
పంచదార ఎందుకు మంచిది కాదు?
చక్కెర పానీయాలూ, మిఠాయిలు ఆరోగ్యానికి మంచివికావనీ అవి ఊబకాయానికీ దారితీస్తాయనేది తెలిసిందే. అయితే అది ఎందుకన్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు మిచిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. తీపి పదార్థాలు మెదడు రసాయనాల్లో మార్పులకు గురిచేసి తద్వారా కీలక నాడుల్ని పనిచేయకుండా చేస్తాయట. మొదట్లో చక్కెర పదార్థాలు కొద్దిగా తిన్నప్పుడు మెదడులో డోపమైన్ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. దాంతో మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. క్రమంగా అది మత్తుమందులా అలవాటైపోతుంది. కొన్ని రోజులకి డోపమైన్ శాతం తగ్గిపోయి, తక్కువగా విడుదలవుతుంటుంది. దాంతో నూర్యాన్లలో చురుకుదనం తగ్గిపోయి, ఎంత తీపి తిన్నా సంతృప్తిగా అనిపించదు. ఫలితంగా అతిగా తినడం అలవాటుగా మారి, ఊబకాయానికి దారితీస్తుందట. అందుకే చక్కెరను తినడం ఏ రకంగానూ మంచిది కాదు అంటున్నారు.
ఒంటరితనంతో మెదడు బేజారు!
మీరెంత సోషల్‌గా ఉంటారనేది మీ సోషల్ మీడియాలోనే కాదు, మెదడు నెట్‌వర్కులోనూ కనిపిస్తుంది అంటున్నారు న్యూరోసైన్సు సొసైటీకి చెందిన నిపుణులు. మెదడులోని మీడియల్ ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ భాగం వ్యక్తి ఆలోచనలనీ ప్రతిబింబిస్తుందట. అంటే- మనం ఒంటరిగా ఉన్నామా... పదిమందితో కలిసి ఉంటున్నామా అన్న విషయం మెదడు భాగం పనితీరులో కనిపిస్తుందన్నమాట. ఇందుకోసం సోషల్‌గా చురుగ్గా ఉండేవాళ్లనూ, ఒంటరిగా ఉండేవాళ్లనీ ఎంపిక చేసి ఎమ్మారై స్కాన్ ద్వారా వాళ్ల మెదడు పనితీరుని పరిశీలించారట. అందులో సోషల్‌గా ఉండేవాళ్లలో- తమ గురించీ సన్నిహితుల గురించీ ఆలోచించేటప్పుడు ఆ భాగం ఒకేలా స్పందిస్తే, సెలెబ్రిటీలూ చుట్టుపక్కలవాళ్ల గురించి ఆలోచించేటప్పుడు మరో రకంగా స్పందించిందట. కానీ పెద్దగా తేడా ఏమీ లేదట. అదే ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా ఉండే వాళ్ల ఆలోచనల్లో కేవలం వాళ్ల గురించి ఆలోచించినప్పుడు మెదడు స్పందించే తీరు, వేరేవాళ్ల గురించి ఆలోచించినప్పుడు స్పందించే తీరుకి పూర్తి భిన్నంగా ఉందట. దీన్నిబట్టి ఎవరితో కలవకుండా ఒంటరిగా గడపడం వల్ల వాళ్ల మెదడులోనూ క్రమేణా మార్పులు చోటుచేసుకుంటాయన్నమాట.
కూర్చుంటున్నారా?
కూర్చోవద్దు... అరగంటకో గంటకోసారి లేవండి... అని ఎంతగా చెప్పినా చాలామంది సీట్లోంచి లేవరు. అయితే దాని ఫలితం ఆరోగ్యంమీద తీవ్రంగానే ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎం.డి. ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన నిపుణులు. చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్ బారిన పడాల్సి ఉంటుందట. ఎక్కువసేపు కూర్చునేవాళ్లలో 82 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వీళ్ల పరిశీలనలో తేలిందట. ఇందుకోసం నలభై ఐదేళ్లు దాటిన ముప్ఫై వేలమందిని ఎంపిక చేసి ఐదేళ్లపాటు వాళ్ల ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారట. అందులో కొందరికి కూర్చునే సమయంలో అరగంట తగ్గించి, ఆ సమయంలో వ్యాయామం చేయించారట. అందులోనూ సైక్లింగ్ అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 31 శాతం, నడక అయితే 8 శాతం తగ్గినట్లూ గుర్తించారు. అంతేకాదు, వాళ్లలో కదలకుండా కూర్చునే మూడు వందలమంది మరో ఐదేళ్ల తరవాత క్యాన్సర్‌తో మరణించారట. అందుకే ప్రతి గంటకీ లేచి ఓ ఐదు నిమిషాలు నడవడం, మెట్లు ఎక్కడం చేస్తే మంచిదని చెప్పుకొస్తున్నారు.
వయసు మీరకుండా ఉండాలంటే..!
రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం వస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. ఆ సంగతి ఎలాగున్నా రక్తంలోని ప్లాస్మా కణాలను సగం వరకూ తొలగించి వాటికి బదులు సెలైన్, ఆల్బ్యూమిన్‌లను ఎక్కించడం వల్ల వయసు వెనక్కి మళ్లుతుంది అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. వృద్ధ ఎలుకల్లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. దీనివల్ల కణజాలాల్లో ముఖ్యంగా మెదడు, కాలేయం, కండర కణాల్లో పునరుత్పత్తి జరిగినట్లు గుర్తించారు. రక్తంలోని ప్లాస్మాలో సగం తొలగించి ఆల్బ్యూమిన్‌ను ఎక్కించడం వల్ల కొత్త ప్రొటీన్ కణాలు విడుదలవుతాయి. అదే సమయంలో ప్లాస్మా గాఢతా తగ్గుతుంది. అంటే- వయసుమీరిన ప్రొటీన్ కణాల శాతం తగ్గిపోతుందన్నమాట. దాంతో పాత, కొత్త ప్రొటీన్ కణాల సమతౌల్యం ఏర్పడుతుంది. తద్వారా వృద్ధాప్యం రాకుండా ఉంటుందనేది శాస్త్ర నిపుణుల విశ్లేషణ.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్