close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంగాళాదుంపలోనూ ప్రొటీన్‌!

బంగాళాదుంపలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్న కారణంతో చాలామంది దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ అందులో కొద్దిపాళ్లలో ఉండే ఓ ప్రొటీన్‌, కండరాల్లో మరింత ప్రొటీన్‌ ఉత్పత్తికి కారణమవుతుందని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. వెయిట్‌ లిఫ్టర్లూ భుజబలం కావాలనుకునేవాళ్లూ ప్రొటీన్‌కోసం ఇష్టం లేకున్నా ఎక్కువగా మాంసాహారంమీదే ఆధారపడుతుంటారు. కానీ అవసరం లేదనీ శాకాహారమైన బంగాళాదుంపలోని ప్రొటీన్‌ కూడా వాళ్లకి సరిపోతుందనీ అంటున్నారు సదరు నిపుణులు. ఇందులో ప్రొటీన్‌ కొద్దిపాళ్లలోనే ఉండొచ్చు కానీ అది కండరాల్లో ప్రొటీన్‌ ఉత్పత్తికి దోహదపడుతుందనీ పైగా ఆరోగ్యానికీ మంచిదనీ చెప్పుకొస్తున్నారు.


ఆప్‌తో రక్తపరీక్ష!

రోజూ ఎన్నో తింటున్నా సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో అనీమియా బారినపడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ విషయం తెలుసుకోవాలంటే రక్తపరీక్ష తప్పనిసరి. అసలే రక్తహీనతతో బాధపడేవాళ్లలో మళ్లీ రక్తం తీసి పరీక్షించాల్సిన అవసరం లేకుండా ఆ సమస్యను గుర్తించే మొబైల్‌ ఆప్‌ను రూపొందించింది పర్‌డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం. దీని ద్వారా కేవలం హీమోగ్లోబిన్‌ శాతమే కాదు, ఇతరత్రా రక్త సంబంధిత సమస్యల్నీ గుర్తించవచ్చు అంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఆప్‌ ద్వారా పనిచేసే ఒక రకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అది ఆన్‌ చేయగానే ఫోన్‌ కెమెరా, స్పెక్ట్రోస్కోపీగా పనిచేస్తుంది. రోగి కనురెప్పను కిందకిలాగి పట్టుకున్నాక టెక్నీషియన్‌ లేదా వైద్యులు ఫోన్‌ కెమెరాను దానికి ఎదురుగా పెట్టి క్లిక్‌ చేసి ఫొటో తీస్తారు. తరవాత ఆ ఫొటోల్ని ఆప్‌ ద్వారా మరో కంప్యూటర్‌లోకి అప్‌లోడ్‌ చేస్తారు. అది రక్తనాళాల్ని నిశితంగా పరీక్షించి రక్తంలోని హీమోగ్లోబిన్‌ శాతాన్ని లెక్కించేస్తుందట. ఇప్పటికే ఈ కొత్త విధానం ద్వారా 153 మందిలో రక్తపరీక్ష చేయగా సంప్రదాయ పరీక్షల్లోకన్నా కచ్చితమైన ఫలితాలు వచ్చాయట. కాబట్టి త్వరలోనే ఈ విధానం అంతటా అమల్లోకి వస్తే రక్తం తీసి పరీక్షించాల్సిన అవసరం లేకపోగా, టెలీ మెడిసిన్‌కీ ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నారు.


వెన్నెముక దెబ్బతింటే...

ప్రమాదాల వల్ల కావచ్చు, కాలు జారి కావచ్చు.... రకరకాల కారణాలతో వెన్నెముక గాయాల బారినపడేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటివాళ్లలో కొన్ని నరాలు పూర్తిగా దెబ్బతినడంతో జీవితాంతం ఆయా భాగాలు చచ్చుబడిపోయి పనిచేయడం మానేస్తాయి. అలాగే కంటినాడి దెబ్బతిన్నా కష్టమే. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నరాలను తిరిగి పనిచేసేలా చేయవచ్చు అంటున్నారు టెంపుల్‌ యూనివర్సిటీ నిపుణులు. అదెలా అంటే- కణాల పెరుగుదలని నియంత్రించే లిన్‌28 అనే కణాన్ని గుర్తించారట. దీని ద్వారా దెబ్బతిన్న కేంద్ర నాడీవ్యవస్థ భాగాల్ని పునర్జీవింప చేయవచ్చు అంటున్నారు. ఇది మూలకణాల్ని ప్రభావితం చేయడం ద్వారా న్యూరాన్ల ఉత్పత్తికి కారణమవుతుంది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు వీళ్లు ముందుగా గాయపడ్డ ఎలుకలకి లిన్‌28ని ఇంజెక్టు చేసి చూడగా- అద్భుతమైన ఫలితాలు వచ్చాయట. ఎందుకంటే వెన్నెముక లేదా కంటి నాడి దెబ్బతిన్నవాళ్లలో ఆయా కణాల్ని మళ్లీ పునరుజ్జీవింప చేయగలిగే చికిత్సలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. కాబట్టి దీని ఆధారంగా ఇకనుంచి దెబ్బతిన్న భాగాల్ని మళ్లీ పనిచేసేలా చేయవచ్చు అంటున్నారు.


పోస్టులతో ప్రమాదం!

రోనా... లాక్‌డౌన్లతో జనంలో సెల్‌ఫోను వాడకం మరింత పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే వర్చ్యువల్‌ ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తున్నారు. వండినా తిన్నా ఇల్లు సర్దుకున్నా కొత్త డ్రెస్సు వేసుకున్నా ఏ పని చేసినా అవన్నీ సెల్‌తో క్లిక్‌ మనిపించడం, ఆ తరవాత వాటిని ఎడిట్‌ చేసి సోషల్‌మీడియాలో పెట్టడం, లైకుల కోసం ఎదురుచూడటం సర్వసాధారణమైపోయింది. అయితే ఇది రాన్రానూ రకరకాల లోపాలకు దారితీస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. సెల్ఫీలు తీసుకుని వాటిని అందంగా మార్పులు చేసి పోస్టులు అప్‌లోడ్‌ చేసేవాళ్లలో ఈటింగ్‌ డిజార్డర్స్‌ పెరుగుతున్నట్లు ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఫొటోలు మార్పులు చేసి పెట్టే పోస్టింగుల వల్ల అందులో ఉన్నట్లే కనిపించాలనుకుంటారు. దాంతో వాళ్లలో విపరీతమైన ఆందోళన పెరిగి తినడం మానేస్తున్నారు. అది క్రమంగా డిప్రెషన్‌కి దారి తీస్తుంది. అంతేకాదు, ఈ పోస్టింగుల వల్ల ఇతరత్రా ప్రవర్తనాలోపాలూ మానసిక సమస్యలూ ఎక్కువ అవుతున్నట్లు తేలింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు