close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందరం కలిసి... చనిపోవాలనుకున్నాం..!

రంజాన్‌ వస్తోందంటే... పిస్తాహౌస్‌ హలీమ్‌ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతారు హలీమ్‌ ప్రియులు. అవును మరి... ఆ హలీమ్‌కు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎందరో అభిమానులు.
ఆ హలీమ్‌లో అంత గొప్ప ఏముందనే విషయాన్ని పక్కన పెడితే... దాని తయారీలోనూ తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలోనూ చావో రేవో అన్నట్లు పోరాడిన మహ్మద్‌ అబ్దుల్‌ మాజిద్‌ కష్టం ఉంది. నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చనే సందేశమూ మనకు కనిపిస్తుంది.

ఒకానొక సమయంలో నా ముందున్న దారులు రెండే. ఒకటి ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవడం... లేదా నేనూ, నా భార్యా, ఆరుగురు పిల్లలూ ఆత్మహత్య చేసుకోవడం. బాగా ఆలోచించాక ఈ రెండూ కాకుండా మూడో మార్గం ఏదయినా ఉంటుందేమోనని చూశా. ఆ మూడో మార్గమే నన్నూ నా కుటుంబాన్నీ నిలబెట్టింది. నాకు ఈ రోజున ఇంత గుర్తింపునూ తెచ్చిపెట్టింది. మాది హైదరాబాదే. మా నాన్న పేరు మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌. మాకు బట్టల వ్యాపారం ఉండేది. మేం మొత్తం తొమ్మిదిమందిమి. నేను ఆఖరి అబ్బాయిని. చిన్నప్పటి నుంచీ నాన్న వ్యాపారం చూస్తూ పెరిగిన నేను, బీకాం పూర్తిచేసిన వెంటనే నాంపల్లిలోని మా దుకాణానికి వెళ్లి కూర్చునేవాడిని. నాకేమో దాన్ని ఇంకా విస్తరించాలనే ఆలోచన ఉన్నా... కొనడానికి వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండేది. ఎందుకని గమనిస్తే... ఏవైనా పండగలు ఉన్నప్పుడే కస్టమర్లు దుకాణాలకు వస్తారు తప్ప రోజూ రారని అర్థమైంది. అంతేకాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్టాళ్లు పెట్టేవాళ్లు చాలా ఎక్కువ మొత్తంలో బట్టలు అమ్మి, లాభాలు తెచ్చుకుంటున్నారనీ తెలిసింది. మేం మరోచోటికి వెళ్లినా... అనుకున్నట్లుగా లాభాలు రాకపోవచ్చు కాబట్టి ఇంకేదైనా వ్యాపారం ఎందుకు చేయకూడదని అనుకున్నా. బాగా ఆలోచిస్తే... అన్నింటికన్నా ఆహార రంగానికి సంబంధించిన వ్యాపారం ఏదైనా ప్రారంభిస్తే ఏడాది పొడవునా ధైర్యంగా నడిపించొచ్చని అనుకుని అటువైపే వెళ్లేందుకు సిద్ధమయ్యా. అంతకన్నా ముందు దాదాపు రెండేళ్లు దిల్లీ, ముంబయి, జైపూర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి, బిర్యానీ, మిఠాయిలూ, రకరకాల బేకరీ
పదార్థాల తయారీలో శిక్షణ తీసుకున్నా. ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చి దాదాపు యాభై, అరవై లక్షల రూపాయలు రెడీ చేసుకున్నా. ఇందుకోసం బ్యాంకు నుంచి కొంత లోనూ, మరికొంత తెలిసిన వారి దగ్గరా అప్పు తీసుకున్నా. పెద్దపెద్ద ఓవెన్లు, స్టౌలు కొనేసి ఓల్డ్‌సిటీలో 1997లో ‘పిస్తా హౌస్‌’ పేరుతో భారీ ఎత్తున బేకరీని ప్రారంభించా. నెల గడిచింది.. ఆదాయం అనుకున్నంత కాకపోయినా, ఫరవాలేదనిపించింది.
రెణ్నెల్లకు వ్యాపారం కాస్త పుంజుకుంది. ఇదే కొనసాగితే నేను చేసిన అప్పులన్నీ తీర్చేసి, జీవితంలో స్థిరపడొచ్చనే నమ్మకం వచ్చింది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు ఎందుకు జరుగుతాయి. మూణ్నెల్లు పూర్తవుతున్నాయనగా... ఓ రోజు పేపర్లో వార్త. మా దగ్గర కొన్న పదార్థాలు తిన్న కొందరికి ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగిందనీ, దాదాపు పదకొండు మంది చనిపోయారనేది దాని సారాంశం. ఫుడ్‌పాయిజనింగ్‌ జరిగిన మాట వాస్తవమే. కానీ ఎవరూ చనిపోలేదు. పదార్థాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చినా... ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలియలేదు. చివరకు పిస్తాహౌస్‌కి తాళం వేసేయాల్సి వచ్చింది. అదే మా జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది.

దూరం పెట్టేశారు...
అప్పటికే నాకు పెళ్లయ్యింది. పైగా ఆరుగురు పిల్లలు. చూస్తే అందరూ చిన్నవాళ్లు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతకు ముందువరకూ ఎంతో ఆప్యాయంగా భయ్యా అని పిలిచిన బంధుగణమంతా ఒక్కసారిగా నన్ను పూర్తిగా దూరం పెట్టేసింది. ఎక్కడ పలకరిస్తే ఏ సాయం చేయాల్సి వస్తుందోనని అనుకునేవాళ్లు. కుటుంబంలో ఏవైనా వేడుకలుంటే పేరుకే పిలిచేవాళ్లు తప్ప రాకపోయినా పట్టించుకునేవారు కాదు... అసలే కష్టాల్లో ఉన్న నేను ఇవేవీ పట్టించుకోలేదు కానీ వాళ్లే నాపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిసినప్పుడు మాత్రం బాధేసింది. ‘ఆహారానికి సంబంధించిన వ్యాపారం మొదలుపెడితే ఇలాంటి సమస్యలు వస్తాయని ముందే చెప్పినా వినిపించుకోలేదు...అనుకున్నంతా అయ్యింది...’ అంటూ నానా మాటలు అనేవారు. వీటన్నింటికీ తోడు బ్యాంకుతోపాటూ అప్పులవాళ్లూ డబ్బు కట్టాలంటూ ఇంటిమీదికి రావడం మొదలుపెట్టారు. అప్పుడే అనుకున్నా. మేమంతా కలిసికట్టుగా చనిపోవాలా.. లేదా ఊరొదిలి ఎక్కడికైనా పారిపోవాలా అని. ఒకవేళ మేం చనిపోతే అందరూ నాలుగు రోజులు మాట్లాడుకుని మర్చిపోతారు. అదే ఊరొదిలి పారిపోతే తప్పు చేశారు కాబట్టే వెళ్లిపోయారని అంటారు. అందుకే ఈ రెండూ కాకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా ఇక్కడే నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నా. నేనెంచుకున్న మూడో మార్గం అదే. అందుకే జరిగిన పొరపాటును ఏ విధంగా దిద్దుకుని, మళ్లీ జీవితంలో స్థిరపడాలా అని ఆలోచించడం మొదలుపెట్టా. కానీ అప్పుల బాధ మరీ ఎక్కువకావడంతో ముందువాటిని తీర్చాలనుకున్నా. నాకు వారసత్వంగా వచ్చిన ఇళ్లూ, కారూ, స్కూటరూ అన్నీ అమ్మేసి దాదాపు అప్పులు తీర్చేసి కుటుంబంతో సహా చిన్న ఇంటికి మారిపోయా. ఆ రోజున నేనూ, నా భార్యా ఒకటే అనుకున్నాం. మా సమస్యలన్నీ తీరేవరకూ మేమిద్దరం కొత్త బట్టలు కొనుక్కోకూడదనీ, ఎన్ని
కష్టాలున్నా పిల్లల్ని మాత్రం బాగా చదివించాలనీ. అలా మేము ఆరేడు సంవత్సరాలు కొత్త బట్టలే కొనుక్కోలేదు.

జేబులో ఉన్నవి పదిరూపాయలే...
అద్దె ఇంటికి మారిన కొత్తల్లో అనుకుంటా. ఓ రోజు మా పాపకు 104 జ్వరం. అప్పుడు తనకు అయిదారేళ్లు ఉంటాయంతే. జేబులో చూస్తే పదిరూపాయలే ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్తే కనీసం వంద నుంచి నూటయాభై రూపాయలైనా అవుతాయి. ఏం చేయాలో తెలియలేదు. ఎవరిని సాయం అడగాలో తోచలేదు. మేమంటే పెద్దవాళ్లం... ఎన్నయినా తట్టుకుంటాం... కానీ పిల్లలకు ఈ గతి తీసుకొచ్చానే అని ఏడుపొచ్చేసింది. చివరకు అర్ధరాత్రి రెండుగంటలకు దగ్గర్లోని అపోలో ఫార్మసీకి వెళ్లి క్రోసిన్‌ ట్యాబ్లెట్లు తెచ్చి వేసి, అలాగే పాప దగ్గర కూర్చుండిపోయాం. మర్నాడు తెలిసినవారినడిగి కొంత డబ్బు తెచ్చి ఆసుపత్రిలో చూపించాం. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, పిల్లల్ని బాగా చదివించాలన్నా నేను ఏదో ఒకటి చేయక తప్పదు గనుక మళ్లీ పాత పనినే చేయాలనుకున్నా. సరంజామా ఉంది కాబట్టి... ఓల్డ్‌సిటీలోని శాలిబండలో పిస్తాహౌస్‌ని తెరిచేందుకు సిద్ధమయ్యా. అయితే ఈసారి బేకరీ కాకుండా... హలీమ్‌ని తయారుచేయాలనుకున్నా. అప్పటికి మన దగ్గర హలీమ్‌ రుచి అంతంత మాత్రంగానే ఉండటంతో నేను దానికో బ్రాండ్‌ సృష్టించాలనుకున్నా. మా పూర్వీకుల నుంచి తెలుసుకున్న మెలకువలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టా. ఇంట్లోనే నేనూ, నా భార్యా తయారీకి అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకునేవాళ్లం. రంజాన్‌ రోజుల్లో పూర్తిగా అదే పని. మిగతా రోజుల్లో బిర్యానీతోపాటూ ఇతర పదార్ధాలు అమ్మేవాళ్లం. నెమ్మదిగా మా హలీమ్‌కు పేరు రావడంతో ఇతర జిల్లాల వాళ్లు... తమకూ కావాలని అడగడం మొదలుపెట్టారు. కానీ అప్పట్లో అలా పంపించాలంటే పోస్టాఫీసే ఆధారం. దాంతో ఎవరెవరితోనో మాట్లాడి, పోస్టు ద్వారా దగ్గరి ప్రాంతాలకు హలీమ్‌ పంపించేందుకు అనుమతి ఇవ్వమంటూ కేంద్రప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా. అప్పుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన అనుమతి ఇవ్వడంతో పోస్టుమ్యాన్లు కొన్ని హలీమ్‌ పార్శిళ్లు తీసుకెళ్లేవాళ్లు.

అందుకు తగినట్లుగా ప్యాకింగ్‌, రుచి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. దాదాపు నాలుగేళ్లు అలాగే చేశాక...ప్రయివేటు కొరియర్‌ సేవల్ని వాడుకున్నా. మా హలీమ్‌ రుచి ఆ నోటా ఈ నోటా దేశంలోని ఇతర రాష్ట్రాలవాళ్లకీ తెలియడంతో వాళ్లూ అడగడం మొదలుపెట్టారు. దాంతో దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి ప్రాంతాలకూ సరైన జాగ్రత్తలు తీసుకుని, స్టెరిలైజ్డ్‌ ప్యాకింగ్‌ చేసి.. హలీమ్‌ని పంపేవాడిని. రోజులు గడిచేకొద్దీ ఈ రుచి విదేశాల్లో ఉన్న మన భారతీయులకూ తెలిసింది. విదేశాలకు ప్యాకింగ్‌ పంపడం కుదరదు కాబట్టి నా దగ్గరున్న సిబ్బందికే హలీమ్‌ తయారీని నేర్పించి వాళ్లను అక్కడికే పంపించడం మొదలుపెట్టా. వాళ్లు రంజాన్‌ మాసంలో అక్కడికి వెళ్లి, ప్రత్యేక ఔట్‌లెట్లను ఏర్పాటు చేసి.. హలీమ్‌ తయారుచేస్తారు. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్‌, ఖతార్‌, ఒమన్‌, సౌదీ, యుకే... ఇలా చాలా దేశాల్లో రంజాన్‌ సమయంలో మా పిస్తాహౌస్‌ హలీమ్‌కు మంచి డిమాండు ఉంటుంది. హలీమ్‌ పుట్టింది సౌదీ అరేబియాలో అంటారు... అలాంటి సౌదీకే నేను హలీమ్‌ను పంపిస్తున్నానంటే అంతకన్నా ఇంకేం కావాలి. రంజాన్‌ మాసంలో కొన్ని వందలమంది సిబ్బంది ఈ హలీమ్‌ తయారీలోనే ఉంటారు. నాన్‌వెజ్‌తోపాటూ వెజ్‌ కూడా చేస్తాం కాబట్టి రెండింటికి కిచెన్‌లే కాదు, కౌంటర్లూ వేర్వేరుగా ఉంటాయి. మిగిలిన సమయంలో డ్రైఫ్రూట్స్‌తోపాటూ బిర్యానీ వంటివీ అమ్ముతాం. ఒక్క హైదరాబాద్‌లోనే మాకు 18 శాఖలున్నాయి. చాలావరకు ఫ్రాంచైజీలుగా ఇచ్చేశాం. విదేశాల నుంచి కొందరు ఉద్యోగం మానేసి వచ్చి మరీ ఈ ఫ్రాంచైజీలను తీసుకుంటామని అడిగినప్పుడు నా కష్టం వృథా పోలేదని అనిపించింది. నిజాయితీతోపాటూ, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం ఉంటే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందని నేను నమ్మాను కాబట్టే ఈ రోజున ఇలా నిలదొక్కుకున్నానేమో! కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రంజాన్‌ మాసంలో హలీమ్‌ తయారీ కుదరకపోవచ్చు కానీ ఒకప్పుడు చేతిలో పదిరూపాయలే ఉండి దాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చుపెట్టాలా అని ఆలోచించిన నేను... ఈ రోజు కష్టంలో ఉన్న కొందరికైనా తోచిన సాయం చేయగలుగుతున్నానంటే ఇంతకన్నా ఇంకేం కావాలి!

 


వాళ్ల ఇంటికే హలీమ్‌...!

నా భార్య పేరు... అమ్తుల్‌ రహీమ్‌. తను కూడా నాతో సమానంగా కష్టపడింది. మాకు ఆరుగురు పిల్లలు. వాళ్లు మా ఇద్దరినీ చూసి.. ఏ రోజూ ఇది కావాలని నోరు తెరిచి అడిగేవారు కాదు సరికదా.. బాగా చదువుకున్నారు. పెద్దపాప బైపీసీ తరువాత ఫార్మసీ చేసింది. ఆ రోజున నా దగ్గర డబ్బులు ఉంటే తను డాక్టరు అయ్యేదని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. మిగిలినవాళ్లూ ఎంబీఏ, బీబీఏలు పూర్తిచేశారు. అందరికీ పెళ్ళిళ్ళై జీవితాల్లో స్థిరపడ్డారు.

* మా హలీమ్‌ను సామాన్యులే కాదు... జూనియర్‌ ఎన్టీఆర్‌ మొదలు... షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ వరకూ అందరూ ఇష్టపడతారు. వాళ్లు మా దగ్గరకు రాలేరు కాబట్టి నేనే చెప్పిన సమయానికి వాళ్ల ఇళ్లకు పంపించే ఏర్పాటు చేస్తుంటా.

* ఓసారి నేను ఏదో పనిమీద దిల్లీ వెళ్లా.. అక్కడ హైదరాబాద్‌ హలీమ్‌ అంటూ ఓ చోట అమ్ముతున్నారు. కానీ అది మాది కాదని అర్థమైంది. తరువాత తెలిసినవారితో చర్చిస్తే..మా హలీమ్‌ని ఎవరూ కాపీ చేయకుండా జియోగ్రఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ తీసుకోమని సలహా ఇచ్చారు. తిరుపతి లడ్డూ ఎలాగో.. హైదరాబాద్‌ హలీమ్‌గా మా పిస్తాహౌస్‌కు ఆ గుర్తింపు వచ్చింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.