close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శృంగారమే ఔషధం!

కొందరు స్త్రీలకి నలభై రాకుండానే మెనోపాజ్‌ లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనికి కారణం వాళ్లు లైంగిక జీవితానికి దూరంగా ఉండటమే అంటున్నారు లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు. వారానికి ఒకసారి లేదంటే కనీసం నెలకోసారి శృంగారంలో పాల్గొనే మహిళలు చిన్నవయసులోనే మెనోపాజ్‌కు గురయ్యే అవకాశం తక్కువని వాళ్ల పరిశీలనలో స్పష్టమైంది. దీనికోసం వీళ్లు రకరకాల వయసుల్లో ఉన్నవాళ్లని ఎంపికచేసుకుని కొన్ని సంవత్సరాలపాటు గమనించారట. ముఖ్యంగా వాళ్లలో నెలసరినీ లైంగికజీవితాన్నీ ఆహారపుటలవాట్లనీ కూడా నిశితంగా పరిశీలించారట. అందులో నెలకోసారి శృంగారంలో పాల్గొన్నవారితో పోలిస్తే వారానికోసారి ఆ ఆనందాన్ని ఆస్వాదించే వాళ్లలో మెనోపాజ్‌ లక్షణాలు ఆలస్యంగా కనిపించినట్లు గుర్తించారు. అలాగే నెలకోసారి కూడా లైంగిక కలయిక లేనివాళ్లలో మెనోపాజ్‌ త్వరగా వచ్చినట్లు తేలింది. అంతేకాదు, చిన్న వయసులోనే మనవల పెంపకంలో పడి సంసార జీవనానికి దూరంగా ఉండటం కూడా మెనోపాజ్‌ త్వరగా రావడానికి కారణమేనని పేర్కొంటున్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా శృంగార జీవితం గడిపే మహిళల్ని మెనోపాజ్‌ మాత్రమే కాదు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ అంతగా బాధించవని వివరిస్తున్నారు.


సోయా తినాల్సిందే కానీ...

సోయాను మనం రకరకాలుగా వాడుతుంటాం. అయితే వాటిని నేరుగా వాడటం కన్నా పులియబెట్టిన సోయా ఉత్పత్తుల్ని వాడటం వల్ల బీపీ, హృద్రోగ మరణాలు తగ్గుతాయని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు జపాన్‌లోని పలు ప్రాంతాల్లో నివసిస్తోన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారట. అందులో వాళ్ల జీవనశైలి, ఆరోగ్యం, ఆహారం గురించి వరసగా పదిహేనేళ్లపాటు పరిశీలించారట. ఎందుకంటే జపాన్‌లో నాటో, మిసొ, టెంపె... వంటి పులిసిన సోయా ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడుతుంటారు. అదేసమయంలో సోయాతో చేసిన టొఫు, పాలు, ఐస్‌క్రీములూ బర్గర్లూ... వంటి పులియని సోయా ఉత్పత్తుల్నీ కొందరు వాడుతుంటారు. దాంతో పులిసిన సోయాతో చేసినవి తినేవాళ్లనీ, పులియని సోయా ఉత్పత్తుల్ని తినేవాళ్లనీ ప్రత్యేకంగా గమనించారట. అందులో పులిసిన ఉత్పత్తులు తిన్నవాళ్లలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే పులియబెట్టిన సోయా ఉత్పత్తుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బాసిల్లస్‌ సబ్టిల్స్‌ అనే బ్యాక్టీరియా, ఆస్పర్‌జిలస్‌ ఒరైజా అనే ఫంగై ఉండటమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు.


కొవ్వునీ కొలవొచ్చు!

చాలామందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవడం చూస్తుంటాం. అది ఎక్కువయితే హృద్రోగాలు, మధుమేహం, కాలేయ సమస్యలకు దారితీస్తుందనేది కూడా తెలిసిందే. ఈ కొవ్వు ఏ స్థాయిలో ఉందో ఎవరికివారు తెలుసుకోవడం కష్టమే. అందుకే అక్కడ ఉన్న కొవ్వుని లెక్కించేందుకు బెల్లో అనే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. అది కేవలం మూడు సెకన్లలోనే పొట్టని స్కాన్‌ చేసేస్తుందట. ఎందుకంటే కొంత కొవ్వు చర్మం లోపలి పొరల్లోనే పేరుకుంటే, మరికొంత కొవ్వు పొట్ట దగ్గర ఉండే కండరాల దగ్గర చేరుకుంటుంది. దీన్ని కచ్చితంగా లెక్కించడం సంప్రదాయ పద్ధతుల్లో కాస్త కష్టం. కాబట్టి అది ఎక్కడెక్కడ ఎంత స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు పరారుణ కిరణాల్ని ప్రసరింపచేయడం ద్వారా స్కాన్‌ చేయడమే కాదు, ఆ సమాచారాన్ని నిమిషాల్లో బ్లూ టూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి పంపించేలా ఈ స్కాన్‌ పరికరంతోబాటు ఓ ఆప్‌ని కూడా రూపొందించారు. అందులోని రీడింగ్‌ని చదువుకోవడం ద్వారా ఎవరికివాళ్లు పొట్ట దగ్గరున్న కొవ్వు స్థాయిని తెలుసుకుని జాగ్రత్తపడవచ్చు అని చెబుతున్నారు.


పరిమళంతో జ్ఞాపకం పదిలం!

నిద్రపోయేటప్పుడూ చదువుకునేటప్పుడూ కొన్ని రకాల పరిమళాల్ని పీల్చడంవల్ల అవి జ్ఞాపకశక్తినీ అధ్యయనశక్తినీ పెంచుతాయని జర్మనీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. సాధారణంగా చూడటం, వినడం, పీల్చడం, తినడం, స్పర్శ... ఇలా జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టుపక్కల జరిగే అనేక విషయాల్ని నేర్చుకుంటుంటాం. అలా నేర్చుకున్న అంశాల్లో కొన్ని తాత్కాలికంగా మాత్రమే గుర్తుంటే, మరికొన్ని దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే జ్ఞాపకమేదయినా నిక్షిప్తమవ్వడం అనేది ప్రధానంగా నిద్రలో జరుగుతుంది. దానికి వాసన కూడా తోడ్పడుతుంది అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే మెదడులో భావోద్వేగాలూ జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రాంతాలకి వాసన గ్రంథులు దగ్గరగా ఉంటాయి. అందుకే చక్కని పరిమళం మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. కాబట్టి చదువుకునేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ మంచి పరిమళాన్ని పీలిస్తే బాగా నిద్రపట్టి, నేర్చుకున్న అంశాలన్నీ జ్ఞాపకంగా నిక్షిప్తమవుతాయని కొందరు విద్యార్థులమీద చేసిన పరిశీలనలో స్పష్టమైందంటున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు