close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సైంటిస్టువి... నీకీ సినిమా పిచ్చేంటన్నారు!

సినిమారంగమంటే చదువు అబ్బనివాళ్ల అడ్డా అనే అభిప్రాయం ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పటికీ ఏ మూలనో ఆ అనుమానాలు ఉన్నవాళ్లు కాస్త శైలేష్‌ కొలను ప్రొఫైల్‌ను చూడాల్సిందే. శైలేష్‌ ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత న్యూసౌత్‌ వేల్స్‌ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశాడు. అక్కడే పనిచేసేవాడు. అలాంటి ‘సైంటిస్టు’ శైలేష్‌లో... అప్పటిదాకా నిద్రపోతూ ఉన్న ‘ఆర్టిస్టు’ నిద్రలేచాడు. అతని చేత కలం పట్టి కథలు రాయించాడు... మైక్రోస్కోపు వదిలి మెగాఫోన్‌ పట్టించాడు. ఇప్పుడేమో ‘హిట్‌’ సినిమా దర్శకుణ్ణీ చేశాడు. ఆ కెరీర్‌ మార్పు కథ శైలేష్‌ మాటల్లోనే...

రెండేళ్లకిందటి మాట ఇది. ఆ రోజు ఎటూ తెగని ఆలోచనలతో బుర్రబద్దలు కొట్టుకుంటున్నాను. పరిశోధకుడిగా ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టే నేను ఏదీ పాలుపోని స్థితిలో ఉన్నాను. ఆ రోజు ఉదయమే ఆస్ట్రేలియా నుంచి బయల్దేరి హైదరాబాద్‌లో ఫ్లైట్‌ దిగి అట్నుంచటే వరంగల్‌కి వెళ్లాను. అక్కడ ఓ షూటింగ్‌లో ఉన్న హీరో నానీని కలిశాను. ఆయనకో కథ చెప్పాలన్నదే నా ఆలోచన. నానీ గంటే సమయం ఇచ్చారు కానీ నేను చెప్పే విధానం నచ్చి మూడుగంటల దాకా పెంచారు. అంతా విన్నాక ‘ఇంత మంచి కథని... ఇంతే డీటైల్డ్‌గా ఇంకెవరూ తెరపైకి తీసుకురాలేరు. ఆ పని నువ్వే చేయగలవు. నేను నిర్మిస్తాను, నువ్వు దర్శకత్వం చెయ్‌..!’ అన్నారు. నేను ఊహించని పరిణామం అది. అప్పటిదాకా దర్శకత్వం చేసే అనుభవం కాదుకదా... అసలు ఆ ఆలోచనే లేదు నాకు. అంతకన్నా... నేను దర్శకుణ్ణి కావాలంటే నా లెక్చరర్‌ ఉద్యోగం, పరిశోధనలూ అన్నీ మానేయాలి. అదే నన్ను సందిగ్ధంలో పడేసింది. అప్పటికీ ఓ పేపర్‌ తీసి నేను సినిమా రంగం వైపు వెళ్తే వచ్చే లాభనష్టాలన్నీ రాశాను. ఎటుచూసినా... నష్టాలు వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపించింది. అయినా సరే,  మనసేమో సినిమావైపే లాగుతోంది. నాపైన నాకున్న నమ్మకం ఓ సాహసం చేసి చూడమంటోంది. ...ఆ సందిగ్ధం గురించి మరింత వివరించే ముందు నా నేపథ్యం గురించీ కాస్త చెబుతాను.

మధ్య తరగతికన్నా తక్కువే...
మా తాతగారు కొలను బ్రహ్మానందరావు... పాతతరం సినిమా పాత్రికేయుడు. ఆయన ఎప్పుడో గుంటూరు నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడ్డారు. మా నాన్న శేషగిరిరావు అక్కడే పుట్టారు. ఆయన చిన్నప్పుడే సినిమా రంగంలోకి వెళ్లి దర్శకుడు కోడిరామకృష్ణ దగ్గర పనిచేశారు. ఎంతగా సినిమారంగంలో ఉన్నా ఆర్థికంగా మాది దిగువ మధ్యతరగతి కుటుంబమే. చెన్నైలో నాకు ఊహ వచ్చేనాటికి ఒక చిన్న పోర్షన్‌లో అద్దెకి ఉండేవాళ్లం. అందరం ఒక్క హాలులోనే సర్దుకుని పడుకోవాలి. మా పెద్దన్నయ్య ఎదిగేకొద్దీ అతని పొడుగుకి హాలు సరిపోకపోవడంతో... కాస్త పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. అవి చాలవన్నట్టు 1990లలో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కి రావడం మొదలుపెట్టింది. ఇక్కడికొస్తే ఎలా ఉంటుందోననే అనుమానంతో నాన్న అక్కడే ఉండిపోయారు. సరే... అక్కడున్న తమిళ పరిశ్రమతో ఆయనకేమైనా సంబంధాలు ఉన్నాయా అంటే అదీ లేదు. దాంతో ఆదాయం బొత్తిగా లేకుండా పోయింది. సరిగ్గా అప్పుడే మా పెద్దన్నకి చెన్నైలో ఇంజినీరింగ్‌ సీటు వచ్చింది. అతనితోపాటూ, మిగిలిన మా ఇద్దరికీ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాడు నాన్న. చివరికి ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పని పరిస్థితిలో హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చేరారు. జీతం తక్కువ కాబట్టి కుటుంబాన్ని హైదరాబాద్‌కి తీసుకెళ్లే పరిస్థితి లేదు. దాంతో అమ్మతోపాటూ నన్నూ, చిన్నన్ననీ తెనాలిలోని మా మావయ్యవాళ్ల దగ్గర ఉంచారు. పెద్దన్నయ్యేమో చెన్నైలో... నాన్నేమో హైదరాబాద్‌లో ఉండేవారు. మా కుటుంబం ఒక్కసారిగా ఇలా మూడుచోట్లకి విడిపోవడం ఆ చిన్న వయసులోనే నన్ను చాలా బాధపెట్టింది. ఇంతటికీ కారణం డబ్బు లేకపోవడమే కాబట్టి... బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్లాలనుకునేవాణ్ని. తెనాలిలో నన్ను ఏడో తరగతిలో చేర్చినప్పటి నుంచీ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకోవడం ప్రారంభించాను. నాన్నకీ ప్రసాద్‌ల్యాబ్‌లో కలిసొచ్చింది. ఉద్యోగిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్థికంగా కాస్త స్థిరపడి మమ్మల్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. అలా పదో తరగతి ఇక్కడే చదివాను. మంచి గ్రేడ్స్‌ తెచ్చుకుని ఇంటర్‌లో చేరాను. నిజానికి సినిమా వైపు వెళ్లాలనే కోరికకి అప్పుడే బీజం పడింది కానీ దాన్ని తొక్కిపెట్టేయాల్సి వచ్చింది!

‘సినిమాలన్నారో కాళ్లు విరగ్గొడతా’
నాన్న ప్రసాద్‌ల్యాబ్‌లో పనిచేస్తుండటంతో నేను తరచూ అక్కడికి వెళ్లేవాణ్ని. ఓ సినిమా కేవలం ‘రా’ కాపీ నుంచి పూర్తిస్థాయి వెండితెర చిత్రంగా ఎలా తయారవుతుందో చూడటం భలే థ్రిల్లింగ్‌గా అనిపించేది. ఇంటర్‌ చదివేటప్పుడు నేనే ఓ కథ రాసి చిన్న కెమెరాతో ‘భయం’ అనే లఘుచిత్రం తీశాను. ఇంత చేస్తున్నా సినిమావైపుకి వెళ్లాలని ఉందని ఇంట్లో చెప్పే ధైర్యం  లేదు. ఆ రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాడు కాబట్టి... మా బతుకులు ఏమవుతాయా అన్న భయం నాన్నది. దాన్ని కోపంగా మార్చుకుని ‘సినిమాల ఊసెత్తితే కాళ్లు విరగ్గొడతా’ అనేవాడు. కాబట్టి సినిమాల పట్ల అప్పుడప్పుడే మొదలైన నా ఆశని మొగ్గలోనే తుంచి పూర్తిగా చదువువైపే దృష్టిపెట్టాను. ఇంటర్‌ అయ్యాక అందరిలాగా మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ వైపు వెళ్లడం కాకుండా ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నాను. ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రివాళ్లు బిట్స్‌ పిలానీతో కలిసి ‘ఆప్టోమెట్రిక్స్‌ అండ్‌ విజన్‌ సైన్స్‌’ పేరుతో నాలుగేళ్ల బీఎస్‌ కోర్సు అందిస్తున్నట్టు తెలిసి దానికి అప్లై చేశాను.

ఆస్ట్రేలియాకి...
మనదేశంలో పెద్దగా తెలియదుకానీ ఆప్టోమెట్రిక్స్‌ నిపుణులది విదేశాల్లో కీలక పాత్ర. అక్కడ సర్జరీ అవసరంలేని కంటి సమస్యలన్నింటికీ వీళ్లే చికిత్స అందిస్తారు. వాళ్లని నేత్రవైద్యులతో సమానంగా చూస్తారు. ఆ కోర్సులో చేరినప్పటి నుంచీ అందులో విజయమే నా జీవిత లక్ష్యంగా మార్చుకున్నాను. నాలుగేళ్ల కోర్సులో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించి బయటకొచ్చాను. ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలోనూ, టాటా ఐ సంస్థలోనూ ఆప్టోమెట్రీషియన్‌గా మూడేళ్లపాటు పనిచేశాను. ఆస్ట్రేలియా సిడ్నీలోని న్యూసౌత్‌ వేల్స్‌ యూనివర్సిటీ అందిస్తున్న ఫెలోషిప్‌ గురించి తెలిసి దానికి అప్లై చేశాను. పీజీ ప్లస్‌ పీహెచ్‌డీ... రెండింటికీ అవకాశం కల్పించే కోర్సు అది. స్కాలర్‌షిప్‌తోపాటూ బస కూడా వాళ్లే ఉచితంగా అందిస్తారు కాబట్టి ప్రపంచం నలుమూలల నుంచీ దానికి పోటీపడతారు. అంతమంది నడుమ, బీఎస్‌లో నాకున్న స్కోరు కారణంగా ఆ ఫెలోషిప్‌ నాకు దక్కింది. డిగ్రీలో నేను ప్రేమించిన నా జూనియర్‌ స్వాతిని పెళ్లి చేసుకుని, ఆస్ట్రేలియా తీసుకెళ్లాను. తను అక్కడ ఆటిజం పిల్లలకి కంటి సమస్యలపైన థెరపిస్టుగా చేరింది. రెండేళ్ల పీజీ తర్వాత ఆరేళ్ల పీహెచ్‌డీ పరిశోధన మొదలుపెట్టాను. కొన్ని మొక్కల వల్ల ఏర్పడుతున్న అలర్జీలు కంటి లోపలి నరాలపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తాయన్నది నేను ఎంచుకున్న సబ్జెక్టు. ఆరేళ్లపాటు దానిపైన రీసెర్చి చేసి థీసిస్‌ సమర్పిస్తే డాక్టరేట్‌తోపాటూ అక్కడే పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ఉద్యోగం కూడా ఇచ్చారు. అలా చదువు పరంగా దాదాపు నా లక్ష్యాన్ని సాధించాను. దాంతో నా మనసు మళ్లీ కథలు రాయడం వైపు మళ్లింది.

అలా మొదలైంది...
అప్పట్లో జంతు హింసకి వ్యతిరేకంగా పోరాడే ‘పెటా’ సంస్థ ఓ కథలపోటీ పెడితే నా కథే ది బెస్ట్‌గా ఎంపికైంది. ఆ గుర్తింపు ఇచ్చిన ధైర్యంతో మరిన్ని కథలు రాయడం మొదలుపెట్టాను... ఆ ఆసక్తి మెల్లగా సినిమా కథలు రాసేంతగా మారింది. నాకు నానీ అంటే ఇష్టం కాబట్టి ఆయన్నే హీరోగా ఊహించుకుని ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథ రాశాను. ముందుగా దాన్ని ఆస్ట్రేలియాలోని నా ఫ్రెండ్స్‌కి వినిపిస్తే మొహం అదోలా పెట్టి ‘దయచేసి ఇలాంటివి మళ్లీ రాయొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పి వెళ్లిపోయారు. అప్పుడుకానీ నాకు కథ రాయడానికీ, సినిమా స్క్రీన్‌ ప్లే రాయడానికీ చాలా తేడా ఉందని అర్థం కాలేదు. దాంతో నాకున్న ఖాళీ సమయాల్లో స్క్రీన్‌ ప్లే రైటింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. వర్క్‌ షాపులకెళ్లీ, ఎన్నో పుస్తకాలు చదివీ అవగాహన పెంచుకున్నాను. దాని ప్రకారం మరో కథని రాసి ఫ్రెండ్స్‌కి వినిపిస్తే అప్పుడు ‘సూపర్‌’ అన్నారు. ఆ నమ్మకంతో ఈ కథని ఎలాగైనా నానీకి చెప్పాలనుకున్నాను. దానికి దారేమిటా అని ఆలోచిస్తున్నప్పుడే మంచు లక్ష్మి గుర్తొచ్చారు. ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలో పనిచేసేటప్పుడు నేను ఏర్పాటుచేసిన కొన్ని నేత్రవైద్య శిబిరాలకి ఆమె అతిథిగా వస్తున్నప్పటి నుంచీ పరిచయం నాకు. ఆమెకు విషయం చెబితే నానీకి పరిచయం చేశారు. ఆయనకి నా కథ మెయిల్‌చేశాను. ఓసారి నేరుగా వచ్చి కలవమంటే... వరంగల్‌ షూటింగ్‌లో ఉన్న ఆయన్ని కలిశాను.

ఏడాదిలో ‘దర్శకత్వం’ నేర్చుకున్నా!
అప్పటిదాకా నా లక్ష్యం వెండితెరపైన ‘స్క్రీన్‌ ప్లే - శైలేష్‌ కొలను’ అని వస్తే చాలు అన్నది మాత్రమే. నానీ నన్నే డైరెక్ట్‌ చేయమని చెప్పడం నేను అసలు ఊహించనిది. రెండురోజులు  ఎన్నో తర్జనభర్జనల తర్వాత లెక్చరర్‌ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సినిమావైపు వచ్చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. అంతకు నెలకిందటే యూనివర్సిటీలో ‘ది బెస్ట్‌ లెక్చరర్‌’ అవార్డు కూడా అందుకున్న నేను ఈ నిర్ణయాన్ని చెప్పాక అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్సయితే వద్దేవద్దంటూ, సైంటిస్టువి నీకీ సినిమా పిచ్చేంటన్నారు. అయినా సరే నేనే సినిమా దర్శకత్వం చేస్తానని నానీకి చెప్పాను.

నాకు దర్శకత్వంలో ఓనమాలు కూడా తెలియవు కాబట్టి ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్దదైన ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌’ పోటీలకింద కేవలం 50 గంటల సమయంలో... మొబైల్‌ ఫోన్‌తో ‘చెక్‌ లిస్ట్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. ఆ పోటీలో అది విజేతగా నిలిచింది. ఆ ధైర్యంతో ‘ఉనికి’ అని కథ రాసి పదిహేను రోజులపాటు భారతదేశమంతా తిరిగి షూట్‌ చేశాను. నేను పూర్తిస్థాయిలో దర్శకుడినని నిరూపించిన షార్ట్‌ ఫిల్మ్‌ అది. నానీకి చూపించాను ‘సరే! ఎప్పుడు మొదలుపెడదాం మన సినిమా’ అన్నారు. ‘ఎప్పుడైనా ఓకే..!’ అన్నాను. స్క్రిప్టు మొత్తం పూర్తిచేసి ఇక షూటింగ్‌ తరువాయి అనుకుంటూ ఉండగా ‘నువ్వు చెప్పిన సైన్స్‌ సినిమా ఇప్పుడొద్దు. ఇంకేమైనా కొత్త కథ ఆలోచించు’ అని చెప్పారు నానీ. అప్పుడే రెండునెలలు కూర్చుని ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ రాసి పట్టుకెళ్లాను... అదే ‘హిట్‌’!

1 నిమిషం = 900 రూపాయలు!
చిన్నప్పటి నుంచీ నేను ఏ పనిచేసినా అందులో విజయం సాధించి తీరాలనే పిచ్చి నాది! ‘హిట్‌’ విషయంలోనూ అలాగే ఉండాలనుకున్నాను. ఈ సినిమాని నానీ కేవలం అరవై రోజుల్లో తీయమన్నారు. నా విశ్లేషణ ప్రకారం నిర్మాతగా ఆయన పెడుతున్న పెట్టుబడికి నిమిషానికి తొమ్మిది వందల రూపాయలు ఖర్చవుతుంది. అంటే షూటింగ్‌ గంట ఆలస్యమైనా ఐదువేల రూపాయలు పోయినట్లే! కాబట్టి, షూటింగ్‌కి ఎవరూ ఆలస్యంగా రావడానికి వీల్లేదని చెప్పేశాను. ఆరు నూరైనా ఉదయం 7.30 కంతా షూటింగ్‌ మొదలుపెట్టేవాణ్ని. ‘ఇలాంటి విశ్లేషణలు లెక్చరర్‌గా పనికొస్తాయికానీ... తెలుగు సినిమా షూటింగ్‌కి పనికిరావు!’ అని కొందరు అంటున్నా నా దారినే నేను వెళ్లాను. మొదటి పదిహేను రోజులపాటు నామీద ఎవరికీ నమ్మకం కుదర్లేదు. ఆ తర్వాత కాస్త నమ్మడం మొదలుపెట్టి... చివరికి నేను చెప్పినదానికి వందరెట్లు ఎక్కువగా కష్టపడటం మొదలుపెట్టారు. ఫలితంగా 44 రోజులకే సినిమా పూర్తిచేశాను! నిర్మాత పెట్టినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టడంతో హిట్‌ని ఇప్పుడందరూ సూపర్‌హిట్టనే అంటున్నారు! ఆ సినిమా రెండో భాగం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.


‘నేనున్నా..!’

లెక్చరర్‌గా నేను రాజీనామా చేసి సినిమాలవైపు వస్తానంటే అందరూ వ్యతిరేకించినా నా భార్య స్వాతి మాత్రం నా వైపే నిలిచింది. ‘నువ్వు సినిమాల్లో ఫెయిలైనా ఫర్వాలేదు... ఇంకో ఉద్యోగం వచ్చేదాకా ఫ్యామిలీని నేను చూసుకుంటాను!’ అని భరోసా ఇచ్చింది. హిట్‌కి ముందు దర్శకుడిగా షార్ట్‌ఫిల్మ్‌తో ప్రయోగాలు చేస్తున్నప్పుడు నా సేవింగ్స్‌ మొత్తం ఖర్చుపెట్టినా ఏ అభ్యంతరమూ చెప్పలేదు. పైగా- ఏడాదిపాటు నేనిక్కడ షూటింగ్‌లో ఉంటే తనొక్కతే ఆస్ట్రేలియాలో ఉండిపోయింది. మేము ప్రేమికులుగా ఉన్న రోజుల నుంచే తనకి సినిమాలంటే పెద్దగా ఇష్టంలేదు. నేను ఏదైనా సినిమా గురించి పదేపదే చెబితే కానీ చూడదు. అలాంటమ్మాయి నా తపనని అర్థం చేసుకుని ఇంతగా మద్దతిస్తుందని నేను ఊహించనేలేదు... థ్యాంక్యూ స్వాతీ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.