close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాళాలు లేని స్కూటర్లు తెచ్చాం!

ఆ ముగ్గురు కుర్రాళ్లూ కలిసి సినిమాలు చూశారు... షికార్లు చేశారు... బెంగళూరు వీధుల్లో బాతాఖానీ కొట్టారు. కానీ ఆ అల్లరి వెనుక ఓ ఆశయం ఉంది, ఏదో సాధించాలనే తపన ఉంది. ఉన్నత చదువులు పూర్తిచేసి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నేరుగా బైక్‌ రెంటల్‌ వ్యాపారంలోకి దిగారు. పది లక్షల రూపాయలు అప్పు చేసి మొదలెట్టిన ఆ బిజినెస్‌ కాస్తా నేడు 4 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది! అదే ‘బౌన్స్‌’ కంపెనీ. ఈ విజయం వెనుక వ్యవస్థాపకులు అనిల్‌ గిరిరాజు, వివేకానంద హళ్లెకెరి, వరుణ్‌ అగ్నిల శ్రమా, దీక్షా ఎంతో ఉన్నాయి. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిల్‌ ఆ ప్రయాణాన్ని మనతో పంచుకుంటున్నారిలా...

మాది బెంగళూరు. నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పనిచేసేవారు. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిని. నాకో అన్నయ్య ఉన్నాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఇంటర్‌ చదువుకునేటప్పుడే వివేకానందతో పరిచయం. తనూ నేనూ ఒకే బెంచీలో కూర్చునేవాళ్లం. వాళ్లది కర్ణాటకలోని హసన్‌ ప్రాంతం. వరుణ్‌ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే కావడంతో వివేకానందతో అతనికి పరిచయం. అలా ముగ్గురం మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. బాగా చదువుకుని సొంతంగా కంపెనీ పెట్టాలని కలలు కనేవాళ్లం. అదే ఆశయంతో వివేకానంద సీఏ పూర్తి చేశాడు, వరుణ్‌ అమెరికా వెళ్లి టెలీకమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చదివాడు. నేను కాస్ట్‌ అకౌంటింగ్‌ చేశాను. అందరం మంచి చదువులే చదవడంతో సొంతంగా వ్యాపారం పెడతాం అన్నప్పుడు ఇంట్లో వాళ్లు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ బిజినెస్‌ వర్కవుట్‌ కాకపోయినా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందిలే అనే ధీమా ఉండేది.

బైకు రావడం ఆలస్యమైంది...
నాకు చిన్నప్పటి నుంచీ బైక్స్‌ అంటే చాలా ఇష్టం. అందులోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంటే పిచ్చి. అది కొనుక్కోవాలని చాలా కష్టపడి డబ్బులు దాచుకున్నా. మొత్తానికి ఓరోజు ఆర్డర్‌ ఇచ్చా. కానీ అప్పట్లో ఇన్ని షోరూంలూ, ఇంత ఉత్పత్తీ లేకపోవడంతో డెలివరీ చాలా ఆలస్యం అయ్యేది. నేను ఆర్డర్‌ ఇచ్చిన పది నెలలకుగానీ బండి అందలేదు! డబ్బులు పోసి కొనేదానికి కూడా ఇంతగా  ఎదురుచూడాలా అనిపించింది. ఇదే మాట నా స్నేహితులతోనూ చెప్పా. అప్పుడే మాకో ఐడియా వచ్చింది. ఇలా పెద్ద కంపెనీల బళ్లు నడపాలని ఆశపడేవారికి వాటిని అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందా అనుకున్నాం. మా ఫ్రెండ్స్‌లోనే కొందరికి చాలా ఖరీదైన బైకులు ఉండేవి. వాటికి ఈఎంఐ కట్టలేక నానా ఇబ్బందీ పడేవారు. అలాంటి వాళ్లందరినీ పోగేసి... వారి బళ్లను మేం అడిగినప్పుడు ఇస్తే, వాటిని అద్దెకు తిప్పగా వచ్చిన డబ్బులో వాటా ఇస్తామని చెప్పాం. దానికి వారూ సరే అన్నారు. మేం కూడా బ్యాంకులో పది లక్షల రూపాయలు లోన్‌ తీసుకుని మూడు బైకులు కొన్నాం. ‘వికిడ్‌రైడ్‌’ అనే పేరుతో ఫర్మ్‌ రిజిస్టర్‌ చేయించాం. అలా మొదలెట్టిన అద్దె బళ్ల వ్యాపారం మీద లాభాలు బాగానే వస్తుండటంతో దాన్నే ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. కానీ బెంగళూరు మెట్రో స్టేషన్‌ మా జీవితాన్నే మార్చేసింది!
బెంగళూరు మెట్రో స్టేషన్ల మధ్య దూరం  ఎక్కువ. ఓరోజు అక్కడ కాసేపు నిలబడ్డప్పుడు... ఆ స్టేషన్ల మధ్య అక్కడక్కడే తిరగడానికి బైకులుంటే నడిచే భారం తప్పుతుంది కదా అనిపించింది. అప్పుడే మొదటిసారిగా ‘బౌన్స్‌’ మా మదిలో మెదిలింది. నాలుగైదు బళ్లను అక్కడ పెట్టి, కావాలి అనుకున్న వారి నుంచి డాక్యుమెంట్లు తీసుకుని అద్దెకు ఇచ్చేవాళ్లం. కానీ వారు దిగాల్సిన చోట మళ్లీ బండి తాళాలు తీసుకోవడానికి ఓ మనిషి ఉండాల్సి వచ్చేది. అటూ ఇటూ సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించేది. మనుషులు లేకుండా, బండి మాత్రం తీసుకునేలా ఏర్పాటు చేయాలనుకున్నాం. అప్పుడే పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడటం మొదలుపెట్టాం. బౌన్స్‌ ఆప్‌ను తయారుచేశాం. దాన్ని ప్రయాణికుడు తన మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక, అడిగిన వివరాలు అప్‌లోడ్‌ చేస్తే... తనకు దగ్గర్లో ఎక్కడెక్కడ బళ్లు అందుబాటులో ఉన్నాయో లొకేషన్‌ చూపిస్తుంది. ఆ చోటికి చేరుకున్నాక రైడ్‌ మొదలుపెట్టగానే ఆప్‌ ద్వారానే బండి అన్‌లాక్‌ అవుతుంది! అంటే కీ లెస్‌ బైక్‌ అన్నమాట. ఈ సాంకేతికతను ఇండియాలో తొలిసారిగా ప్రయోగించింది మేమే. ఆ తర్వాత చాలా కంపెనీల వారు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. దీని ద్వారా ప్రయాణికుడు ఎక్కడి వరకూ వెళ్లాలనుకున్నాడో వెళ్లి, అక్కడ పబ్లిక్‌ పార్కింగ్‌ ఏరియాలో స్కూటర్‌ను విడిచిపెట్టొచ్చు. ఎవరి ప్రమేయమూ లేకుండా వినియోగదారుడు సొంతంగా వాడుకునే వీలు ఉండటంతో ఎక్కువగా విద్యార్థులూ, చిరుద్యోగులూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఇలా 20,000 స్కూటర్లు తిరుగుతున్నాయి. రోజుకు లక్షా ముప్ఫైవేల రైడ్స్‌ చేస్తున్నారు. ఇందులో 25 శాతం మహిళలే! ఒకప్పుడు వ్యాపారం నడవకపోతే ఉద్యోగాలు చూసుకుందాంలే అనుకున్నాం. కానీ ఇప్పుడు మా కంపెనీలో 4,600 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం.
ఇండియాలో కేవలం 18 శాతం జనానికి మాత్రమే సొంతంగా వాహనం ఉంది. మిగతా అందరూ ప్రభుత్వ, ప్రైవేటు రవాణా మీద ఆధారపడాల్సిందే. కానీ సొంతంగా బండి లేకపోయినా డ్రైవింగ్‌ మాత్రం చాలామందికి వచ్చు. అలాంటి వారే మా టార్గెట్‌. ‘షేర్డ్‌ మొబిలిటీ’ అన్న అంశాన్ని ఫోర్‌ వీలర్స్‌కు ఓలా, ఊబర్‌ వంటి సంస్థలు ఎలా తీసుకొచ్చాయో మేం కూడా అలాగే దాన్ని టూవీలర్‌కు తీసుకొచ్చాం. మా స్కూటర్‌ను రోజుకు ఏడు నుంచి ఎనిమిది మంది వినియోగిస్తున్నారు. దీనివల్ల బండి వినియోగం పూర్తిస్థాయిలో ఉంటోంది. రోజులో ఒకటి రెండుసార్లు అవసరం పడేవాళ్లకు కొనడం కంటే ఇలాంటి పద్ధతులు లాభదాయకంగా ఉంటాయి. ఈ ఆలోచనే మమ్మల్ని ప్రజలకు దగ్గర చేసింది. నిజానికి ఒక వాహనం కొంటే దాని సగటు వినియోగం రోజులో గంటా గంటన్నరకు మించి ఉండదు. కానీ యజమాని దాని మొత్తం నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దానికితోడు వాహనం అంటూ ఉంటే చిన్న చిన్న అవసరాలకు కూడా వాడతారు కాబట్టి కాలుష్య కారకాలూ పెరిగిపోతాయి. ఇప్పుడు మా ఆలోచనతో ప్రయాణికుడు తాను వెళ్లిన దూరానికీ, బండిని వాడిన సమయానికీ తగ్గట్టు డబ్బు చెల్లిస్తే చాలు. ఇది ఆటో ఛార్జీల కంటే పెద్ద ఎక్కువగా ఉండదు. ఎంతైనా బైక్‌లో వెళ్తే ఆ మజాయే వేరు కదా!

నిబంధనలు తప్పనిసరి
బౌన్స్‌ స్కూటర్ల పార్కింగ్‌, డ్రైవింగ్‌ విషయంలో వినియోగదారుడు సంస్థ షరతులకు లోబడే ఉండాలి. లేదంటే వాహనం నడపడానికి వీలుపడదు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, రక్షణ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. మా కస్టమర్లంతా బాధ్యతాయుతంగా మెలిగేవారే. అందుకే చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించ గలిగాం. అయితే తొలినాళ్లలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఇక మన వల్ల కాదు అనిపించింది కూడా. కానీ వెనకడుగు వేయలేదు. ప్రతి సమస్యకూ పరిష్కారం వెతుక్కుంటూ ముందుకెళ్లాం. మా ముగ్గురి మధ్యా అన్నదమ్ములకంటే ఎక్కువ ప్రేమా, శత్రువుల కంటే ఎక్కువ పోటీ ఉంటాయి! ఒకరి విజయాలను ఒకరం ఆస్వాదిస్తాం. వివేకానంద చాలా ఆవేశపరుడు, అదేసమయంలో పది అడుగులు ముందు ఆలోచిస్తాడు. ‘థింక్‌ బిగ్‌’ థియరీని ఫాలో అవుతూ పెద్దపెద్ద రిస్క్‌లు తీసుకోవడానికి వెనుకాడడు. అందుకే తనకు సీఈవో బాధ్యతలు అప్పగించాం. వరుణ్‌ ప్రతి చిన్న విషయాన్నీ చాలా జాగ్రత్తగా డీల్‌ చేస్తాడు, తొందరపడి నిర్ణయం తీసుకోడు. మా బృందంలో ఉన్న ఇంజినీర్‌ తను ఒక్కడే, సీటీవో(చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌)గా విధులు నిర్వహిస్తున్నాడు. నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళతాను. ముఖ్యంగా వాళ్లిద్దరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఏంటో అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నడుచుకుంటాను. అందుకే 2014లో మొదలైన మా ప్రయాణం ఎలాంటి ఒడుదొడుకులూ లేకుండా సాఫీగా సాగుతోంది.

ఇంకా చాలా ఉంది
ఇప్పుడున్న రవాణా సాధనాలు చేరుకోలేని చోటికి కూడా మేం వెళ్లాలన్నదే మా లక్ష్యం. కిలోమీటరుకు రూపాయి లేదా రూపాయిన్నర రుసుము మాత్రమే తీసుకుంటూ సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ వంటి చోట్ల పనిచేస్తున్నా... ఇంకా చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ రవాణాతో అనుసంధానంగా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే బస్టాండ్లూ, మెట్రో రైలుకు చేరుకునేందుకు మా బైకులు పూర్తిస్థాయిలో వాడేలా చేస్తాం. ఇది వినియోగదారుడికి సులభం మాత్రమే కాదు, చవకైనది కూడా. కర్ణాటకలో చిన్న చిన్న ఊళ్లలో మా స్కూటర్లను స్థానికంగా ఉండే కిరాణా, పాల వ్యాపారులు మేనేజ్‌ చేసేలా కొత్త దారిలో వెళ్తున్నాం. దీని వల్ల ‘బౌన్స్‌’ అందరికీ చేరువ కావడమే కాదు, స్థానికులకూ కొంత ఆదాయం సమకూరుతుంది. హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో స్కూటర్లను ‘లాంగ్‌ టర్మ్‌ రెంటల్స్‌’గా ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే నెలకు రెండు లేదా రెండున్నర వేల రూపాయలు చెల్లించి స్కూటర్‌ తీసుకుంటే వారు నెలంతా వాడుకోవచ్చు. తక్కువ సమయం అవసరం పడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్‌
కంపెనీలతో అనుసంధానమై పనిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.


వైరస్‌ వ్యాప్తి లేకుండా...

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్ని సంస్థల మాదిరిగానే మాకూ ఇబ్బందులు తప్పలేదు. లాక్‌డౌన్‌ వల్ల స్కూటర్లు తిరగకపోవడం ఆర్థికంగా చాలా ప్రభావితం చేసే అంశం. కానీ ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం ఆలోచించాం. అమెరికా నుంచి ‘యాంటీ మైక్రోబియల్‌’ అనే టెక్నాలజీని దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నాం. ఈ ప్రక్రియలో ఒకసారి ఏదైనా వాహనాన్ని శానిటైజ్‌ చేస్తే... మూడు నెలల వరకూ దాని మీద ఎలాంటి వైరస్‌ బతకలేదు! అప్పుడు స్కూటర్‌ను ఎంతమంది వాడినా అది వైరస్‌ వాహకంగా పనిచేయదు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న బౌన్స్‌ బైకులు అన్నింటినీ ఈ పద్ధతిలో శానిటైజ్‌ చేయిస్తున్నాం. అంతేకాదు, కర్ణాటకలో ఉన్న పోలీస్‌ వాహనాలన్నీ శుద్ధి చేశాం. త్వరలో హైదరాబాద్‌లోనూ చేయబోతున్నాం. ఈ ఆపద సమయంలో సైనికుల్లా పోరాడుతున్న పోలీసులకు దీని ద్వారా సాయం చేయాలన్నదే మా ఉద్దేశం. అంబులెన్సులూ, ఇతర ప్రభుత్వ వాహనాలనూ ఈ పద్ధతిలో శానిటైజ్‌ చేయిస్తాం.


ఇంకొంత...

బహుశా బైకులంటే ఇష్టం ఉండటం వల్ల కావొచ్చు, నాకు ట్రావెలింగ్‌ అన్నా కూడా చాలా ఇష్టం. లాంగ్‌ జర్నీలంటే ఇంకా ఇష్టం. అదృష్టవశాత్తూ నా భార్య శ్వేతకు కూడా ప్రయాణాలు నచ్చుతాయి. ఇద్దరం అలా బండి మీద ఎంత దూరం అయినా వెళ్లిపోతూ ఉంటాం. తనతో అలా వెళ్లడం మనసుకు చాలా హాయినిస్తుంది. అంతేకాదు, వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ కూడా హాబీ. అప్పుడప్పుడూ అడవికి వెళ్లి కొంత సమయం గడిపి వస్తుంటా. అటవీ శాఖకూ, కొన్ని ఎన్జీవోలకూ వాలంటీరుగా కూడా పనిచేశా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.