close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
క్రీములతో ముప్పు!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ల సంఖ్య అందులోనూ స్త్రీలలో రొమ్ముక్యాన్సర్‌ ఎక్కువయిందన్నది తెలిసిందే. దీనికి క్రీములూ లోషన్లూ కూడా కారణమే అంటున్నారు. ముఖ్యంగా చర్మ సంరక్షణ లేదా అందం కోసం వాడే సన్‌స్క్రీన్లూ కాస్మొటిక్సులోని రెండు రకాల రసాయనాలు రొమ్ముకణాల్లోని డీఎన్‌ఏని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. అదేసమయంలో ఈస్ట్రోజెన్‌ రిసెప్టర్లు లేని ఇతర కణాలమీద అవి ఎలాంటి ప్రభావాన్నీ కనబరచడం లేదని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. సన్‌స్క్రీన్‌లో ఉపయోగించే బెంజోఫినోన్‌-3 అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలానే కాస్మొటిక్స్‌లో ప్రిజర్వేటివ్‌లా ప్రొపైల్‌పారబెన్‌ను వాడుతుంటారు. చర్మాన్ని సంరక్షించే ఈ రెండు పదార్థాలూ రొమ్ముకణాలమీద మాత్రం దుష్ప్రభావం చూపిస్తున్నాయట. క్షీరగ్రంథులమీద ఇవి చూపించే ప్రభావాన్ని పరిశీలించగా- అవి ఆ కణాల్లోని డీఎన్‌ఏని దెబ్బతీసి తద్వారా క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, గర్భిణీలు కాస్మొటిక్స్‌ను వాడటంవల్ల వాటిల్లోని పారబెన్లు చర్మకణాల్లోంచి లోపలకు ఇంకి, పుట్టబోయే బిడ్డలో జన్యుమార్పులకు కారణమై బరువు పెరిగేలా చేస్తున్నాయట. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు సదరు నిపుణులు.


ఆడవాళ్లకే ఆలోచన ఎక్కువ!

వయసులో ఉన్నప్పుడు మగవాళ్లు ఎంత పెత్తనం చేసినా వృద్ధాప్యంలో మాత్రం ఇల్లాలు చెప్పినట్లే వినడాన్ని ఎక్కువగా చూస్తుంటాం. దీనికి హార్మోన్లతోబాటు మెదడు పనితీరూ కారణమే అంటున్నారు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఆరోగ్యపరంగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల మెదడు మూడు సంవత్సరాలు చిన్నదట. దీనికి తోడు దంపతుల్లో మగవాళ్లకన్నా ఆడవాళ్లు వయసులోనూ చిన్నగా ఉంటారు. కాబట్టి వాళ్ల మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందన్నమాట. అందుకే వృద్ధాప్యంలో మగవాళ్లకన్నా ఆడవాళ్లే బాగా ఆలోచించగలుగుతారని చెబుతున్నారు. ఎందుకంటే-  వయసు పెరిగేకొద్దీ మెదడులో జీవక్రియా వేగం తగ్గుతుంటుంది. అయితే ఇది మగవాళ్లలో కన్నా ఆడవాళ్లలో తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించగా- మలివయసులో స్త్రీల మెదడు పురుషులకన్నా మూడేళ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. అందుకే ఒకే వయసున్న స్త్రీ పురుషుల్ని పోల్చి చూసినప్పుడు- పెద్ద వయసులో ఆడవాళ్లే చురుకుగా ఉండటంతోబాటు సమస్యల్ని పరిష్కరించే తెలివితేటలూ జ్ఞాపకశక్తీ కూడా వాళ్లకే ఎక్కువని తేల్చి చెబుతున్నారు.


ఆకర్షణకు ఆమె దూరం!

ఆడవాళ్ల మనసు చంచలం అంటారుగానీ కానీ అది నిజం కాదు. అది మగవాళ్లకే ఎక్కువ అంటున్నారు మెక్‌గ్రిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మామూలుగానే మగవాళ్లలో ఎక్కువశాతం పెళ్లితో సంబంధం లేకుండా అమ్మాయి కనిపిస్తే ఆకర్షించాలని చూస్తుంటారు. అలాంటిది అనుకోకుండా ఓ అందమైన అమ్మాయి వాళ్ల జీవితంలోకి వస్తే, ఆ అమ్మాయితో పోల్చి చూసుకుంటూ భార్యలోని లోపాలను వెతుకుతుంటారు. అదే ఆడవాళ్లయితే- ఎంత ఆకర్షణీయమైన అబ్బాయి వెంటబడినా వాళ్ల గురించి పట్టించుకోరు సరికదా, భర్తలోని బలాలను గుర్తుచేసుకుంటూ తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని వాళ్ల అధ్యయనంలో తేలింది. దీన్నిబట్టి శరీరనిర్మాణంలో తేడా ఉన్నట్లే స్త్రీ, పురుషుల మనసూ భిన్నంగా స్పందిస్తుంది అని విశ్లేషిస్తున్నారు సదరు పరిశోధకులు.


పదాలు మర్చిపోతున్నారా?

మెనోపాజ్‌లో హార్మోన్లలో మార్పులు వస్తాయని తెలిసిందే. ఆ సమయంలో ఉన్నట్టుండి చలిగా అనిపించడం, అంతలోనే శరీరం వేడెక్కిపోవడం, విపరీతంగా చెమటలు పట్టి నిద్రమధ్యలో లేవడం... వంటి వాటితోబాటు ముఖం, మెడ, వీపు భాగాలమీద సన్నని దద్దుర్లు(ర్యాష్‌) రావడం జరుగుతుంటుంది. అయితే ఈ దద్దురును మెనోపాజ్‌ సమస్యగా తీసిపారేయడానికి వీల్లేదనీ, దీనివల్ల హిప్పోక్యాంపస్‌, ప్రీఫ్రాంటల్‌ కార్టెక్స్‌ భాగాల పనితీరు దెబ్బతిని తద్వారా పదాలకు సంబంధించిన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ఎమ్మారై స్కాన్‌ ద్వారా ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు పదాల మతిమరుపునకీ ఈ ర్యాషెస్‌కీ సంబంధం ఉందనేది స్పష్టమైందట. అందుకే నలభై, యాభై దాటాక కొంతమంది ఏదో చెబుతూ దానికి సంబంధించిన పదం గుర్తు రాక సతమతమవుతుంటారు. అది ఆ క్షణానికి గుర్తురాకున్నా తరవాత ఎప్పుడో గుర్తురావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే ఈ ర్యాషెస్‌ను నివారించడం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గకుండా చేయవచ్చు అంటున్నారు సదరు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు