దుగా పిలిచేవాళ్లు. తాతయ్య కారప్పూస తయారీలో ప్రయోగాలు చేసి కొత్త రుచుల్ని సృష్టించేవాడు. అప్పట్లో లావుపాటి కారప్పూసని అందరూ తయారుచేస్తుంటే సన్న కారప్పూసని తయారుచేసేవాడు తాతయ్య. దాన్లో మోఠీ దాల్‌ని కలపడంతో కొత్త రుచి వచ్చేది. 1941 నాటికి అందరూ కారప్పూస కిలో రెండు పైసలకు అమ్మితే తాతయ్య అయిదు పైసలకు అమ్మేవాడు. బికనేర్‌ రాజు మహారాజా దుంగార్‌ సింగ్‌ పేరుమీద ‘దుంగార్‌ సేవ్‌’ పేరుతో ఓ వెరైటీ కారప్పూసని తెచ్చాడు. బ్రిటీషర్ల కాలంలో బికనేర్‌ మీదుగా కోల్‌కతా వెళ్లే వ్యాపారులు మా దగ్గర కారప్పూస కిలోలకొద్దీ కొని తీసుకువెళ్లేవారు. వారానికి 200 కిలోల కారప్పూస అమ్మేవాళ్లం. తాతయ్యకి ముగ్గురు కొడుకులు. వారిలో నాన్న మూల్‌చంద్‌ పెద్దవాడు. నాన్నకి నలుగురు కొడుకులు వారిలో నేను పెద్ద. ఆరో తరగతి తర్వాత నన్నూ వ్యాపారంలోకి దించారు. దాంతో చిన్నప్పట్నుంచీ ఆర్థిక, వ్యాపార నిర్వహణ తెలిసింది. అప్పట్లో కిరాణా దుకాణాలకు వెళ్లి ముడి సరుకులు తెచ్చేవాణ్ని. కేజీ పప్పు రెండు పైసలని చెబితే, నేను ఒకటిన్నర పైసకి ఇవ్వమని అడిగేవాణ్ని. వాళ్లు ఎంతో కొంత తగ్గించేవారు. తగ్గించకపోతే వాళ్లు చెప్పిన రెండు పైసలిచ్చి ఓ వంద గ్రాములు ఎక్కువ వెయ్యమనేవాణ్ని. ధరలోనే బేరాలు ఉండాలి, కానీ నాణ్యతలో ఎప్పుడూ ఉండకూడదనేది నేను చిన్నపుడు నేర్చుకున్న మరో పాఠం.

కోల్‌కతా ప్రయాణం...
మాది ఉమ్మడి కుటుంబం. 1955లో తాతయ్యకి వాళ్ల నాన్నతో గొడవ వచ్చి కోల్‌కతా వెళ్లి వ్యాపారం మొదలుపెట్టాడు. నాకపుడు పద్నాలుగేళ్లు. తాతయ్యకి తోడుగా చిన్నాన్న రామేశ్వర్‌లాల్‌, నేనూ కోల్‌కతా వెళ్లాం. తాతయ్య అప్పటికి కొన్నేళ్ల కిందట ఓ పెళ్లికి వెళ్లి కోల్‌కతా చూశాడట. అందుకే అక్కడకు వెళ్లాలనుకున్నాడు. బికనేర్‌తో పోల్చితే కోల్‌కతా చాలా పెద్ద నగరం. అక్కడ తాతయ్య ట్రేడ్‌మార్క్‌ సన్న కారప్పూసతోపాటు మరికొన్ని స్వీట్లనీ తయారుచేసి అమ్మేవాళ్లం. నగరంలోని వివిధ దుకాణాలకు వెళ్లి సమోసా, కారప్పూస, బెంగాలీ స్వీట్లని రుచిచూసి తాతయ్యకి వాటి గురించి చెప్పేవాణ్ని. రుచి బావుంటే మా దగ్గర తయారుచేసేలా చూసేవాణ్ని. మా చిన్నాన్న మాత్రం ‘అంత శ్రమ అవసరంలేదు. మన రుచులే చాలు’ అనేవాడు. నాకు 17 ఏళ్లకే పెళ్లి అయింది. మా చెల్లినిచ్చిన బావ నాగ్‌పుర్‌లో మిఠాయి దుకాణం ప్రారంభిస్తానంటే అన్నీ సమకూర్చి రమ్మని నన్ను పంపాడు తాతయ్య. 1968లో నాగ్‌పుర్‌ మొదటిసారి వచ్చాను. అప్పట్లో అది చాలా చిన్న నగరం. రోడ్లన్నీ ఖాళీగా ఉండేవి. పెద్ద భవనాలేవీ లేవు. అయితే స్థానికులకు సాయంత్రంపూట చిరుతిళ్లు తినే అలవాటు బాగా ఉంది. వంటవాళ్లకి మా బ్రాండ్‌ కారప్పూస తయారుచేయడం నేర్పించాను. దాంతోపాటు మిక్స్చర్లు తయారుచేసి అమ్మేవాళ్లం. దాదాపు ఏడాదిపాటు నాగ్‌పుర్‌లో ఉండి వ్యాపారం లాభాల్లోకి వచ్చాక కోల్‌కతా వెళ్లిపోయాను.

‘హల్దీరామ్‌’ నాగ్‌పుర్‌తో మొదలు...
కోల్‌కతా వెళ్లిన కొద్ది నెలల తరవాత... నేను తప్పుడు లెక్కలు చూపిస్తున్నానని నిందమోపి మా చిన్నాన్న నన్ను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. దాంతో భార్యా నలుగురు పిల్లలతో కలిసి నాగ్‌పుర్‌ వచ్చేశాను. నేను కోల్‌కతా వెళ్లాక మా బావ వ్యాపారం ఏమంత బాగా నడవలేదు. నేను మళ్లీ వచ్చేసరికి వాళ్లెంతో సంతోషించారు. నేను తిరిగొచ్చాక బికనేర్‌ రసమలై, బెంగాలీ రసగుల్లా తయారుచేయించి అమ్మడం మొదలుపెట్టాం. రెండు నెలలకోసారి కోల్‌కతా వెళ్లి అక్కడ దుకాణాల్లో వంటకాల్ని రుచి చూసేవాణ్ని. కొత్తగా ఏమేం తెస్తున్నారో గమనించేవాణ్ని. అక్కడ చూసొచ్చాక మా వంటవాళ్లచేత వాటిని తయారుచేయించేవాణ్ని. జిలేబీ, మైసూర్‌ పాక్‌, పేడా కూడా అమ్మడం మొదలుపెట్టాం. దాంతో మొదటి సంవత్సరం రూ.35వేల లాభం వచ్చింది. ఆ డబ్బుతో మా దుకాణం పక్కనున్న ఆరు దుకాణాల్ని కొని వ్యాపారాన్ని విస్తరించాం. మా దుకాణాలకు ‘హల్దీరామ్‌’ పేరు పెట్టాం. కోల్‌కతాలో ఉండటంవల్ల స్వీట్స్‌ తయారీమీద పట్టు వచ్చింది. కారప్పూస మాకు గుర్తింపు తెస్తే తర్వాత మేం తయారుచేసిన సోన్‌ పాపిడి, కాజూ బర్ఫీ మా దశనే మార్చేశాయి. క్రమంగా రెస్టరెంట్‌ వ్యాపారంలోకీ అడుగుపెట్టాం. అక్కడ చైనీస్‌, ఇటాలియన్‌, దక్షిణాది వెరైటీల్ని చేర్చాను. వ్యాపారం చాలా వేగంగా బాగా అభివృద్ధి చెందింది.

దేశాన్ని వాటాలేసుకున్నాం...
నాగ్‌పుర్‌లో వ్యాపార విస్తరణకు పెద్దగా అవకాశం కనిపించలేదు. ఆ దశలో దిల్లీ వెళ్దామని తమ్ముడు మనోహర్‌ నేనూ అనుకున్నాం. కానీ ఇంట్లోవాళ్లు అప్పులు చేసి వ్యాపారం చేయొద్దు అన్నారు. మేం పొదుపుచేసిన డబ్బు పట్టుకుని దిల్లీ వెళ్లి 1983లో దుకాణం తెరిచాం. ప్రఖ్యాత
చాందినీచౌక్‌లో సిఖ్ బేకరీపైన మా దుకాణం ఉండేది. ఆ పై అంతస్తులో ఇల్లు. అక్కడ వ్యాపారం ప్రారంభించిన ఏడాదికి లాభాల్లోకి వచ్చాం. బికనేర్‌వాలా, ఘంటేవాలా లాంటి వ్యాపార దుకాణాలు అప్పటికే కారప్పూసని దిల్లీకి పరిచయం చేశాయి. దాంతో మేం స్వీట్స్‌పైన దృష్టిపెట్టాం. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో సిక్కులపైన దాడులు జరగడంవల్ల సిఖ్‌ బేకరీతోపాటు మా దుకాణమూ ఇల్లూ కూడా మంటల్లో కాలిపోయాయి. కొన్ని నెలల్లోనే మళ్లీ వాటిని బాగుచేసి దుకాణం ప్రారంభించాం. రోజుకి 16-20 గంటలు పనిచేసేవాళ్లం. 1990 నాటికి దిల్లీ, నాగ్‌పుర్‌లలో కొత్త తయారీ కేంద్రాల్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేవాళ్లం. మాకు మరో తమ్ముడు మధుసూదన్‌ కూడా తోడయ్యాడు. మార్వాడీ కుటుంబం కాబట్టి కేవలం శాకాహార పదార్థాలనే తయారుచేయాలనేది మా సిద్ధాంతం. మంచి రుచుల్ని అందిస్తే మాంసాహారులు కూడా శాకాహారం తింటారని మా నమ్మకం కూడా. వ్యాపారంతోపాటే కుటుంబ సభ్యులూ పెరిగారు. దాంతో నిర్వహణ కష్టమని వ్యాపారాన్ని వాటాలు వేసుకున్నాం. ఒకరి పరిధిలోకి మరొకరు రాకూడదని ఒక నిర్ణయానికి వచ్చాం.  దిల్లీ కేంద్రంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో మనోహర్‌, మధుసూదన్‌ వ్యాపారం చేసుకోవాలనీ, నాగ్‌పుర్‌ కేంద్రంగా పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో నేను వ్యాపారం చేసుకోవాలనీ అనుకున్నాం. నా జీవితాన్ని మార్చేసిన నగరం నాగ్‌పుర్‌ అందుకే అక్కడికే తిరిగి వెళ్లిపోవాలనుకున్నాను. ఇదే సమయంలో తూర్పు భారతాన్ని చిన్నాన్న వారసులు చూసుకునేలా మాట్లాడుకున్నాం. తర్వాత ‘హల్దీరామ్‌’ పేరు వాడకంపైనా చిన్నాన్న వారసులతో గొడవ అయింది. ప్రస్తుతం దిల్లీ, నాగ్‌పుర్‌ కేంద్రాలుగా నడుపుతున్న వ్యాపారాలకే హల్దీరామ్స్‌ బ్రాండ్‌ హక్కులున్నాయి. నా పరిధిలోని ఉత్పత్తుల ప్యాక్‌మీద హల్దీరామ్‌తోపాటు నాగ్‌పుర్‌ అని కూడా ముద్రిస్తాను. ‘బికాజీ’ పేరుతో మరో తమ్ముడు శివ్‌ రతన్‌ అగర్వాల్‌ బికనేర్‌ నుంచి వ్యాపారాన్ని నడుపుతున్నాడు. ప్రస్తుతం హల్దీరామ్‌ వారసుల వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.25వేల కోట్లు ఉంటుంది.

ఖర్చు రెండువేలు
తాతయ్య హల్దీరామ్‌ ఏడు పదుల వయసులోనూ సైకిల్‌ తొక్కుకుంటూ కోల్‌కతాలోని మా దుకాణాలన్నింటినీ చుట్టివచ్చేవాడు. ఆయనకు కాలక్షేపం, తీరిక అంటే తెలీదు. ఎప్పుడూ వ్యాపారం గురించే ఆలోచించేవాడు. క్యాషియర్‌ దగ్గర రోజూ 50 పైసలు తీసుకుని తన ఖాతాలో రాసుకోమనేవాడు. ఆయన్నుంచే నాకు పొదుపు కూడా అలవాటైంది. ఇప్పుడు నా నెలవారీ ఖర్చు రూ.2000 మాత్రమే. కానీ పెట్టుబడి పెట్టాలంటే మాత్రం వెనకాడను. ఆయన క్రమశిక్షణా, వ్యాపార దక్షతవల్ల కుటుంబ వ్యాపారం చేయగలిగాం కానీ ఈ రోజుల్లో కుటుంబ వ్యాపారాన్ని నడపడం అంత సులభం కాదు. పిల్లలతో కలిసి ఇప్పుడు నేను నిర్వహిస్తున్న వ్యాపారంలో ఎనిమిది మందికి వాటాలు ఉన్నాయి. పిల్లల్లో ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి వెళ్దామని ప్రతిపాదించినపుడు పిల్లలు అంతగా ఆసక్తి చూపలేదు. ఎన్నో సందేహాల్ని వ్యక్తంచేశారు. కానీ నేను పట్టుబట్టి అడుగుపెట్టాను. ఈరోజు అక్కడ కూడా మంచి లాభాలు వస్తున్నాయి. కాలం ఎంతో మారిపోయింది. వ్యాపారశైలి, మార్కెటింగ్‌ పద్ధతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకే విద్యావంతులైన వ్యక్తుల్ని డైరెక్టర్లుగా తీసుకుంటున్నాం.

వంద దేశాలకు
కారప్పూస ఒక్కటే మమ్మల్ని ఇక్కడకు తీసుకురాలేదు. మాకు కాంట్రాక్టు పద్ధతిలో కారప్పూస తయారుచేసి ఇచ్చిన మా బంధువుల్లో చాలామంది సొంత బ్రాండ్లు తెచ్చారు. రాజస్థాన్‌లోని చాలా కంపెనీల నుంచీ మాకు పోటీ ఉంది. వ్యాపారంలో కష్టపడటం, ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం, విస్తరించడం అవసరం. మనదేశం ఎన్నో మంచి సంప్రదాయాలకు నెలవు. వాటిలో తినుబండారాలు కూడా ఒక సంప్రదాయమే. భవిష్యత్తు తరాలకు మంచి రుచుల్ని అందించాలనే తపనే నన్ను ఈరోజుకీ పనిచేసేలా చేస్తుంది. ‘హల్దీరామ్స్‌’ లేకుండా భారతీయుల పండగలు పూర్తికానంతగా భాగమైపోయాం. వివిధ నగరాలకు మా దుకాణాల్నీ, రెస్టరెంట్‌లనీ విస్తరిస్తున్నాం. ఈ మధ్యనే హైదరాబాద్‌లో అడుగుపెట్టాం. మరోవైపు ఎగుమతులకీ ప్రాధాన్యం ఇస్తున్నాం. రెడీ టు ఈట్‌ అప్పడాలూ, పానీపూరి, భేల్‌పూరి, చిప్స్‌ తెచ్చాం. ‘నాణ్యత, రుచి’ ఈ రెండూ మా కంపెనీ విజయానికి కారణం. డిమాండ్‌ని అందుకోవడానికి కాంట్రాక్టర్ల నుంచి కూడా మేం ఉత్పత్తుల్ని తీసుకుంటాం. వాళ్లనుంచి వచ్చే స్టాక్‌లో కొన్ని శాంపిల్స్‌ని నేనే రుచిచూసి నాణ్యతని పరీక్షిస్తాను. కొన్నింటిని రుచి కూడా చూడకుండా చూసీచూడంగానే నాణ్యతని చెప్పేయగలను. మా తాత స్ఫూర్తితో వ్యాపారాన్ని ఇక్కడవరకూ తీసుకువచ్చాను. నా పిల్లలూ మనవలూ మరింతగా విస్తరిస్తారని ఆశిస్తున్నాను. మా సోన్‌ పాపిడి ప్రపంచ ప్రఖ్యాతి అని చెప్పడానికి గర్వంగా ఉంది. మేం ఒక నెలలో తయారుచేసే సోన్‌ పాపిడిని ఒక క్రికెట్‌ స్టేడియంలో పెడితే అది నిండిపోతుంది. నాగ్‌పుర్‌లోని 12 ఫ్యాక్టరీల్లో మా స్వీట్స్‌, హాట్స్‌ తయారుచేస్తున్నాం. మేం ఏడాదికి తయారుచేసే హాట్‌ లక్ష టన్నులు ఉంటుంది. మసాలా స్నాక్స్‌, స్వీట్స్‌, లస్సీ... ఇలా 400 రకాల్ని అమ్ముతున్నాం. దాదాపు 100 దేశాలకు మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తున్నాం! నాకు ఊపిరి ఉన్నంతవరకూ కాకపోయినా ఓపిక ఉన్నంతవరకూ పనిచేస్తాను. పనిచేయకుండా నేను ఉండలేను! నిద్రలోనూ పని గురించే ఆలోచిస్తుంటాను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.