close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోవిడ్‌ను కుక్కలు గుర్తిస్తాయా?

శిక్షణ ఇచ్చిన శునకాలు క్యాన్సర్లనీ మలేరియానీ బాంబుల్నీ వాసనతో పసిగట్టగలవని గతకాలపు పరిశోధనల్లో తేలింది. అయితే వాటికి కోవిడ్‌ వైరస్‌ని గుర్తించేలానూ శిక్షణ ఇవ్వొచ్చు అంటున్నారు పరిశోధకులు. నిజానికి కోవిడ్‌ లక్షణాలు పైకి కనిపించనివాళ్లు చాలామందే ఉంటున్నారు. ఆ విషయం తెలీక వాళ్లు బయటకు రావడంతో మరికొంతమంది ఆ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాగే కొంచెం జలుబు చేసినా కాస్త జ్వరం వచ్చినా అది కరోనానో కాదో కూడా తెలియడం లేదు. అలాంటి సందర్భాల్లో- కుక్కలు ఆ విషయాన్ని పసిగట్టగలవని బ్రిటన్‌కు చెందిన డాక్టర్‌ ఫ్రెఢరిక్‌ బృందం పేర్కొంటోంది. జర్మనీలోని హనోవర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి చూశారట. ఇందుకోసం ముందుగా ఎనిమిది కుక్కలకు ఓ వారం రోజులపాటు ఇన్ఫెక్షన్‌ వచ్చిన శాంపుల్స్‌నీ, ఇన్ఫెక్షన్‌ సోకని శాంపుల్స్‌నీ వాసన చూపించడం ద్వారా శిక్షణ ఇచ్చారట. అంటే- సుమారు వెయ్యికి పైగా శాంపుల్స్‌ను సేకరించి, వాటిని ఒక వరసలో కాకుండా అన్నింటినీ అక్కడక్కడా ఉంచారట. అయితే వాటిల్లో 94 శాతం శాంపుల్స్‌ని అవి కచ్చితంగా గుర్తించగలిగాయట. దీని ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు శునకాల్నీ ఉపయోగించుకోవచ్చు అంటున్నారు సదరు పరిశోధకులు.


వరైనా తెలిసినవాళ్లు ఎదురొస్తే వెంటనే మన ముఖంలో ప్రత్యక్షమయ్యేది చిరునవ్వుల పలకరింపే. కానీ మాస్క్‌ పుణ్యమా అని అది కాస్తా మరుగునపడిపోయింది. వాళ్లను చూసి మనం నవ్వినా వాళ్లకీ తెలీదు. వాళ్లు నవ్వినా మనకూ తెలీదు. అంటే- మాస్క్‌ ముఖంలోని భావోద్వేగాల్ని చాలావరకూ కప్పేసిందన్నమాట. నిజానికి 55 శాతం మంది తమ భావాలనూ లేదా విషయ సమాచారాన్ని మాట్లాడటం కన్నా శరీర భాషతోనే ఎక్కువగా వ్యక్తం చేస్తారట. అదీ ఎక్కువగా ముఖ కవళికల్ని ప్రదర్శించడం ద్వారానే అంటున్నారు మానసిక విశ్లేషకులు. అయితే ఇప్పుడు మాస్క్‌ ముఖాన్ని కప్పేయడంతో అలాంటివాళ్లకి పెద్ద సమస్యే వచ్చి పడింది. ముఖ్యంగా ఆఫీసుల్లో ఇంటర్వ్యూలూ మీటింగులూ జరిగేటప్పుడు అవతలివాళ్ల వ్యక్తిత్వాన్నీ మనసులోని భావాల్నీ ఎక్కువగా ఫేస్‌ రీడింగ్‌ ద్వారానే అంచనా వేస్తుంటారు.  మాస్క్‌తో అది కుదరదు కాబట్టి అలాంటి సమయంలో అవతలి వాళ్ల కళ్లలోకి నేరుగా చూడటం మినహా మరో మార్గం లేదు అంటున్నారు. అలాగే ఒకటికి నాలుగు సార్లు ప్రశ్నించడం వంటివి చేయాలట. ఇవేవీ కుదరని సందర్భాల్లో పారదర్శక మాస్క్‌ల్ని వాడుకోవడం ఉత్తమం అంటున్నారు.


మతిమరుపుకీ మందు!

డిమెన్షియా లేదా ఆల్జీమర్స్‌ నివారణకు తొలిసారిగా జన్యుచికిత్స కనుగొన్నారు ఆస్ట్రేలియాలోని మెక్‌క్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పూర్తి స్థాయి డిమెన్షియాతో బాధపడుతున్న వృద్ధ ఎలుకల్ని తీసుకుని వాటి మెదడులోని పి38 గామా అనే ఎంజైమ్‌ను ప్రేరేపించడం ద్వారా ఓ ప్రొటీన్‌లో మార్పు చేయగలిగారు. తద్వారా ఆల్జీమర్స్‌ లక్షణాలు పెరగకుండా చేయగలిగారట. మెదడు పనితీరులో కీలకపాత్ర పోషించే ఈ ఎంజైమ్‌, క్రియారహితంగా మారిపోవడంవల్లే ఆల్జీమర్స్‌ వ్యాధికి గురవుతున్నట్లు వాళ్లు గుర్తించారు. దాంతో ఈ ఎంజైమ్‌ను క్రియా శీలకంగా మార్చడంతో మతిమరుపు తగ్గడంతోబాటు మళ్లీ వాటి మెదడు చురుకుగా పనిచేయడం ప్రారంభించిందట. ముఖ్యంగా అవి చిన్నవయసు ఎలుకల్లా ఆలోచించగలగడంపరిశోధకుల్ని మరీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దీని ఆధారంగా 40-65 మధ్య వయసులో వచ్చే ఫ్రాంటొ టెంపోరల్‌ డిమెన్షియానీ ఈ జన్యుచికిత్సతో నివారించవచ్చు అంటున్నారు.


బి-12 లోపంతో బాధపడుతుంటే..!

క్తకణాల ఉత్పత్తికీ నాడీవ్యవస్థ పనితీరుకీ బి-12 విటమిన్‌ అవసరం. అయితే ఇది ఎక్కువగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. దాంతో అచ్చంగా శాకాహారం మాత్రమే తీసుకునేవాళ్లలో బి12 లోపం కనిపిస్తుంటుంది. అలాంటివాళ్లు సప్లిమెంట్ల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ విటమిన్‌, పులిసిన ధాన్యపు ఉత్పత్తుల్లోనూ ఉంటుందని వివరిస్తున్నారు హెల్సింకి విశ్వవిద్యాలయ నిపుణులు. ప్రొపియోనిబ్యాక్టీరియం ఫ్రెడెన్‌రెయిచి అనే బ్యాక్టీరియాని తీసుకుని పరీక్షించగా అది పదకొండు రకాల ధాన్యపు ఉత్పత్తుల్ని పులిసేలా చేసిందట. పైగా ఈ ఒక్క బ్యాక్టీరియానే పులియడం అనే ప్రక్రియ ద్వారా ధాన్యాల్లో బి12ని ఉత్పత్తి చేయగలుగుతుందని గుర్తించారు. అందులోనూ వరి, బక్‌వీట్‌ వంటి ముడిధాన్యాల్ని మూడురోజులు పులియబెట్టినప్పుడు ఇది అధిక శాతంలో ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వేగన్లు పులిసిన ధాన్యంతో చేసిన ఉత్పత్తుల్ని తీసుకుంటే సప్లిమెంట్లతో పనిలేకుండా శరీరానికి సరిపడా బి-12 అందుతుందని వివరిస్తోంది శాస్త్రబృందం. సో మనం తినే ఇడ్లీ దోశ, ఢోక్లా... వంటి పదార్థాలన్నీ ఈ కోవకే చెందుతాయి. కాబట్టి ఇవి ఎక్కువగా తింటే సరిపోతుంది.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు