close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న... నేను చచ్చిపోయాననుకున్నాడు!

కొందరు సినిమావాళ్ల జీవితంలో వాళ్లు తీసే చిత్రంలోకన్నా ఎక్కువ నాటకీయతా సాహసాలూ కనిపిస్తుంటాయి. కరుణకుమార్‌ జీవన ప్రయాణం అలాంటిదే. ‘పలాస 1978’తో తెలుగు చిత్రసీమకి ఓ విలక్షణ చిత్రాన్నందించి ప్రశంసలు అందుకున్న కరుణకుమార్‌... పదిహేనేళ్ల వయసులో హోటల్లో ప్లేట్లు కడగడంతో జీవితాన్ని మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి ఆంత్రప్రెన్యూర్‌గా మారాడు. అదే సాహసంతోనే సినిమాలవైపూ వచ్చాడు. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే...

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని ఓ కుగ్రామం మాది. పేరు కంట్రగడ. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందా పల్లెటూరు. అప్పట్లో మానాన్న సాగుచేస్తూ ఉన్న ఆరు సెంట్ల భూమే మాకున్న ఏకైక ఆస్తి. కానీ ఊరిలో ఒక్కసారిగా నక్సలైట్ల ప్రభావం హెచ్చింది. అన్నలు వందల ఎకరాలున్న కామందుల భూములతోపాటూ మా ఆరుసెంట్లనీ అక్కడి గిరిజనులకి పంచేశారు! అలా మాకున్న ఒకే ఒక జీవనాధారం పోయింది. కడుపు నిండటమే కష్టమైంది. అప్పుడు నేను పదో తరగతి పాసై ఉన్నాను. పై చదువులకి వెళ్లే స్థోమత లేకున్నా సరే నాన్న నన్ను చదివించాలనుకున్నాడు. శ్రీకాకుళం పట్టణంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో చేర్చాడు. అక్కడ ఆయనకు తెలిసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లో ఉంటూ చదువుకునే ఏర్పాటుచేశాడు. కాలేజీకి వెళుతున్నానన్న మాటేకానీ ఇంటికొచ్చి కనీసం పుస్తకంపట్టే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు ఆ ఇంట్లోవాళ్లు. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్షణం తీరికలేకుండా ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. అప్పటికే సరైన ఆహారం లేక అర్భకంగా ఉండే నన్ను ఆ పనులు మరింతగా కృశించేలా చేశాయి. ఇదే కాయకష్టం నేను బయట చేస్తే కనీసం నాలుగు డబ్బులైనా చేతికొస్తాయనే ఆలోచన వచ్చింది. దాంతో ఓ రాత్రి ఆ ఇంటి నుంచి బయటపడ్డాను. బస్సెక్కి ఆముదాలవలస రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాను. ఓ రైలొస్తే అది ఎక్కడికి వెళుతుందో కూడా చూసుకోకుండా ఎక్కేశాను. టీటీఈ కంటపడకుండా రాత్రంతా లెట్రిన్‌లో దాక్కున్నాను. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... ఆ తర్వాతి రోజు నేను కళ్లు తెరిచేసరికి ట్రెయిన్‌ చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో ఉంది!

ప్లాట్‌ఫామే పడక...
తెలియని ఊరు... అర్థంకాని భాష. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్‌లోనే ఉండిపోయాను. ఆకలైతే అక్కడున్న కొళాయి నీళ్లతోనే కడుపు నింపుకున్నాను. మరీ తట్టుకోలేకపోతే ప్రయాణికుల దగ్గరకెళ్లి అడిగితే తాము తింటున్నదాంట్లో కొంత పెట్టేవారు. అమ్మావాళ్లు గుర్తుకొచ్చి ఏడుపొచ్చినా డబ్బు సంపాదించకుండా వాళ్ల దగ్గరకెళ్లకూడదనుకున్నాను. నా చావో బతుకో ఇక్కడే తేలిపోవాలనుకున్నాను. అలా ఐదు రోజులూ స్టేషన్‌లోనే గడిపాను. ఓసారి బాగా ఆకలిగా అనిపించి ఓ ప్రయాణికుడి దగ్గరకెళితే ఆయన చేతిలో తెలుగు పత్రిక కనిపించింది. తెలుగువాళ్లనగానే ప్రాణం లేచి వచ్చి ‘ఆకలవుతోంది... సార్‌!’ అన్నాను. వెంటనే ఆయన స్టేషన్‌ బయట ఉన్న హోటల్‌కి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించాడు. నా కథంతా విన్నారు. ‘నువ్వు స్టేషన్‌లోనే ఉండిపోతే ఆకలితో చచ్చిపోతావ్‌. ఇక్కడ ఏదైనా హోటల్‌లో పనిచెయ్‌... కనీసం మూడుపూటలా అన్నమైనా పెడతారు..!’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పినట్టు స్టేషన్‌కి దగ్గర్లో బ్లూ స్టార్‌ అనే హోటల్‌కి వెళ్లి పని అడిగాను. కొత్తవాళ్లకి ఇవ్వలేమని చెప్పేశారు. అప్పుడు ఆ హోటల్‌ పక్కన రిక్షాపైన అన్నం వండి అమ్ముతూ ఉన్న ఓ కుటుంబం కనిపించింది. నేను వాళ్లకి సాయంగా ప్లేట్లు కడగటం మొదలుపెట్టాను. వాళ్లు నాకు మూడుపూటలా భోజనం పెట్టేవారు. అదే నా తొలి ఉద్యోగం! వాళ్ల గుడిసె దగ్గరే ప్లాట్‌ఫామ్‌పైన పడుకునేవాణ్ణి నేను. అక్కడ పరిచయమైన స్నేహితుడొకడు చెన్నైలోని ఉడుపి హోటల్‌లో పనికి కుదిర్చాడు. ఆ హోటల్‌ వడపళని అనే ప్రాంతంలో ఉంటుంది. విజయవాహిని సినిమా స్టూడియో ఉండేది కూడా అక్కడే! ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు ఎక్కువ కాబట్టి పాత తెలుగు పుస్తకాలు బాగా దొరికేవి. అప్పటి నుంచి అవే నాకు నేస్తాలయ్యాయి. అప్పటికి నేను ఇల్లు వదిలి ఆరునెలలు. అప్పుడప్పుడూ అమ్మావాళ్లు గుర్తొచ్చేవారు. ఒక్కగానొక్క కొడుకు కానరాక వాళ్లెంత అల్లాడిపోతారో అనే ఆలోచనొస్తే బాగా ఏడుపొచ్చేది. వెంటనే నేను ఫలానా చోట ఉన్నానంటూ ఓ జాబు రాయటం మొదలుపెట్టేవాణ్ణి. వెంటనే ‘మీవాడు చెన్నైలో కప్పులు కడుగుతున్నాడట...’ అని నలుగురూ అంటే వాళ్లకెంత అవమానం!’ అనుకుని రాసిన ఉత్తరాలు చించేసేవాణ్ణి. ఇలా అయినవాళ్లతో సంబంధాలు తెంచుకోవడం వల్ల బాగా ఒంటరితనంగా అనిపించేది. ఆ ఒంటరి తనాన్నంతటినీ పుస్తకాలే పొగొట్టాయి. అప్పట్లో యండమూరి నవలలు నాకెంతో స్ఫూర్తినిచ్చేవి. వాటిని చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆలోచనలన్నింటినీ డైరీలా రాసుకోవడం మొదలుపెట్టాను. నా రచనలకి బీజం అక్కడే పడింది.

అదే పెద్ద మలుపు...
ఉడుపి హోటల్లో చేరానని చెప్పాను కదా... అక్కడ హోటల్‌ బయట ఊడవడంతో మొదలుపెట్టి ప్లేట్లు కడగడం, టేబుళ్లు తుడవటం, తర్వాత అక్కడి ప్రధాన చెఫ్‌కి సహాయకుడిగా మారడం... ఇలా చాలా అంచెలు దాటాక నన్ను బిల్లింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చోబెట్టారు... హోటల్‌లో ఉద్యోగాల పరంగా అది ఓ పెద్ద ప్రమోషన్‌లాంటిది! కాలేజీకి వెళ్లకున్నా సాహిత్యాన్ని చదువుతుండటం వల్ల నా మాట తీరూ, మన్ననా చూసి మా హోటల్‌కి తరచుగా వచ్చే ఒకతను ‘సైఫన్‌’ అనే రొయ్యల సాగు సంస్థలో నన్ను ఆఫీస్‌ బాయ్‌గా చేర్చాడు. ఆఫీస్‌ వాతావరణం నన్ను చాలా మార్చింది. ఖాళీ సమయంలో సాహిత్యంతోపాటూ స్పోకెన్‌ ఇంగ్లిషు, టైపింగ్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏడాది తిరక్కుండానే కంప్యూటర్‌ ఆపరేటర్‌ని అయ్యాను. ‘టాలీ’ సాఫ్ట్‌వేర్‌ అప్పుడప్పుడే మార్కెట్‌లోకి వస్తుంటే దానిపైన పట్టు సాధించడంతో ఆ సంస్థకి నన్ను అకౌంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేశారు. ఒక్కసారిగా నా జీవితం మారిపోయింది. మూడేళ్లు అక్కడ పనిచేశాక... అమ్మానాన్నల దగ్గరకెళ్లడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. అలా ఊరొదిలి వచ్చిన పదేళ్ల తర్వాత ఇంటి బాట పట్టాను.

‘మాఅబ్బాయివి కాదేమో’
ఊరి పొలిమేరలోనే కనిపించిన నాన్న ఎదురుగా నిల్చుంటే ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఎంత చెప్పినా నేను నేనేనని నమ్మలేదు. నేను ఊరొదిలి వచ్చేటప్పుడు విజయనగరం ప్రాంతంలో తోటపల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుండేది. ఆ నిర్మాణానికి మగపిల్లల్ని బలిస్తున్నారంటూ వదంతులు రేగుతుండేవి అప్పట్లో. నేను కూడా అలా బలైపోయానని అనుకున్నాడట. అంటే...వాళ్ల దృష్టిలో నేను చచ్చిపోయానన్నమాట! అన్నేళ్లు నేను వాళ్లకి సమాచారం ఇవ్వకుండా ఉన్నందుకు తొలిసారి పశ్చాత్తాపపడ్డాను. ఆయన్ని హత్తుకుని తన కొడుకుని నేనేనంటూ ఏడ్చాను. అమ్మతో నాకింత సమస్యరాలేదు. నాన్నతో వస్తున్న నన్ను చూడగానే తన కన్నపేగు కదిలినట్టుంది... భోరుమంటూ వచ్చి హత్తుకుంది. మూడునెలలపాటు అమ్మానాన్నల్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు నేను. ఆ తర్వాత విశాఖలో ‘హాలిడేస్‌ వరల్డ్‌’ అనే పర్యటనల నిర్వహణ సంస్థలో చేరాను. కార్పొరేట్‌ సంస్థల నుంచి వీఐపీల దాకా వాళ్లక్కావాల్సిన దేశీ, విదేశీ పర్యటనల్ని నిర్వహించే సంస్థ అది. అందులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ‘టూర్‌ మేనేజర్‌’గా ఎదిగాను. ఆ కంపెనీలో పనిచేస్తున్న నీలిమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాది కులాంతర వివాహం. నా జీవితాన్ని ‘నీలిమకి ముందు, ఆ తర్వాత’ అని చెప్పొచ్చు. ఉద్యోగిగా ఉన్న నేను ఆంత్రప్రెన్యూర్‌గా మారానన్నా... రచనలవైపు సాగానన్నా... ఇప్పుడు సినిమా దర్శకుణ్ణయ్యానన్నా అంతా తన చలవే. ‘హాలిడేస్‌ వరల్డ్‌’ సంస్థలో ఉద్యోగిగా ఉంటున్న నేను దాని ఫ్రాంచైజీ తీసుకుని హైదరాబాద్‌లో ఆఫీసు తెరిచాను. కానీ తొలి ఆరేడునెలలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఆటుపోట్లకి గురైతే ఆ బాధలన్నీ నా భార్యే పంటిబిగువున భరిస్తూ కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. మొదట్లో ఆటుపోట్లు వచ్చినా సంస్థ లాభాల బాట పట్టింది. ఇంతలో ‘పసిఫిక్‌ ట్రయల్స్‌’ అనే ఎమ్మెన్సీ సంస్థ నన్ను డిప్యుటీ జనరల్‌ మేనేజర్‌గా చేరమంది. సింగపూర్‌లో ఉద్యోగం. 2003లోనే ఆరు అంకెల జీతం. కానీ భార్యాపిల్లలకి దూరంగా ఉండటంలో అర్థంలేదు అనిపించి రాజీనామా చేసి మళ్లీ హైదరారబాద్‌ వచ్చాను. ‘నవదీప్‌ హాలిడేస్‌’ అనే పర్యటక సంస్థని స్థాపించాను. అనతికాలంలోనే బజాజ్‌ అలయెన్జ్‌ వంటి సంస్థల ఉద్యోగులూ మా వినియోగదారులుగా మారారు!

సినిమాలవైపు...
పదిహేనేళ్లప్పుడు సాహిత్యంతో ఏర్పడ్డ సాహచర్యాన్ని నేను వదులుకోలేదు. హైదరాబాద్‌ వచ్చాక మహ్మద్‌ ఖదీర్‌బాబు, కుప్పిలి పద్మ, మహీ బెజవాడ వంటి రచయితలు పరిచయమయ్యారు. వాళ్లు నిర్వహించే వర్క్‌షాపుల ద్వారా ‘చున్నీ’, ‘పుష్పలత నవ్వింది’, ‘498’, ‘జింగిల్‌ బెల్స్‌’... వంటి ఆరు కథలు రాశాను. అవి వివిధ సంపుటాలూ, పత్రికల్లో అచ్చయ్యాయి. వీటిలో ‘పుష్పలత నవ్వింది’ కథ ఐదు భాషల్లోకి అనువాదమైంది. అప్పుడే నేనూ రచనయితనేననే నమ్మకం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్‌లో ‘చతురులు’ పేరుతో స్టాండప్‌ కామెడీ షోలు నిర్వహిస్తున్న వాళ్లతో కలిసి నేనే స్క్రిప్టు రాసి ప్రదర్శనలివ్వడం ప్రారంభించాను. వాటిని చూసిన దర్శకులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ప్రదీప్‌ అద్వైత్‌ల ద్వారా ప్రశాంత్‌ వర్మ పరిచయమయ్యాడు. అలా ఆయన తీసిన ‘అ!’ సినిమాకి పనిచేశాను. ఆ సినిమాకి మంచి పేరొచ్చాక నాకు దర్శకుడిగానూ మారాలనిపించింది. 2016లో కేంద్ర స్వచ్ఛభారత మిషన్‌ షార్ట్‌ఫిల్మ్‌ల పోటీ పెడితే గంటలో స్క్రిప్టు తయారుచేసి ‘చెంబుకు మూడింది...’ అనే చిత్రం తీసి పంపాను. దానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి వచ్చింది! ఆ తర్వాత గత వందేళ్లుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అమూల్యమైన కథల్ని తెరకెక్కించాలనిపించింది. అందుకు శ్రీకారంగా మహ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన ఓ కథని ‘ప్రణతి’ అని షార్ట్‌ఫిల్మ్‌గా తీశాను. దాన్ని చూశాకే తమ్మారెడ్డి భరద్వాజ్‌ పిలిచి సినిమా కథలున్నాయా అని అడిగితే... ‘పలాస 1978’ సినిమా కథ ప్లాట్‌ చెప్పాను. నేను మా ఊర్లో చూసిన జానపద కళాకారుల జీవితమే దాని నేపథ్యం. భరద్వాజ్‌ ద్వారా ధ్యాన్‌ అట్లూరి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. నాకు బెంగాలీ, మలయాళం, తమిళ సినిమాల స్టైల్‌ ఇష్టం కాబట్టి... నా సినిమాలో స్మాల్‌ టౌన్‌ వాతావరణాన్ని చూపిస్తూ వాస్తవికతకి పెద్దపీట వేయాలనుకున్నాను. ఆన్‌లైన్‌లో డైరెక్షన్‌, ఎడిటింగ్‌ మెలకువలపైన శిక్షణ తీసుకుంటూనే ఈ సినిమా తీశాను! నా ఆలోచనల్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులూ దొరకడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు నేను.


అల్లు అరవింద్‌ పిలుపు...

‘పలాస 1978’ సినిమా మార్చి మొదట¨వారంలో విడుదలైంది. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్‌లకి రావడం మొదలుపెట్టారు. చిత్రం లాభాలు తెస్తోందని అనుకుంటూ ఉండగానే  కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. దాంతో అమెజాన్‌ ప్రైమ్‌లో దాన్ని విడుదల చేశాం. ఈ సినిమాని చూసిన అల్లు అరవింద్‌ నన్ను పిలిచి చెక్‌ చేతిలోపెట్టి ‘గీతా ఆర్ట్స్‌ తర్వాతి సినిమా నువ్వే చేస్తున్నావ్‌!’ అని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ సంస్థ తరపున ఓ ప్రముఖ హీరోతో సినిమా చేయబోతున్నాం. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ప్రకటన వస్తుంది! సినిమా పనులతోపాటూ నా నవదీప్‌ హాలిడేస్‌ సంస్థనీ నడుపుతున్నాను. ఏ కొత్త పనైనా సరే అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకోవడం, ఏ పనిచేసినా చేస్తున్నంత సేపూ అదొక్కటే ధ్యాసగా ఉండటం నాకున్న బలాలు. హోటల్లో ప్లేట్లు కడగటంతో జీవితం మొదలుపెట్టిన నేను దర్శకుడిగా మారానంటే ఈ రెండు గుణాలే ప్రధాన కారణమని భావిస్తున్నాను!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.