
మనం తినే ఆహారం నోటికి రుచిగా ఉండడమే కాదు, మెదడుకీ రుచించాలి. అప్పుడే అది చక్కగా పనిచేసి మన జ్ఞాపకశక్తిని పది కాలాలపాటు పదిలంగా ఉంచుతుంది అంటున్నాయి అనేక పరిశోధనలు. సాధారణంగానే కూరగాయలూ ఆకుకూరలూ బెర్రీలూ నట్సూ తృణధాన్యాలూ చేపలతో కూడిన మధ్యధరా ఆహారాన్ని తీసుకునేవాళ్లలో మతిమరపు తక్కువగా ఉండటంతోబాటు ఆలోచనాశక్తి కూడా పెరుగుతుందట. అంతేకాదు, కొన్ని ఆహారపదార్థాల మేళవింపు కూడా జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుందని ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బార్డియాక్స్ విశ్వవిద్యాలయ నిపుణుల అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఎక్కువ పిండిపదార్థాలు ఉన్న బంగాళాదుంపలకి మాంసాహారమూ, కుకీలూ, స్నాక్సూ తోడయితే ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. అదే మాంసాహారానికి ఇతరత్రా పండ్లూ కూరగాయలూ సీఫుడ్డూ జోడించి తినేవాళ్లలో మతిమరపు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద ఆహారంలో ఆరోగ్యకరమైనవి ఎన్ని రకాలు జోడిస్తే అంత మంచిదని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ ఒకే రకం కాకుండా అన్ని రకాలూ తింటే మెదడూ చక్కగా ఆలోచిస్తుందన్నమాట.
ఈ ‘చింత’ జ్వరానికి మందు!
సి-విటమిన్ ఎక్కువగా ఉండే చింతకాయలు ఆరోగ్యానికి మంచిదన్నది తెలిసిందే. అయితే అచ్చం చింత రుచిలోనే ఉండే బ్లాక్ వెల్వెట్ చింతలో విటమిన్-సి, ఎలతోపాటు ఫోలిక్ ఆమ్లం, నియాసిన్, రిబోఫ్లేవిన్... వంటి పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్లకు కాసే పండ్లలో కూడా చింతలో మాదిరిగానే పండిన తరవాత పెంకు ఊడిపోతుంది. గుజ్జు అచ్చం చింతపండు రుచిలోనే ఉంటుంది కానీ పులుపుకన్నా తీపి ఎక్కువ. ఈ పండ్లతోపాటు చెట్టు ఆకులూ బెరడూ అన్నీ అనేక వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. ముఖ్యంగా శ్వాసకోశవ్యాధులకు ఈ పండ్లు మంచి మందులా పనిచేస్తాయి. ఈ పండ్లను నానబెట్టి నీటిని తాగితే జ్వర తీవ్రత కూడా తగ్గుతుందట. డయేరియానీ మూత్రపిండ వ్యాధుల్నీ నిరోధిస్తుంది. ఇందులోని పొటాషియం బీపీ, మధుమేహాలను తగ్గించడంతోపాటు అల్సర్లకీ ఔషధంలా పనిచేస్తుందట. దంతాలమీద పాచినీ బ్యాక్టీరియానీ తొలగించి చిగుళ్లవ్యాధుల్నీ పంటినొప్పినీ కూడా నివారిస్తుంది. నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఈ పండ్లలోని పోషకాలు మందులా పనిచేస్తాయి. పాలు తక్కువగా ఉండే గర్భిణీల్లో ఈ పండ్లు పాలు పడేలా చేస్తాయి. రక్తహీనతనీ తగ్గిస్తాయి. దీని ఆకులూ బెరడు కషాయం మలేరియాకి మంచి మందు. ఇవేకాదు, మరెన్నో వ్యాధుల్ని నియంత్రించే ఈ చింతని ఆరోగ్యంలో భాగంగా చేసుకుంటే మంచిదన్న కారణంతో దీన్ని ఇప్పుడు మనదేశంలోనూ పెంచుతున్నారు.
రాగికి లేజర్ చికిత్స!
రాగికి బ్యాక్టీరియాని నాశనం చేసే శక్తి ఉందనేది తెలిసిందే. రాగిలోని అయాన్లు బ్యాక్టీరియా కణత్వచంలోకి ప్రవేశించి అవి చనిపోయేలా చేస్తాయి. అయితే దీని ఉపరితలం నున్నగా ఉండటం వల్ల అయాన్లు బ్యాక్టీరియాలోకి ప్రవహించేందుకు కొన్ని గంటలు పడుతుంది. అదే రాగిని లేజర్ కిరణాలతో చర్య పొందేలా చేయడం వల్ల ఈ ఉపరితలం గరుకుగా మారి, అయాన్ల ప్రవాహం వేగవంతమై బ్యాక్టీరియా త్వరగా నశిస్తుందని పర్డ్యూ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకునేందుకు హానికర ఈ-కోలి బ్యాక్టీరియామీద పరిశీలించినప్పుడు- అది 40 నిమిషాల్లో పూర్తిగా చనిపోయిందట. అంతేకాదు, ఆర్థోపెడిక్ ఇంప్లాట్స్కు వాడే లోహాలకు కూడా ఈ పద్ధతిని ఉప యోగించడం వల్ల అవి చుట్టూ ఉన్న కణజాలాలకి త్వరగా అతుక్కుంటాయని చెబుతున్నారు.
ఒకటే డ్రెస్సు... చల్లగా వెచ్చగా..!
వేసవిలో చల్లదనంకోసం కాటన్వీ చలికాలంలో వెచ్చదనంకోసం సిల్కు, ఊలు దుస్తులు వాడుతుంటాం. ఇలా విడివిడిగా కాకుండా ఒకే ఫ్యాబ్రిక్ వేసవిలో చల్లదనాన్నీ చలిలో వెచ్చదనాన్నీ అందిస్తే ఎంత బాగుంటుందీ... సరిగ్గా అదే ఆలోచనతో వాతావరణాన్ని బట్టి వేడినీ చల్లదనాన్నీ అందించే వస్త్రాన్ని తయారుచేసింది అమెరికన్ కెమికల్ సొసైటీ. ఇందుకోసం ముందుగా స్పన్సిల్కులో రంగుదారాలనీ షెల్ఫిష్ నుంచి సేకరించిన చిటోసా పదార్థాన్నీ కలిపి రంధ్రపూరితమైన ఫ్యాబ్రిక్కుని రూపొందించారు. ఆ చిల్లుల్లో అవసరాన్ని బట్టి వేడిని పీల్చుకుని, విడుదల చేసే పాలీ ఇథిలీన్ గ్లైకాల్(పీఈజీ) అనే పాలిమర్‌ను నింపి, దానిపైన పాలీ డైమిథైల్సిలోక్సేన్ పూతగా పూశారు. దాంతో ఇది నీటిని కూడా పీల్చుకోదు. ఆపై దీన్ని పరిశీలించేందుకు చిన్న ఫ్యాబ్రిక్ ముక్కని పాలియెస్టర్ గ్లోవ్స్లోపల అమర్చి, ఆ గ్లోవ్స్ వేసుకున్న చేతిని అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర పెట్టగా అందులోని పీఈజీ ఆ వేడికి కరిగి ద్రవంలా మారి, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చిందట. అదే చేతిని మళ్లీ కోల్డ్ ఛాంబర్లో పెట్టగానే అది గట్టిపడి ఉష్ణాన్ని విడుదల చేయడంతో వెచ్చగా అనిపించిందట. సో, భవిష్యత్తులో స్మార్ట్ దుస్తులకి బదులు ఈ టూ ఇన్ వన్ ఫ్యాబ్రిక్‌తోనే కోట్లూ గ్లోవ్సూ సాక్సూ వంటివన్నీ చేస్తారన్నమాట.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్