
కరోనాలో కొత్త ‘ఊపిరి’
దేశంలో ఒకవైపు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మరోవైపు సరిపడా వెంటిలేటర్లు లేక రోగులకు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు అత్యవసర శ్వాస అందించేందుకు కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్సీటీఐఎంఎస్టీ) ఎయిర్ బ్రిడ్జ్ పేరుతో సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించింది. ఇది వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయం కాదుగానీ, వెంటిలేటర్ అందుబాటులో లేనప్పుడు రోగికి కొన్ని గంటల నుంచి రోజుల పాటు శ్వాస అందించేందుకు ఉపకరిస్తుంది. ఈ ఎయిర్ బ్రిడ్జ్ రోగి శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు ఉచ్ఛ్వాస, నిశ్వాసలనూ నియంత్రణలో ఉంచుతుంది. రోగి పరిస్థితి విషమించే సందర్భంలో అలారం ద్వారా వైద్యులను అప్రమత్తం చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ యంత్రాన్ని తేలిగ్గా ఎక్కడికైనా తరలించవచ్చు. దీన్ని ఆపరేట్ చెయ్యడమూ తేలికే.
దోమల్లో జంబలకిడి పంబ..
అదేదో ఔషధ ప్రభావం వల్ల మగవాళ్లు ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా మారడం ‘జంబలకిడి పంబ’ సినిమాలో చూశాం. ఏదో సినిమా కాబట్టి సరిపోయిందిగానీ, నిజ జీవితంలో ఏ ప్రాణికీ ఇలా జరగదని మనందరికీ తెలుసు. కానీ, దోమల విషయంలో ఇక మీదట ఇది జరగబోతోంది అంటున్నారు వర్జీనియా టెక్ పరిశోధకులు! మనకు ప్రాణాంతక డెంగీని కలిగించే ఏడిస్ ఈజిప్టై ఆడ దోమలో ఒక జీన్ మార్పు చేసి మగ దోమగా మార్చేయవచ్చని తమ పరిశోధనల్లో నిరూపించారు. దీన్ని ఇటీవల సైన్స్ డైలీ వెబ్సైట్ ప్రచురించింది. అయితే, ఈ విషయంలో పర్యావరణంలో వచ్చే మార్పుల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఇక మీదట డెంగీకి మనం భయపడాల్సిన పనుండదు. ఆస్పత్రుల్లో వేలకి వేలు వదిలించుకునే బాధా తప్పుతుంది!
ఇక ఆ భయం లేదు
ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం తాకాలన్నా ఇప్పుడంతా కరోనా వణకు. దేన్ని ముట్టుకుంటే ఎక్కడ వైరస్ పట్టుకుంటుందో అని ఒకటే భయం. ఏటీఎంలు, లిఫ్టుల్లో బటన్లు నొక్కాలన్నా ఆలోచించే పరిస్థితి. ఈ భయాల నుంచి బయటపడేసేలా సరికొత్త హుక్‌లు వచ్చేశాయి. ఈ యాంటీ మైక్రోబియల్ హుక్లని సరుకులు తేవడానికి, ఏటీయం, లిఫ్టుల్లో బటన్లు నొక్కడానికి ఉయోగించవచ్చు. వీటి మీద చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు జీవించి ఉండలేవు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
చిన్నగా... ఛిల్గా...
ఇంట్లో చల్లగా ఏదైనా తాగాలి, తినాలి అంటే ఫ్రిజ్ కావాలి. ఫ్రిజ్ కావాలంటే దాని కోసం సరిపడా స్థలం కూడా ఉండాలి. అయితే ఒక పెద్ద రిఫ్రిజిరేటర్ చేయగలిగే పని ఒక చిన్న స్టాండ్ రూపంలో ఉండే యంత్రం చేయగలితే! అవునా, అలాంటిది ఉందా అంటారా? ఇప్పటిదాకా లేదు, ఇక ముందు మార్కెట్లోకి రాబోతోంది. ప్రేరణ శీతలీకరణ సూత్రం ద్వారా ఒక శక్తిమంతమైన రిఫ్రిజిరేటర్లా పనిచేసే చిన్న ఛిల్లర్ని ఇంజనీర్లు ఈ మధ్యనే తయారుచేశారు. ల్యాబులతో పాటు ఇంట్లో కూడా తక్కువ మోతాదులో ద్రవాలను అత్యంత వేగంగా శీతలీకరించడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చట. ఇంకేం, చల్లటి నిమ్మకాయ నీళ్ల కోసం ఫ్రిజ్జులో వాటర్ బాటిల్ పెట్టి అరగంటో, గంటో వేచి చూడాల్సిన అవసరం ఇక ముందు ఉండదన్న మాట!
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్