
కాస్త ఊహ తెలిసిన పసిపిల్లలు కొత్తవాళ్లు ఎత్తుకోగానే బిక్కమొహం వేస్తారు, కొందరయితే ఏడుస్తారు కూడా. అలాగే వాళ్లు గుక్కపట్టి ఏడ్చేటప్పుడు కూడా అమ్మ ఎత్తుకుంటే ఠక్కున ఏడుపు ఆపుతారు. ఎందుకంటే- నాలుగు నెలలు దాటిన పసిపిల్లలకి తల్లిదండ్రులు గుండెలకి హత్తుకునేదానికీ బయటివాళ్లు దగ్గరకు తీసుకునేదానికీ తేడా తెలిసిపోతుందని టోక్యోలోని యోషిడా ఆఫ్ టోహా యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం పేర్కొంటోంది. దీనికోసం వీళ్లు ఏడాదిలోపు పిల్లల్ని ఎంపికచేసి, అమ్మానాన్నలు వాళ్లను కౌగిలించుకున్నప్పుడు హృదయస్పందనని పరిశీలించారట. అందులో నాలుగునెలలు దాటిన పసివాళ్లను తల్లితండ్రులు గట్టిగా హత్తుకున్నప్పుడు ఇద్దరిలోనూ గుండె కొట్టుకునే వేగం తగ్గిందట. అంటే- ఈ హగ్ వల్ల పసివాళ్లతోబాటు తల్లితండ్రులూ రిలాక్స్డ్గా ఫీలయినట్లు గుర్తించారు. అదే బయటివాళ్లు ఎత్తుకున్నప్పుడు పిల్లల గుండె రేటులో మార్పు లేదట. అలాగే నాలుగు నెలలలోపు పిల్లల్ని హత్తుకున్నప్పుడు వాళ్ల గుండె వేగంలో తేడా లేదు. దీన్నిబట్టి నాలుగు నెలల వయసు నుంచీ పసివాళ్లు తల్లితండ్రుల కౌగిలిని గుర్తుపడతారనీ, అది వాళ్ల పెరుగుదలకి ఎంతో అవసరమనీ చెప్పుకొస్తున్నారు.
ఈ బ్యాండేజీతో ఆహారం పాడవదు!
ఆక్సీకరణ ప్రక్రియవల్లే ఆహారం పాడైపోవడం, పండ్లు కుళ్లిపోవడం జరుగుతుంటుంది. ఇనుము తుప్పు పట్టేదీ ఇందుకే. సహజమైన ఈ ప్రక్రియ శరీరంలోనూ జరుగుతుంటుంది. అదెలా అంటే- శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడి ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతింటాయి. దీనివల్లే గాయాలూ పుండ్లూ తగ్గడం ఆలస్యమవుతుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియను నిరోధించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయన్న విషయాన్ని గమనించిన టెక్సాస్‌లోని ఎ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వాటితో నానోఫైబర్ మ్యాట్స్‌ను రూపొందించారు. పాలీవినైల్ పైరాలిడోన్ అనే పాలిమర్‌తో అత్యంత సన్నని దారాలను నేసి దానిమీద టానిక్ ఆమ్లం ఉండేలా చేసిన ఈ మ్యాట్‌ను పుండుమీద అతికిస్తే, ఆ పదార్థం కొద్ది కొద్దిగా విడుదలవుతూ గాయాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ మ్యాట్లను ఆహార పదార్థాలమీదా కప్పితే ఆహారం పాడవకుండా ఉంటుంది. పైగా ఇవి బ్యాక్టీరియానీ వైరస్‌నీ కూడా తిప్పికొడతాయట.
లాకెట్టుతో ఈసీజీ!
గుండెలో మంటగా అనిపించినా ఛాతీలో పట్టేసినా గుండెనొప్పేమో అని పిస్తుంటుంది. చెకప్ చేయించుకుంటే ఏమీ ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ లేకుండానే గుండెపోటు రావచ్చు. అందుకే నలభై దాటాక తరచూ పరీక్షలు చేయించుకోవడం అవసరమని చెబుతారు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఆసుపత్రికి వెళ్లలేం. అందుకే ఎవరికి వాళ్లే ఈసీజీ తీసుకునేలా పెండెంట్‌ను రూపొందించారు ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. దీన్ని మెడలో చెయిన్‌కి వేసుకుని అనుమానం వచ్చినప్పుడల్లా ఈసీజీ తీసుకోవచ్చు. ఫోన్లో ఆప్‌ను ఆన్ చేసి, ఛాతీమీద ఉన్న పెండెంట్మీద అరచేయి పెట్టి ముప్ఫై సెకన్లపాటు నొక్కాలి. అప్పుడు గుండె కొట్టుకునే తీరు నేరుగా ఆప్‌కు వెళ్లిపోతుంది. అందులో ఉన్న హార్ట్ రిథమ్‌ని మనం చూసుకో వడంతోబాటు వైద్యులకీ పంపించి తెలుసుకోవచ్చు. కాబట్టి పెద్ద వయసువాళ్లూ లేదా జన్యుపరంగా గుండెజబ్బు వచ్చే అవకాశం ఉన్నవాళ్లూ దీన్ని ధరించడం వల్ల గుండె వేగంలోని హెచ్చుతగ్గుల్ని ముందుగా గుర్తించడం ద్వారా గుండెపోటుని నియంత్రించుకోవచ్చు అంటోంది నిపుణుల బృందం.
ఒత్తిడితో సతమతమవుతున్నారా?
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అత్యంత సహజమైన విషయంగా మారింది. అయితే అది దీర్ఘకాలంపాటు కొనసాగితే దాని ప్రభావం మెదడులోని నూర్యాన్లలో మార్పులకి కారణమై రకరకాల మానసిక సమస్యలు ఏర్పడతాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ హెల్త్ న్యూ ఆర్లీన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. అదెలా అంటే- తరచూ ఆందోళన, ఒత్తిడితో సతమతమయ్యేవాళ్లలో మెదడులో సమాచార మార్పిడికి దోహదపడే నాడీకణాలకి పోషకాలు సరిగ్గా అందక అవి క్రమంగా బలహీనమై చనిపోతాయి. అంతేకాదు, అదేసమయంలో ఒత్తిడి వల్ల నోర్పీనెఫ్రీన్ అనే హార్మోన్ విడుదలై నాడీకణాల పనితీరు కూడా దెబ్బతినేలా చేస్తుంది. దాంతో రకరకాల ప్రవర్తనాలోపాలూ మానసిక సమస్యలూ ఏర్పడుతున్నాయని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు. కాబట్టి వీలైనంతవరకూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించమని సలహా ఇస్తున్నారు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్