close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మమాటే ఆవిష్కర్తని చేసింది..!

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి... తెలంగాణలోని చేవెళ్ల మాజీ ఎంపీ. ఓ ఆవిష్కర్తగా వ్యాపారిగా విజయం సాధించి రాజకీయాల్లోకి వచ్చినవారాయన.  కొవిడ్‌-19పైన ప్రపంచం చేస్తున్న పోరాటం సందర్భంగా తనలోని ఆవిష్కర్తని మళ్లీ నిద్రలేపారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ‘ఐకోవెంట్‌’ అనే తక్కువ ధర వెంటిలేటర్‌ని రూపొందించారు! రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆవిష్కర్తగా మిగలడం విశేషమే కానీ... ఆయన జీవితంలో అలాంటి విశేషాలెన్నో ఉన్నాయి. అవన్నీ ఆయన మాటల్లోనే...

‘ప్రజా సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలన్న వాదానికి కాలం చెల్లింది. ఇకపైన ప్రజలకి సేవచేయాలంటే ఏ లాయరో, డాక్టరో, ఇంజినీరో కావాలి. ఇంజినీరైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంతటివాడు కావాలి!’ - అని చెబుతూనే మా తాతయ్య కొండా వెంకట రంగారెడ్డి నాకు ఈ పేరు పెట్టారట. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రిగా చేసినవారు. రంగారెడ్డి జిల్లాకి ఆ పేరు ఆయన గౌరవార్థం పెట్టిందే. రాజకీయంగా ఇంత సాధించినా సరే ఆయన తన పదకొండుమంది సంతానంలో ఎవరూ అటువైపు రాకూడదని పట్టుబట్టారు. అందర్నీ ఉన్నత చదువులవైపు మళ్ళించారు. మా నాన్న మాధవరెడ్డి లా చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా సేవలందించారు. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల తర్వాత నేను. నా ముగ్గురక్కయ్యలూ చదువుల్లో బాగా రాణించారు. పెద్దక్కయ్య డాక్టరైతే రెండో అక్కయ్య రసాయనశాస్త్ర పరిశోధకురాలిగా డాక్టరేట్‌ సాధించారు. మూడో అక్క అప్పట్లోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వైపు నడిచారు. మా బాబాయిల పిల్లల్లోనూ చాలావరకు ఐఐటీల్లో చదువుకున్నవారే. వీళ్లందరి మధ్య నేనే కాస్త యావరేజ్‌ విద్యార్థిగా ఉండేవాణ్ని. అందువల్ల అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటే మా అమ్మ జయలత మాత్రం నాకు అండగా నిలిచేది. ‘చూస్తూ ఉండండి. వాడు జీవితంలో ఎంతో ఎదుగుతాడు, ఎన్నో సాధిస్తాడు’ అంటుండేది. నలుగురిలో నేను చిన్నబుచ్చుకోకూడదని అమ్మ అలా చెప్పి ఉండొచ్చుకానీ... ఆ మాటలు నిజంగానే నామీద బాగా పనిచేశాయి. ‘చదువుకి మించిన విషయం ఏదో నాలో ఉంది’ అనే ఆత్మవిశ్వాసాన్ని తెచ్చాయి. ఆ ‘ఏదో’ ఏమిటనే విషయం నాకు ఇంటర్‌ తర్వాతే అర్థమైంది. అది... డిజైనింగ్‌. మన అవసరాలకి తగ్గట్టు ఓ కొత్త వస్తువుని రూపకల్పన చేసే ఆ సామర్థ్యమే నన్ను ఇంత దూరం నడిపించింది.

చదువుకునేటప్పుడు...
ఇంటర్‌ అయ్యాక ఐఐటీ-మద్రాసుకి దరఖాస్తు చేసుకున్నా కానీ మార్కులు తక్కువకావడంతో అక్కడ సీటు రాలేదు. దాంతో పక్కనే ఉన్న గిండీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ తీసుకున్నాను. అక్కడ రెండో ఏడాది నుంచే సొంతంగా స్టీరియో ఆంప్లిఫయర్‌లు తయారుచేయడం మొదలు పెట్టాను. అప్పట్లో రైల్వే ఉద్యోగులు పట్టాలపైన నిల్చుని సిగ్నల్‌ ఇవ్వడానికి కిరోసిన్‌తో పనిచేసే లాంతరులాంటిదాన్ని ఉపయోగిస్తుండేవారు. వాటిని ఎలక్ట్రికల్‌ ల్యాంప్‌లుగా మార్చడానికి దక్షిణ రైల్వే టెండర్‌ పిలిస్తే... నేనూ, నా ఫ్రెండ్‌ జోజో థామస్‌ దరఖాస్తు చేసుకున్నాం. అప్పటికి మేం విద్యార్థులం కాబట్టి అనుభవం లేదంటూ రైల్వేశాఖ దాన్ని తిరస్కరించింది. అయితే మేం ఊరుకోలేదు. మిగతావాళ్లకంటే అతితక్కువ ఖర్చుతో ఏ రకంగా పనులు చేయగలమో చూపించి టెండర్‌ ఓకే చేయించుకున్నాం. అప్పటికి నాకు పందొమ్మిదేళ్లు. ఆంత్రప్రెన్యూర్‌గా అదే నా తొలి అడుగు.

అమెరికాలో కంపెనీ...
నవలలూ కథలూ ఓ మనిషి జీవితాన్ని మారుస్తాయా... అని చాలామంది అడుగుతుంటారు. నా వరకైతే మైఖెల్‌ క్రైటన్‌ (‘జురాసిక్‌ పార్క్‌’ నవల కూడా ఈయనదే) రాసిన ‘ది టెర్మినల్‌ మ్యాన్‌’ అనే నవల నా జీవిత పథాన్నే మార్చేసింది. ఓ వ్యక్తికి తెలియకుండా అతని తలలో ఎలక్ట్రోడ్‌ని పెట్టి... కొందరు శాస్త్రవేత్తలు అతని చేత కొన్ని పనులు చేయించడం ఇందులోని కథాంశం. దాని సాధ్యాసాధ్యాలని పక్కన పెడితే ఈ నవల నన్ను బయో-మెడికల్‌ ఇంజినీరింగ్‌వైపు దృష్టిపెట్టేలా చేసింది. ఆ లక్ష్యంతోనే అమెరికాలోని మిన్నెసొటా యూనివర్సిటీలో ఎమ్మెస్‌లో చేరాను. విద్యార్థిగా ఉంటూనే రెండు పరికరాలని ఆవిష్కరించాను. ఒకటి- కడుపులో ఉన్న శిశువు గుండె కొట్టుకునే తీరుని స్పష్టంగా వినిపించే పరికరం. అదివరకున్నవన్నీ బిడ్డ గుండె చప్పుడుతోపాటూ అనవసరమైన ఇతర శబ్దాలనీ వినిపించేవి... నేను ఆ శబ్దాలు లేకుండా దాన్ని తయారుచేశాను. ఇక రెండోది, ‘మస్క్యులర్‌ డిస్ట్రఫీ’ రకాన్ని చెప్పే పరీక్షా విధానం. ఈ ఆవిష్కరణల కారణంగా నాకు అమెరికా వైమానిక దళం నుంచి పిలుపొచ్చింది. వాళ్లకి యుద్ధవిమానాలూ, మిస్సైళ్లని నియంత్రించే పరికరాలను తయారుచేస్తున్న మాల్విన్‌ అనే సంస్థలో ఉద్యోగం చేయమన్నారు. రెండేళ్లు అక్కడ పనిచేశాక ఆ పరికరాలని నేను సొంతంగా తయారుచేయగలను అనే నమ్మకం వచ్చింది. ఇందుకోసమే ‘రెడ్డీస్‌ కంపెనీ’ అనే సంస్థని ప్రారంభించి పరికరాలని సరఫరా చేయడం మొదలుపెట్టాను. ఇక భారతదేశానికి వచ్చి మన సైన్యానికీ ఇలాంటి పరికరాలే సరఫరా చేయాలనుకున్నాను. కానీ సైన్యంలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండకూడదనే నాటి విధానాల కారణంగా అది ముందుకు సాగలేదు. దాంతో ‘రెడ్డీస్‌ కంపెనీ’ని అమెరికాలోనే అమ్మేశాను. భారతదేశానికి వచ్చి కొత్తగా ‘స్టెఫాన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌’ అనే సంస్థని ప్రారంభించి మళ్లీ బయో ఇంజినీరింగ్‌పైన దృష్టిపెట్టాను. చుట్టూ ఉన్న గాలి ద్వారా ఆక్సిజన్‌ని తయారుచేసే ‘ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌’నీ, డిస్పోజబుల్‌ ఈసీజీ ఎలక్డ్రోడ్‌లనీ తయారు చేయడం మొదలుపెట్టాను. అంతేకాదు- మనుషుల అవసరం లేకుండా ఆసుపత్రిలోని పేషెంట్లని సులభంగా పైకెత్తగల పరికరాన్ని కనిపెడితే దానికి అమెరికా పేటెంట్‌ కూడా వచ్చింది. ఈ ఆవిష్కరణలప్పుడే అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్‌ సి.రెడ్డి వాళ్లమ్మాయి సంగీతారెడ్డితో పెళ్లైంది. 1990ల చివర్లో ఐటీ బూమ్‌ మొదలయ్యాక ఆ కొత్తరంగంలోనూ ఏదైనా ఆవిష్కరణలు చేయగలమేమో చూడాలనుకున్నాను. సిటడెల్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సంస్థని ప్రారంభించి ఆసుపత్రుల నిర్వహణకి అవసరమైన హై-పార్‌, హై-రెప్స్‌, హైకోర్‌ అనే సాఫ్ట్‌వేర్‌లని తయారుచేశాను. చిన్నప్పటి నుంచీ జీఈ సంస్థలో పనిచేయాలని నాకో కల ఉండేది. అలాంటిది మా సాఫ్ట్‌వేర్‌ని చూసిన ఆ సంస్థ మాతో కలిసి పనిచేస్తామని ముందుకొచ్చింది. అలా ఆ సంస్థతో కలిసి జేఈ-ఎంఎస్‌ఐటీ అనే పేరుతో ఓ కంపెనీని ఏర్పాటుచేశాం. దానికి నేనే సీఈఓగా వ్యవహరించాను. ఆ తర్వాత ఆ సంస్థని విప్రో కొనుగోలు చేసినా... దానికీ నన్నే సీఈఓగా ఉండమంది. ఈలోపు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది... అది నా జీవితంలో మరో మలుపుకి కారణమైంది.

గ్రామస్వరాజ్యమే... కొత్తగా!
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను వివిధ పోరాటాల్లో పాల్గొంటూనే యువత కోసం ‘80 రోజుల్లో 80 నైపుణ్యాలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాను. అవి తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించడంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో మా తాతయ్య గీసిన గీతని నా తరంలో దాటాల్సి వచ్చింది. 2014లో చేవెళ్ల ఎంపీగా పోటీచేసి 75వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాను. మొదటి రోజు నుంచే పల్లెల స్వయం సమృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నాను. ఇందుకోసం కొన్ని ప్రయోగాలు చేశాను. అందులో మొదటిది పల్లెల్లో బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసి ఎల్పీజీపైన ఆధారపడటాన్ని తగ్గించడం. రెండోది, నా నియోజకవర్గంలోని బడుల్లో ఉన్న మరుగుదొడ్లని శుభ్రంగా ఉంచడం. ఇందుకోసం అత్యాధునిక పరికరాలతో కూడిన ట్రక్కుల్ని రూపొందించడం. మూడోది, టొమాటో రైతు నష్టపోకుండా ఇక్కడే ‘ప్యూరీ’ తయారీ కేంద్రాలు ఏర్పాటుచేయడం. నాలుగోది, చేవెళ్లలో ఉన్న కోటిపల్లి ఆనకట్టని విహారకేంద్రంగా మార్చడం. వీటన్నింటినీ మొదట మానాన్న పేరుతో ఏర్పాటుచేసిన మాధవరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా సొంతఖర్చుతోనే చేపట్టాను. ఆ ప్రయోగాలు విజయవంత మయ్యాక ఎంపీ నిధుల ద్వారా నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలకి విస్తరించాను. వీటి ద్వారా సుమారు పదిహేను వందల మంది యువత నగరాల బాట పట్టకుండా వాళ్ల గ్రామంలోనే ఉపాధి సాధించగలిగారు. నేను పార్టీ మారి, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయినా సరే, ఈ పథకాల విలువ గుర్తించిన ప్రభుత్వం వాటిని నా నియోజకవర్గంలో ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వాటి సృష్టికర్తగా నాకు అంతకంటే సంతృప్తినిచ్చే విషయం ఏముంటుంది?!

ఐకోవెంట్‌ గురించి...
‘కొవిడ్‌’ ఉధృతి మార్చినెలలో మొదలైనప్పటి నుంచే కేవలం ఈ వ్యాధికే ఉపయోగపడగల వెంటిలేటర్‌ తయారీపైన దృష్టిపెట్టాను. కొవిడ్‌ రోగుల ఊపిరితిత్తులకి ఓ కచ్చితమైన మోతాదు, నిర్ణీత ఒత్తిడితోనే ఆక్సిజన్‌ని సరఫరా చేయాల్సి ఉంటుంది. సాధారణ వెంటిలేటర్‌లు ఆ పనిచేయలేవు. వాటివల్ల ఊపిరితిత్తులు దెబ్బతినటమే కాదు... వైద్యులకీ వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువ. ఆ సమస్యల్ని మా ఐకోవెంట్‌ పరిహరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి వెంటిలేటర్లు పదిలక్షల దాకా అవసరమవుతాయని ఓ అంచనా. అందుకే ప్రపంచంలో ఏ మూలనైనా సరే సులువుగా తక్కువ ధరకి దొరికే పరికరాలతోనే వీటిని తయారుచేశాను. అదిమాత్రమే కాకుండా, కరోనా చికిత్సలో పాల్గొంటున్న వైద్యులకి వందశాతం రక్షణ కల్పించే ప్రత్యేక రెస్పిరేటరీ మాస్కుని కూడా తయారుచేస్తున్నాను. ఇవి రెండూ మరో నెలలో మార్కెట్‌లోకి రావొచ్చు. ఓ రాజకీయనాయకుడిగా నా నియోజకవర్గం ప్రజల మంచిచెడుల గురించే నేను ఆలోచించగలను కానీ అదే ఆవిష్కర్తగా అయితే ప్రపంచంలోని ప్రజలందరి అవసరాలనూ తీర్చగలను... అన్న ఆలోచనే నన్ను ఇలాంటి ఆవిష్కరణలవైపు నడిపిస్తోంది!


సంగీత... ఓ స్ఫూర్తిమంత్రం!

అమెరికాలో కంపెనీ నడిపే టప్పుడు సంగీతా రెడ్డిని ఒకట్రెండు పార్టీల్లో చూశానుకానీ పలకరింపుల్లేవు. మిగతావాళ్లతో తను కలుపుగోలుగా మాట్లాడే తీరు, ఉన్నది ఉన్నట్టు చెప్పే వైనం నాకు నచ్చాయి. పెళ్ళి చూపులప్పుడు కూడా తనతో పెద్దగా మాట్లాడలేకపోయాను. అప్పట్లో పెళ్ళి విషయంలో అబ్బాయిల ఇష్టాయిష్టాలకున్న ప్రాధాన్యం అమ్మాయిలకి ఉండేదికాదు. వాళ్ళకి నచ్చకపోయినా పెళ్ళి జరగాల్సిందే. నాకేమో తనకి నేను నచ్చానో లేదో అనే ఆందోళన ఉండేది.  అందుకే ‘తనకి నేనంటే ఇష్టమో లేదో కనుక్కోండి’ అని అడిగేసరికి అందరూ ఆశ్చర్య పోయారు. నేను ఇలా అడగడమే సంగీతకి నచ్చిందట! దాంతో 1989లో మా పెళ్ళైంది. చూస్తుండగానే ముప్పైయేళ్లు గిర్రున తిరిగిపోయాయి. నా భార్యగానే కాదు, ఓ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అపోలో సంస్థని తను నిత్యం పరుగెత్తిస్తున్న తీరు నాకెప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మాకు అనిందిత్‌, విశ్వజిత్‌, విరాజ్‌ అని ముగ్గురూ అబ్బాయిలే. పలు కంపెనీల యజమానిగా నేనూ, అపోలో నిర్వాహకు రాలిగా తనూ ఎప్పుడూ బిజీగా ఉంటున్నా... తల్లిదండ్రులుగా పిల్లలకి అవసరమైనంత సమయాన్ని పూర్తిగా కేటాయించాం. వృత్తిజీవితంలో ఇద్దరం ఎంత సాధించినా సరే... ఈ ఒక్క విషయం మాకెంతో సంతృప్తినిస్తూ ఉంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.