
నవ్వు నాలుగిందాల చేటు కాదు మేలు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు పరిశోధకులు. అయితే ఇటీవల కోవిడ్ కారణంగా చాలామంది డిప్రెషన్, ఆందోళనలకు లోనవుతూ మనస్ఫూర్తిగా కులాసాగా నవ్వడం ఎటూ మర్చిపోయారు. కనీసం వాళ్లను పనిగట్టుకుని అయినా నవ్వించే ప్రయత్నంలో భాగంగా మరోసారి నవ్వుమీద పరిశీలన చేశారట సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. హాయిగా నవ్వినా కావాలని నవ్వినా నవ్వు నవ్వే, దీనివల్ల మేలే జరుగుతుంది అని తేల్చారు. ఎందుకంటే ఎలా నవ్వినా ముఖంలో కదిలే కండరాల వల్ల మెదడులో న్యూరోట్రాన్స్మిటర్లు విడుదలవుతున్నాయనీ దానివల్ల మనసుకి హాయిగా అనిపిస్తుందనీ వాళ్ల పరిశీలనలో స్పష్టమైందట. అంతేకాదు, దీనివల్ల వాళ్లలో పాజిటివ్‌గా ఆలోచించే గుణం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. దాంతో వాళ్లు మానసికంగానే కాదు, శారీరకంగానూ ఆరోగ్యంగానూ ఉంటారని చెప్పుకొస్తున్నారు సదరు పరిశోధకులు.
పొట్టలోని బ్యాక్టీరియాతోనే...
కొంతమంది వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారు. అదే మరికొందరు చాలా చిన్నవయసులోనే బీపీ, రక్తంలో కొవ్వులు, అధిక బరువు... ఇలా రకరకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం జన్యుపరంగా సంక్రమించే వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియానే అంటోంది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ. ఇందుకోసం వీళ్లు రకరకాల వ్యాధులతో బాధపడుతోన్న వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాని పరిశీలించి చూశారట. వాళ్లలో అది ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమ్మేళనంతో ఉందట. ముఖ్యంగా పదకొండు రకాల బ్యాక్టీరియా శాతంలోని హెచ్చు తగ్గుల కారణంగా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, ఎగ్జిమా, బీపీ, కొవ్వు, అధిక బరువు... ఇలా 28 రకాల వ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు రుమినోకాకస్ బ్యాక్టీరియా అధికశాతంలో ఉంటే బీపీ పెరుగుతున్నట్లు తేలింది. దీని ఆధారంగా ఆ మైక్రోబయోమ్ సమ్మేళనంలో మార్పులు చేయగలగడం ద్వారా వ్యాధుల్ని నిరోధించగలిగేందుకు ప్రయత్నిస్తున్నారు సంబంధిత శాస్త్రనిపుణులు.
సి-విటమిన్ వంగిపోనివ్వదు!
వృద్ధాప్యంలో కొందరికి నడుం వంగిపోతుంటుంది. ఎందుకంటే వాళ్లలో యాభై దాటాక వెన్నెముక కండరాల పరిమాణం ఏటా ఒక శాతం తగ్గిపోతుంటుంది. దాంతో వెన్నెముక కొంచెంకొంచెంగా వంగిపోతుంటుంది. ఈ స్థితినే సార్కొపెనియా అంటారు. అయితే యాభై దాటినవాళ్లు విటమిన్-సి ఎక్కువగా తీసుకుంటే ఈ పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువ అంటున్నారు ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆ వయసులో సి-విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ బెర్రీలూ తినేవాళ్లలో వెన్నెముక కండరాలు కుంచించుకుపోకుండా ఉంటున్నాయట. హానికర ఫ్రీరాడికల్స్ కారణంగా కణజాలాలు దెబ్బతినకుండా కాపాడుతుంది సి-విటమిన్. ఈ విషయాన్ని నిర్ధరించుకునేందుకు వీళ్లు 42- 82 మధ్య వయసులోని సుమారు 13 వేలమందిని ఎంపిక చేసి వాళ్లు తీసుకునే సి-విటమిన్ శాతాన్నీ వాళ్ల కండరాల పరిమాణాన్నీ పరిశీలించారు. అందులో సి-విటమిన్ ఎక్కువగా తీసుకునే వర్గంలో కండరాల పరిమాణంలో పెద్ద తేడా కనిపించలేదట. సో, పండ్లూ కూరగాయలూ తినేవాళ్లలో ఎముక కండరాల క్షీణత తక్కువగా ఉంటుందన్నమాట.
స్మార్ట్‌ఫోన్‌తో సంతానలేమి!
సంతానంకోసం ఎదురుచూస్తోన్న పురుషులు రాత్రివేళలో స్మార్ట్‌ఫోన్ వాడటం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెబుతున్నారు అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్‌కు సంబంధించిన నిపుణులు. ఎందుకంటే పడుకునేముందు ఎలక్ట్రానిక్ మీడియా- అది టీవీ, స్మార్ట్ఫోను, ట్యాబ్లెట్ ఏదయినా గానీ ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో వీర్యకణాల శాతం తగ్గిపోవడమే కాదు, వాటిల్లో కదలిక సరిగ్గా ఉండటం లేదని గుర్తించారు. వీటినుంచి వెలువడే కాంతి ప్రభావం వీర్యకణాల ఉత్పత్తిమీద పడుతుందట. ఇందుకోసం సాయంత్రం వేళలోనూ, పడుకునే సమయంలోనూ డిజిటల్ మీడియాను ఎక్కువగా వాడే 21 నుంచి 59 సంవత్సరాల వయసులోపు ఉన్న వందమందిని ఎంపిక చేసి పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైందట. అదే సమయంలో ఇవేమీ చూడకుండా హాయిగా వేళకు నిద్రపోయేవాళ్లలో వీర్యకణాల శాతం ఎక్కువగా ఉందట. కాబట్టి సంతానంకోసం ఎదురుచూస్తోన్న దంపతులు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి అంటున్నారు.
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్