close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శరణార్థిగా వచ్చి అధినేతనయ్యా!

బతుకుతెరువు కోసం దిల్లీ రోడ్లపై గుర్రపుబండి నడిపిన ఆ చేతులే, ‘పద్మభూషణ్‌’ పురస్కారాన్ని సగర్వంగా స్వీకరించాయి.  రెండు అణాల కోసం ఒకనాడు రెక్కలుముక్కలు చేసుకున్న ఆయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.21 కోట్లు! నాలుగో తరగతితో చదువు మానేసి చిన్న చిన్న పనులు చేస్తూ, అంచెలంచెలుగా ఎదిగిన ఆ వ్యక్తి.. ‘ఎండీహెచ్‌’ మసాలాల సంస్థ అధినేత మహాశయ్‌ ధర్మపాల్‌ గులాటీ.  సమాజానికి తిరిగివ్వడంలోనూ ముందుండే 97 ఏళ్ల ఈ పెద్దాయన తన జీవితానుభవాలను మనతో పంచుకుంటున్నారు...


ఈ జీవితంలో ఎన్నో విజయాలు సాధించాను. కానీ ‘పద్మభూషణ్‌’ అందుకున్న క్షణాలు మాత్రం మరచిపోలేను. అయిదో తరగతి కూడా పూర్తి చేయని నేను, అంత మంది పెద్దల సమక్షంలో అవార్డు తీసుకోవడం అంటే మాటలా! దీనంతటికీ కారణం నా కృషి మాత్రమే కాదు... దేవుని కృప, మా వినియోగదారుల ఆశీస్సులు కూడా!


నేటి పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో 1923లో పుట్టాను. నాన్న చున్నీలాల్‌ గులాటీ మసాలా దినుసులూ, పొడులూ అమ్మేవారు.  నాకు ఇద్దరు అన్నదమ్ములు, అయిదుగురు అక్కచెల్లెళ్లు. నాన్న ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలను పాటించేవారు. మమ్మల్ని బాగా చదివించాలని ఆశపడేవారు. కానీ ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచీ అస్సలు చదువు అబ్బలేదు నాకు. బడికి వెళ్లడమంటేనే విసుగ్గా అనిపించేది. అయిదో తరగతి నుంచీ మొత్తంగా ఎగనామమే! గాలిపటాలు ఎగరేసుకుంటూ, పావురాలు పెంచుకుంటూ ఆవారాగా తిరిగేవాణ్ని. కనీసం పనైనా నేర్చుకుంటానని నాన్న మా కొట్టు ఉండే బజారులోనే ఓ చోట పనికి కుదిర్చారు. నాలుగు రోజులు చేయడం, మానేయడం... ఇలాగే ఉండేది నా వ్యవహారం. కొన్నిరోజులు బియ్యంకొట్లో, మరికొన్ని రోజులు సబ్బులు అమ్మే చోట, కొన్నాళ్లు చెక్కపని చేసే చోట, చివరిగా దుస్తుల దుకాణంలో... ఇలా ఆ బజారులో నేను పనిచేయని కొట్టు లేదంటే నమ్మండి! కానీ ఎక్కడా నెల రోజులు కూడా కుదురుకోలేదు. వాటి యజమానులేమో ‘మా దగ్గర ఎందుకు బాబూ, మీవాణ్ని నీ కొట్టులోనే పెట్టుకోవచ్చు కదా’ అని నాన్నను విసుక్కునేవారు. కానీ అప్పటికి చిన్నవాణ్ని కావడంతో ఆ మసాలా ఘాటుకు నా ఆరోగ్యం పాడవుతుందని మా కొట్టులో ఉంచేందుకు నాన్న ఇష్టపడేవారు కాదు. పెళ్లి చేస్తే దారిలో పడతానని 18 ఏళ్లు రాగానే లీలావతితో వివాహం జరిపించారు. అప్పటికి మా దుకాణం బాగానే నడిచేది. నేనూ అమ్మకాలు నేర్చుకున్నా. అంతా బాగుందనుకున్న సమయంలో అనుకోకుండా కుటుంబమంతా రోడ్డున పడ్డాం.

‘‘పొద్దున లేవగానే యోగా, వాకింగ్‌ చేస్తా. వాట్సప్‌ చూస్తా. సంస్థలో అన్ని ముఖ్య సమావేశాలకూ హాజరవుతా. దిల్లీ మా ప్రధాన కేంద్రం. అప్పుడప్పుడూ ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారం ఎలా ఉందో చూసి వస్తుంటా. ఓ వాణిజ్య ప్రకటనలో నటించాక ఇక నన్ను ఏదోలా వాటిల్లో చూపించేస్తున్నారు. నాకూ సరదాగా ఉండటంతో నటిస్తున్నా. వాటిల్లో నేను పెట్టుకునే ఎర్రని తలపాగా బాగా ఫేమస్‌ అయిపోయింది. అందుకే మసాలా పొడి ప్యాకెట్‌ మీదా నా బొమ్మే వేస్తున్నారు. దీంతో కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా అయిపోయా. నా రోల్స్‌రాయిస్‌ కారంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడూ అందులో చక్కర్లు కొడుతుంటా!’’

శరణార్థులయ్యాం
అప్పుడే భారత్‌కు స్వతంత్రం వచ్చింది, మా సంతోషానికి అవధుల్లేవు! కానీ అంతలోనే పిడుగులాంటి వార్త. ఇండియా నుంచి పాకిస్థాన్‌ వేరుపడుతోంది, మేం ఉన్నచోటు ఇక భారతదేశం కాదు! అలాంటి సమయంలో అక్కడ ఉండాలనిపించలేదు. ఉన్నవన్నీ తెగనమ్ముకుని భారత్‌కు బయల్దేరాం. అమృత్‌సర్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నాం. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. తర్వాత పని వెతుక్కుంటూ దిల్లీకి చేరాం. రావడమైతే వచ్చాం కానీ ఏం చేయాలో తెలీదు. నాకూ సంతానం కలగడంతో, మంది ఎక్కువై కుటుంబం నడవడం కష్టంగా మారింది. చేసేది లేక టాంగా నడపాలని నిర్ణయించుకున్నా. నాన్నతో అంటే, తను దాచిన సొమ్ములోంచి 600 రూపాయలు ఇచ్చారు. వాటితో బండీ, గుర్రం కొని తిప్పేవాణ్ని. దిల్లీ రైల్వేస్టేషన్‌ నుంచి కుతుబ్‌ రోడ్డుకు రెండు అణాలు తీసుకునేవాణ్ని. కొందరు బాగానే ఇచ్చినా, మరికొందరు మాత్రం తెగ బేరమాడేవారు. అలవాటు లేని పని కావడంతో ఒళ్లు హూనమైపోయేది. అయినా తప్పేది కాదు. అంత కష్టపడినా రోజు గడిచాక ఎంత మిగిలిందో చూసుకుంటే బాధ కలిగేది. ఇంట్లో అందరూ కడుపు నిండా తినడానికీ ఆ డబ్బు సరిపోయేది కాదు. ఇలా అయితే కష్టమని బాగా ఆలోచించా. నాన్నకు అలవాటైన ఆ మసాలా వ్యాపారాన్ని మళ్లీ ఎందుకు మొదలుపెట్టకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నా జీవితాన్ని మార్చేసింది!

మసాలా సామ్రాజ్యావిర్భావం
పెట్టుబడి కోసం గుర్రాన్నీ, బండినీ అమ్మేశాను. ఆ వచ్చిన డబ్బుతో దిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఓ చిన్న బడ్డీ కొట్టు అద్దెకు తీసుకున్నా. ‘మహాశయా డి హట్టి -ఎండీహెచ్‌ (మహాశయ బడ్డీకొట్టు)’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాను. పాకిస్థాన్‌లోని దుకాణమే ఇక్కడికి మార్చామని ప్రచారం చేశాను. దాంతో మాలాగే వలస వచ్చిన వారంతా ఆ దుకాణానికి వచ్చేవారు. మొదటి నుంచీ నాన్న నాణ్యమైన దినుసులతో ప్రత్యేకమైన మసాలాలు తయారుచేసేవారు. దాన్నే నేనూ కొనసాగించడంతోపాటు కొత్త కొత్త వెరైటీలు సృష్టించాను. ఉత్తరాదిలో చేసే ప్రతి ముఖ్య వంటకానికీ ఒక మసాలా తయారుచేశాను. మెల్లగా అందరూ వాటికి అలవాటుపడ్డారు. వ్యాపారం పుంజుకుంది. చిన్న స్థలం కొని మసాలాలు దంచేందుకు ఓ పరిశ్రమ మొదలుపెట్టాను. అది విజయవంతం కావడంతో అలాంటి యూనిట్లనే మరో రెండు చోట్ల నెలకొల్పాను. అప్పటి నుంచీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం మా సంస్థ 62 రకాలైన మసాలాలను 150 రకాల ప్యాకింగ్స్‌లో ఉత్పత్తి చేస్తోంది. 1000కిపైగా స్టాక్‌ పాయింట్లు, 4 లక్షల మందికిపైగా రిటైలర్లు ఉన్నారు. రోజుకు 30 టన్నులకుపైగా పొడులు సిద్ధమవుతున్నాయి. ఏడాదికి 900 కోట్ల రూపాయల టర్నోవర్‌ చేస్తున్నాం. దుబాయ్‌, లండన్‌లలో మా ఆఫీసులు ఉన్నాయి. అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, జపాన్‌, యూఏఈ, సౌదీఅరేబియా లాంటి ఎన్నో దేశాలకు మా ఎండీహెచ్‌ మసాలా ఎగుమతి అవుతోంది.

కుటుంబమే అంతా...
ఒకప్పుడు అణా కోసం టాంగా లాగేవాణ్ని, ఇప్పుడు నా వార్షిక వేతనం రూ.21 కోట్లు. గోద్రెజ్‌, ఐటీసీ వంటి కంపెనీల సీఈవోల కంటే ఎక్కువ. ఈ విజయం సులభంగానైతే రాలేదు. ఈ ప్రయాణంలో మా కుటుంబ సభ్యులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేశారు. అంత మంది ఉన్నా అందరూ ఒకేమాటపై నిలబడ్డారు. నాకు ఆరుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. సీఈవోగా నేను ముఖ్య నిర్ణయాలు తీసుకుంటున్నా, మిగతా వ్యాపారమంతా వారే చూసుకుంటున్నారు. ఎండీహెచ్‌లో 80 శాతం వాటా మా కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంది. మసాలా వ్యాపారం బాగా పుంజుకున్నాక ఇతర రంగాల్లోకీ విస్తరిస్తే బాగుంటుంది కదా అని వాళ్లు అభిప్రాయపడ్డారు. అయితే తెలియని రంగంలో కాలుమోపడం నాకు ఇష్టం లేదు. ముందు నుంచీ మా ప్రతిభ ఘాటైన, మేలైన మసాలాలు తయారుచేయడమే! బహుశా అది నా రక్తంలోనే ఉందనుకుంటా. అది కాకుండా నాకు వేరే పని కూడా తెలియదు. అందుకే ఆ వ్యాపారాన్నే విస్తరిస్తూ వెళ్లాం. సమాజానికి తిరిగివ్వాలి ఒక చిన్న బడ్డీ కొట్టులో మొదలైన ఎండీహెచ్‌ ఇవాళ ఇలా ఉందీ అంటే అది మా వినియోగదారుల చలవే. వారి ఆదరణకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. అందుకే సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఆలోచనతో ‘మహాశయ్‌ చున్నీలాల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశా. నా జీతంలో 90 శాతానికి పైగా ఈ సంస్థ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకే వెళ్తోంది. దీని ద్వారా దిల్లీలో 10 పడకల కంటి ఆసుపత్రిని ప్రారంభించాం. ఆ తర్వాత మా అమ్మ చానన్‌దేవి పేరు మీద 20 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిని నెలకొల్పాం. కొన్నాళ్లకు పశ్చిమ దిల్లీలో 5 ఎకరాల స్థలంలో 300 పడకలు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించాం. తరచూ ఈ ఆసుపత్రులను సందర్శిస్తూ సేవలు ఎలా అందుతున్నాయో సమీక్షిస్తూ ఉంటాను. పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు వీలుగా ఒక మొబైల్‌ ఆసుపత్రినీ ప్రారంభించాం. నాకు చదువైతే రాలేదుకానీ, చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే 20కి పైగా పాఠశాలలు ఏర్పాటుచేశాం. వాటిలో ఎక్కువ శాతం వెనుకబడిన ప్రజల నివాస ప్రాంతాల్లోనే ఉన్నాయి. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకూ ఆర్థిక సాయం చేస్తున్నాం.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.