
చిన్న ఉద్యోగం దొరికితే చాలు... తమ సమస్యలు తీరినట్లేననీ, నెలనెలా వచ్చే జీతంతో ఆనందంగా గడపొచ్చనీ అనుకుంటారు చాలా మంది. కానీ వీళ్లు మాత్రం దీనికి భిన్నం. ఆ జీతంతో కుటుంబ అవసరాలను తీరుస్తూనే కొంత భాగాన్ని విద్యార్థుల చదువుకు వెచ్చిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అల్పాహారం ఇస్తూ పాఠాలు...
విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం, హాజరు శాతాన్ని పెంచడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయినా, ఉదయం అల్పాహారం లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పేద పిల్లలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించేంత వరకూ ఆకలి బాధను దిగమింగుతూ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఆకలిని తట్టుకోలేక పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులూ ఉన్నారు. ఇదే విషయం చెన్నైలోని కొడుంగైయూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పి.కె.ఇళమారన్ని ఆలోచింపజేసింది. ఆయన ఉదయం తరగతి గదులకు వెళ్లగానే కొందరు విద్యార్థులు నీరసంగా కనిపించేవారు. మరికొందరు విద్యార్థులు పాఠాలపై దృష్టిపెట్టే వారు కాదు. అల్పాహారం తినకపోవడమే దీనికి కారణమని గ్రహించిన ఇళమారన్... పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రోజూ తనే సొంతంగా టిఫిన్లు అందించాలనుకున్నాడు. పాఠశాల సమీపంలోని టిఫిన్ సెంటర్ యజమాని కొంత తగ్గింపు ధరకు అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చాడు. అలా గత రెండేళ్లుగా రోజూ 100 నుంచీ 120 మంది దాకా విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ఇడ్లీ, పొంగలి అందిస్తూ వారి ఆకలి బాధను తీరుస్తున్నాడు ఇళమారన్. అల్పాహారం కోసం ఆయన ప్రతి నెలా తన జీతంలోంచి ఎనిమిది వేల వరకూ ఖర్చు చేస్తున్నాడనీ, ఈ కారణంగా విద్యార్థులు చదువుల్లో చురుగ్గా ఉంటున్నారనీ అంటారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు.
‘బీఎస్ఎన్ఎల్’ ఇంటి పేరైంది
నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన రంగినేని నర్సింహారావు చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించి చదువుతూనే బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం పొందాడు. తనలా పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సమస్య ఆటంకం కాకూడదనీ, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో స్థిరపడాలనీ అనుకున్న నర్సింహారావు... ఆ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలను కల్పించడంతోపాటు పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. విద్యార్ధుల కోసం ఇరవైకి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేశాడు. వాళ్లు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సొంత ఖర్చులతో మాక్ పరీక్షలను నిర్వహిస్తూ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాడు. చదువుకోవాలన్న ఆసక్తి ఉండీ, ఫీజులు చెల్లించే స్తోమతలేని విద్యార్థులకు రూ.10 వేల నుంచీ రూ.50 వేల వరకూ ఆర్థికసాయం చేస్తున్నాడు. సుమారు 20 మంది విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నాడు. దాదాపు వంద ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచరూ, ఇతర సామగ్రీ అందించాడు. అలా గత ఇరవై ఏళ్ల నుంచీ ఇప్పటి వరకూ తన జీతంలోంచి రూ.2 కోట్లదాకా వెచ్చించాడు. అతడి సేవలకుగాను నర్సింహారావు ఇంటిపేరు ‘బీఎస్ఎన్ఎల్’గా స్థిరపడిపోయింది.
పొదుపు డబ్బుతో పాఠశాల
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా మీరజ్కు చెందిన ఇరప్పానాయక్ది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తేగానీ కుటుంబం గడవని పరిస్థితి. పేదరికం కారణంగా తన ఇద్దరు సోదరులూ పాఠశాల మాని పనుల్లో చేరిపోయారు. తానైనా చదువుకుంటానని చెప్పినా... తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రోజూ ఉదయం, సాయంత్రం, సెలవు రోజుల్లో కూలీకి వెళ్తూ, దుకాణాల్లో పనులు చేస్తూ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పలు ప్రాంతాల్లో ఇంజినీరుగా కొనసాగాడు. నెలనెలా వచ్చే జీతంలో కొంత డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు పెడుతూ, మరికొంత పాఠశాల ఏర్పాటు కోసం పొదుపు చేస్తుండేవాడు. పొదుపు చేసిన సొమ్ముతో 2000 సంవత్సరంలో మీరజ్ సమీపంలోని తన సొంత స్థలంలో పాఠశాలను ప్రారంభించి కొందరు ఉపాధ్యాయులను నియమించాడు. పేద విద్యార్థులను ఇందులో చేర్చుకుని వారికి దుస్తులూ, పుస్తకాలూ ఉచితంగా అందజేస్తున్న నాయక్... ఇప్పటి వరకూ 500 మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దాడు. అందులో సుమారు 200 మంది పదో తరగతి పూర్తి చేసి పైచదువులకు వెళ్లారు కూడా. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల వేతనాల కోసం ప్రతి నెలా రూ.70 వేల దాకా ఖర్చు చేస్తున్న అతడి సేవాభావాన్ని గుర్తించిన అక్కడి విద్యాశాఖ అధికారులు ముగ్గురిని విద్యావాలంటీర్లుగా నియమించి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. అతడి స్నేహితులూ కొంత డబ్బును విరాళంగా అందజేస్తున్నారు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్